హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. ‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం
తల్లికి కాన్పు అవ్వగానే అమ్మాయా, అబ్బాయా అని అడుగుతుంటారు. కానీ ఈ భూమి మీద ఒకటిన్నర కోటికి పైగా ఆడా మగా కానీ వారు ఉన్నారని చాలా మందికి తెలియదు. ఎక్స్, వై క్రోమోజోములు కలిస్తే అబ్బాయిలు పుడతారనీ ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయిలు పుడతారనీ తెలుసు కానీ ఈ క్రోమోజోములు ఇతర నిష్పత్తిలో కలిస్తే రకరకాల శారీరక, మానసిక పరిస్థితులు ఏర్పడతాయని తెలియదు.
అలా పుట్టిన వాళ్ళు సాంప్రదాయ నిర్దేశిక, సామాజిక ఆమోదమైన ఆడా మగా నమూనాల్లో ఇమడలేక ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ తమ శరీరాలతోనూ, మనస్సులతోనూ.. ఇటు కుటుంబాలతోనూ అటు సమాజంతోనూ నిత్య యుద్ధాలతో మునిగి తేలుతుంటారనీ తెలియదు.
సమాజానికి యింత వల్నరబుల్ గా ఉన్న ఈ సమూహాల గురించిన భయం, సంశయం, నిర్లక్ష్యం వదిలి ఎప్పుడైనా ఆలోచించామా?
ఈ భయానక హింసాయుత జీవితం వారు కోరుకొన్నది కాదు. కొన్ని పెట్టుబడిదారీ సాంస్కృతిక ప్రచార సాధనాలు, సాహిత్యం, సినిమాలు ప్రచారం చేస్తున్నట్లు ఆ పరిస్థితి కేవలం భావోద్వేగాలకు సంబంధించింది కూడా కాదు. భావోద్వేగాలు ఆకాశం నుండి ఊడిపడవు, వాటికి భౌతిక పునాది ఉంటుంది అనే కోణం నుండి జరిగిన పరిశోధనలు ఈ స్థితికి అనేక హార్మోన్లు, క్రోమోజోన్లు కారణాలుగా తేల్చాయి. కొందరికి ఈ స్థితి వారి అవయవ నిర్మాణంలో కనబడితే మరికొందరికి కేవలం మానసిక ప్రవృత్తిలో కనబడుతుంది.
‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం మగపిల్లవాడిగా పుట్టి అంతర్గతంగా స్త్రీ లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి ఆత్మ కధ. ఇది ‘వ్యక్తి ఆత్మ కధ’ అనటం కంటే ఆ సమూహం బయట ప్రపంచానికి సమర్పించుకొన్న సంవేదన అనవచ్చు. ఎందుకంటే రేవతిగా మారిన దొరై స్వామి( అలా అనటం రేవతికి ఇష్టం ఉండదు, రేవతీ అని పిలవటమే ఇష్టం) జీవితం అలా బతుకుతున్నఒకటిన్నర కోట్ల వ్యక్తుల జీవిత సంగ్రహం. అవయవ మార్పిడి చేసుకొని హిజ్రాలుగా పిలువబడుతున్నవారు మానసికంగా పడిన సంఘర్షణల స్థాయిలను, సమాజంతో చేసిన యుద్ధాలను సాధారణీకరించి, సంగ్రహిస్తే దాని సారమే రేవతి రాసిన ఈ పుస్తకం.
మన చుట్టూ వున్న సమాజం స్త్రీలకు, దళితులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు – మొత్తంగా మెజారిటీ జనసందోహానికి బాగోలేదని తెలుసు.
కానీ ‘ఆడంగులుగా’ పిలువబడుతూ ఇతరుల ఏహ్యానికి, చీదరింపుకు, భయానికి, వెలివేతకు గురవుతున్న హిజ్రాల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించగలదో ఈ పుస్తకం మనకు అర్ధం చేయిస్తుంది.
కుటుంబం కూడా సమాజంలో ఒక భాగం కాబట్టి ఆ క్రూరత్వపు సెగలు కుటుంబం నుండి కూడా తగులుతుంటాయి. వర్గ సమాజంలో ఆర్ధిక స్థితిగతులు మనిషి బతుకును శాసిస్తాయి. కానీ హిజ్రాలు కుటుంబంతో గడపలేని పరిస్థితుల వలన ఎంతో కొంత ఆర్ధిక వనరులు ఉన్న కుటుంబం నుండి వచ్చినా ఆమె లేక అతను ఆ వనరులను పొందలేరు. కుటుంబంలో వారి సహజ ఉనికికి సాధారణంగా ఒప్పుదల ఉండదు కాబట్టి సమాజంలోకి వారు విసిరివేయబడతారు.
వారి భౌతిక రూపం, ఆర్ధిక వెనుకబాటుతనం వారిని స్వతంత్రంగా ఉండనివ్వవు. తమకంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకొన్న సమాజాల్లో మాత్రమే వాళ్ళు బతకగలరు. అక్కడే వారి ఉనికికి స్వాంతన, ఒప్పుదల ఉంటాయి. అయితే అంతటా విస్తరించిన అవలక్షణాలు వాళ్ళ సమాజాలను కూడా తాకి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. బతుకు పోరులో అలసి పోతూ కేవలం బతకటం కోసమే కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి కుటుంబానికి పరుగులు పెడుతుంటారు.
అలాంటి పరుగులనే రేవతి నిరలంకారంగా, ఉన్నది ఉన్నట్లుగా ఈ పుస్తకంలో వర్ణించింది. ఆమె సంతోషాలను, ఘర్షణలను, దుఃఖాలను, బలహీనతలను నిజాయితీగా చెప్పింది. ఈమె ఈ పుస్తకంలో స్రవించిన జీవిత ప్రవాహానికి, అక్కడక్కడ ఆమె వ్యాఖ్యానాలు, ఆపుకోలేక కొన్ని చోట్ల ఆమె చేసిన ఉద్వేగ ప్రకటనలు ఏమాత్రం ఆటంకాలు కాలేదు. ఈ జీవితకధ సౌందర్యవంతంగా ఉండదు. ఈ కధ సుఖాంతం అయ్యే ఛాన్స్ లేదు. ఈ జీవితంలో ఉండే భిన్నత్వం .. ఈ బతుకు చూపించే కొత్త కోణం మనకు కలిగించే ఎరుక మాత్రం తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
మగవాడిగా పుట్టి స్త్రీ మానసిక ప్రవృత్తి కలిగి ఉండటం చిన్నతనాన కలిగించే గందరగోళం అర్ధం కావాలంటే ఆమె హృదయాన్ని అక్షరాలలో చూడాల్సిందే. తనకు చిన్నప్పటి నుండి ఎందుకు ఆడ దుస్తులు ధరించాలని అనిపిస్తుంది? ఎందుకు ఆడవాళ్ళకు మగవాళ్ళపై కలిగే సహజ ఆకర్షణ తనకు కలుగుతుంది? మగ శరీరంలో ఇరుక్కు పోయిన స్త్రీగా ఎందుకు అనిపిస్తుంది? ఈ అయోమయపు ప్రశ్నలకు సమాధానాలు దొరక్క తనలో జరుగుతున్న అలజడిని రేవతి బాగా రాయగలిగింది. ఆమెలో పురుషుల పట్ల చెలరేగుతున్న లైంగిక వాంఛల గురించి కూడా నిజాయితీగా చెప్పగలిగింది.
ప్రధాన స్రవంతి జీవితం అంచులకు నెట్టబడిన హిజ్రాలు తమకు తామే కొన్ని సంస్కృతీ, సాంప్రదాయాలు, వావి వరుసలు ఏర్పరుచుకొంటారు. ఎక్కడా ఆమోదం దొరకక తమలో తామే తిట్టుకొంటూ, కొట్టుకొంటూ ఒక ‘కాకి గుంపు లాగా’ ఎప్పుడూ అతుక్కొనే బతుకుతారు. ఎవరూ పనులు ఇవ్వరు. సెక్స్ వర్క్ (వ్యభిచారం) చేయటం, అడుక్కోవటం తప్ప వేరే గతి ఉండదు. ఈ హిజ్రాల లోకంలో ఉన్న హింస భయంకరమైనది. నిరంతరం పోలీసుల, రౌడీల – బెదిరింపులతో, దాడులతో భయం క్రీనీడలో బతుకు వెల్లమారుస్తుంటారు. రేవతి తన ఒక రాత్రి పోలీసు స్టేషన్ లో గడిపిన అనుభవాన్నిఒళ్ళు గగుర్పొడిచేలా వర్ణించింది. చదువుతుంటేనే భీతి కలిగే క్రూర పరిస్థితులలో వారు నిత్యం సహవాసం చేస్తుంటారు.
ఈ దేశంలో పేదగా పుట్టినా, అణగారిన కులాల్లో పుట్టినా, మైనారిటీ మతాల్లో పుట్టినా, అంగవైకల్యంతో పుట్టినా పేరుకి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ హిజ్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రేవతి తన జీవితాన్నే ప్రదర్శనగా చూపిస్తూ చట్టాలనూ యితర రాజ్యాంగ యంత్రాలను చాలా ప్రశ్నలు వేసింది. ఆడపిల్లగా కుటుంబంలో కొంత స్థానం ఉంటుంది. మగపిల్లవాడికైతే హక్కులు ఉంటాయి. హిజ్రాలు ఇటు కుటుంబంలోనూ, అటు న్యాయస్థానాలలోనూ తిరస్కృతులు అవుతుంటారు. చివరకు రేషన్ కార్డ్ కోసం, డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. రేవతి సెక్స్ వర్క్ చేసి పంపించిన డబ్బుతో ఇళ్ళు బాగు చేయించుకొని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటానికి కుటుంబం అంగీకరించదు. అప్పటి దాక వేసిన ప్రతి అడుగు ఆమెకు యుద్ధం అయినా, రేవతి ఈ తిరస్కారాన్ని మాత్రం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది.
ప్రేమ, పెళ్ళి విషయంలో ఆమె పొందిన వైఫల్యాన్ని, దాని తాలూకూ దుఃఖాన్ని ఆమె నుండి పుస్తకంలోకి, పుస్తకం నుండి పాఠకులకూ సమర్ధవంతగా బదిలీ చేయగలిగింది. హిజ్రాలకు ప్రేమోద్వేగాలు ఉంటాయా అంటే ఉంటాయి. కానీ అవి మన సినిమాల్లో, సాహిత్యంలో కనబడినంత ఎగతాళిగా, వెకిలిగా ఉండవు. అందరి యువతులకు కలిగినంత సహజంగా మనసుకి నచ్చిన పురుషుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. అయితే అది సఫలం అయ్యే పాళ్ళు మాత్రం చాలా తక్కువ. ‘సాధారణేతర లైంగిక స్వభావం’ కలవారిని పెళ్ళి చేసుకొంటానని ఉపన్యాసాలలో చెప్పి చేసుకొన్న వ్యక్తి కూడా చివరకు ఆమెను వదిలించుకొని వెళ్ళిపోతాడు.
ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనసుని తాకుతాయి. స్త్రీ తరహా మానసిక ప్రవృత్తి తో ఉన్న వాళ్ళు పురుషుల పట్ల ఆకర్షితులవడం సహజమే కానీ, స్త్రీత్వం అని ఆపాదించినదంతా స్త్రీకి సొంతమైనది కాదు. ఉదాహరణకు రేవతి భార్యగా తన భర్తకు పరిచర్యలు చేయాలనీ, అతన్ని సంతోష పెట్టాలనీ అనుకొంటుంది. అతను ఇంటి పని ఏమీ చేయకపోయినా పట్టించుకోదు. అదే స్త్రీత్వం అనే భావన కూడా ఆమెకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి ఇంటి చాకిరీ, పురుషుడి పట్ల సేవాభావము స్త్రీల మెదళ్ళలో భూస్వామ్య భావజాలం అనాదిగా అంటగట్టబడినవి. అదే స్త్రీత్వమనే తప్పుడు భావన హిజ్రాలకు కూడా బదిలీ అయినట్లు కనబడుతుంది. అలాగే స్త్రీలగా కనబడాలనే తాపత్రయంతో ఎక్కువ అలంకరణలు చేసుకోవటం, శరీరాన్ని ప్రదర్శించటం కూడా జరుగుతుంది. ఇవి పెట్టుబాడీదారి సమాజం స్త్రీలపై రుద్దిన అనారోగ్యధోరణులు. స్త్రీలు మోస్తున్న ఈ భావ దరిద్రాలన్నీ హిజ్రాలు కూడా మోస్తున్నారు.
రేవతి ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచయిత్రిగా రుజువు చేసుకొన్నది. సామాజిక కార్యకర్తగా పుస్తక రచయిత్రిగా ఎదిగిన ఈమె ఈ పుస్తకం పూర్తి అయ్యేనాటికి మళ్ళీ సెక్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితికి నెట్టబడటం ఒక కఠిన వాస్తవం. ఈ గడ్డ మీది ప్రతి మానవ పుటకా హుందాయైన బ్రతుకు తెరువు, గౌరవనీయమైన జీవనం అభయంగా పొందాలి. అలా పొందలేనపుడు వందల సమూహాల అస్థిత్వాలు వాటి ఉనికి కోసం ఆక్రోశిస్తాయి. ఆ సమూహాల్లో ఒక సమూహం ఈ హిజ్రా సమూహం. ఈ పుస్తకం చదివి ఆ సమూహాల పట్ల, వాళ్ళు చేస్తున్న పోరాటాల పట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పరుచుకోగలిగితే రేవతి కృషి ఫలించినట్లే .
No comments:
Post a Comment