Friday, May 22, 2009

పెరియార్‌ జీవితం - ఉద్యమం... వి.ఎస్‌. నైపాల్‌



పెరియార్‌ జీవితం - ఉద్యమం
- వి.ఎస్‌. నైపాల్‌


పెరియార్‌ గురించీ, ఆయన చేపట్టిన విలక్షణమైన ఉద్యమం గురించీ తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం కొంతవరకు దోహదం చేస్తుంది. నిజానికి ఇది వి.ఎస్‌. నైపాల్‌ రాసిన ''ఇండియా: ఎ మిలియన్‌ మ్యూటినీస్‌ నౌ'' అన్న బృహత్‌గ్రంథంలోని ఒక చిన్న అధ్యాయం. భారతదేశ పర్యటనలో భాగంగా 1988లో మద్రాసులో అనేకమంది పెరియార్‌ అనుయాయుల్ని, డిఎంకె ప్రతినిధులను కలుసుకుని ఆయన తన అనుభవాలను గ్రంథస్తం చేశారు.

పెరియార్‌ 1879లో అంటే గాంధీ పుట్టిన పదేళ్ల తరువాత జన్మించాడు. ఆయన రాజకీయ జీవితం 1919లో ప్రారంభమై 1973లో చనిపోయే వరకూ సుదీర్ఘకాలం కొనసాగింది. గాంధీ పూర్తిగా శాఖాహారి. పెరియార్‌ మాంసాహారి. భోజనప్రియుడు. పొట్టేలు మాంసం, ఎద్దు మాంసం, పంది మాంసం ఇష్టపడేవాడు. ఆయనకు తిండి విషయంలో ఎట్లాంటి నియమాలూ వుండేవి కావు. గాంధీ ఆస్తికుడు. పెరియార్‌ నాస్తికుడు.

గాంధీకి పూర్తి భిన్నంగా కనిపించినప్పటికీ, గాంధీని ఆయన అన్నివిషయాల్లో గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లక్ష్య సాధనకు కృషి చేయడంలో, చెప్పింది స్వయంగా ఆచరించడంలో, దైనందిక వ్యవహార శైలిలో పెరియార్‌ గాంధీ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. పెరియార్‌లో భోజన ప్రియత్వం, మాంసాహార అ లవాటు, మొండితనం వంటి లక్షణాలు ఎన్ని వున్నా ఒక విధమైన నిర్మలత్వం కూడా కనిపిస్తుంది. ఆ నిర్మలత్వమే పెరియార్‌కు ''యాంటీ గాంధీ'' రూపాన్నిచ్చింది అంటారు నైపాల్‌.

పెరియార్‌ బ్రాహ్మణేతరుల దేవాలయ ప్రవేశ హక్కు కోసం పోరాడారు. స్వాభిమాన ఉద్యమాన్ని నిర్వహించాడు. నాస్తికత్వాన్ని ప్రచారం చేశారు. విగ్రహారాధనను, మూఢనమ్మకాలను నిరసించాడు, కుల నిర్మూలనకు పాటుపడ్డాడు, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ల ముందరి బోర్డుల్లో శాఖాహారానికి పర్యాయపదంగా ''బ్రాహ్మణ'' అన్న పదాన్ని, మాంసాహారానికి పర్యాయపదంగా ''మిలిటరీ'' అన్న పదాన్ని వాడడాన్ని నిరసించి ఆ పదాలను తొలగింపజేశాడు. వినూత్న స్ఫూర్తితో ద్రవిడ ఉద్యమం నిర్మించాడు.

డెబ్బై ఏళ్ల వృద్ధాప్యంలో పెరియార్‌ ముఫ్ఫై ఏళ్ల మణ్యమ్మాయ్‌ అనే మహిళను ద్వితీయ వివాహం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. దానిమూలంగా ఎందరో ఆయనకు దూరమైపోయారు.చివరికి ద్రవిడ స్వాభిమాన ఉద్యమంలో చీలికకు కూడా దారితీసింది. మణ్యమ్మాయ్‌ తల్లిదండ్రులు పెరియార్‌ అభిమానులు. వెల్లూరుకు వెళ్లినప్పుడు ఆయన ఎక్కువగా వారి ఇంట్లోనే బస చేసేవారు. మణ్యమ్మాయ్‌ టీచర్‌ ట్రెనింగ్‌ పూర్తిచేసింది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకొమ్మని ఎంత బలవంతపెట్టినా ఒప్పుకునేది కాదు. చివరికి పాతికేళ్ల వయసులో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి మరో టీచరు ఇంట్లో ఆశ్రయం తీసుకుంది. ఆమెను పెరియార్‌ తన కార్యదర్శిగా నియమించుకున్నాడు. ఆమె ఆయనకు ఒక నర్స్‌గా కూడా సపర్యలు చేసేది. దాదాపు ఆరేళ్ల తరువాత వారిరువురూ వివాహం చేసుకున్నారు. పెరియార్‌ వద్ద కోట్ల ఆస్తి వుండేది. ఆ ఆస్తి తన బంధువుల పాలు కాకుండా పూర్తిగా తన ఉద్యమానికే ఉపయోగపడాలనేది ఆయన కోరికనీ, అందుకే ఆయన మణ్యమ్మాయ్‌ని పెళ్లి చేసుకున్నాడని ప్రతీతి.

''ప్రపంచం ఇంకా గాఢాంధకారంలోనే వుంది
కులాన్ని నమ్మే జనానికి ఇంకా నూకలు పుడుతూనే వున్నాయి
మతం ద్వారా ప్రజల్ని బెదిరించే వ్యక్తులు ఇంకా బలిసిపోతూనే వున్నారు
ఈ జిత్తులమారి మోసాలకు అంతమెప్పుడు?
కులం, మతం అంతరించిపోనంతకాలం...
స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దయ్యాలు మాత్రమే అనుభవిస్తాయి!''


- భారతీ దాసమ్‌ (పెరియార్‌ స్వాభిమాన ఉద్యమంలో ఒక విధంగా ఆస్థాన కవి)

వి. ఎస్. నైపాల్ (సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్) 1932 లో ట్రినిడాడ్ లో జన్మించారు. అనేక కాల్పనిక, కాల్పానికేతర రచనలను వెలువరించారు. ఇటీవలి అయన రచనల్లో An Area of Darkness, India : Wounded Civilization, India: A Million Mutinies Now , Beyond Belief: Islamic Excursions ప్రముఖ మైనవి. In a Free State అన్న నవలకు 1971 లో బుకర్ ప్రైజ్ లభించింది. 2001 లో నోబెల్ ప్రైజ్ కూడా ఆయనను వరించింది.


పెరియార్‌ జీవితం - ఉద్యమం
-వి.ఎస్‌.నైపాల్‌
ఆంగ్ల మూలం : India: A Million Mutinies Now, V.S.Naipaul, Minerva, India 1991.

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


ప్రథమ ముద్రణ: 1999
26 పేజీలు, వెల: రూ.15/-
............................

1 comment:

  1. Periyaar puttina (Tamilnadu) gadda meeda, ippudu machchukaina periyaar aashayaalu/aalochanalu kanipinchatledu. Iam so sad to see this happening in Tamilnadu. But at the same time bhakthi vudyamam as told in this book is so popular. Prajala gundela lothulaku cherukovadam lo Periyaar enduku vipalamayyadu. I could see only one reason illiteracy.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌