మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, June 23, 2009
ఊరు వాడ బతుకు ... దేవులపల్లి కృష్ణమూర్తి గారి పుస్తకంపై అరుణ పప్పు గారి సమీక్ష
అరుణ పప్పు గారు తన అరుణమ్ బ్లాగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవలనే ప్రచురించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి ఊరు వాడ బతుకు పుస్తకాన్ని సమీక్షించారు. వారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సమీక్షను మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం తిరిగి ఇక్కడ యదాతథం గా పొందుపరుస్తున్నాము
ఊరు వాడ బతుకు
మామిడాల మా అమ్మమ్మ ఊరు, మూసీనది దాటి పోవాలె. వేరే బాటలేదు. అనాజిపురం దగ్గర నుండి మూసీనది దాటాల్సి ఉంటుంది. ఎండకాలంలోనే రెండుమూడు పాయెలు పారేది. మిగతా కాలంలో నిండుగా పారుతుండేది. నడుముల లోతు నీరుంటే కూడా ఇద్దరు ముగ్గురు జంటలు జంటలుగా పట్టుకొని లోతులేని దగ్గర నుంచి ఏరు దాటి పోయేది. వానలను ఏరు నిండుగా పారేది. చెట్లు, కొమ్మలు కొట్టుక వచ్చేవి. అప్పుడు దాటటం కష్టం. సద్దిమూట ఏటి ఒడ్డున విప్పుకొని తిని కాస్త అలిపిరి తీసుకుని బాట పట్టెటోళ్లం. ఏటి ఒడ్డున సద్ది మూట విప్పితే తెల్లని బువ్వలో మామిడికాయ తొక్కు కలిసిపోయి ఎర్రమందారం అయ్యి, కమ్మని రుచేసేది. నాభికాడ చల్లబడితే నవాబు కాడ జవాబియ్యొచ్చు. నడిచి నడిచి అలసి ఉన్న పానం ఏటి ఒడ్డున చల్లని గాలికి హాయిగా తేలిపోయేది. తిన్నరేవును తలవాల.
* * * *
దొరోరి వ్యవసాయమంటే ఎంత జేస్తుండో, ఎంత పండుతుందో ఎవరికి అంచనా దొరికేదికాదు. ‘దొరలయవుసం బడుగులపాడు’. ఊరిపక్క పొలాలు చెల్కలన్నీ వాళ్లవే. మా ఇంటికి ఎదురుగానున్న పొలం దొరోరిదే. నాట్లు వేసేటప్పుడు, కలుపుతీసేటప్పుడు, కూలీలు పాడే పాటలు నాకెంతో ఇష్టం.
బొల్లిబొల్లి గుట్ట మీద నాగుమల్లె దారిలో
పొడిచినాడె చందమామ నాగుమల్లె దారిలో
నీకు మామ నాకు మామ నాగుమల్లె దారిలో
తెల్లబట్ట కట్టుకోని నాగుమల్లె దారిలో
తెల్లజొన్నలేయబోతే నాగుమల్లె దారిలో
వాడు చూచె చూపులకు నాగుమల్లె దారిలో
తెల్లబట్ట తేలిపాయె నాగుమల్లె దారిలో
* * *
లెవీగింజల వసూళ్లకని గిర్దావరు వస్తుండేటోడు. గిర్దావరు అంటే ప్యాంటుమూటు వేసుకొని వుండేటోడు. ఊర్లోకి గిర్దావరు వచ్చిండంటే హడలు. రైతులు ఎక్కడోళ్లక్కడ చెల్కలకు పోయేటోళ్లు. ఇంటింటికి పోయి లెవీ ధాన్యం కొలువమని బలవంతం చేస్తుండేటోళ్లు. పంటలే తక్కువ. ఇక లెవీ ఎక్కడిస్తరు? ఈ భయానికి రైతులు ఊర్లో లేకుండా చెల్కలకు పోయేటోల్లు.
కుప్పనూర్చినాడమ్మా చందమామ రైతూ
అప్పుతీర్చినాడమ్మా చందమామ రైతూ
కష్టించి పైరులు పెంచి చందమామ రైతూ
పండించి ప్రభువులకు పంచి చందమామ రైతూ
మేలు రకం అమ్ముతాడమ్మా చందమామ రైతూ
తాలు రకం తింటాడమ్మా చందమామ రైతూ
లోకాన్ని బతికిస్తాడే చందమామ రైతూ
శోకాన్ని భరియిస్తాడే చందమామ రైతూ
ఎన్నకన్నా మెత్తనివాడే చందమామ రైతూ
నీ కన్నా చల్లని వాడే చందమామ రైతూ
* * * *
తహసీల్ ఆఫీస్ దగ్గరలో ఆవుల పిచ్చయ్య అనే కమ్యూనిస్టు నాయకుడు వుండేవాడు. ‘ఆసియాలోనే పెద్ద భూపోరాటం తెలంగాణలో జరిగింది. ఒక దశకు వచ్చిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలోని కొందరు అకారణంగా నెహ్రూపై భ్రమలు పెట్టుకొని ఉధృతంగా సాగుతున్న పోరాటాన్ని నీరుగార్చిండ్రు. పోరాట విరమణ తర్వాత కూడా మిలటరీ చేతుల్లో హతమార్చబడ్డరు. ఎట్లాగైనా కమ్యూనిస్టు రాజ్యం వస్తుందని ఉన్న ఆస్తిపాస్తులను వదులుకొని పార్టీలో చేరిండ్రు. ఆఖరికి కన్నబిడ్డలను కూడా వదులుకున్నరు. పోరాట విరమణ తరువాత కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులు పెట్టిండ్రు. మర్దరు కేసుల్లో ఇరికిస్తే ఉరిశిక్షలకు కూడా గురి అయ్యిండ్రు.
ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం.
నష్టపోయింది కింది స్థాయి కేడరే.’ అంటూ తన బాధ వెల్లబోసుకుండు. నాకు అంతగా అర్థం అయ్యేది కాదు, కాని ఏదో విద్రోహం జరిగిందనిపించేది. ఎట్లైనా కమ్యూనిష్టు రాజ్యం వస్తుంది. ఇక నా తిండికి ఇబ్బంది వుండదు. కాబట్టి పార్టీలో ఫుల్ టైమ్ వర్కరుగా పోదామనుకున్నా. ఈ విషయం బి.ఎన్. రెడ్డి గారితో చెబితే తొందరపడకు చదువు పూర్తికానివ్వు తర్వాత చూద్దాం అన్నడు. పెద్ద మనిషి మాట కాదనలేక చదువుపైననే శ్రద్ధ పెట్టిన. సూర్యాపేటలో ఎప్పుడు కమ్యూనిష్టులు మీటింగ్ పెట్టినా అది ఎర్రసముద్రం అయ్యేది. దాన్ని చూసి నేను రష్యా, చైనాలో వున్నట్లుగా భ్రమించేవాడిని.
* * * *
మా మిత్రుడు మన్సూర్ అహ్మద్ తండ్రి ఖాసీంపేట జాగీర్దార్. రామయ్య సార్ ఇంటి పక్కనే ఉంది వాడి బంగ్లా. తండ్రి చనిపోయిండు. తల్లి, తను, చెల్లెలు కలసి వుంటున్నరు. అది వెనుకట కట్టించిన పెద్ద బంగ్లా.రిపేర్లు చేయక పాతబడిపోయింది. గోడలకు రాగిచెట్లు పుట్టినవి. పేరుకు జాగీర్దారే కాని ఇప్పుడేమీ మిగలలేదు. ‘తుర్కలెవుసం బురకలపాడు’. వున్నభూముల్లో కౌలుదార్లు వున్నరు. వాళ్లు కొనరు, ఇంకోళ్లకు అమ్మనియ్యరు. అయినా కొంత కొంత కౌలుదార్లకే అమ్ముతూ జీవనం సాగిస్తున్నరు. మేము వాడ్ని ఆటపట్టించడానికి ‘నీకేమిరా జాగీర్దారువు’ అంటూ వుండేవాళ్లం.
ఒకసారి బక్రీదు పండగ వచ్చింది. నేను లక్ష్మణాచారి క్రిష్ణారెడ్డి రేపు మీ ఇంటికి వస్తున్నాం దావత్ ఇవ్వాలిరా అన్నం. దానికి వాడు ఏమి సమాధానం చెప్పలేదు. అయినా మేము మధ్యాహ్నం వాని ఇంటికి వెళ్లినం. మాకు బాదాం కీర్ ఇచ్చిండ్రు తాగినం. అదోఇదో మాట్లాడుకుంటూ వుండిపోయినం. మధ్యాహ్నం రెండు అయింది. వాళ్లమ్మ మమ్ములను భోజనానికి లేవమని అంది. మేము కాళ్లు చేతులు కడుక్కొని దస్తర్ ఖానాపై కూర్చొన్నం. ప్లేట్లు పెట్టిండ్రు. అన్నం వడ్డించిండు. ముందు నాలుగు పింగాణి గిన్నెలు వున్నయి. మా దోస్తు ఖానా షురూ కీజియె అన్నడు. ఆ గిన్నెలపై మూతలు తీస్తే అన్నిట్లో మామిడికాయ పచ్చడి మాత్రమే వుంది. ఏ లీజియే, ఓ లీజియే అంటూ ఆప్యాయతతో వడ్డించడం మొదలుపెట్టిండు.ఆఖరికి ఒక గిన్నెలో కట్టా అంటూ తెచ్చిండు. అది పచ్చిపులుసు. దానితో భోజనం ముగించినం.
మావాడి తల్లి ఎంతో ప్రేమతో పలుకరించింది. ‘పండుగపూట నాడు మావాడు దోస్తులను పిలిచిండు. ఏమేమో చేద్దామనుకున్నం బేటా, పైసలందలేదు, ఉద్దెర దొరకలేదు, గరీబోంకా దావత్ హై కుచ్ మత్ సమఝ్ నా ’ అంటూ కంట నీరు పెట్టుకుంది. నహి అమ్మా ఐసా మత్ సోచో హమ్ బహుత్ ఖుష్ హై అంటూ మావాడికి ఈద్ ముబారక్ చెప్పి బయటపడ్డం. మావాడి మనసు గొప్పది. ఏమి పెట్టాడు అన్నది కాదు ఎలా పెట్టింది అన్నదే ముఖ్యం. ఆ మంచి మనసుకు వందనాలు చెప్పుకున్నం.
* * * *
దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ‘ఊరు వాడ బతుకు’ పుస్తకాన్ని నవల అనాలో, ఆత్మకథ అనాలో తెలియదు.
అరవయ్యేళ్ల వెనక్కి తీసుకెళ్లి తెలంగాణ గ్రామప్రాంతాలను, అక్కడి జీవనవిధానాన్నీ కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ పుస్తకం చదవదగ్గది అని మాత్రం చెప్పగలను.
నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నాగులపాడు పరగణాలోని అనంతారంలో 1940లో సాలె (పద్మశాలి) కుటుంబంలో పుట్టారు కృష్ణమూర్తి. ఆయన రాసిన ‘ఊరు వాడ బతుకు’ పేరుకు తగ్గట్టే నాటి
గ్రామాలను అత్యంత సహజంగా మనముందు నిలబెడుతుంది.
రుతువులు, జానపద గీతాలు, కులభావనలేని కులాలు, పల్లెటూరి వృత్తులు, పండగలు, పేదరికం, ప్రేమ, సమిష్టి కుటుంబాలు, స్నేహాలు, పోరాటాలు అన్నిటినీ సహజ సుందరంగా చిత్రించిన ఈ పుస్తకాన్ని వీలయినప్పుడు చదవండి.
135 పేజీలున్న ఈ పుస్తకం ధర నలభై రూపాయలు. పేజీల్లో అక్కడక్కడా ఆకట్టుకునే బొమ్మలు లక్షణ్ ఏలేవి. ఈ నెలే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment