Wednesday, January 21, 2015

మనం తలతిప్పుకునే జీవితాల కథ _ భాను ప్రకాష్ కె.

మనం తలతిప్పుకునే జీవితాల కథ    


అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కరుణామయుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని తిరిగి అయోధ్యకి వెళ్ళవలిసిందిగా చెప్పి తనపై వారికి ఉన్న ప్రేమకు కృతజ్ఞత చెప్పాడు. అందరూ తిరిగి అయోధ్యకు బయలుదేరారు. కాని కొంతమంది మాత్రం అక్కడ నుంచి కదలలేదు.
అది చూసిన రాముడు మీరెందుకు వెళ్ళలేదని అడిగాడు.
మీరు ఆడవారిని మగవాళ్ళని వెళ్ళమన్నారు. మేము ఈ రెండింటికి చెందిన వారం కాదు, అందుకే మీ వెంటే ఉండి పోయాము అని చెప్పారు. రాముడు వాళ్ళ సత్యనిరతికి సంతోషించి వాళ్ళ మాట ఎపుడూ సత్యమయ్యేలా దీవించి వరమిచ్చాడు. వాళ్ళే ఇప్పుడు మనమంతా కనీసం మనుషులుగా నైనా చూడడానికి ఇష్టపడని హిజ్రాలు.

OkaHijraAtmakatha600ఈసారి అనగనగా ద్వాపరయుగం. కురుపాండవులిరువురూ కురుక్షేత్ర యుధ్ధ సన్నాహాల్లో ఉన్నారు. పాండవులు యుద్ధానికి ముందు యుద్ధంలో గెలుపు కోసం నరబలి ఇవ్వాలి. ఆ బలి కాబోయేవాడు సకల శాస్త్రాల్లో ఆరితేరినవాడు ఉత్తమజాతి పురుషుడై ఉండాలి. ఆ కాలంలో అలాంటివాళ్ళు ముగ్గురే ముగ్గురు. ఒకరు సాక్షాత్ శ్రీ కృష్ణపరమాత్ముడు, ఇంకొకరు అర్జునుడు, మరొకరు అర్జునునికి నాగకన్యకి పుట్టిన అరవానుడు.

నరనారాయణులిద్దరు కురుక్షేత్రంలో చేయవలసింది చాలా ఉంది కాబట్టి వాళ్ళు అరవానుని బలికి సిద్ధం చేస్తారు. ఐతే బలి కాబోయే ముందు తనకి ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని ఒక్కసారైనా సంసార సుఖం అనుభవించాలని ఉంటుంది. కాని ఆ రాజ్యంలో ఒక్కరు కూడ ముందుకురారు. అది చూసిన శ్రీ కృష్ణుడు ఒక స్త్రీగా మారి ఆతడిని పెళ్ళి చేసుకుంటాడు. అర్వాన్ ని బలి ఇచ్చిన తర్వాత విధవగా మారతాడు. అప్పట్నుంచి ఈ ఒక ఉత్సవం జరుగుతుంది దానినే అర్వాణి ఉత్సవం అంటారు. ఆ ఉత్సవం చేసుకునే వాళ్ళు అర్వాణులు. వారికి మరో పేరే హిజ్రాలు. ఈ హిజ్రాలందరు శ్రీ కృష్ణున్ని తమ పూర్వీకుడిగా అర్వాణ్ ని తమ భర్త గా పూజిస్తారు.

పైన చెప్పిన రెండు కథలూ రేవతి (దొరైస్వామి) తన ఆత్మకథలో చెప్పిన సంగతులు. నిజానికి దొరైస్వామి అని పిలిస్తే తనకి నచ్చదు. ఎందుకంటే ఆమె మగవాడి శరీరంలో బంధింపబడిన స్త్రీ. ఆ లక్షణాల వల్లనే తన కుటుంబానికి దూరం అయ్యింది. సమాజంలో అతి హీనంగా చీత్కారానికి గురైంది. మనసు స్త్రీది అయ్యి మనిషి మగవాడైతే ఎంత నరకమో అది ఎన్ని దారుణమైన పరిస్థితులకి దారి తీస్తుందో “నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మ కథ”లో మనకి అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మనకి కంట తడి పెట్టిస్తాయి. రేవతిలాంటి బతుకు పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. కాదు కాదు, పగదానికి కూడ రాకూడదనిపిస్తుంది. లింగ వివక్ష ఒక్క స్త్రీలకే అనుకుంటే వీళ్ళ స్థితి ఇంకా దారుణం. వీళ్ళపై పోలీసులు రౌడీలు చేసే దౌర్జన్యం అమానుషం.

దొరై స్వామి తమిళనాడులోని ఒకానొక పల్లెటూరులో పుట్టిన అభాగ్యుడు. తను ఒక స్త్రీగానే పుట్టాడు ఒక స్త్రీగానే పెరిగాడు. కాని అదంతా తన కోణంలోనే. సమజానికి, కుటుంబానికి తను అబ్బాయిలా వుండి అమ్మాయి వేషాలు వేసే ఆడంగి వెధవ. జీవితం ఒకటే కాని చూసే కోణాలే వేరు. ఎంత దారుణమైనది ఈ సమాజం! అంతా తను చెపినట్టే జరగాలి అనుకుంటుంది. వినలేదంటే పగ తీర్చుకుంటుంది. అలాగే రేవతి పైనా తీర్చుకుంది.

తనకి ఇష్టమొచ్చినట్టుగా బతకడానికి వీలు లేదని రేవతిని వెలివేసింది. కుటుంబం లోనె అన్నల చేతిలో దారుణమైన అవమానాలు, చచ్చేలా దెబ్బలు తింది. ఇంక ఆక్కడ ఉండలేక తన లాంటి వాళ్ళ సహాయంతో పారిపోతుంది. అక్కడ హిజ్రా సమాజాన్ని వాళ్ళ కట్టుబాట్లని మనకి కళ్ళకి కట్టినట్లు చెబ్తుంది రేవతి.

అన్నట్టు తనకి రేవతి అని పేరు కూడా తను సినిమా హీరోయిన్ రేవతిలా ఉంటుందని తన గురువైన ఒక హిజ్రా నామకరణం చేసింది. అత్యంత సాహసంతో కూడిన రేవతి ప్రయాణం మనకి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలని చెబ్తుంది. అంతేకాదు హిజ్రా సమాజంలో ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు తమ గురువులని యెంత గౌరవిస్తారు, అలాగే వాళ్ళని వీళ్ళు ఎలా పోషిస్తారు, వీళ్ళు పూర్తిగా ఆడవాల్లుగా మారడానికి చేసుకునే ఆపరేషన్, దాని కోసం పడే అవస్థలూ… అబ్బో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఈ సమాజం వీళ్ళకి సెక్స్ వర్క్ లేదా అడుక్కోవడం ఈ రెండుదార్లే చూపించింది. వేరే దారి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు పని ఇవ్వరు, సరి కదా కనీసం సాటి మనుషులుగా నైనా చూడరు. అందుకే వీళ్ళు మనకి ట్రైన్లలో షాపుల్లో అడుక్కుంటూ కనిపిస్తారు. ఇంకా రేవతి జీవితంలో ఐతే అడుగడునా విషాదమే కాని కొన్ని తను ఎలా కొనితెచ్చుకుందో మనకి తనే నిర్భయంగా చెప్పుకుంటూ పోతుంది. తను కేవలం తన లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి సెక్స్ వర్క్ మొదలు పెడుతుంది. కాని చివరకి అదే తన వృత్తి ఐపోతుంది. రేవతికి మొదటి నుంచి తమ జీవితాలు ఎందుకు ఇంత హీనంగా ఉన్నై అన్న బాధ “సంగమ” అనే స్వచ్ఛంద సంస్థలో పని చేసెలా చేసింది. కాని తను అందులో పని చేస్తున్నప్పుడే తన గురువు, ఇంకా స్నేహితుల హత్యలని చూస్తుంది. హిజ్రాలు కాబట్టి ఆ కేసుల్ని కూడ ఎవరూ పట్టించుకోరు. వీళ్ళని రోడ్లపైన రౌడీలు వెంటపడి కొడుతున్నా సాటి మనుషులు ఎవరూ అడ్డుకోకపోవడాన్ని దీనంగా మనతో చెప్పుకుంటుంది.

బస్సుల్లో ట్రైన్లలో వారి పై జరిగే అత్యాచారాన్ని ఎంత మౌనంగా అనుభవించారో చెప్పుకుంటుంది. ఇంక ఒక పోలీసు ఒక రోజు రాత్రి పోలిస్టేషన్లో తనతో ఎంత హేయంగా ప్రవర్తించాడో చాలా నిజాయితీగా చెప్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా మనకి హిజ్రాల మీద ఉన్న చిన్న చూపు పోతుంది. వాల్లు కూడా సాటి మనుషులుగా కనిపిస్తారు. అంతే కాదు, ఈ పుస్తకంలో ఎవరు తనపైన అమానుషంగా ప్రవర్తించినా వాళ్ళని ‘మీ ఇంట్లో కూడ నాలాంటి వాడు ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ’ అని అంటుంది. తను తెలిసి అన్నా తెలియక అన్నా ఈ సమాజంలో వాళ్ళకి సమానహక్కులు రావాలంటే ఖచ్చితంగా ప్రతీ ఇంట్లో ఆడ మగతో పాటు ఒక హిజ్రా కూడ అంతే సహజంగా పుట్టాలి అప్పుడే అర్థమవుతుంది అనిపిస్తుంది. “సంగమ”లో ఒక మంచి కార్యకర్తగా ఉంటూ తమవారి బాగుకోసం తను చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.

అలాగే ఇంత నిజాయితీగా తనకోసం తన సమాజం కోసం తను చెప్పడం చాలా చాలా బాగుంది. పుస్తకం మూయగానే ఒక ఆర్ధ్రత మనసులో నింపిపోయే పుస్తకం ఇది. మిస్ కాకండి.

- భాను ప్రకాష్ కె.   

("కినిగె పత్రిక" జనవరి 2015 సౌజన్యం తో)

http://patrika.kinige.com/?p=4741






No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌