
మంచీ చెడూ (నవల)…
రచన: శారద ...
అరవై డెబ్బై ఏళ్ల కిందట వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశాన్ని వశీకృతం చేసుకుని అశేష తెలుగు పాఠకలోకానికి శారద గా పరిచితుడైన ఈ రచయిత అసలు పేరు నటరాజన్.
ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. 12-13 ఏళ్లు వచ్చేదాకా ఆంధ్రలో అడుగుపెట్టి ఎరుగడు. బ్రతుకు తెరువు వెతుక్కొంటూ మద్రాసు నుంచి తెనాలి వచ్చి వంటవాడిగా స్ధిరపడ్డ నటరాజన్ తెలుగు నేర్చుకున్నాడు.
సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం కలిగిన తెనాలి, త్రిపురనేని రామస్వామి చదౌరి మొదలు చలం, చక్రపాణి, కొడవటిగంటి, జి.వి.కృష్ణారావు ప్రభృత భావ విప్లవకారులైన సంస్కర్తలు, రచయితల నెందరినో పూచిన తెనాలి నటరాజన్‌ను సహజంగానే ప్రభావితం చేసింది.
జీవితం పాఠాలు నేర్పింది.
అతనిలోని సృజనశీలి మేలుకొన్నాడు, వికసించాడు. సాహితీ పరిమళాలు వెలార్చాడు.
శారద (నటరాజన్) తొలి కథ... ప్రపంచానికి జబ్బు చేసింది. 1946లో ప్రజాశక్తిలో వెలువడింది.
ఆ తరువాత జ్యోతి, తెలుగు స్వతంత్ర, విశాలాంధ్ర, యువ, రేరేణి వగైరా ఎన్నో పత్రికల్లో ఆయన రచనలు అచ్చయ్యాయి.
1950 ప్రాంతంలో వెలువడిన ఏది సత్యం నవల ప్రతులన్నీ ఒక్క నెలలో అయిపోయాయి. ఆనాడది అపూర్వమైన రికార్డు ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ... మంచీ-చెడూ, అపస్వారాలు నవలలు తెలుగు పాఠకలోకాన్ని ఊపిశేశాయి. ముసిరిన దారిద్య్రంలో శారద కన్ను మూశాడు.
మంచీ-చెడూ, అపస్వారాలు సమాజంలో ఆనాడు కొత్తగా చోటుచేసుకొంటున్న వ్యాపార విలువలను చిత్రించాయి. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తూన్న మనుషుల స్వభావ శీలాల పరివర్తనాన్ని కళ్లకు కడతాయి ఆ నవలలు.
శారద జీవితం వ్యక్తిత్వం, జనం కోసం కలం పట్టాలన్న ఆయన తపన తరాలు గడచిపోయినా పలిగిపోని స్ఫూర్తి దీపమై
నిబద్ధతగల వర్ధమాన రచయాతలందరికీ ఇన్‌స్పిరేషన్ యిస్తాయి.
......
మంచీ చెడూ
రచన: శారద
సంక్షిప్తం: సాహవాసి
బ్మొమ్మలు: కాళ్ల
వెల: రూ.25
No comments:
Post a Comment