Monday, August 24, 2009

2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక - టంకశాల అశోక్‌ ...


2009 లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలు దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనున్నాయా?

కాంగ్రేస్‌ పార్టీ తాను సైతం ఊహించని విధంగా పుంజుకుంది.
బిజెపి ఎవరూ అనుకోనట్లు దెబ్బతిన్నది.
వామపక్షాలు తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు వర్గాల పార్టీలలో కొన్ని బలపడగా, కొన్ని పరాజయం పాలయ్యాయి.

దేశం మొత్తం మీద బేరీజు వేసినప్పుడు సెంట్రలిస్ట్‌ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉమ్మడి సీట్లు పెరిగాయి. కానీ ఉమ్మడి ఓట్ల శాతం
తగ్గింది.
వామపక్షాల సీట్లూ ఓట్లూ కూడా పడిపోయాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు పార్టీల ఉమ్మడి సీట్లు పెరిగాయి, ఓట్ల శాతంలో తేడా లేదు.

ఈ పుస్తకంలోని ప్రధానాంశం సెంట్రలిస్టు పార్టీలను, ప్రాంతీయ, బడుగు పార్టీలను ప్రస్తుత ఎన్నికల సందర్భంగా పోల్చి చూడటం.
ఆ విధంగా పరిశీలించినపుడు సెంట్రలిస్టులకు సీట్లు పెరిగినా ఓట్లు తగ్గటం, ఫెడరలిస్టులు - బడుగులకు సీట్లు కొద్దిగా పెరిగి ఓట్లు

తగ్గక పోవటాన్ని బట్టి, ఉభయ శిబిరాల బలాబలాలలో పెద్ద మార్పులు లేనట్లు కనిపిస్తుంది.
కానీ ఈ అంకెల ఫిజిక్సును పక్కన ఉంచి రాజకీయ వాతావరణపు కెమిస్ట్రీలోకి వెళ్లి చూస్తే, ప్రజల ఆలోచనలో కొత్త మార్పు
వస్తున్నదేమోననే సందేహం కలగకమానదు.

- టంకశాల అశోక్‌ (ముందుమాట అర్థ శోధన నుంచి)

2009 ఎన్నికల సందర్భంగా వార్త దినపత్రిక సంపాదకులు టంకశాల అశోక్‌ రాసిన వివిధ వ్యాసాల, సంపాదకీయాల
సంకలనమే ఈ పుస్తకం.

ఇందులోని శీర్షికలు:

1) అర్థ శోధన 2) ఫెడరలిస్ట్‌ బడుగు పార్టీలకు మేల్కొలుపు 3) సెంట్రలిస్ట్‌ పార్టీలు మళ్లీ పుంజుకుంటే 4) మళ్లీ సుస్థిరత దిశగా
5) జాతీయ పార్టీలకు ఎందుకీ దుస్థితి 6) ఫెడరల్‌ డార్వినిజం 7) మార్గం మూసుకున్న బీజేపీ 8) వామపక్షాల స్వయంకృతం
9) చేతులు కాలిన లెఫ్ట్‌ 10) పల్లకీ బోయీలు కాదా? 11) పరణితి లేని మాయావతి 12) కూటమి బలమైనదే కానీ 13)
కూటమి వైరుధ్యాలు 14) ప్రాంతీయ పార్టీల రుగ్మతలు 15) తెలుగుదేశం అర్థ సమీక్ష 16) కేసీఆర్‌కు తగని ధోరణి 17) లెఫ్ట్‌
స్వయంకృతం 18) మాయావతి ఇందిరాగాంధీ కూతురా? 19) నగదు బదిలీ కొట్టివేయదగ్గదేం కాదు 20) మనకు తెలియని
ఒక రహస్యం 21) చంద్రబాబు పొరపాటు 22) స్థానికేతరులపై వ్యతిరేకత ఎందుకు?

టంకశాల అశోక్‌ గురించి ...

స్వగ్రామం మడిగొండ, వరంగల్‌ జిల్లా.
హైదరాబాద్‌, ఢిల్లీలలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహరాల్లో విద్యాభ్యాసం.
వార్తలు రాయటం ఆరంభించింది 1966 వరంగల్‌ జిల్లా వారపత్రిక జనధర్మకు.
అదే పత్రికలో 1967-72 మధ్య పూర్తిస్థాయి పని.

1972 నుంచి 77 వరకు ఆధ్ర జనత , నవ్యాంధ్ర ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికలలో హైదరాబాద్‌లో ఉద్యోగాలు, 1979-
80లో ఆంధ్రప్రభకు ఢిల్లీ నుండి అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్‌. 1984-94 నుండి 96 వరకు హైదరాబాద్‌లో అసిస్టెట్‌
ఎడిటర్‌. తర్వాత వార్త దినపత్రికలో ఉద్యోగం. 2002 వరకు అసిస్టెంట్‌ ఎడిటర్‌ తర్వాత నుండి ఎడిటర్‌.
పంజాబ్‌, కాశ్మీర్‌, కార్గిల్‌ యుద్ధం, శ్రీలంక, ఉత్తర భారత రాష్ట్రాల ఎన్నికలు, పాకిస్థాన్‌, ఇరాన్‌లపై ఆయా ప్రాంతాల నుంచి
ప్రత్యేక రిపోర్టింగ్‌లు.

ఎబికెతో కలిసి నాలుగు సంపాదకీయ సంపుటాల ప్రచురణ.
సముద్రం, ఒబామా జీవితం-ఆలోచనలు, ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ, తెలంగాణ రచనల సంకలనం-వివేచన ఇతర ప్రధానమైన
ప్రచురణలు.



2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక
- టంకశాల అశోక్‌


అట్టమీద బొమ్మలు : శంకర్‌
కవర్‌ డిజైన్‌ : రమణ జీవీ
ధర : రూ. 40
తొలి ముద్రణ : జూలై, 2009

ప్రతులకు, వివరాలకు :

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ ; 23521849

EMAIL : hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Wednesday, August 19, 2009

అనుసరణీయం మూలికావైద్యం



మూలికా వైద్యంతో ఆరోగ్యం
సంప్రదాయిక వైద్య విజ్ఞానం లేకుండా ఆధునిక వైద్య విజ్ఞానం లేదు. దీనిని గుర్తించనిరాకరించే వారు అన్నింటికీ అల్లోపతి వైద్యమే పరిష్కారమన్నట్టు మాట్లాడుతున్నారు.

సంప్రదాయిక వైద్య విధానాల్లోని శాస్త్రీయతని ప్రశ్నిస్తున్నారు. కానీ శతాబ్దాల అనుభవ జ్ఞానంతో ఉనికిలో వుంటున్నాయి సంప్రదాయిక వైద్యవిధానాలు. వీటినే దేశీయ వైద్య విధానాలంటున్నారు. వీటిలో అతి ప్రాచీనమైంది మూలికావైద్యం. వర్తమాన అవసరాలకి అనుగుణంగా ఈ వైద్య విధానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చునో డా. జి. లక్ష్మిణరావు కొన్నాళ్ళుగా వివరిస్తున్నారు. మనం ఆరోగ్యంగా జీవించేందుకు మూలికావైద్యం ఎలా ఉపరిస్తున్నదో చెబుతున్నారు. కొంతకాలంగా ఆయన రాసిన వ్యాసాలన్నిటిని ఒకచోట చేర్చి, 'మూలికా వైద్యంతో ఆరోగ్యం' శీర్షికన హైదరాబాద్‌ బుక్‌ట్రస్టు ప్రచురించింది.

మూలికావైద్యం అవసరం ఏమిటో. అది ఎలా ఉపకరిస్తుందో, ఆయుర్వేదం, హోమియో వైద్యవిధానాలకీ, మూలికా వైద్యానికీ తేడాలు ఏమిటో తొలుత వివరించారు అలాగే పశ్చిమ దేశాల్లో ఈ మూలికా వైద్యాన్ని ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో రాశారు. తర్వాతి అధ్యాయాల్లో చర్మ వాధ్యులు, శ్వాససంబంధ వ్యాధులు, కీళ్ళవ్యాధులు, జీర్ణవ్యాధులు, స్థూలకాయం, మధుమేహం మొదలయిన వ్యాధుల్నినయం చేయడంలో మూలికావైద్యం పాత్ర ఏమిటో చెప్పారు.

వ్యాధుల నివారణలో ఎలా ఉపయోగపడుతున్నదనే కాకుండా, అసలు దేహం జబ్బుల బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చునో చెప్పిన విధానం బాగుంది. ప్రకతి ప్రసాదించిన మూలికల్ని కాపాడుకోవటం, వినియోగించుకోవటం ద్వారా ఆర్యోంగా దీర్గకాలం జీవించడానికి గల అవకాశాల్ని రచయిత వివరించారు.

- స్వామి
(వార్త ఆదివారం అనుబంధం 16 ఆగస్ట్‌ 2009 సౌజన్యంతో)


మూలికా వైద్యంతో ఆరోగ్యం
- డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు

235 పేజీలు, వెల: రూ.180/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Tuesday, August 18, 2009

వ్యక్తిత్వాన్న గౌరవించే పెళ్లిల్లు - పెరియార్‌ ఇ.వి. రామస్వామి ...


వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్లిల్లు నుంచి ...
వివాహం అంటే ఏమిటి? ఒక స్త్రీ ఒక పురుషుడు వైవాహిక జీవితంలోకి ప్రవేశించటానికి అంగీకరించి ఆ విధంగా ప్రకటించటమే వివాహం. అయితే పెళ్లిళ్లు అనేక రకాలుగా జరుగుతాయి.
ఇన్ని రకాల వివాహాలు జరగాల్సిన అవసరం వుందా? ఈ ప్రశ్నకు ఏ ఒక్కరూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.
...
ముహూర్తం, నక్షత్రం, లగ్నం అనేవి తమిళ పదాలు కావు. తమిళులకు తమవైన సంవత్సరాలు లేవు. సంవత్సరాలకు చెప్పే కథే అసభ్యకరమైనది. నారదుడి, కృష్ణుడి కలయిక (ఇద్దరూ మగవారే) మూలంగా 60 మంది పిల్లలు పుట్టుకొచ్చారనీ... వారి పేర్లే సంవత్సరాలనీ భాగవతం తదితర పురాణాలు చెబుతున్నాయి. ఇధ్దరు మగవారి కలయిక మూలంగా పిల్లలు పుట్టారని చెప్పడం ఎంత అసంబద్ధమూ, ఎంత అసభ్యకరమో మనకు తెలుసు.
...
వివాహ ఆహ్వాన పత్రికల్లో ''కన్యాదాన ముహూర్తం'' లేదా ''తారా ముహూర్తం'' ''వివాహ శుభ ముహూర్తం'' వంటి శీర్షికలుంటాయి. కన్యాదానం అంటే కన్యను మరొకరికి దానంగా, బహుమతిగా ఇవ్వడం.నేటి పెళ్లి కుమార్తెలు దీనికి అంగీకరిస్తారా?
...
మన నాగరికతకు, సంప్రదాయానికి సరిపడనందున సాంప్రదాయ వివాహాలలోని అనేక పద్ధతుల్న మనం విసర్జించాము. వైదిక సంప్రదాయం ''వేద'' నుంచి జనించింది. వేద అనే పదం బ్రాహ్మణులచే సృష్టించబడి, మనపై రుద్దబడింది.
వేదాలను ఇతరులు చదవకుండా వారు అనేక కఠినమైన నిబంధనలు ఏర్పరిచారు. ఏ బ్రాహ్మణేతరుడైనా వేదాలను చదివితే అతని నాలుక కత్తిరించాలన్నారు. బ్రాహ్మణులు వేదాలు చదువుతుండగా ఎవరైనా వింటే వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని నిర్ణయించారు. ఈ విధమైన నియమాల ద్వారా వారు ప్రజలను భయకంపితులను చేసి, ప్రజల్ని వేదాలు చదవకుండా అందులో ఏముందో తెలుసుకోడానికి వీలు లేకుండా చేశారు....
వేదలలో ఏమున్నదనేది నేడు బహిరంగ రహస్యం. అందువల్ల నేటి సాంప్రదాయాలకు వేదాలను అనుసంధానించడం కేవలం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. వైదిక సాంప్రదాయం పేరిట నేడు జరుగుతున్నదంతా బ్రాహ్మణులచే సృష్టించబడిన ఓ ఇంద్రజాలం మాత్రమే.... పురాణాలన్నీ బ్రాహ్మణులచే సృష్టించబడిన కాకమ్మ కథలే. అవి వాస్తవాలు కావు. బ్రాహ్మణుల సంస్కృతినీ, వారి గొప్పదనాన్నీ వర్ణించడానికే పురాణాలు రాయబడ్డాయి
...
ఈ పూజారులేమిటి? మనకు అర్థం కాని, తెలియని భాషలో పురోహితుడు మాట్లాడుతుంటాడు. అసలు ఆవిధమైన కర్మకాండ, వైదిక క్రియలను ఎందుకు పాటించాలో అతనికే తెలియదు. మనలను వాటిని పాటించమని మాత్రం చెబుతాడు. మన నుంచి డబ్బు గుంజుతాడు. మనం అతని పాదాలపై పడటమే కాక నూతన వధూవరులను కూడా అతని పాదాలపై పడమని కోరతాం. ఈ పూజారులను మించిన ద్రోహులు ఎవరైనా వుంటారా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని బాగా ఆలోచించారు? అసలు మనకి పూజారి అవసరమేమిటి?
...
మనం మన వివాహాల్లో చేసిన మొదటి మార్పు ఈ పూజారిని తొలగించడమే. ఏ బ్రాహ్మణున్నైనా మన పెళ్లిళ్లు జరిపించటానికి ఆహ్వానించే ప్రశ్నే లేదు.
ప్రజల్ని ఎక్కువ, తక్కువ వారిగా విభజించే విధానానికి మనం వ్యతిరేకం. బ్రాహ్మణులపై మనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మనం చేస్తున్నదల్లా ఏమిటంటే మనం పుట్టుకతోనే తక్కువ జాతి వాళ్లం అన్న మాటని ఒప్పుకోకపోవడమే. అదేవిధంగా నెయ్యి వంటి విలువైన వాటిని మనం మూర్ఖంగా అగ్నికి ఆహుతి చేయడాన్ని కూడా ఒప్పుకోం. అవన్నీ అర్థరహితమైనవి.
...
కుల వ్యవస్థను శాశ్వతం కావించడానికే ఈ వైదిక కర్మకాండ సృష్టించబడింది. ఈ కర్మకాండ అవసరం మనకు ఏమిటి? దీని వల్ల మనకు జరిగే లాభమేమిటి? ఎవర్ని ప్రశ్నించినా మనకు లభించే సమాధానం ఒక్కటే. ''మన కులంలో ఇది సనాతనంగా వస్తున్న ఆచారం!''
...
మార్పు అనివార్యం...మనం మార్పును కోరుకుంటాం. కాలంతో పాటు పరుగెత్తుకుని వచ్చే మార్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
మన వివాహాలలో మన తార్కిక దృష్టికి అహేతుకంగా కనిపించే ప్రతిదాన్నీ తిరస్కరిస్తాం.
మార్పులు సహజసిద్ధం. ఎవ్వరూ వాటిన ఆపలేరు. ఏ సాంప్రదాయవాదైనా జరుగనున్న మార్పులకు నేడో రేపో తలవంచాల్సిందే.

వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్ళిళ్లు
- పెరియార్‌

ఆంగ్ల మూలం:Self Respect Marriages, Published by Periyar Self-Respect Propaganda Institute, Madras-7
ప్రథమ ముద్రణ: 1995
పునర్ముద్రణ: 2000
36 పేజీలు, వెల: రూ.10

Saturday, August 15, 2009

ఏడాదిలో 10,000 హిట్లు ... !


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగును ప్రారంభించి దాదాపు 14 నెలలు కావస్తోంది.
అయితే వీక్షకుల సంఖ్యను తెలిపే క్లస్టర్ మాప్ ను ఇన్సర్ట్ చేసి మాత్రం సరిగ్గా సంవత్సరం అవుతోంది.
గత 14 ఆగస్ట్ 2008 నుంచి ఇవాళ్టి వరకు 10,000 కు పైగా హిట్లను సూచిస్తోంది అది .
మా బ్లాగును ఇంతగా అభిమానిస్తున్న పుస్తక ప్రియులందరికీ ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
మేం ప్రచురించిన పుస్తకాలపై వివిధ పత్రికల్లో, బ్లాగుల్లో వెలువడిన (మా దృష్టికి వచ్చిన ) సమీక్షలను మా బ్లాగులో తిరిగి పొందుపరుస్తున్న విషయం తెలిసిందే.
మంచి పుస్తకాల ప్రచురణకూ, వాటి ప్రాచుర్యానికీ ఈ సమీక్షలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఇకనుంచీ మా పుస్తకాలను చదివిన పాఠకులు ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని, స్పందనను, సమీక్షను మాకు నేరుగా మెయిల్ చేస్తే వాటిని కూడా మా బ్లాగులో పొందుపరచాలని అభిలషిస్తున్నాం.
ఇదే మీకు మా ఆహ్వానం.
రండి మంచి పుస్తకాలు విరివిగా వెలువడేందుకు మీ వంతు సహకారం అందించండి..
మా పాఠకులకూ, బ్లాగు వీక్షకులకూ, సమీక్షకులకూ, కూడలి, జల్లెడ, హారం లకూ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇట్లు
మీ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ఈమెయిలు చిరునామా : hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,

Thursday, August 13, 2009

పర్ణశాల బ్లాగులో "మునెమ్మ" నవలపై మూడు భాగాలుగా వెలువడిన సమీక్ష


కొంత కాలం క్రితం కత్తి మహేష్ కుమార్ గారు తన పర్ణశాల బ్లాగులో కేశవరెడ్డి నవల "మునెమ్మ" ను సమగ్రంగా సమీక్షించారు. పుస్తక ప్రియులైన మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం కత్తి మహేష్ కుమార్ గారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము.

http://parnashaala.blogspot.com/2009/05/native-reader-2.html

‘మునెమ్మ’ పాఠకుడి (native reader) స్పందన -

ఈ మధ్యకాలంలో తెలుగు నవలాసాహిత్యంలో ఒక అలజడిని రేపిన నవల మునెమ్మ. ఈ నవల గురించి నా అభిప్రాయాలు కొన్ని...

నేను కాలేజిలో ఆంగ్లసాహిత్యం మేజరు చదివేప్పుడు మా ఫ్రొఫెసర్ ఎన్.ఎస్.రఘునాథ్ , "Read English literature to understand it, to appreciate it and to learn literary theories.But, if you really want to "feel" literature, go back to your native (language) literature" అని చెప్పేవారు. అంటే, స్థానికేతర సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించడం వరకూ బానేవుంటుందిగానీ, అనుభవానికొచ్చే సరికీ స్థానిక సాహిత్యమే బెస్టన్నమాట.

సాహిత్యసృజన ఆ భాషకు సంబంధించిన సామాజిక-సాంస్కృతిక-రాజకీయ-ఆర్ధిక నేపధ్యంనుంచీ కలిగే అభివ్యక్తిని
అక్షరబద్ధం చేసే ప్రక్రియ. ముఖ్యంగా, ఈ అన్ని అంశాల్నీ ప్రభావితం చేసే క్షేత్ర లక్షణాల్ని (nature of land scape) ఆ సాహిత్యం పుణికిపుచ్చుకుంటుంది .అందుకే ఈ నేపధ్యానికి దగ్గరగావున్న స్థానికులు తమ భాషా సాహిత్యాన్ని అర్థంచేసుకుని ఆస్వాదించడమే కాకుండా ముఖ్యంగా అనుభవించగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సౌలభ్యం పరాయి సాహిత్యంలో అంతసులువుగా సంభవం కాదు.

ఇదే తర్కాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళితే,మునెమ్మ నవలలోని కథాప్రదేశానికి (రాయలసీమ- చిత్తూరు) స్థానికుడిగా, నా అనుభవానికీ ఇతర ప్రాంతాల వారి పఠనానుభవానికీ పిసరంత తేడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. ఆ నమ్మకమే ఈ వ్యాసం రాయడానికి కారణం !

ఈ నేపధ్యంలోంచీ నేను 'మునెమ్మ' చదివాను. బహుశా ఆ కారణంగానే ముందుమాట, వెనకమాట, సైకో-సోషియల్ సాహితీ సిద్ధాంతాల ప్రమేయం లేకుండా ఆ (నా) నేల మీద నడిచిన కథ నడిచినట్టుగానే నన్ను ఆకట్టుకుంది. అందుకే నా విశ్లేషణని వ్యాఖ్యానంగా కాక ఒక ప్రతిస్పందనగా భావిస్తాను. విమర్శకుల కొలమానాల శాస్త్రీయత ఇక్కడ కనిపించదు. స్థానికపాఠకుడిగా ఇది నా స్పందన, ఒక ధృక్కోణం అంతే!

కాల్పనిక సాహిత్యంలో, ఇతివృత్తం (theme) తరువాత కథాప్రదేశం (setting) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కథ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలకు అత్యంత కీలకమైన సమాధానాలుగల అంశం అది . ఆతరువాత ప్రముఖంగా చెప్పుకునే అంశాలైన పాత్రలు(characters) కథావస్తువు(plot),ధృక్కోణం(point of view),శైలి (style) మొదలైన అంశాలు కథాప్రదేశానికి అనుగుణంగానే ఏర్పడతాయి. పాత్రల ప్రవర్తన,వేషభాషలూ మరియూ విధివిధానాలూ. కథావస్తువు సాగే విధానం.ఎవరి ధృక్కోణంలో కథ సాగుతోందన్న సత్యం. వీటన్నిటికీ అనువుగా శైలి కుదురుకుంటాయి లేక ఎంచుకోబడతాయి.

ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మునెమ్మ నవలలో నాకు కనిపించిన మరో ముఖ్యపాత్ర కథాప్రదేశానిది.ఆంగ్లంలో landscape అనుకోవచ్చు. అందుకే for me మునెమ్మ novel is as much about the place and its culture in itself beyond the story that happened over there.

రెండో భాగం
………………………………..

మా చిత్తూరు పల్లెల్లో కథలు చెప్పే వాళ్ళు ఇంటికొకరూ వీధికొ్కరూ ఉంటారు. మునెమ్మ కథ చెప్పే 'సినబ్బ' కూడా అలాంటి సిన్నోడే. తనుజెప్పేదాంట్లో నిజమెంతుంటుందో ఊహా అంతే ఉంటుంది.విషయమెంతుంటుందో అలవికాని వివరమూ అంతే ఉంటుంది. కతెంతుంటుందో కతకు ఏ సంబంధమూలేని మెట్టవేదాంతమూ అంతే ఉంటుంది. ఇవన్నీ కథ చెప్పే కిటుకులోని భాగాలు. కథను మరింత రసవత్తం చేసే అంశాలు.ఆద్యంతం శ్రోతలు లేక పాఠకుల ఆసక్తిని నిలిపే విషయాలు. అందుకే, ఒక పాఠకుడిగా, సినబ్బ చేత కథచెప్పించిన రచయితకన్నా కథ చెప్పిన సినబ్బ నాకు ముఖ్యం.

ఇరవైఏళ్ళ సినబ్బ. మునెమ్మ ఆక్కో,వదినో తెలీని సినబ్బ. కల తరువాత మునెమ్మలోని మార్పునిచూసి అబ్బురపడిన సినబ్బ. మునెమ్మ సాహసొపెతమైన ప్రయాణంలో కలిసి ప్రయాణించిన సినబ్బ. మునెమ్మ సాహసాన్ని కళ్ళప్పగించి చూసిన సినబ్బ. మునెమ్మ వృత్తాంతాన్ని అభిమానంగా, గర్వంగా, ప్రేమగా తనదైన రీతిలో చెప్పేప్రయత్నంలో మునెమ్మని ఒక శక్తిలా ఆరాధించాడు, ఒక దేవతలా పూజించాడు.బహుశా ప్రేమించాడుకూడా. కథకుడికి ఇలాంటి అద్వితీయ భావనే లేకపోతే కథలో ఇంత సాధికారత రాదు. అదే కల్లాకపటం లేని రాయలసీమ నేల మహత్యం. ఆ ప్రాంతపు కథా సంస్కృతికి చిహ్నం.

చిన్నప్పుడు మా పల్లెలో ఎవరైనా కుటుంబ పెద్దలు లేక గ్రామ ప్రముఖులు చనిపోతే, వాళ్ళ దినాలకు కథపెట్టించేవాళ్ళు. ఆ కథ చనిపోయి మనిషి గురించుండేది. మా తాతగారు చనిపోయినప్పుడు ఆ కథకుల్ని ఉస్తికాయలపెంట,పాకాల లేకపోతే కంగుంది కుప్పం నుంచీ పిలిపించారు. అప్పుడు నా వయసు ఏడెనిమిదేళ్ళుంటుందేమో. పదకొండో రోజు కథైతే కథకులు నాలుగు రోజుల ముందే వచ్చేసారు. బంధువర్గంలో కలిసిపోయి ఆమాటా ఈ మాటా సేకరించారు.

పదకొండో రోజు వాళ్ళు కథ చెబితే...కేవలం ముసలివాడిగానే నాకు తెలిసిన మా తాతగారి బాల్యం నాముందు ఆవిష్కృతమయ్యింది. యవ్వనంలో అతని వేట సాహసాలు విదితమయ్యాయి. వ్యక్తిగా,కుటుంబ పెద్దగా, గ్రామంలో ప్రముఖుడిగా తను చేసిన పనులు చెబుతుంటే మా తాతగారికన్నా గొప్ప వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనిపించింది. అ కథకులు చెప్పినదాంట్లో ఎంత నిజముంది, ఎంత కల్పనుంది అనేది నాకు అప్రస్తుతమయ్యాయి. కథ చెప్పిన తీరు.కథ చెప్పిన ఉద్దేశం. కథద్వారా కథకులు శ్రోతల్లో కలిగించిన రసస్పందన. ఇవే ముఖ్యం. బహుశా అందుకే రసస్పందనలో తర్కం కూడదంటారేమో!

పాఠకుడి ఉద్దేశం రసస్పందన.పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు. తన అనుభవాల్లోంచీ కథను అర్థం చేసుకుని అనుభవించి ఆనందిస్తాడు. విమర్శకుడు అలా కాదు. తను కథ ఔచిత్యాన్ని, సార్థకతనూ,సామాజిక అర్ధవంతతనూ తమ
దగ్గరున్న పనిముట్లతో బేరీజు చేస్తాడు. అంటే రసస్పందనలో తర్కాన్ని ఆశిస్తాడు. కాబట్టి ఒక స్థానికుడిగా నేను ఇటువంటి కథకుడు (సినబ్బ) చెప్పే ఇతివృత్తంలో అతడి సమర్పణభావాన్ని చూసానేకానీ,సాధ్యాసాధ్యాలను కాదు. పాఠకుడిగా కథద్వారా కలిగిన రసస్పందనని ఆస్వాదించానేగానీ తర్కాన్నిశోధించలేదు. అందుకే ఒక స్థానిక పాఠకుడిగా నాకు జవాబుల్లేని ప్రశ్నకి సమాధానాలు లభించాయి.

మూడవ భాగం
……………..

కథలో చాలా మంది విమర్శకులకూ పాఠకులకూ అర్థంకాని పజిల్ గా మిగిలింది ఆరంభ ఘట్టం. బొల్లిగిత్తని జయరాముడు చావగొట్టే ఉదంతం.దాంతోపాటూ, ఇంట్లో పెరిగిన గొడ్డుని.ప్రాణంలా చూసుకున్న గొడ్డుని.తమ్ముడిలా చూసుకున్న గొడ్డుని. జోవనోపాధిగా మారిన గొడ్డుని. జయరాముడు (పరసలో)సంతలో తెగనమ్మేందుకు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ కథకుడు ఆ ఘటనా స్థలిలో ఉండే పాత్రల ద్వారా కాకుండా, అక్కడ ఏం జరుగుంటుంది? జయరాముడికి ఆ ఉన్మాదం ఎలా ఆవరించింది? అనే ప్రశ్నలకు జయరాముడి తల్లి సాయమ్మ భయంద్వారా సమాధానం ఇప్పిస్తాడు. ఆ సమాధానం మూల ప్రశ్నల్లోనే మార్పుని ఆశిస్తుంది.

బొల్లిగిత్త మునెమ్మ మీదికి ఏ ఉద్దేశంతో చేరింది అనే ప్రశ్నకన్నా, జయరాముడు బొల్లిగిత్త చేష్టలకి హఠాత్తున ఉగ్రుడెందుకయ్యాడు అనేది సరైన ప్రశ్న. జయరాముడు బొల్లిగిత్తని తమ్ముడిలాగా చూసుకున్నాడన్నది కథారీత్యా తెలిసిన సత్యం. మునెమ్మ, జయరాముడూ,బొల్లిగిత్తా వీధిలో వెళ్తుంటే సీతారామలక్ష్మణుల్లాగా అనిపించేదని మునెమ్మ కూడా చెబుతుంది. అలాంటప్పుడు బొల్లిగిత్త ప్రేమగా మునెమ్మను చేరడం చూసి, పెళ్ళాం చీరకట్టిన పాపానికి నాటకంలో వేషం వేసినాయన్ని తెగనరికిన దొరసామిరెడ్డి రక్తం ప్రవహిస్తున్న జయరామి రెడ్డిని ఆ క్షణాన ఉన్మాదం ఆవరించడం సహజమైన భ్రంశనగానే అనిపిస్తుంది.

"జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగటే కనబడతావుండాయి" అన్న సాయమ్మ వాగ్మూలం అందుకు సాక్షం. అంటే ఇక్కడ బొల్లిగిత్త యొక్క తెలియని ఉద్దేశాలకన్నా, మునెమ్మ అమాయకత్వంకన్నా, జయరాముడి ఉన్మాద చర్య కథకు కీలకం. దీన్నొదిలేసి విమర్శకులు, పశువులు మనుషులపైకి వస్తాయా? boredom sex పశువుల్లో ఉందా? అనే పనికిమాలిన శాస్త్రీయ ప్రమాణాలను వెతుక్కున్నారు. పైపెచ్చు అదేదో రచయిత మానసిక రుగ్మతకు సాక్షంగా ఊదరగొట్టారు.

ఒక రాయలసీమ పల్లెవాసిగా, ఎదకొచ్చిన/సుల్లరానికొచ్చిన పశువులు మనుషుల మీద "ఎగరడం" నాకు తెలుసు. దానికి శాస్త్రీయ ప్రమాణం అనవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ప్రాధాన్యమైన సంస్కృతిలో పశువుల్ని మనుషుల్లాగా ప్రేమించడం ఎంత సహజమో, పశువులకూ మనుషులకూ "సంబంధాల్ని" అంటగట్టి హాస్యాలాడ్డమూ అంతే సహజం. కాబట్టి, ఇక్కడ శాస్త్రీయ ఆధారాలకన్నా, సాంస్కృతిక ధోరణిని అర్థం చేసుకోవడం అవసరం. అంతేకాక, విషయం అవగతమైన తరువాత సాయమ్మ అనే మాటలు గమనిస్తే, అంతర్లీనంగా జయరాముడి మార్పుపట్ల భయం కనిపిస్తుందేతప్ప ఆ ఘటన యొక్క "తప్పొప్పులు" కాదు. సాయమ్మ సినబ్బతో అంటుంది,"...పాపమేది పుణ్యమేది అని తెగజెప్పాల్సి వచ్చినప్పుడు దేవాను దేవతలే ఒక్కోసారి ముందూ యనకా అయినారు.

మనుషులు మనమెంత? జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగిటే కనబడతా ఉండాయి. వాడికి మీసాలొచ్చినప్పట్నుంచి ఇది గవనిస్తానే ఉండాను. ఇక ఆ గొడ్డు ఒక్క దినం గూడా ఉండకూడదనిపించిందిరా. అది ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏ మూలనో నాగుపాము ఉన్నట్లే ఉంటుంది" అని. ఇక్కడ కూడా బొల్లిగిత్త ఎందుకు మునెమ్మ మీదకొచ్చింది? అది తప్పాఒప్పా? అనే ప్రశ్నలకన్నా, జయరాముడి అనుమానం ద్వారా కలిగే విపరీతాలనుంచీ కుటుంబాన్ని కాపాడలనుకునే తల్లే కనిపిస్తుంది. అడ్డుచెబుతుందనుకున్న అత్తకూడా బొల్లిగిత్తను అమ్మేందుకే తయారవడం మునెమ్మకు అర్థం కాకపోవడానికి కారణంకూడా సాయమ్మకు తెలిసిన కుటుంబ చరిత్ర మునెమ్మకు తెలియకపోవడమే.

ఈ అపోహకు కారణం బహుశా, నవలతోపాటూ వచ్చిన అంబటి సురేంద్రరెడ్డి రాసిన విశ్లేషణలోని వాక్యాలు కూడా కావచ్చు. ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ నవల ఇస్తూ చాలా మందికి ముందుమాటా వెనకమాటా చదవొద్దని చెప్పాను. బహుశా ఈ నవల చాలా చిన్నదవటం వలన, పేజీలు పెంచడానికి ప్రకాశకులు వీటిని జతచేశారేమో. ఇలా జతచేయడం వలన లాభంతో పాటూ కొంత నష్టమూ జరిగిందని మాత్రం చెప్పగను.

నాలుగవ భాగం ?

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి

తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40

ప్రతులకు, వివరాలకు :


హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849

E Mail : hyderabadbooktrust@gmail.com

..................................

Tuesday, August 11, 2009

గడ్డి పరకతో విప్లవాన్ని సృష్టించిన మసవోబు ఫుకువోక పై "ప్రాణహిత" లో అజయ్ ప్రసాద్ పరిచయ వ్యాసం ,,,



ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మసవోబు ఫుకువోక అద్భుత రచన "ది వొన్ స్ట్రా రివల్యూషన్ " ను చాలా కాలం క్రిందటే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ "గడ్డి పరక తో విప్లవం" పేరుతొ ప్రచురించింది. ఆ మహానీయుడిపై "ప్రాణహిత" ఆగస్ట్ 2009 సంచికలో బి అజయ్ ప్రసాద్ గారు చక్కని పరిచయ వ్యాసం రాశారు.
మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. ప్రాణహిత (pranahita.org) వారికీ, అజయ్ ప్రసాద్ గారికీ మా కృతఙ్ఞతలు.
.....

ప్రకృతి దార్శనికుడు మసనోబు ఫుకువోకా

గతసంవత్సరం ఆగష్టు 16న మసవోబు ఫుకువోకా మరణించాడు.బాగా మగ్గిన పండు తనంత తానే చెట్టు కొమ్మ నుండి రాలి పడినట్టు ఫుకువోకా తొంభై ఐదు సంవత్సరాల నిండు వయసులో ప్రకృతి ఒడిలోకి వెళ్ళి పోయాడు.

భూమిని నాగలితో దున్ననవసరం లేదనీ,రైతులకు తీరిక లేకుండడం,వారు అవిశ్రాంతంగా పని చేసుకుంటూ పోవడం భూమికి హానికరం అంటాడు పుకువోకా.రైతులు నాగరికత మూలంగా తమమీద పడిన అనవసర అదనపు శ్రమ వదిలించుకొని హైకూలు రాసుకోవాలని కలలు కన్నాడాయన.పుకువోకా మీద జెన్ బౌద్ధంతో పాటు చైనాలొని టావోయిజం ప్రభావం ఉందని ఒప్పుకోవాలి. ప్రకృతి వ్యవసాయానికి అతీతంగా ప్రకృతి ఆహారం గురించి, పిల్లల పెంపకం గురించి ,మానవ శాస్త్ర పరిశోదనల గురించి ఆయన దృక్పథం ఏమిటి?

పుట్టుక ఫలితమే జీవితం.ఇంతకుమించి ఏమీలేదు.ప్రకృతికి సాధమైనంత దగ్గరగా జీవించడమే మనిషి ఉద్దేశ్యం. బతకడానికి ఏమి తిన్నా,లేదా బతకడానికి ఏవేవి తప్పనిసరిగా తినాలని మనుషులనుకున్నా ఇదంతా వాళ్ళు ఊహించుకున్నదే.మనిషి జీవితానికి ఒక ఉద్దేశ్యమంటూ లేదు. అది ఉందని ఊహించుకొని దానిని తెలుసుకోవాలన్న తాపత్రయంలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇది ఒక వ్యక్తి చేసే ముష్టి యుద్ధంలాంటిది. జీవితానికి ఉద్దేశ్యమంటూ ఊహించుకోనవసరం లేదు.ఉద్దేశ్యం లేని జీవితం యెంత అర్థరహితమో పిల్లల్ని అడిగి చూడండి అంటాడు పుకువోకా.

చావు పుట్టుకలను మానవులు చాలా సంకుచిత దృష్టితో చూస్తారు. వసంతంలొ మొలకెత్తడం,ఆకురాలే కాలంలో చనిపోవడం, ఈగడ్డి పరకకు ఏం పట్టింది? జీవితం సంతోషమనీ,చావడం విచారమని మనుషులకు అనిపిస్తుంది.భూమిలో దాగి ఉండి వసంతంలో మొలకెత్తినప్పుడూ,ఎండి పొయి రాలి పోతున్నప్పుడూ వరి గింజలో జీవిత ఆనందం ఒకే విధంగా నిండుగా ఉంటుంది జీవితంలోని ఆనందం చావుతో విడిపోదు. క్షణంలో కదలిపోయే ఘటన మృత్యువు.వరి గింజకు జీవించడంలోని ఆనందం పూర్తిగా తెలుసు కాబట్టి మరణించడంలోని దుఃఖం తెలియదనిపించడంలేదూ?

ఈ జననమరణ చక్రాలలో పాల్గొని,అనుభూతి చెంది,ఆనందించగలిగితే అంతకు మించి ఏమీ సాధించాల్సిన అవసరం లేదు. చాలా మంది తెలిసిన జీవితాన్నే పట్టుకు వేళ్ళాడుతూ ఉంటారు. అందుకే చావంటే అంత భయం.చేజారిన గతం మీదా,ఇంకా రాని రేపు మీదా దృష్టి నిలిపి ఇక్కడా,ఈ క్షణంలో భూమి మీద బతికున్నామన్న సంగతి మరచి పోతారు.గందర గోళంలో కొట్టుమిట్టాడుతుండడం వల్ల జీవితం కలలాగే గడచి పోతుంది.

ప్రకృతిలో చావు పుట్టుకలు లేవు.ప్రకృతి సంతోషమయంగా ఉంటుంది.మానవ సమాజంలో చావు పుట్టుకలున్నాయి.ప్రజల్లో విషాదముంది అంటాడు పుకువోకా.

ఆయన జీవితాన్ని మార్చివేసి ఆయనను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించిన సంఘటన ఏమిటి?

ఇరవై ఐదు సంవత్సరాల పాటు కస్టమ్స్ బ్యూరోలో మొక్కల తనిఖీ విభాగంలో మొక్కల తెగుళ్ళ గురించి చదువుకున్నాడు.సాయంత్రాలు ఆటపాటలతో తీరిక లేకుండా గడిపేవాడు.సూక్ష్మదర్శినిలో అతడు చూసే ప్రపంచమూ,ఈ విశాల విశ్వమూ ఒకే రకంగా గోచరించి అద్భుతంగా అనిపించేది.ఒకసారి తీవ్రమైన పని ఒత్తిడిలో న్యుమోనియాకు గురయ్యాడు.ఆసుపత్రిలో ఒంటరి జివితం గడిపాడు.చావు,పుట్టుకలు అంటే ఏమిటి అన్న ప్రశ్నలు అతడిని వెంటాడాయి. మొట్టమొదటి సారిగా చావు అంటే భయం ఏర్పడింది.ఆసుపత్రి నుంచి బయట పడ్డాడు.కానీ నిరాశా వాదం నుండి బయట పడలేదు.

“అప్పటి వరకు దేని మీద నమ్మకంతో బతికాను? ఏ విషయమూ పట్టించుకోకుండా సంతోషంగా తిరిగే వాడిని.కానీ నాకు సంతృప్తినిచ్చిన విషయమేమిటి?ఇటువంటి ప్రశ్నలు నన్ను వెంటాడాయి.చావు పుట్టుకలు అంటే అనుమానం పట్టి పీడించసాగింది.వీటితో నిద్ర పట్టేది కాదు.పనిలో కూడా మనసు నిలిచేది కాదు.రాత్రిళ్ళు తీరంవెంట తిరిగినా ఉపశమనం దొరికేది కాదు.

ఒక రాత్రి తిరిగి తిరిగి అలసి పోయాను.కొండ మీద నుంచి రేవు కనపడుతుంది.రేవు కేసి చూస్తూనే ఒక పెద్ద్ద చెట్టు మొదలుకు ఆనుకొని మత్తులొకి జారుకున్నాను.నిద్ర,మెలకువ కాని స్థితిలో పొద్దు పొడిచే వరకు గడిపాను.ఆరోజు మే 15.అదంతా నా గ్నాపకాల పొరల్లో చెరగని ముద్రలా నిలిచి పోయింది.సూర్యోదయం.ఆ వెలుగులొ రేవు నిండి పోవటం కలలోలాగా అనిపించింది.కొండ కింది నుంచి గాలి వీచి ఒక్కసారిగా మంచు విడి పోయింది.అదే క్షణంలోఒక నీటి కొంగ ఒక్క అరుపు అరిచి దూర తీరాలకు ఎగిరి పోయింది.దాని రెక్కల చప్పుడు నాకు స్పష్టంగా వినపడింది.ఆ సమయంలో నాలోని అయోమయపు మబ్బులు విడిపొయాయి.అప్పటి వరకు నేను నమ్మినవీ,నేను పట్టుక వేళ్ళాడుతున్నవీ గాలితో పాటే కొట్టుక పోయాయి.”ఈ ప్రపంచంలో ఏమీ లేదు” అన్న మాటలు నా నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి.నేను అర్థం చేసుకుంది ఏమీ లేదు.”

ఈ అనుభవం అయిన మరుదినమే ఫుకువోకా తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు.సంవత్సరం పాటు దేశామంతటా అనేకమంది ప్రజలతో కలసి తిరిగాడు.నగరానికి వచ్చినప్పుడల్లా గుళ్ళలొనూ,పార్కులలోను నిద్ర పోయేవాడు. గ్రామాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి రైతుల మధ్య జీవిస్తు వాళ్ళతొ కలసి పొలాల్లో పని చేసేవాడు.ఆయనకు అర్థమైన విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాడు.అభేద్యమైన ప్రకృతిలో మనవ అస్థిత్వానికి అర్థమే లేదని చెప్పినప్పుడల్లా ఆయనని ఎవరూ నమ్మలేదు.చివరికి తను నమ్మినదానిని రుజువు చేయడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు.సుమారు నలబై సంవత్సరాల పాటు భూమిని దున్నకుండా,రసాయన ఎరువులు వాడకుండా అనేక రకాల పంటలు అధిక దిగుబడులతో పండించాడు.ప్రకృతి గురించి తను తెలుసుకున్నదానికి వ్యతిరేకంగా ఏనాడూ రాజీ పడలేదు.రసాయనిక ఎరువులు,రైతుల అనవసర వృధా శ్రమ ఇవన్నీ చూసి అసలేమీ చేయకుండా ఉండడానికి ఒక ఉద్యమం తీసుకు రావాలేమో అంటాడు పుకువోకా.

ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం ప్రకృతి వ్యవసాయమే.అంతకు మించి మరేమీ కాదంటాడు పుకువోకా.అది మనకు ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది.తద్వారా వొక అంతఃదృష్టినిస్తుంది.ప్రకృతి వ్యవసాయం అంతిమ లక్ష్యం పంటలను పండించడమే కాదు.మనుషులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దే వ్యవసాయం As I see it,the ultimate goal of natural farming is not growing crops…but the cultivation and perfection of human beings.

ప్రకృతిలో సాపేక్షిక ప్రపంచమంటూ ఉండదు.అనుభవానికి మానవ మేధస్సు ఇచ్చే రూపమే సాపేక్షికత.ఇతర ప్రాణులు అవిభాజ్యమైన వాస్తవిక ప్రపంచంలో జీవిస్తాయి. ఈ మేధస్సు సృష్టించిన సాపేక్షిక ప్రపంచంలో కూరుకు పోయినవారు కాలానికి అతీతమైన కాలాన్ని, స్థలానికి అతీతమైన స్థలాన్ని గ్రహించలేరని ఆయన ఉద్దేశ్యం.

పుకువోకా దృష్టిలో డబ్బు గురించి చింతపడడం,ఇంకా ఇంకా విస్తరించాలనుకోవడం,వ్యాపార పంటలు సాగు చెయ్యడం వంటివి రైతు జీవన విధానంలోవి కావు.తన చిన్న మడిని జాగ్రత్తగా చూసుకుంటూ పూర్తి స్వేచ్చ, కావలసినంత తీరికతో ప్రతి రోజు గడపడమే అసలయిన వ్యవసాయవిధానం.కోరికల తీవ్రత కారణంగా ప్రపంచం ప్రస్తుత ఈ స్థితిలో ఇరుక్కుంది.ఇంకా ఇంకా ఎక్కువ,ఇంకా ఇంకా వేగంగా అన్నది అభివృద్దికి మారు పేరయింది.ఇది సమాజ పతనానికి దారి తీస్తుంది.ఇది మనిషిని,ప్రకృతినీ వేరు చేస్తుంది.మానవాళి భౌతిక వస్తువుల పట్ల కోరిక,వ్యక్తిగత లాభాలు విడనాడి ఆధ్యాత్మిక చైతన్యం దారిలో పయనించాలి.ఒక చిన్న ఊరిలో పరిపూర్ణమైన జీవితాన్ని గడపవచ్చునని టావో తత్వవేత్త లావోత్సు అభిప్రాయం.జెన్ మత సంస్థాపకుడయిన బోధి ధర్ముడు ఎటూ కదలకుండా ఒక గుహలో సంవత్సరం పాటు గడిపాడు.

సంస్కృతిని కేవలం మనుషులు రూపొందించి కాపాడి,అభివృద్ధి చేయలేరు.మనిషీ,ప్రకృతీ కలయికతోనే సంస్కృతి పుడుతుది.రూపుదిద్దుకుంటుంది.సంస్కృతికీ,రోజువారీ జివితానికీ సంబంధం ఉంది.ఈ విధంగానే ఇది తరతరాలకు సంక్రమిస్తూ,నేటివరకూ కొనసాగుతూనే ఉంది.మానవ అహంకారం నుండి,సుఖాన్వేషణ నుండి పుట్టింది నిజమైన సంస్కృతి కాదు.నిజమైన సంస్కృతి ప్రకృతిలొ పుట్టి స్వచ్చందంగా,సీదాసాదాగా,అణకువగా ఉంటుంది అంటాడు పుకువోకా.

శాస్త్ర పరిశోదనల గురించి చెబుతూ ఐన్ స్టీన్ రూపొందించిన సాపేక్షికతా సిద్ధాంతం మనుషుల్ని కాలం,స్థలం అన్న బంధాలనుంచి విడుదల చేసి మరింత ప్రశాంత సంతోషభరిత జీవితానికి దారి తీసి ఉంటే, ఆయన కిచ్చిన నోబెల్ బహుమతికి అర్థం ఉండేది.మానవ ఆధ్యాత్మిక సుఖ శాంతులను చెడగొట్టినందుకు అతనికి బహుమతి ఇచ్చి ఉంటే సరిపోతుంది అని అంటాడాయన.

పోటీ సిద్ధంతంపై ఆధారపడి ఉన్నానా,సహజీవన సిద్ధాంతంపై ఆధార పడి ఉన్నానా ఆని ప్రపంచం తనను తాను ప్రశ్నించుకోదు.మానవ బుద్ధిలొని సాపేక్షిక దృష్టితో చూసినపుడే బలమైనవీ,బలహీనమైనవీ పెద్దవీ,చిన్నవీ కనిపిస్తాయి.బలవంతుడు బలహీనుడు అనే భావలపై ఆధారపడి యుద్ధం చేయడంమనుషులకు మాత్రమే సాధ్యమయ్యే అంశమంటే బతుకు హాస్యాస్పదమవుతుంది.ఈ హాస్యాస్పదమైన దాన్ని హాస్యాస్పదమైనదిగా గుర్తించలేక పోవడంలోనే మానవ విషాదం ఉంది.

ఒక వస్తువును మొత్తం నుంచి వేరుచేసి ప్రత్యేకంగా చూస్తే అది దాని అసలైన వస్తుతత్వాన్ని కోల్పోతుంది.అందుకు ఉదాహరణగా పిల్లలు ఇది ఆకుపచ్చ,ఇది ఎరుపు అని రంగులు గుర్తుపట్టడం మొదలైనప్పుడే వాళ్ళకు ప్రకృతి అర్థం కాకుండా పోతుంది అంటాడు పుకువోకా.ప్రపంచంలో ఏడు మూల రంగులున్నాయి(ఇంద్ర ధనుస్సులోనివి).ఈఏడు రంగులూ కలిస్తే తెలుపు వస్తుంది.స్ఫటిక, తెలుపును ఏడు రంగులుగా విడగొడుతుంది.ప్రపంచాన్ని మనిషి “మేధ లేకుండా”చూస్తే రంగులోని

రంగు మాయమవుతుంది.విచక్షణతో కూడుకున్న ఈ ఏడు రంగుల మేధతో చూసినప్పుడే రంగులు కనపడతాయి.వైరుధ్యాలు,విభేదాలు లేని ప్రపంచంలో పిల్లలు ప్రశాంతంగా జీవిస్తారు.వెలుతురు,చీకటి,బలమైనది,బలహీనమైనది వంటివి గ్రహిస్తారు.కాని ఏ విధమైన తీర్పులు చెప్పరు.నిజమైన ప్రకృతిని పిల్లలొక్కరే చూడగలరు.వాళ్ళు ఏమీ ఆలోచించకుండా,హాయిగా,ఆనందంగా చూస్తారు.కనీసం చెట్ల పేర్లు తెలిసినా,ఇది చీనీ చెట్టు,ఇది దేవదారు చెట్టు అని తెలిసినా ప్రకృతి అసలు రూపాన్ని చూడలేరు.

అంతేగాక పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవడానికి సహజంగా ఏ విలువా ఉండదు.విద్యావంతులైతే గాని బతకలేని పరిస్థితులు సృష్టించిన తర్వాత దీని అవసరం ఏర్పడుతుంది.మానవ సమాజం ప్రకృతి నుంచి ఎంతగా దూరమైతే అంతగా బడి అవసరం ఏర్పడుతుంది.బడికి వెళ్లి చదువుకొవడానికి ప్రకృతిలొ ఎటువంటి ఉపయోగమూ లేదు.

ఆడుకుంటూ,లేదా ఏమీ చెయ్యకుండాపిల్లలు సంతోషంగా గడిపేస్తారు.దీనికి భిన్నంగా పెద్దవాళ్ళు ముందుగా తమకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నిర్ణయించుకుంటారు. అటువంటి పరిస్ఠితులు ఏర్పడినప్పుడే సంతృప్తి పొందుతారు.ఆధునిక ప్రజలు తమ సహజ శక్తులను కోల్పొయారు.ఫలితంగా వాళ్ళు వసంతకాలపు ఏడు మూలికలను ఏరుకొని ,తిని ఆనందించలేకపోతున్నారు.రకరకాల రుచుల కోసం పాకులాడుతుంటారు.వాళ్ళ ఆహారం గందరగోళ మవుతుంది.రానురాను వాళ్ళ సహజ శక్తి మరింత అయోమయంలో పడిపోతుంది.ఈ దశలో వంటల్లో మసాలా ఎక్కువగా వేయడం మొదలవుతుంది.వంటకు ఎక్కువ సమయం తీసుకుంటుది..క్రమేపీ ఆహారం-మానవ ఆత్మ మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది.

పుకువోకా అమెరికా ,యురప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఇథియోపియా,సోమాలియా వంటి కరువు పీడిత ఆఫ్రికా దేశాలను పర్యటించాడు.అమెరికాకి ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల శక్తి ఉంది.అదే సమయంలోసహాయం చేయగల శక్తీ ఉంది.అది ఆ రెండు పనులూ చేయదు.అమెరికా ఆయా దేశాలను కాఫి, పంచదార వంటి వాణిజ్య పంటల పండించేట్లు చేస్తున్నది. వాళ్ళు తమకు కావలసిన వరి,కాయగూరలు పండించుకోగలరు.కాని అమెరికా వాళ్ళని వాణిజ్య పంటల కోసం బానిసల వలే అనుక్షణం పని చేయండి అని ఒత్తిడి తెస్తూ ఉంది.ఒక్క కాఫి పంట కోసం అమెరికా, ఆఫ్రికా ప్రభుత్వాలు ఆఫ్రికా ప్రజలని కాఫి,తేయాకు వంటి ఐదారు వాణిజ్య పంటలు పండించడానికి ప్రోత్సహిస్తాయి.వాళ్లకుప్రజల ఆకలితో పనిలేదు.కావలసిందల్లా ఎగుమతుల వాణిజ్యం ఫలితంగా చివరకు అది ఎలా తయారయిందంటే అక్కడి ప్రజలు తమకు కావలసిన కూరగాయలు తినడం కూడా మరచి పోయారు.

ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఎడారులను కూడా సస్యశ్యామలం చేయవచ్చునంటాడు పుకువోకా.అమెరికా,యూరప్ దేశాలు అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాయి. అదంతా వృధా శ్రమ.దానికి బదులు విమానాల ద్వారా ఎడారుల్లో విత్తనాలు చల్లించండి అంటాడు పుకువోకా.

నేను నా వరి పైరులలో నుంచొని వినాశకర సాంకేతికాభివృద్ధికి,ఇతర ప్రాణులను నిర్మూలించడానికి వ్యతిరేకంగా నిలబడి మానవాళికి సేవ చేస్తున్నానని నమ్ముతున్నాను.ఒకప్పుడు ప్రపంచం చాలా సహజంగా ఉండేది.పొద్దున్నే మైదానంలో నడిస్తే మంచు బిందువులు చల్లాగా తగిలేవి.ఈ ఒక్క మంచు బిందువును శాస్త్రీయంగా వివరించడానికి పూనుకోవడంతో ఇప్పుడు అంతులేని మేధో జగత్తులొ కూరుకు పోయారు.మానవ జ్ఞానం ఎంత అల్పమైనదో రుజువు చెయ్యడానికి మాత్రమే శాస్త్ర జ్ఞానం తోడ్పడింది.

మానవ మేధ సృష్టించే ప్రకృతి చిత్రాన్ని నేను తృణికరిస్తాను.విచక్షణ చేయని బుద్ధి ద్వారా అనుభవంలోకి వచ్చే ప్రకృతి దీని కంటే ఎంతో భిన్నమైనది.శాస్త్రీయ సత్యాలు ఎన్నటికీ అసలయిన సత్యాన్ని చేరుకోలేవు.తత్వ శాస్ర్తాలన్నీ ఈ ప్రపంచానికిచ్చేది భాష్యాలు మాత్రమే.విధ్వంసానికి గురయిన ప్రకృతే శాస్త్రీయ విజ్ఞానానికి బోధ పడుతుంది. మొదటి నుంచి తూర్పు,పడమరలు లేవు.ఇన్-యాంగ్ లేవు (opposite forces).

ప్రకృతిని అర్ఠం చేసుకోవడం ఎందుకు సాధ్యంకాదు?ప్రకృతి అనేది ఆయా వ్యక్తుల మెదడులో జనించే ఊహ మాత్రమే.ప్రకృతి నుంచి ఎంతగా విడిపోతే మూలం(source) నుంచి అంత దూరంగా మానవులు పరిభ్రమిస్తుంటారు.తిరిగి మూలానికి,ప్రకృతికి చేరుకోవాలన్న తహతహ కూడా అదేసమయంలొ పుడుతుంది.కేవలం ప్రతి చర్యగా కుడి వైపుకో,ఎడమ వైపుకో వెళతాం.కాని ప్రకృతిని మాత్రం చేరుకోలేం.సాపేక్షిక సిద్ధాంతానికి అందని నిశ్చల కేంద్రం ఎవరి దృష్టికీ ఆనలేదు.ప్రకృతి విధానాలకు అనుగుణంగా,కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలు మెచ్చుకోదగినవే కాని నిజమైన పరిష్కారమిచ్చే దిశలో పయనించడంలేదు.

కాలంకాని కాలంలో పండించడంగురించి చెపుతూ “కొంతకాలం తరువాత ఇలా పండిస్తున్నకూరగాయల్లో పోషక విలువలు ఏ మాత్రమూ లేవని కనుగొంటారు.దీనితొ పోషక విలువలు నష్టపోకుండా ఉండడానికి మరో సాంకేతిక నిపుణుడు పరిశోధనలు మొదలు పెడతాడు. కాంతి ప్రసరణలో సమస్య ఉందనుకొని దానిపై పరిశోధనలు చేస్తాడు. మనుషులు ఎంత కష్టపడినప్పటికి ప్రకృతికి మించి మంచి కూరగాయలు,పండ్లూ సాగు చేయలేరు.కృత్రిమ విధానాల్లో పండించిన పంట ద్వారా ప్రజల గొంతెమ్మ కోర్కెలు తీర్చవచ్చు.కాని ఇవి మనిషి శరీరాన్ని బలహీనపరుస్తాయి.శరీర రసాయన ధర్మాన్నే మార్చేసి ఇటువంటి ఆహారంపైనే ఆధారపడేట్లూ చేస్తాయి.ఈ పరిస్థితులలో విటమిన్ బిళ్ళలు,టానిక్కులు అవసరమైతాయి.వీటన్నిటివల్లా రైతులకు అదనపు శ్రమ, వినియోగదారులకు అనారోగ్యమూ మిగులుతాయి. ఆహారాన్ని పండించడంలో ప్రకృతి మనకు సహకరిస్తుందని భ్రమ పడతాం.ప్రకృతి మనకు ఏది ఇవ్వడానికి నిశ్చయించుకుందో కేవలం దాన్ని మాత్రమే స్వీకరిస్తాం అంటాడు పుకువోకా.

జపాను భూములూ,సమాజమూ గత నలభై సంవత్సరాలుగా క్షీణించిపోవడాన్ని పుకువోకా నిరశనతో చూస్తుండిపోయాడు.పుకువొకా వరి పొలాలను చీలుస్తూ ఇప్పుడొక జాతీయ రహదారి పడింది.

ప్రకృతిని చూసే విధానం యుగయుగానికీ మారవచ్చు కాని ప్రకృతి మారదు. ఏ యుగానికైనా సరే వ్యవసాయం ఆలంబనగా ప్రకృతి సేద్యం ఉండనే ఉంటుంది.

గడ్దిపరకతో విప్లవం రావాలని కాంక్షించాడు పుకువోకా.ఈ నేల మీద సూర్య కిరణం తాకి గడ్డి మొలకెత్తుతూ పుకువోకాని గుర్తు చేస్తూనే ఉంటుంది.అలా గడ్డి పరక కూడా మొలకెత్తలేని రోజు ఈ భూమి మీద మనిషి మనుగడే ఉండదు.

...............

గడ్డి పరకతో విప్లవం
-మసనోబు ఫుకుఓకా


ఆంగ్ల మూలం: The One Straw Revolution, Originally published in Japanese as Shizen Noho Wara Ippon No Kakumei, translated into English and published by Other India Press, Goa, 1992.

తెలుగు: సురేష్‌, సంపత్‌

తెలుగులో మొదటి ముద్రణ: టింబక్టూ కలెక్టివ్‌, 1990
రెండవ ముద్రణ: హెచ్‌బిటి, 2001

199 పేజీలు, వెల: రూ.50
.....

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.........

Saturday, August 8, 2009

జమీల్యా నవల పై పుస్తకం డాట్ నెట్ లో నరేష్ నందం గారి సమీక్ష


పుస్తకం డాట్ నెట్ లో ఇటీవల అంతర్వాహిని బ్లాగ్ నిర్వాహకులు నరేష్ నందం గారు జమీల్య నవల పై చేసిన పుస్తక సమీక్షను మా బ్లాగు సందర్శకుల సౌకర్యార్థం ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాము. పుస్తకం డాట్ నెట్ వారికి, నరేష్ గారికి మా ధన్యవాదాలు.
జమీల్య

“ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”గా విమర్శకుల మన్ననలు పొందిన కథ ఇది. “సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్ధలు పాదుకొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుందీ” రచన. కిర్గిస్తాన్ రచయిత “చింగీజ్ ఐత్‌మాతోవ్”కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నవల జమీల్యా.

ఈ పుస్తకాన్ని నవల అనే కంటే కూడా పెద్ద కథ అంటే సరిపోతుందేమో! కిర్గిజ్, రష్యన్ భాషలలో వెలువడిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. భారత దేశంలో రష్యన్ రచయితల ప్రాభవం, ప్రభావం పెరుగుతున్న 1950లలో ఈ పుస్తకాన్ని తెలుగులోకి ఉప్పల లక్ష్మణ రావు గారు అనువదించారు.

ప్రధాన పాత్రలు, పరిస్ధితులు:

ఈ కథ కిర్గిస్తాన్‌లోని కుర్కురోవ్ అనే గ్రామం నేపధ్యంగా సాగుతుంది.
జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున ప్రతి యువకుడు పాల్గొనాల్సిన పరిస్ధితి. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండని వాతావరణం. “పండే ప్రతి గింజ యుద్ధభూమికే” అన్న నినాదంతో యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల అవసరాలకోసం, ఇంకా చెప్పాలంటే ప్రతి స్త్రీ తన భర్త, కొడుకుల కోసం పొలంలో శ్రమించాల్సిన అవసరం అప్పటిది.
యుద్ధభూమి నుండి ఏదైనా ఉత్తరం గాని, ఎవరైనా సైనికుడు గానీ వస్తే తమ వారి గురించీ, యుద్ధ వాతావరణం గురించి అడిగి తెలుసుకునే దాకా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుంది.

ఈ పరిస్ధితులలో ఆ కుర్కురోవ్ గ్రామంలో ఉన్న మన కథకుడు సయ్యద్ తన ఆలోచనలనూ, అనుభవాలనూ పాఠకులతో పంచుకుంటాడు.

సయ్యద్: తన చుట్టూ తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను మౌనంగా చూడటం తప్ప సమర్దించటం లేదా వ్యతిరేకించటం చేయలేని పరిస్ధితి అతనిది. కథాసమయం నాటికి అతని వయసు పదిహేను లేదా పదహారేళ్లు. ఇద్దరు అన్నలు యుద్ధంలో చనిపోతారు. అమ్మ, నాన్న, పిన్ని, ఒక చెల్లెలు, మారుటి అన్న, వదిన.. ఇతని కుటుంబం. చిత్ర కళ అంటే ఆశక్తి.

సాదిక్: సయ్యద్‌కు మారుటి అన్న. సరిగా చెప్పాలంటే.. సాదిక్ నాన్న చనిపోయాక కట్టుబాటు ప్రకారం, అతని అమ్మను సయ్యద్ నాన్న పెళ్లి చేసుకుంటాడు. జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు మిగిలిన యువకులతో పాటు తప్పనిసరి పరిస్ధితులలో యుద్ధానికి వెళతాడు. అప్పటికే పెల్లైన ఇతను భార్య అంటే వస్తువుగా, మగాడి ఆస్తిలో భాగంగా చూసే అప్పటి సమజానికి అసలైన ప్రతినిధి.

జమీల్యా: సయ్యద్ భార్య. ఒక గుర్రపు వ్యాపారి కుమార్తె. కొత్త కోడలిగా వచ్చిన ఆమెకు ఆదరించే ఇద్దరు అత్తలు దొరుకుతారు. పెళ్లి ఐన వెంటనే భర్త యుద్ధానికి వెళతాడు. అత్త మామలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంది. తన “చిట్టి మరిది”తో ఆటలు ఆడుతుంది. ఊళ్లో ఎవరైనా తమలపాకుతో ఒకటిస్తే, ఈమె తలుపు చెక్కతో రెండిస్తుంది.

ధనియార్: మాజీ సైనికుడు. చిన్ననాడే కుర్కురోవ్ గ్రామం వదిలిపోయినా, యుద్ధంలో గాయపడిన తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటాడు. ఆ ఊళ్లో పొలం పుట్ర ఏమీ లేని కారణం చేత గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో అతనికి కూలీగా పని ఇస్తారు పెద్దలు. ఒకరి జోలికి పోకపోవటం, ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవటం వలన ఇతనంటే ఆ ఊరి పిల్లలకు లోకువ, పెద్దలకు అనాసక్తి.

కథలోకి వెళ్తే..:

సయ్యద్ ఒక సామాన్య యువ రైతు తన బాల్యం, కుటుంబం, అందులో అనుకోకుండా వచ్చి పడిన కొన్ని పరిస్ధితులను విశ్లేషించుకుంటూ తన మనసులోని మాటలను కథ రూపంలో మనకు చెప్తాడు. ఒక చిత్రాన్ని గురించి వివరిస్తూ కథలోకి దారి తీస్తాడు. అతని స్వంత అన్నలు ఇద్దరు, మారుటి అన్న సాదిక్ యుద్ధానికి వెళతారు. వడ్రంగి ఐన తండ్రి, కుటుంబ పెత్తనం అంతా ఇతని తల్లికే వదిలేస్తాడు.

అతని పిన్ని, సాదిక్ భార్య- జమీల్యా పక్కనే ఉన్న “చిన్న ఇంట్లో” ఉంటారు. జమీల్యా అంటే అతనికి ఎంతో అభిమానం. గోధుమ పంటను రైల్వే స్టేషనుకు గుర్రపు బండ్లపై తీసుకువెళ్లేందుకు జమీల్యా అవసరం పడుతుంది. “ఆడకూతురుని నేను పంపను” అని సయ్యద్ అమ్మ ఆ గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్ర అధికారితో గొడవ పడుతుంది. చివరకు సయ్యద్ తోడుగా ఉంటాడనీ, ఇంకా కావాలంటే ధనియార్ కూడా వస్తాడనీ చెప్పటంతో ఒప్పుకుంటుంది. తర్వాతి రోజు ఉదయం నుంచి వీరు ముగ్గురు గోధుమలు తీసుకెళతారు. స్వతహాగా వాగుడుకాయలైన జమీల్యా, సయ్యద్‌లు దారంతా ధనియార్‌ను వెక్కిరిస్తారు. అతనిపై జోకులేస్తారు. ఉదయం వెళ్లిన వారు తిరిగి రాత్రికి గానీ ఊరు చేరలేరు కాబట్టి వచ్చేటప్పుడు అంత దూరం వెన్నెల కాంతిలో ప్రయాణాన్నీ, “సైపు” మైదానాలలో గుర్రపు బండ్ల పోటీగా మార్చుకుంటారు. తిరుగు ప్రయాణంలో జమీల్యా పాడే పాటలు ఆ వెన్నెల రాత్రులని మరింత అందంగా చేస్తాయి. ఆ పాటలు ధనియార్‌ను ఆకర్షిస్తాయి. అతను జమిల్యాను చుస్తూ ఉండిపోతాడు. ధనియార్‌ను విసిగించేందుకూ,
అతనికి కోపం తెప్పించేందుకూ ప్రయత్నాలు చేస్తారు ఆ వదినా మరుదులు.

అప్పటికీ వారు సఫలం కాక అతని బండిలో ఎక్కువ బరువు ఉన్న బస్తాలను వేస్తారు. గోధుమ బస్తాలను షెడ్డులో పెట్టే క్రమంలో ఆ అధిక బరువు బస్తాతో ధనియార్ పడిన శ్రమ అతనంటే ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతను చూసిన చూపు జమీల్యాలో అపరాధ భావనను కలిగిస్తుంది. తర్వాత కొన్ని అల్లరి లేని ప్రయాణాల తర్వాత జమీల్యానే ధైర్యం చేసి ధనియార్‌ను పాడమంటుంది. అతని పాట జమీల్యాను కరిగించి వేస్తుంది.

జమీల్యా మనసు పొరల లోలోపలి భావాలకు అర్ధం తెలుస్తున్నట్లవుతుంది. ఇన్నాళ్లూ తను ఎదురు చూసిన వస్తువేదో తనను
పిలుస్తున్నట్లనిపిస్తుంది. ఆ గాన ప్రవాహం, ఉధృతి సయ్యద్‌ను అతనికి అభిమానిగా మారుస్తుంది. మళ్లీ రోజులు మామూలు కంటే సంతోషంగా మారతాయి. ప్రయాణంలో పాటల తోడుతో అలసట తెలియదు.

ఒకరోజు రైల్వే స్టేషను దగ్గర కలిసిన సైనికుడు జమీల్యా భర్త సాదిక్ రాసిన ఉత్తరాన్ని అందిస్తాడు. అది చూసిన ధనియార్ ఒక్కడే వెళ్లిపోతాడు. సాదిక్, గాయాలు తగ్గిపోయేకా, ఒక నెలలో తిరిగి వస్తానని రాస్తాడు. సయ్యద్‌ను కూడా వెళ్లిపొమ్మంటుంది జమీల్యా. అలా మొదటిసారిగా ముగ్గురూ ఒంటరిగా తిరుగు ప్రయాణమౌతారు.

ఆ రాత్రి పొలం చేరుకున్న తర్వాత ధనియార్ దగ్గరకు వెళతాడు సయ్యద్. అతనిని పలకరించలేక కొంచెం దూరంగా గడ్డిలో పడుకుంటాడు. తర్వాత వచ్చిన జమీల్యా ధనియార్ దగ్గరకు రావటం చూస్తాడు. వాళ్లిద్దరి కళ్లలో బాధ గమనిస్తాడు. జమీల్యా ధనియార్‌తో మాట్లాడుతుంది. అతను కొంచెం సంతోషంగా చూడటం గమనిస్తాడు సయ్యద్. “జమీల్యా మాటలు అతన్ని ఎందుకు ఊరడించాయో కదా? అనుకున్నాను. ఒక వ్యక్తి భారంగా నిట్టుర్చుతూ: “నాకు భరించడం సులభమనుకుంటున్నావా?” అని అంటే, ఆ మాటల్లో ఊరడింపుకి ఏముందంటా?” అని ఆలోచిస్తాడు.

తర్వాతి నుంచీ మామూలే. ధనియార్ పాటలు ఆమెను ఎక్కడికో తీసుకు పోతాయి. అతని బండి పక్కగా నడుస్తూ, పాటలో లీనమై పోయి ఆమె అతని పక్కన కూచుంటుంది. అతని భుజాలపై తల ఆనించి పరవశం చెందుతుంది. ఆ సన్నివేశాన్ని సయ్యద్ చుస్తూండిపోతాడు. తేరుకున్న జమీల్యా బండిదిగి ఇద్దరినీ కసురుకుంటుంది.

తర్వాతి రోజు ఒక కాగితాన్ని, బొగ్గు ముక్కను సంపాదించిన సయ్యద్ బండిపై జమీల్యా, ధనియార్‌లు కూర్చుని ఉండటాన్ని చిత్రిస్తాడు. తమను తాము మైమరచిన ప్రేమికులలా అనిపిస్తారు వాళ్లిద్దరూ అతనికి. ధనియార్‌ను చూస్తే అతనికి ఈర్ష్య కలుగుతుంది. ఆ చిత్రాన్ని జమీల్యా తీసేసుకుంటుంది. చిన్నప్పుడు బడిలో వదిలేసిన చిత్రకళను తనకు ఇష్టమైన వారి చిత్రాలతో తిరిగి ప్రారంభించటంతో సంతోషిస్తాడు.

ఒక రాత్రి పొలం పక్కన ఏటి ఒడ్డుకు వెళ్లిన అతనకి దూరంగా రెండు ఆకారాలు కనిపిస్తాయి. అవి రెండూ జమీల్యా, ధనియార్ అని గుర్తించటానికి అతనికి ఎక్కువసేపు పట్టదు. ఏటి అవతలి గట్టుపై దూరంగా వెళ్తున్న వారిద్దరినీ చూసి, తేరుకుని వెంట పరిగెత్తుతాడు. కాలికి ఎదురు రాళ్లదెబ్బలతో వెళ్లినా చీకటిలో కలిసిపోయిన వారిద్దరూ కనిపించరు. ఉదయం ఇంటికి వచ్చాక తెలుస్తుంది, అనుకున్నదే అయిందని. లోపల సంతోషపడినా ఏమీ తెలియనట్లే ప్రవర్తిస్తాడు. ఊరంతా ఒక కుటుంబ మర్యాద పోగొట్టిన జమీల్యా గురించే కథలు కథలుగా చెప్పుకుంటారు.

యుద్ధం నుంచి వచ్చిన సాదిక్ జమీల్యాను చంపేస్తానంటాడు. ఎక్కడున్నారో తెలియక ఊరుకుంటాడు. ఒకరోజు ఆవేశంతో వచ్చిన సాదిక్, “ఇ చిత్రం నువ్వు గీసినదేనా? వీడెవడు?” అని అడుగుతాడు. “ధనియార్” అని చెప్తాడు సయ్యద్. చెంప పగలకొట్టి ఆ చిత్రాన్ని చింపేస్తాడు సాదిక్.

“నీకు తెలుసా?” అని అడిగిన తల్లికి “అవున”ని సమాధానమిస్తాడు.

తనకు చిత్రకళను నేర్చుకోవాలని ఉందని, వెళ్లేందుకు తల్లిని అనుమతి కోరతాడు సయ్యద్. చిత్రకళ డిప్లొమాకోసం మళ్లీ అదే చిత్రాన్ని
చిత్రికరిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన ప్రతిసారీ గుర్తు వచ్చే గ్రామాన్ని, జమీల్యాను తలచుకుని తిరిగి ఇంటికి వెళ్లాలనుకోవటంతో కథ ముగుస్తుంది.

కిర్గిజ్ జాతిపితగా పిలవబడుతున్న ఐత్‌మాతోవ్ 12-12-1928న అప్పటి సోవియట్ రష్యా యూనియన్‌లో భాగమైన కిర్గిస్తాన్‌లో జన్మించారు. గిరిజన సంచార కుటుంబంలో జన్మించిన కారణంగా ఆయన ఎక్కువ ప్రదేశాలను, అక్కడి ప్రజలనూ, కట్టుబాట్లనూ గమనించటానికీ, అర్థం చేసుకోవటానికీ ఆయనకు అవకాశం దక్కింది. చిన్నప్పటినుంచి తను గమనించిన విషయాలనే ఆయన తన రచనల్లో వ్యక్తీకరించారు. “రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ధ్వనించటమే ముఖ్యం” అన్న మాక్సిం గోర్కీ మాటలు తననెంతో ప్రభావితం చేశాయంటారు రచయిత.

1990లలో రష్యా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన కిర్గిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం దక్కేందుకు చింగీజ్ ఐత్‌మాతోవ్ ఎంతో కృషి చేశారు.
ఎన్నో దేశాలకు కిర్గిస్తాన్ రాయబారిగా కూడా పని చేసిన చింగిజ్ ఐత్మాతోవ్ 10-06-2008న జర్మనీలో చనిపోయారు.

నా అభిప్రాయం:
ఈకథ (రెండవ ప్రపంచ యుద్ధం) సమయానికి, సోవియట్ యూనియన్ అంతర్భాగమైన రష్యాలొ స్త్రీ స్వాతంత్ర్యానికి అనుకూలంగా జరిగిన అనేక సంఘటనలు అప్పటి సమాజంలో స్త్రీకి కొంత ధైర్యాన్ని, సమాజ కట్టుబాట్లను ఎదిరించే తెగువను ఇచ్చాయి. అటువంటి పరిస్దితులలో జమీల్యా తనని మనిషి మాత్రంగా నైనా చూడని భర్త సాదిక్ నుంచి విడిపోయి తనకు నచ్చిన ధనియార్‌తో వెల్లేందుకూ, తద్వారా సమజాన్ని ఎదిరించేందుకు సాహసం చేసింది.

ఈకథ చదివిన తర్వాత స్త్రీ అంటే వస్తువే అనే భావం కేవలం భారతదేశంలోని ప్రజలది మాత్రమే కాదనీ, అప్పటి ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలను పాటించే ఆనాటి ప్రజలందరిదీ అని తెలుస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ, ఆ కుటుంబంలో భర్త సోదరున్ని/అదే వంశస్ధున్ని వివాహమాడాలన్న నిబందన కూడా కనిపిస్తుంది.

అలాగే, ఈకథ యుద్ధం ఎటువంటి పరిస్ధితులను సృష్టిస్తుందో తెలియజేస్తుంది. వ్యవసాయం చేసేందుకు మగవారు లేని సమయంలో స్త్రీ, తన చిన్న పిల్లలతో పడే కష్టాలు, భర్త దగ్గర లేని స్త్రీ ఎదుర్కునే వేధింపులు కనిపిస్తాయి.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న “సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు”, “అందరూ కలిసి పని చేయటం” అప్పటికే ఉన్నాయనీ, సరైన వ్యవస్ధ ఉంటేకానీ అవి విజయవంతమవవనీ గమనించవచ్చు.
...........................................................................

ఇదే రచన పై పుస్తకం.నెట్ లో మరో వ్యాసం ఇక్కడ!
http://pustakam.net/?p=551
............................................................................

అదేవిధం గా ఇదే నవలపై అరుణ పప్పు గారు తన బ్లాగు "అరుణమ్" లో రాసిన మరో సమీక్షను ఇక్కడ చదవొచ్చు.
http://arunam.blogspot.com/2008/10/blog-post_23.html
............................................................................

జమీల్యా
చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌

అనువాదం: ఉప్పల లక్ష్మణరావు

96 పేజీలు, వెల: రూ.40



ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కా పూర్‌,
హైదరాబాద్‌- 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

E Mail : hyderabadbooktrust@gmail.com


.........................................

Monday, August 3, 2009

మరో కొత్త అధ్యాయంతో కంచ ఐలయ్య పుస్తకం "నేను హిందువు నెట్లయిత ?" ఐదవ ముద్రణ వెలువడింది.



నేను హిందువు నెట్లయిత ?...

కొత్తగా చేర్చిన అధ్యాయం లోంచి కొంతభాగం .....
... ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూ మతం నిన్నమొన్నటిదే.

''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్‌ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అ ల్‌ హింద్‌''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్‌ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్‌' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు.

ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్‌' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది. భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్‌ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్‌ అన్నారు. అయితే 'హిందుస్థాన్‌' అన్న పదం వాడుక మొదలయింది 'సింధుస్థాన్‌' అన్న పదంలోంచి. అంటే సింధూ నదీ పరీవాహక ప్రాంతమన్నమాట.

అ ల్‌ బెరూనీ వాడిన 'హింద్‌' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్‌' లాగే వుంటుంది.
వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరులనందరినీ హిందువులుగా పరిగణించింది.

క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు. అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదూ అన్న భావన వారిలో లేదు. అయితే కంటికి కనిపించే ఒంటి రంగు తేడాపై ఆధారపడ్డ జాతి విభజనమాత్రం వారిలో వుంది.

పాశ్చాత్య మేధావులు అ ల్‌ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్‌ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించారు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నారు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా తనకి దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు.

కుల వ్యవస్థ వల్లనే భారతీయాత్మ ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.

హిందూ మతం - బౌద్ద, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. అదే మిగతా మూడు మతాలు పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది.

హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని తాత్వికంగా బొత్తిగా ఉపేక్షించింది.

ప్రాచ్య మేధోవర్గం హిందూమత సారాన్ని అర్థంచేసుకోకుండా మిగతావాటిలాగా అదో సరైన పౌర మతంగా పరిగణించింది. ఇస్లాంను, క్రైస్తవాన్ని వ్యతిరేకించే సనాతన ధర్మానికి మరోపేరైన ఈ హిందూమత గుర్తింపును బాపన జాతీయవాదులు చక్కగా వాడుకున్నారు. ఆధ్యాత్మిక నియంతృత్వానికీ - ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికీ మధ్య జరిగే పోటా పోటీలో ఇది వారికి బాగా ఉపయోగపడింది.

ఇస్లాంలోనూ క్రైస్తవంలోనూ ప్రత్యేకించి మహిళలు అనేక రకాల అసమానతలను ఎదుర్కొన్నారు. ఇస్లాంలో 'బురఖా', 'తలాక్‌' సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సమావేశం విషయంలో మహిళలకు ఏనాడో హక్కును కల్పించారు. ఇతర మతాలకూ హిందూ మతానికీ మధ్య వున్న ప్రధానమైన తేడా ఏమిటంటే హిందూమతంలో ఆధ్యాత్మిక నియంతృత్వ స్వభావం అంతర్గతంగా పెనవేసుకుపోయి వుండటం.

అదే బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలలో అయితే ఇంతకు ముందే ప్రస్తవించినట్టు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం వాటి ప్రధాన సారంగా కనిపిస్తుంది. పరస్పర మత యుద్ధాలలో వారు తమ ప్రాథమిక మత సారాన్ని ఉల్లంఘించారు. కొన్ని సందర్భాలలో ఆ మత యుద్ధాలు చాలా అమానుషంగా జరిగాయి. మతపరమైన యుద్ధాలు, మతప్రచార యుద్ధాలు ఉధృతంగా కొనసాగిన చారిత్రక దశలు వున్నాయి. ఈ మతాలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాలతో కూడినవి. ఆ ప్రజాస్వామ్యాలు రాజకీయపరమైనవి కాదు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్ని సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కరించలేదు. కానీ, సామాజిక, రాజకీయ సమానత్వానికి అది పునాదులు వేస్తుంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యాన్ని ఒక వ్యవస్థగా సమగ్రంగా అభివృద్ధిపరిచేందుకు చారిత్రకంగా ఎంతగానో దోహదం చేస్తుంది.

ఒక్క హిందూ మతం తప్ప మరే ఇతర మతం కూడా పౌర సమాజంలో తన మతస్థులుగా పరిగణింపబడేవారిని తనే అణగదొక్కి హింసించే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని నిర్మించలేదు. హిందూ మతం తనను తాను సంపూర్ణంగా సంస్కరించుకోనైనా సంస్కరించుకోవాలి లేదా మొత్తం భారతీయ సమాజం ఆధ్యాత్మిక నియంతృత్వ సామాజిక వ్యవస్థలు లేని ఇతర మతాల్లో నైనా చేరిపోవాలి.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ''నేను హిందువు నెట్లయిత?'' ను రాయడం జరిగింది. తన ఆరున్నరేళ్ల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ హిందూమతాన్ని సంస్కరించేందుకు ఎట్లాంటి ప్రయత్నమూ చేయలేదు. హిందూ ఏకజాతి గురించి అదేపనిగా మాట్లాడే బీజేపీ హిందూమతాన్ని కులరహితంగా మార్చేందుకు మాత్రం పూనుకోలేదు. పైపెచ్చు బ్రాహ్మణిజం పెత్తనం చెలాయించడాన్ని, దాని గుత్తాధిపత్యాన్ని బిజెపి ప్రోత్సహిస్తోంది.

గతంలో కొనసాగిన భక్తి ఉద్యమం సూద్రులను బ్రాహ్మణీకరించడం ద్వారా వారికి ఆధ్యాత్మిక హక్కులు కల్పించాలని మాత్రమే అడిగింది. అయితే ఆ ఉద్యమం కూడా కుల వ్యవస్థను మార్చలేదు. భవిష్యత్తులో సైతం బ్రాహ్మణత్వానికి ప్రాతినిధ్యం వహించే హిందూత్వ ఆలోచన తనను తాను సంస్కరించుకుంటుందన్న ఆశ నాకు ఏకోశానా లేదు. ఎందుకంటే హిందూమతం తాలూకు రోజువారీ ఆచరణగానీ, దాని సిద్ధాంత గ్రంథరచనలు గానీ సంస్కరణకు ఏమాత్రం అవకాశాన్ని కల్పించేలాలేవు.

ఇటీవల హిందూ మితవాదులైన బిజెపి, ఎన్‌డిఎ అధికారంలో వున్నప్పుడు సైతం ఆవిధమైన ప్రయత్నాలు లీలామాత్రంగానైనా చేయలేదు. హిందూమతం హింసావాద మతం అనీ, గుజరాత్‌లో జరిగిన జాతిహత్యాకాండలో మాదిరిగానే కరడుగట్టిన హిందువు హింసను చాలా సహజంగా సమర్థిస్తాడని నేనీ పుస్తకంలో పదేపదే ప్రస్తావించినట్టుగానే - 2004 సాధారణ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వారీ విషయాన్ని మళ్లీ నిరూపించారు. 'మంచి' వాజిపాయి, 'తెలివైన' అరుణ్‌ శౌరి మొదలుకుని 'చెడ్డ' నరేంద్రమోడీ, తొగాడియాల వరకూ హింస అనివార్యమైనదంటూ సమర్థించారు.

ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన హింస సమర్థనీయమైనదే అయితే గతంలో చారిత్రకంగా దళితబహుజనలపై చేసిన హింస కూడా సమర్థనీయమైనదేనన్నమాట. హింస వారి మతవిశ్వాసం. హింసను వారు ప్రేమిస్తారు. హింసలోనే జీవిస్తారు. హింస వారి ఆధ్యాత్మిక నియంతృత్వంతో కలిసే పుట్టిపెరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


భారతదేశంలో దళితబహుజన ఉద్యమం చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. దళితబహుజన విద్యావంతులు బ్రాహ్మణీయ విద్యా సంస్థల్లో నేర్చుకున్న దానిని విసర్జింపజేయడం కష్టంగా వుంది. అనేక విశ్వవిద్యాలయాల్లో బ్రాహ్మణిజంను మార్క్సిస్టు పరిభాషలో బోధిస్తున్నారు. భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో, కొన్ని విదేశీ విద్యాలయాల్లో శిక్షణ పొందిన శక్తులు ''గులాంగిరి'', ''కుల నిర్మూలన'', ''నేను హిందువునెట్లయిత?'' వంటి పుస్తకాలను తిరస్కరిస్తున్నాయి. మతతత్వాన్ని, లౌకికవాదాన్ని బోధించే క్రమంలో హిందూత్వ గ్రంథాలను వ్యతిరేకించే దళితబహుజనుల సానుకూల పాఠ్యాంశాల కంటే ఎక్కువగా సావర్కార్‌ 'హిందూత్వ' లేదా గోల్వాల్కర్‌ 'బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌' లకు అత్యంత ప్రాధాన్యత యిస్తున్నాయి.

అసలు కులం గురించి మౌనాన్ని పాటించే లౌకికవాదం లౌకికవాదమేనా అని? కులతత్వం అనేది మతతత్వంలో అంతర్భాగమే కదా? ఒక హిందువును కాని భారతీయుడిగా నేను ఎన్‌ఆర్‌ఐ మేధావులతో సహా దేశీయ మేధావులనందరినీ ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాను: వాజ్‌పేయీ, అద్వానీలు సాక్షాత్తూ అపర శ్రీరాముని అవతారాలే కదా? ఒక జాతిగా ఆ ఇరువురూ హింసనే ఆచరించినప్పుడు రాముడు హిందూ మర్యాదా పురుషోత్తముడై, అద్వానీ మాత్రం అమర్యాదా పురుషోత్తముడెట్లా అవుతాడు.

రాముడు తాటకిని చంపాడు. తన తమ్ముడైన లక్ష్మణుడి చేత ద్రవిడ జాతికి చెందిన అత్యంత అందగత్తె అయిన శూర్పణఖ ముక్కుచెవులు కోయించాడు. వాలిని హతమార్చాడు. శంబూక వధ చేశాడు. రావణాసురుడి మొత్తం వంశాన్ని నిర్మూలించాడు. రాముడు తన భార్య సీతను నిలువునా అగ్నికి ఆహుతి చేయడానికి కూడా వెనుకంజవేయలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసి సజీవంగా వచ్చివుండకపోతే కాలిబూడిదై వుండేదే కదా.

ఆయన చేసిన ఈ హింసంతా దళితబహుజనులకూ, స్త్రీలకూ వ్యతిరేకంగా సాగించినదే. తన దళితబహుజన సేవకుడైన హనుమంతుడి చేత అనేకమందిని చంపించి హిందూ రామరాజ్య రక్షణ కోసమే ఆ హింస అంతానూ అని ఒప్పిస్తాడు.

అద్వానీ, వాజ్‌పేయీల పర్యవేక్షణలో వారి ప్రియతమ శిష్యుడు, ఓబీసీికి చెందినవాడూ అయిన నరేంద్రమోడీ గుజరాత్‌లో చేసింది అదే కదా.

నేను హిందువునెట్లయిత రాముడి హింసనూ వ్యతిరేకిస్తుంది, రామరాజ్య హింసనూ వ్యతిరేకిస్తుంది. హిందూమతం, హిందూత్వ అనేవి ఆధ్యాత్మిక నియంతృత్వ మనబడే ఒకే నాణానికి రెండువైపులా వున్న బొమ్మా బొరుసులే! ఈ అంశాన్ని చర్చించడం చాలా ముఖ్యం కదా? ఈ రెంటిలో ఒకదానిని ప్రేమిస్తూ, అందులోనే జీవిస్తూ మరొకదానిని ద్వేషించడం సాధ్యమవుతుందా?

,,,
ఈ కొత్త అధ్యాయాన్ని ప్రభాకర్ మందార అనువదించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



నేను హిందువు నెట్లయిత ?
కంచ ఐలయ్య


ఆంగ్ల మూలం : Why I Am Not a Hindu, Kancha Ilaiah, Samya, Calcutta, 1996
Copy right: Kancha Ilaiah 1996

తెలుగు అనువాదం : ఎ . సురేందర్ రాజు

ప్రధమ ముద్రణ : జనవరి 2000

మలి ముద్రణలు : 2000, 2002, 2005, 2007, 2009

188 పెజీలు , వేల : రూ. 55
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

.........

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.....................................

Sunday, August 2, 2009

చే గువేరా పుస్తకం పై సాహితీయానం బొల్లోజు బాబా గారి సమీక్ష



సాహితీయానం బొల్లోజు బాబా గారు ఇటీవల పుస్తకం డాట్ నెట్ లో " ప్రవహించే ఉత్తేజం చే గవేరా పుస్తకాన్ని సమీక్షించారు.
ఆ సమీక్షను మా బ్లాగు వీక్షకుల సౌకర్యం కోసం ఇక్కడ పొందు పరుస్తున్నాము.
సాహితీయానం లో విహరించేందుకు ఇక్కడ
http://sahitheeyanam.blogspot.com/2009/07/blog-post_31.html

పుస్తకం డాట్ నెట్ లో విహరించేందుకు ఇక్కడ
http://pustakam.net/?p=1703
క్లిక్ చేయండి.
.............................................................

ప్రవహించే ఉత్తేజం చే గవేరా : కాత్యాయని

“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా ” అని గర్జించాడతను.

కాళ్లలో రెండూ, మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.
******
అలా 1967, అక్టోబర్ 9 మద్యాహ్నం 1:10 నిముషాలకు, బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గెవారా హత్య జరిగింది. మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.

చే గెవారా మరణించి నాలుగు దశాబ్దాలు నిండాయి. దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.

గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు – అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.

చే గెవారా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చే గెవారా అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.
క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, ఫిడల్ కాస్త్రో కు కుడి భుజంగా మెసలి, విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చెగువెరా. ఆయన తన జీవితమంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.

ప్రభుత్వాలు మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.

చే గెవారా జీవితమంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను. క్యూబా విప్లవవిజయానంతరం లభించిన అధిపత్యాన్ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవపోరాటమార్గన పయనించిన గొప్ప ధీశాలి. ఆ ప్రయత్నంలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యచేయబడ్డాడు.

ఈ పుస్తక రచయిత్రి కాత్యాయని గారి శైలి చదువరి రక్తాన్ని పరుగులెట్టిస్తుంది. వర్ణణలద్వారా ఆయా సంఘటనలలోని ఉద్వేగాలు అక్షరాల్లోంచి హ్రుదయంలోకి ప్రవహిస్తాయి. చరిత్రపుస్తకాలకు ప్రధానంగా ఉండాల్సినవి సంఘటనల క్రమం మరియు తదనంతర కాలంలో ఆ సంఘటనల వల్ల ప్రభావితమైన పరిణామాలు. అవి ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా ఉండటంచే కధనం ఆద్యంతం ఒకరకమైన భావోద్వేగానికి గురిచేస్తుంది.

ఏ సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేడో, అవే చే గెవారాను కలిపేసుకొని, ఇతని వెంట్రుకలనుంచి డైరీలవరకు వేలానికి పెట్టటం ఒక దురదృష్ట పరిణామం. “చే గెవారా పాకేజ్” ల పేరిట టూరిష్టులను ఆకర్షించటం, ఇతని బొమ్మని ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన వస్తువుగా మార్చివేయటం, ఇతన్నో “టీన్ ఐడోల్” గా తయారుచేసి కోట్లు గడించటం వంటివి బాధించే అంశాలు. 2000 సంవత్సరంలో ఈ శతాబ్దిలో పేరుమోసిన 100 మందిలో చే గెవారా ను ఒకడిగా పేర్కొన్న టైం పత్రిక “ఏ అసమానత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ చే బులెట్ ను ముద్దాడాడో ఆ పరిస్థితులు ఈనాటికీ ఉన్నాయి” అని వ్యాఖ్యానించింది.

ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేంకావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందలకిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ చే వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.

“మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలి” అన్న చే గెవారా మాటలే అతని జీవితం. అలాంటి యోధుని జీవితంలోని ప్రతీ ఘట్టాన్ని పొందుపరుచుకొన్న పుస్తకం కాత్యాయని గారు రచించిన “చే గెవారా” ప్రవహించే ఉత్తేజం.

ప్రతులకు:

హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫ్లాట్ నెం. 85-బాలాజీ నగర, గుడి మల్కాపూర్, మెహిదీ పట్నం, హైదరాబాద్ – 67
ఫోన్: 23521849


..............................

Saturday, August 1, 2009

నెమలి కన్ను బ్లాగులో ఇట్లు ఒక రైతు పుస్తకం పై సమీక్ష

ఇటీవల తన నెమలి కన్ను బ్లాగు లో మురళి గారు "ఇట్లు ఒక రైతు " పుస్తకాన్ని సమీక్షించారు.
వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ...
మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము.
ఈ సమీక్ష పై వచ్చిన వ్యాఖ్యలను నెమలి కన్ను బ్లాగులో చూడండి.

http://nemalikannu.blogspot.com/2009/07/blog-post_28.html

........................................................





ఇట్లు ఒక రైతు

వ్యవసాయం అంటే ఏమిటి? నేలను చదును చేసి విత్తనాలు చల్లడం.. పండిన పంటని కోసి మార్కెట్లో అమ్ముకోవడం. పల్లెలతో పరిచయం లేని చాలా మందికి వ్యవసాయం గురించి తెలిసింది ఇదే. విత్తనం నాటడానికి, పంట కోయడానికి మధ్య రైతుకి ఎదురయ్యే కష్టనష్టాలు, పడే శ్రమ, గురయ్యే ఒత్తిడి వీటిని గురించి ఆలోచించే వారు తక్కువ. ఈ నేపధ్యంలో వ్యవసాయ రంగాన్ని, ఈ రంగంలో ఉండే సమస్యలని, లోటుపాట్లని వివరిస్తూ వచ్చిన పుస్తకం 'ఇట్లు ఒక రైతు.'

చిత్తూరు జిల్లాకి చెందిన ఆదర్శ రైతు, సామాజిక ఉద్యమ కార్యకర్త గొర్రెపాటి నరేంద్రనాథ్ రాసిన ఈ చిరు పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. పెద్ద నగరంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, వ్యవసాయం మీద మక్కువతో స్వగ్రామానికి పయనమైన నరేంద్రనాథ్, ఉమాశంకరి దంపతులు నేలతో చేసిన ప్రయోగాలను వివరించారు ఈ పుస్తకంలో. అలాగే ప్రపంచీకరణ ఫలితంగా వ్యవసాయ రంగంలో పెరిగిన పోటీ, దానిని ఎదుర్కోడంలో రైతులకి ఎదురవుతున్న సమస్యలనీ కళ్ళకి కట్టారు.

పుస్తకం ప్రారంభంలో కొన్ని పేజీలు సిద్ధాంత వ్యాసాన్ని తలపించినా, నరేంద్రనాథ్ తన స్వానుభవాలను వివరించడం మొదలు పెట్టగానే పాఠకులు పుస్తకంలో లీనమై పోతారు. వ్యవసాయానికి కొత్తైన నరేంద్రనాథ్, పొరపాట్లు చేస్తూ, వాటినుంచి నేర్చుకుంటూ సేంద్రీయ వ్యవసాయం చేసిన తీరు ఆపకుండా చదివిస్తుంది. అలాగే, 'ఆర్గానిక్ ప్రొడక్ట్స్' ని సూపర్ మార్కెట్లలో రెట్టింపు ధరలకి అమ్ముతున్నా, వాటినుంచి రైతులకి వచ్చే ప్రతిఫలం, మామూలు పంటలపై వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉండదన్న సత్యం బోధపడుతుంది.

సేంద్రీయ పద్ధతిలో చెరకు, మామిడి సాగు, 'శ్రీ వరి' పద్ధతిలో వరిసాగు చేసే విధానాన్ని కూలంకుషంగా వివరించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమ గురించి, పంటలు పోయినా పాడి పరిశ్రమ రైతులని ఎలా ఆదుకుంటుందో చెప్పారు నరేంద్రనాథ్. ఈ రంగంలోనూ సమస్యలకి కొదవ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహమూ అంతంత మాత్రమే. డైరీల నిర్వహణ, విజయాలూ వైఫల్యాలనూ తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా.

వ్యవసాయాన్నీ, గ్రామీణ జీవితాన్నీ వేరు చేసి చూడలేము. గ్రామీణ సమాజంలో బలంగా పాతుకు పోయిన వర్ణ, వర్గ వ్యవస్థలనూ, కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులనూ నిశితంగా పరామర్శించారు రచయిత. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల గ్రామీణ భారతం ఎదుర్కొనే సమస్యలనూ, వాటి తాలూకు పరిణామాలనూ తెలుసుకోవచ్చు.

రచయిత స్వయంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్న వారు కావడం వల్ల, వివిధ సమస్యలపై నాయకులు, అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆయనకి తెలుసు. కుల వివక్షకి వ్యతిరేకంగా జరిపిన ప్రచారంలో తాను గమనించిన అంశాలనూ, భూ పంపిణీ విషయంలో నాయకుల, అధికారుల వైఖరినీ స్థూలంగా వివరించారు. వ్యవసాయ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పులనీ రేఖామాత్రంగా స్పృశించారు.

ఏ రాజకీయ భావజాలానికీ అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో లేకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకతగా చెప్పాలి. నరేంద్రనాథ్ కేవలం రైతు పక్షపాతి అనిపించక మానదు, పుస్తకం పూర్తి చేశాక. ముందుమాట రాసిన ప్రొఫెసర్ కే.ఆర్. చౌదరి చెప్పినట్టుగా ఈ పుస్తకానికి ఒక్కటే లోపం. వివిధ చాప్టర్ల మధ్య లంకె లేకపోవడం. పుస్తకంలో ప్రస్తావించిన విభిన్న అంశాలను అనుసంధానించే విధంగా కథనం ఉంది ఉంటే మరింత బాగుండేది.

నరేంద్రనాథ్ జీవించి ఉంటే వ్యవసాయంపై మరిన్ని ప్రయోగాలు చేసి ఉండేవారు కదా..అనిపించింది, పుస్తకం పూర్తి చేశాక. గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది. ('ఇట్లు ఒక రైతు, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌