
ప్రముఖ బెంగాలీ నవల ''అరణ్యక''ను 'వనవాస'ి పేరుతో,
ప్రముఖ హిందీ నవలిక ''సూరజ్ కా సాత్వా ఘోడా''ను 'సూర్యుడి ఏడో గుర్రం' పేరుతో ఈ మధ్యే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పునర్ముద్రించిన విషయం విదితమే.
ఆ నవలా రచయితల గురించి క్లుప్తంగా ...

బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ:
1894లో కలకత్తాకు ఉత్తరంగా వందమైళ్ల దూరంలో వున్న మరాఠీపూర్ గ్రామంలో పుట్టిన బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ బాల్యమంతా బీదరికంతోనే గడిచిపోయింది.
చదువు స్థానిక పాఠశాలలో సాగింది.
1918లో కలకత్తాలోని రిప్పన్ కాలేజీ నుండి డిగ్రీపొందారు.
మధ్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం మాత్రం ఉపాధ్యాయుడిగానే కొనసాగిన ఆయన తొలి కథ 1922లో కలకత్తా జర్నల్‌లో ప్రచురితమైంది.
అప్పటి నుంచీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలు ప్రచురించారు. ఆయన విఖ్యాత రచన, ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టిన రచన ''పథేర్ పాంచాలీ''. దీనికి కొనసాగింపుగా రాసింది ''అపరాజిత''. వీటిని ప్రముఖ దర్శకులు సత్యజిత్ రే చలనచిత్రాలుగా మలచి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు.
దట్టమైన ప్రకృతితో మమేకమై అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనసులకు సునిశితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక (వనవాసి) బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ విశిష్ట రచనగా విణుతి కెక్కింది.
ఆయన 1950లో మరణించారు.

ధర్మవీర్ భారతి:
హిందీ సాహితీరంగంపై బలమైన ముద్రవేసిన విశిష్ట రచయిత ధర్మవీర్ భారతి.
1926 లో అ లహాబాద్‌లో జన్మించారు.
కవిగా, నాటక రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా హిందీ సాహిత్యంలో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనది.
ఆయన రచించిన ''గునహోంకా దేవతా'' భారతీయ సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే క్లాసిక్. మహాభారత యుద్ధం పరిసమాప్తమైన ఆఖరి రోజు పరిణామాలను సమకాలీన దృక్పథం నుంచి విశ్లేషిస్తూ రాసిన నాటకం ''అంధయుగ్'' భిన్న తరాలకు చెందిన ప్రయోక్తల సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వేలసార్లు ప్రదర్శితమైంది.
శైలీపరంగా ఓ అసాధారణ ప్రయోగం ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' (సూర్యుడి ఏడో గుర్రం).
అ లహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి హిందీ సాహిత్యంలో ఎంఎ. పట్టా తీసుకున్న ధర్మవీర్ భారతి 1950లలో విస్తృతంగా రాశారు.
హిందీ అధ్యాపకుడిగా పనిచేశారు.
1960 నుంచీ 1987 వరకూ ప్రముఖ హిందీ వార పత్రిక ''ధర్మయుగ్'' కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు.
పద్మశ్రీతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.
సూరజ్ కా సాత్వా ఘోడా నవలను 1992 లో ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ అదే పేరుతో హిందీలో చలన చిత్రంగా తీశారు. ఆ చిత్రానికి వివేష ప్రజాదరణతో పాటు జాతీయ అవార్డు లభించింది.
Soorampoodi SitaRam



No comments:
Post a Comment