
ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి ...
''...ఇరవై ఏళ్ల క్రితం జెఎన్‌యు ప్రొఫెసర్ జి.పి.దేశ్‌పాండే అద్భుత పరిచయంతో అప్పుడు అర్జున్ డాంగ్లే అనువాదం చేసి ఓరియంట్ లాంగ్మన్ వాళ్లు ప్రచురించిన మరాఠీ దళిత ఆత్మకథలు చదివిన అనుభూతి మళ్లీ ఈ పుస్తకం చదివితే కలిగింది.
తెలుగులో ఇట్లా ఎవరైనా ఆత్మకథలు రాసుకున్నారా తెలియదు. రావూరి భరద్వాజ ''జీవన సమరం'', దాశరథి రంగాచార్య ''జీవన యానం'', దాశరథి కృష్ణమాచార్య ''యాత్రాస్మృతి'' వంటివి లేవని కాదు.
బహుశా ఈ ''ఊరు వాడ బతుకు'' రావూరి భరద్వాజ ''జీవన సమరం'' వంటిది.
అయితే ఈ రచనా పథకం చాలా విచిత్రమైంది. అందువల్ల తెలుగు ఆత్మకథల్లో ఇది విలక్షణమైనది. అపూర్వమైనది.
ఆయనకింకా ఇరవై ఏళ్ల వయస్సు కూడా రాకుండానే, ఆయనగా తనదయిన జీవితంలోకి, వైవాహిక జీవితంలోకి ప్రవేశించే దగ్గరే ఈ నవల వంటి ఆత్మకథ ముగుస్తుంది. బహుశా ఇది మొదటి భాగమేమో.
కాదు. ఇప్పటికే నాలుగు భాగాలు 1) బాల్యం 2) ప్రాథమిక విద్య, 3) మాధ్యమిక విద్య, 4) ఉన్నత విద్య - పదవ తరగతి వరకు (తెలంగాణాలో అప్పటికదే గొప్ప. తహసీల్దార్ కావచ్చు!).
బాల్యంలో పోలీసు చర్య పేరుతో జరిగిన సైనిక చర్యకు ముందు జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం రజాకార్లు, ప్రవాసం.
చదువులో అనంతారం, సూర్యాపేట అనుభవాలు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నాగుల పాటు పరగణాలోని అనంతారంలో 1940 కృష్ణాష్టమి నాడు పుట్టాడు గనుక కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.
'బడికి పోయేటప్పుడు పుట్టిన తేదీ 14.06.1940 అని రాసిండ్రు'.
1958 ఏప్రిల్ 9న చివరి పరీక్ష మధ్యాహ్న వరకు రాసి సైకిల్ మీద ఊరికి పోయి అంతకు ముందే నిర్ణయమైవున్న ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటికింకా ఆయనకు 18 ఏళ్లు నిండలేదు.
''1958 ఏప్రిల్ 9న చివరి పరీక్ష మధ్యాహ్నం వరకు అయిపోయింది.
అదే రోజు రాత్రి (నా) పెండ్లి.
అప్పుడు బస్సులేదు.
సైకిల్ కిరాయకు తీసుకున్న.
నాకు తొక్కడం సరిగ్గా రాదు.
అప్పుడప్పుడు స్నేహితులు సైకిల్ కిరాయకు తీసుకుంటె ఒకటి రెండు చక్కెర్లు కొట్టేటోణ్ని. అంతంతమాత్రం తొక్కేటోణ్ని.
సైకిల్‌ను ఊరి బయటి దాక నడిపించి రాయి చూసుకుని, రాయిమీద కాలుబెట్టి సైకిలెక్కి తొక్కడం మొదలుపెట్టిన.
చిన్నగ తొక్కుకుంటూ పోయిన.
ఏదైన బస్సు, లారీ ఎదురొస్తే దిగి మరల ఎక్కేటోణ్ని.
ఎట్లయితేంది ఇంటికి చేరుకున్నా.
ఇంకా (పెండ్లి కొడుకు) రాలేదేమని ఎదురుచూస్తుండ్రు.
వచ్చినందుకు సంతోషించిండ్రు.
బయలుదేరి బండ్ల మీద నకిరేకల్ చేరుకున్నం.
పెండ్లి అయ్యేవరకు కలికి గాంధారి వేళ అయింది.
నా భార్య పేరు కమల.''
ఇది కథన పద్ధతి.
పద్దెనిమిదేళ్ల జీవిత కథ పద్దెనిమిది పర్వాల మహాభారత కథకన్నా తక్కువ ఆసక్తిదాయకంగా ఏమీ లేదు.
పైగా మహాభారతం శ్మశానంగా మారిన యుద్ధ భూమి నుంచి స్వర్గారోహణతో ముగుస్తుంది.
ఈ పద్దెనిమిదేళ్ల జీవిత కథ కమల కలికి గాంధారి వేళ కృష్ణమూర్తి జీవితంలో ప్రవేశించడంతో నిజానికి జీవితం మొదలవుతుంది.
ఎంత బాగా రాసాడు.ఎంత అద్భుతంగా రాసాడు.
ఇది ఒక దృశ్య కావ్యం.
పథేర్ పాంచాలీ వంటి జానపద బాధల గాథ.
మా కృష్ణమూర్తేనా రాసింది.
నలభై ఏళ్లుగా నాకు తెలిసిన కృష్ణమూర్తి ... అని ఆశ్యర్యపోవడం కన్నా విశ్లేషణ కందనిదీ అపూర్వ గ్రంథం.
- వి.వి. (ముందుమాట నుంచి)
ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
మా పుస్తకాలని ''ఎవికెఎఫ్ బుక్ లింక్'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.
......................................................................
No comments:
Post a Comment