Saturday, January 10, 2015

దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు : సంపాదకులు : సుశి తారు, కె.లలిత





దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు  భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలిత



భారతీయ స్త్రీల రచనలను తొలిసారిగా ఇంగ్లీష్‌లోకి అనువదించి 1989-91ల లోనే 'అన్వేషి' రెండు భాగాలుగా వెలువరించింది. ఆ సంకలనంలోని రెండో భాగానికి తెచ్చిన తెలుగు అనువాదమే ప్రస్తుత గ్రంథం. సమాజ వికసనంలో తమదైన ముద్ర వేసిన మనదేశపు స్త్రీల భావజాలానికి దర్పణం. పితృస్వామ్య శక్తులతో ఘర్షణ పడుతూనే తమ అస్తిత్వాలను నిరూపించుకున్న ఇరవయ్యవ శతాబ్దికి చెందిన 73 మంది రచయిత్రుల అక్షరాల దారులు మనందరి కోసమే.

- విజయ భారతి

విశ్రాంత డైరెక్టర్‌, తెలుగు అకాడెమీ


ఈనాటి మహిళల సాహిత్య ప్రస్థానం గొప్పగా సాగుతున్నదంటే దానికి పునాది ఎన్నో ఏళ్ల క్రితం వాటికి బీజం వేసిన రచయిత్రులదే. ఈ రోజున మహావృక్షం నీడన కూర్చున్నాం కదా అని మనం విత్తనాన్ని మరవలేం. మహిళల సాహిత్య కృషి భారతీయ సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేసిందో చెప్పడానికి ''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' అన్న గ్రంథం వచ్చినపుడు అందరూ అవాక్కయ్యారు. మనకు ఎంతో తెలుసుననుకున్న భారతీయ సాహిత్యం గురించి ఎంత తక్కువ తెలుసో చెప్పిన ఆ పుస్తకం ఒక చారిత్రక ఘట్టం. ఇప్పటికే రాస్తున్న స్త్రీలకు మరింత ప్రోత్సాహాన్ని, ఇక పై రాయనున్న వారికి గొప్ప స్ఫూర్తిని అందజేయగల ఈ పుస్తకం అక్షరాలా అక్షర మార్గమే.

- మృణాళిని,
డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఎన్‌సైక్లోపీడియా, తెలుగు యూనివర్సిటీ


''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకాలు ఆఫ్రికన్‌ స్త్రీలూ, దళితులూ, ఇంకా అనేక పీడిత సమూహాలు సాహిత్య చరిత్ర రచనకు పూనుకోవడానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో వీటి అవసరం చాలా ఉంది.

- కె. సత్యనారాయణ,
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చరల్‌ స్టడీస్‌,
ఇంగ్లీష్‌ & ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (EFLU)


దారులేసిన అక్షరాలు - 
ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలిత
600 పేజీలు, ధర : రూ. 400/-

ప్రతులకు, వివరాలకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

...................................................................................................................................................

ఈ పుస్తకం ముందుమాట నుంచి కొంత భాగం :
...  ... ... 
స్త్రీల సాహిత్యంలో అద్భుతమైన 'మచ్చుతునకలు' వెలికితీయటం సంతోషకరమైన ప్రయత్నం. ఇంకొక స్థాయిలో అది స్త్రీవాద విమర్శ సిద్ధాంతం, ఆచరణలకు సంబంధించిన కష్టతరమైన, ప్రయోగాత్మక చర్య. పేరుపొందిన రచయిత్రుల కృషిని తిరిగి 'చదవటానికి', ప్రపంచానికి అంతగా పరిచయంలేని వాళ్ళను పరిచయం చేయటానికీ, మేం ప్రయత్నించాం. ఇందులో కొన్ని మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే విషయాలున్నాయి. తెలుగు సాహిత్యంలో తెలుగు పాఠకులకి కూడా ఆనందాన్ని కలగజేసే విషయాలున్నాయి. సాంప్రదాయక అంచనాల్తో చూస్తే ఇక్కడ ఉన్న రచనలు చాలా వరకు ప్రఖ్యాత గ్రంథాల నుంచే. అందులో కొన్ని కాలం పెట్టిన పరీక్షలకు- అవి ఎంత కఠినమైనాసరే- తట్టుకొని నిలబడినవి. ... ...

ఇంతకు ముందు రూపొందించిన ఎన్నో రకాల సిద్ధాంత భావనల్ని ప్రశ్నించే అవసరం ఈ సంకలనానికి ఉంది. ఇంతకు ముందు రచనా ప్రపంచంలో ఏరి వేయబడిన; 'కొనసాగలేని' ఎన్నో రకాల అంశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటికి స్పష్టతనిచ్చి, ప్రాముఖ్యత కలిగిస్తామని మా ఆశ. సాహిత్య గ్రంథాన్ని, దాని సాంఘిక సందర్భాలను విడదీసి గత నూటయాభై సంవత్సరాలుగా సాహిత్య సౌందర్య శాస్త్రం మీద పెట్టిన భారాన్ని వదిలించుకోవాలని, తిరుగుబాటు ధోరణుల రూపాలు వైరుధ్యాలను ఎత్తిచూపే విధిని నిర్వర్తించాలని మా కోరిక. అటువంటి ఆచరణ చేసే వాగ్దానం ఒక సాహిత్యానికే పరిమితం కాదు. అకాడెమీలో కూడా - గాయిత్రీ స్పీవాక్‌ అన్నట్టు, ''చరిత్ర, రాజకీయార్ధ శాస్త్రం - ప్రపంచంతోటి కలిపి సాహిత్య రూపాల్ని చూడాలి''.68 పాతకాలం విశ్వజనీనత మాసిపోయి, ఆకర్షణావిహితంగా కన్పించటం ప్రారంభమైతేనే నూతన ప్రపంచపు సౌందర్యం కంటికి తోచే అవకాశం ఉంది. ఆ సాహిత్యాలలోని ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే భావ ప్రకటనలూ, వాటి అనుభూతులూ, రుచులూ - జీవం లేనివిగా, ఉత్త సెంటిమెంట్లుగా కన్పించడం మొదలవుతుంది.

... ... రాజకీయ ఆర్థిక విధానాల మధ్య సంబంధాల్ని శోధించటం మా ఉద్దేశం. మా నమ్మకంలో ఈ సంబంధాలే స్త్రీల రచనల్లో అంశాలకు వెలుగు పడతాయి. మొదటి సంకలనంలో సంస్కరణ, జాతీయ ఉద్యమ సాహిత్యాల ముందుమాటల్లో పంథొమ్మిది, ఇరవై శతాబ్దాలలో 'స్త్రీలు', 'పితృస్వామ్యం' అనే అంశాలకు సంబంధించిన స్త్రీల సాహిత్య చొరవల గురించి ఉంది. మొదట సామ్రాజ్యాధిపత్య స్థాపన గురించీ, తర్వాత జాతీయ ఉద్యమం పెరుగుదల గురించీ అందులో కనిపిస్తుంది. 


వర్గం, జెండర్‌, కులం, జాతి, మతం, పరస్పరం ప్రభావితం అయ్యే క్రమాల గురించి వివరించే ప్రయత్నం చేసాం. ఈ సంపుటంలో 1940-50లలో మనదేశం సృష్టించిన సామాజిక ఊహా చిత్రణ, 1970లలో పైకెగసిన తిరుగుబాటు ఉద్యమాల గురించి ఉంది. వివిధ  పద్ధతుల్లో ముందుకొచ్చిన ఈ నూతన ఆధిపత్యాన్ని  స్త్రీల రచనలు నిలదీస్తాయని మా వాదన. ఐతే కొన్ని సార్లు అవి అధికారిక పద్ధతుల్ని కూడా  స్థిరీకరిస్తాయి. స్త్రీల పోరాటాలు ఏ రూపాల్ని తీసుకుంటాయన్న అంశం మీదే మా దృష్టి ఎక్కువ. 

వాళ్ళ ప్రపంచాలెలా మలచబడ్డాయి? ఇతర ప్రయోజనాల కోసం నిర్దేశించిన ఇతివృత్తాలను, చిత్రణలను, కవితా కల్పనా సృష్టిని, తమ ప్రయోజనాలకోసం స్త్రీలెలా వినియోగించారు? వాళ్ళ పట్ల శత్రుబద్ధమైన, నిర్లక్ష్యమైన ధోరణి ప్రదర్శించిన సాంస్కృతిక  చిహ్నాలని తెలివిగా వారికనువుగా ఎట్లా మల్చుకున్నారు? సైద్ధాంతిక వలల్ని తప్పించుకుంటూ, 'సంఘ, చట్ట' విరుద్ధమైన సౌఖ్యాలనెట్లా కోరుకున్నారు? 'ఆత్మశక్తి', చిత్తశుద్ధి గురించి వాళ్ళ కలలు ఏ రూపాల్ని తీసుకున్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ తిరుగుబాటు రూపాలేమిటి? మా ఎంపికలో కూడా ప్రధానంగా చూసిన విషయం ఇదే. 

వాళ్ళ కోసం నిర్దేశించిన కార్యక్రమాల్ని ప్రశ్నించి, దాటేసి, తిప్పిరాసి, మార్పుచేసి చివరికి తారుమారు ఎలా చేయగలిగారు?

ఇంకొక రకంగా చెప్పాలంటే, మనకు సంక్రమించిన ప్రపంచాల్ని ఈ స్త్రీలెలా మలిచారో తెలుసుకోవాలని మా ఆసక్తి. ఆధిపత్యానికి సంబంధించిన చరిత్రనా, సవాలు చేసిన చరిత్రనా, దేనిని మనం కోరుకుంటున్నాం? ఈ ప్రయత్నాలలో రచయిత్రులు పడ్డ ఇబ్బందులు, పోగొట్టుకున్న నిక్షేపాలు, చేసుకున్న ఒప్పందాలు, ఒదులుకున్న  రాయితీలు అవన్నీ మనకు సంక్రమించిన అంశాల మీద ఏం ప్రభావాల్ని కలిగించాయి అని పరిశీలించగలిగాం. ఈ రచనల ద్వారా ఇంత వరకూ ఉన్న దానికంటే మరింత శక్తివంతమైన సంక్లిష్టమైన స్త్రీవాద చరిత్రవైపు దృష్టి నిలిపే ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నం 'అణచివేత', 'విముక్తి' అనే సులభతరమైన సూత్రీకరణలను మించిన, మరింత ఇబ్బందికరమైన చరిత్ర గురించే!
 






No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌