Thursday, August 13, 2009

పర్ణశాల బ్లాగులో "మునెమ్మ" నవలపై మూడు భాగాలుగా వెలువడిన సమీక్ష


కొంత కాలం క్రితం కత్తి మహేష్ కుమార్ గారు తన పర్ణశాల బ్లాగులో కేశవరెడ్డి నవల "మునెమ్మ" ను సమగ్రంగా సమీక్షించారు. పుస్తక ప్రియులైన మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం కత్తి మహేష్ కుమార్ గారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము.

http://parnashaala.blogspot.com/2009/05/native-reader-2.html

‘మునెమ్మ’ పాఠకుడి (native reader) స్పందన -

ఈ మధ్యకాలంలో తెలుగు నవలాసాహిత్యంలో ఒక అలజడిని రేపిన నవల మునెమ్మ. ఈ నవల గురించి నా అభిప్రాయాలు కొన్ని...

నేను కాలేజిలో ఆంగ్లసాహిత్యం మేజరు చదివేప్పుడు మా ఫ్రొఫెసర్ ఎన్.ఎస్.రఘునాథ్ , "Read English literature to understand it, to appreciate it and to learn literary theories.But, if you really want to "feel" literature, go back to your native (language) literature" అని చెప్పేవారు. అంటే, స్థానికేతర సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించడం వరకూ బానేవుంటుందిగానీ, అనుభవానికొచ్చే సరికీ స్థానిక సాహిత్యమే బెస్టన్నమాట.

సాహిత్యసృజన ఆ భాషకు సంబంధించిన సామాజిక-సాంస్కృతిక-రాజకీయ-ఆర్ధిక నేపధ్యంనుంచీ కలిగే అభివ్యక్తిని
అక్షరబద్ధం చేసే ప్రక్రియ. ముఖ్యంగా, ఈ అన్ని అంశాల్నీ ప్రభావితం చేసే క్షేత్ర లక్షణాల్ని (nature of land scape) ఆ సాహిత్యం పుణికిపుచ్చుకుంటుంది .అందుకే ఈ నేపధ్యానికి దగ్గరగావున్న స్థానికులు తమ భాషా సాహిత్యాన్ని అర్థంచేసుకుని ఆస్వాదించడమే కాకుండా ముఖ్యంగా అనుభవించగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సౌలభ్యం పరాయి సాహిత్యంలో అంతసులువుగా సంభవం కాదు.

ఇదే తర్కాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళితే,మునెమ్మ నవలలోని కథాప్రదేశానికి (రాయలసీమ- చిత్తూరు) స్థానికుడిగా, నా అనుభవానికీ ఇతర ప్రాంతాల వారి పఠనానుభవానికీ పిసరంత తేడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. ఆ నమ్మకమే ఈ వ్యాసం రాయడానికి కారణం !

ఈ నేపధ్యంలోంచీ నేను 'మునెమ్మ' చదివాను. బహుశా ఆ కారణంగానే ముందుమాట, వెనకమాట, సైకో-సోషియల్ సాహితీ సిద్ధాంతాల ప్రమేయం లేకుండా ఆ (నా) నేల మీద నడిచిన కథ నడిచినట్టుగానే నన్ను ఆకట్టుకుంది. అందుకే నా విశ్లేషణని వ్యాఖ్యానంగా కాక ఒక ప్రతిస్పందనగా భావిస్తాను. విమర్శకుల కొలమానాల శాస్త్రీయత ఇక్కడ కనిపించదు. స్థానికపాఠకుడిగా ఇది నా స్పందన, ఒక ధృక్కోణం అంతే!

కాల్పనిక సాహిత్యంలో, ఇతివృత్తం (theme) తరువాత కథాప్రదేశం (setting) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కథ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలకు అత్యంత కీలకమైన సమాధానాలుగల అంశం అది . ఆతరువాత ప్రముఖంగా చెప్పుకునే అంశాలైన పాత్రలు(characters) కథావస్తువు(plot),ధృక్కోణం(point of view),శైలి (style) మొదలైన అంశాలు కథాప్రదేశానికి అనుగుణంగానే ఏర్పడతాయి. పాత్రల ప్రవర్తన,వేషభాషలూ మరియూ విధివిధానాలూ. కథావస్తువు సాగే విధానం.ఎవరి ధృక్కోణంలో కథ సాగుతోందన్న సత్యం. వీటన్నిటికీ అనువుగా శైలి కుదురుకుంటాయి లేక ఎంచుకోబడతాయి.

ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మునెమ్మ నవలలో నాకు కనిపించిన మరో ముఖ్యపాత్ర కథాప్రదేశానిది.ఆంగ్లంలో landscape అనుకోవచ్చు. అందుకే for me మునెమ్మ novel is as much about the place and its culture in itself beyond the story that happened over there.

రెండో భాగం
………………………………..

మా చిత్తూరు పల్లెల్లో కథలు చెప్పే వాళ్ళు ఇంటికొకరూ వీధికొ్కరూ ఉంటారు. మునెమ్మ కథ చెప్పే 'సినబ్బ' కూడా అలాంటి సిన్నోడే. తనుజెప్పేదాంట్లో నిజమెంతుంటుందో ఊహా అంతే ఉంటుంది.విషయమెంతుంటుందో అలవికాని వివరమూ అంతే ఉంటుంది. కతెంతుంటుందో కతకు ఏ సంబంధమూలేని మెట్టవేదాంతమూ అంతే ఉంటుంది. ఇవన్నీ కథ చెప్పే కిటుకులోని భాగాలు. కథను మరింత రసవత్తం చేసే అంశాలు.ఆద్యంతం శ్రోతలు లేక పాఠకుల ఆసక్తిని నిలిపే విషయాలు. అందుకే, ఒక పాఠకుడిగా, సినబ్బ చేత కథచెప్పించిన రచయితకన్నా కథ చెప్పిన సినబ్బ నాకు ముఖ్యం.

ఇరవైఏళ్ళ సినబ్బ. మునెమ్మ ఆక్కో,వదినో తెలీని సినబ్బ. కల తరువాత మునెమ్మలోని మార్పునిచూసి అబ్బురపడిన సినబ్బ. మునెమ్మ సాహసొపెతమైన ప్రయాణంలో కలిసి ప్రయాణించిన సినబ్బ. మునెమ్మ సాహసాన్ని కళ్ళప్పగించి చూసిన సినబ్బ. మునెమ్మ వృత్తాంతాన్ని అభిమానంగా, గర్వంగా, ప్రేమగా తనదైన రీతిలో చెప్పేప్రయత్నంలో మునెమ్మని ఒక శక్తిలా ఆరాధించాడు, ఒక దేవతలా పూజించాడు.బహుశా ప్రేమించాడుకూడా. కథకుడికి ఇలాంటి అద్వితీయ భావనే లేకపోతే కథలో ఇంత సాధికారత రాదు. అదే కల్లాకపటం లేని రాయలసీమ నేల మహత్యం. ఆ ప్రాంతపు కథా సంస్కృతికి చిహ్నం.

చిన్నప్పుడు మా పల్లెలో ఎవరైనా కుటుంబ పెద్దలు లేక గ్రామ ప్రముఖులు చనిపోతే, వాళ్ళ దినాలకు కథపెట్టించేవాళ్ళు. ఆ కథ చనిపోయి మనిషి గురించుండేది. మా తాతగారు చనిపోయినప్పుడు ఆ కథకుల్ని ఉస్తికాయలపెంట,పాకాల లేకపోతే కంగుంది కుప్పం నుంచీ పిలిపించారు. అప్పుడు నా వయసు ఏడెనిమిదేళ్ళుంటుందేమో. పదకొండో రోజు కథైతే కథకులు నాలుగు రోజుల ముందే వచ్చేసారు. బంధువర్గంలో కలిసిపోయి ఆమాటా ఈ మాటా సేకరించారు.

పదకొండో రోజు వాళ్ళు కథ చెబితే...కేవలం ముసలివాడిగానే నాకు తెలిసిన మా తాతగారి బాల్యం నాముందు ఆవిష్కృతమయ్యింది. యవ్వనంలో అతని వేట సాహసాలు విదితమయ్యాయి. వ్యక్తిగా,కుటుంబ పెద్దగా, గ్రామంలో ప్రముఖుడిగా తను చేసిన పనులు చెబుతుంటే మా తాతగారికన్నా గొప్ప వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనిపించింది. అ కథకులు చెప్పినదాంట్లో ఎంత నిజముంది, ఎంత కల్పనుంది అనేది నాకు అప్రస్తుతమయ్యాయి. కథ చెప్పిన తీరు.కథ చెప్పిన ఉద్దేశం. కథద్వారా కథకులు శ్రోతల్లో కలిగించిన రసస్పందన. ఇవే ముఖ్యం. బహుశా అందుకే రసస్పందనలో తర్కం కూడదంటారేమో!

పాఠకుడి ఉద్దేశం రసస్పందన.పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు. తన అనుభవాల్లోంచీ కథను అర్థం చేసుకుని అనుభవించి ఆనందిస్తాడు. విమర్శకుడు అలా కాదు. తను కథ ఔచిత్యాన్ని, సార్థకతనూ,సామాజిక అర్ధవంతతనూ తమ
దగ్గరున్న పనిముట్లతో బేరీజు చేస్తాడు. అంటే రసస్పందనలో తర్కాన్ని ఆశిస్తాడు. కాబట్టి ఒక స్థానికుడిగా నేను ఇటువంటి కథకుడు (సినబ్బ) చెప్పే ఇతివృత్తంలో అతడి సమర్పణభావాన్ని చూసానేకానీ,సాధ్యాసాధ్యాలను కాదు. పాఠకుడిగా కథద్వారా కలిగిన రసస్పందనని ఆస్వాదించానేగానీ తర్కాన్నిశోధించలేదు. అందుకే ఒక స్థానిక పాఠకుడిగా నాకు జవాబుల్లేని ప్రశ్నకి సమాధానాలు లభించాయి.

మూడవ భాగం
……………..

కథలో చాలా మంది విమర్శకులకూ పాఠకులకూ అర్థంకాని పజిల్ గా మిగిలింది ఆరంభ ఘట్టం. బొల్లిగిత్తని జయరాముడు చావగొట్టే ఉదంతం.దాంతోపాటూ, ఇంట్లో పెరిగిన గొడ్డుని.ప్రాణంలా చూసుకున్న గొడ్డుని.తమ్ముడిలా చూసుకున్న గొడ్డుని. జోవనోపాధిగా మారిన గొడ్డుని. జయరాముడు (పరసలో)సంతలో తెగనమ్మేందుకు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ కథకుడు ఆ ఘటనా స్థలిలో ఉండే పాత్రల ద్వారా కాకుండా, అక్కడ ఏం జరుగుంటుంది? జయరాముడికి ఆ ఉన్మాదం ఎలా ఆవరించింది? అనే ప్రశ్నలకు జయరాముడి తల్లి సాయమ్మ భయంద్వారా సమాధానం ఇప్పిస్తాడు. ఆ సమాధానం మూల ప్రశ్నల్లోనే మార్పుని ఆశిస్తుంది.

బొల్లిగిత్త మునెమ్మ మీదికి ఏ ఉద్దేశంతో చేరింది అనే ప్రశ్నకన్నా, జయరాముడు బొల్లిగిత్త చేష్టలకి హఠాత్తున ఉగ్రుడెందుకయ్యాడు అనేది సరైన ప్రశ్న. జయరాముడు బొల్లిగిత్తని తమ్ముడిలాగా చూసుకున్నాడన్నది కథారీత్యా తెలిసిన సత్యం. మునెమ్మ, జయరాముడూ,బొల్లిగిత్తా వీధిలో వెళ్తుంటే సీతారామలక్ష్మణుల్లాగా అనిపించేదని మునెమ్మ కూడా చెబుతుంది. అలాంటప్పుడు బొల్లిగిత్త ప్రేమగా మునెమ్మను చేరడం చూసి, పెళ్ళాం చీరకట్టిన పాపానికి నాటకంలో వేషం వేసినాయన్ని తెగనరికిన దొరసామిరెడ్డి రక్తం ప్రవహిస్తున్న జయరామి రెడ్డిని ఆ క్షణాన ఉన్మాదం ఆవరించడం సహజమైన భ్రంశనగానే అనిపిస్తుంది.

"జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగటే కనబడతావుండాయి" అన్న సాయమ్మ వాగ్మూలం అందుకు సాక్షం. అంటే ఇక్కడ బొల్లిగిత్త యొక్క తెలియని ఉద్దేశాలకన్నా, మునెమ్మ అమాయకత్వంకన్నా, జయరాముడి ఉన్మాద చర్య కథకు కీలకం. దీన్నొదిలేసి విమర్శకులు, పశువులు మనుషులపైకి వస్తాయా? boredom sex పశువుల్లో ఉందా? అనే పనికిమాలిన శాస్త్రీయ ప్రమాణాలను వెతుక్కున్నారు. పైపెచ్చు అదేదో రచయిత మానసిక రుగ్మతకు సాక్షంగా ఊదరగొట్టారు.

ఒక రాయలసీమ పల్లెవాసిగా, ఎదకొచ్చిన/సుల్లరానికొచ్చిన పశువులు మనుషుల మీద "ఎగరడం" నాకు తెలుసు. దానికి శాస్త్రీయ ప్రమాణం అనవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ప్రాధాన్యమైన సంస్కృతిలో పశువుల్ని మనుషుల్లాగా ప్రేమించడం ఎంత సహజమో, పశువులకూ మనుషులకూ "సంబంధాల్ని" అంటగట్టి హాస్యాలాడ్డమూ అంతే సహజం. కాబట్టి, ఇక్కడ శాస్త్రీయ ఆధారాలకన్నా, సాంస్కృతిక ధోరణిని అర్థం చేసుకోవడం అవసరం. అంతేకాక, విషయం అవగతమైన తరువాత సాయమ్మ అనే మాటలు గమనిస్తే, అంతర్లీనంగా జయరాముడి మార్పుపట్ల భయం కనిపిస్తుందేతప్ప ఆ ఘటన యొక్క "తప్పొప్పులు" కాదు. సాయమ్మ సినబ్బతో అంటుంది,"...పాపమేది పుణ్యమేది అని తెగజెప్పాల్సి వచ్చినప్పుడు దేవాను దేవతలే ఒక్కోసారి ముందూ యనకా అయినారు.

మనుషులు మనమెంత? జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగిటే కనబడతా ఉండాయి. వాడికి మీసాలొచ్చినప్పట్నుంచి ఇది గవనిస్తానే ఉండాను. ఇక ఆ గొడ్డు ఒక్క దినం గూడా ఉండకూడదనిపించిందిరా. అది ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏ మూలనో నాగుపాము ఉన్నట్లే ఉంటుంది" అని. ఇక్కడ కూడా బొల్లిగిత్త ఎందుకు మునెమ్మ మీదకొచ్చింది? అది తప్పాఒప్పా? అనే ప్రశ్నలకన్నా, జయరాముడి అనుమానం ద్వారా కలిగే విపరీతాలనుంచీ కుటుంబాన్ని కాపాడలనుకునే తల్లే కనిపిస్తుంది. అడ్డుచెబుతుందనుకున్న అత్తకూడా బొల్లిగిత్తను అమ్మేందుకే తయారవడం మునెమ్మకు అర్థం కాకపోవడానికి కారణంకూడా సాయమ్మకు తెలిసిన కుటుంబ చరిత్ర మునెమ్మకు తెలియకపోవడమే.

ఈ అపోహకు కారణం బహుశా, నవలతోపాటూ వచ్చిన అంబటి సురేంద్రరెడ్డి రాసిన విశ్లేషణలోని వాక్యాలు కూడా కావచ్చు. ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ నవల ఇస్తూ చాలా మందికి ముందుమాటా వెనకమాటా చదవొద్దని చెప్పాను. బహుశా ఈ నవల చాలా చిన్నదవటం వలన, పేజీలు పెంచడానికి ప్రకాశకులు వీటిని జతచేశారేమో. ఇలా జతచేయడం వలన లాభంతో పాటూ కొంత నష్టమూ జరిగిందని మాత్రం చెప్పగను.

నాలుగవ భాగం ?

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి

తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40

ప్రతులకు, వివరాలకు :


హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849

E Mail : hyderabadbooktrust@gmail.com

..................................

3 comments:

 1. అబ్బా! మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండీ. నాలుగో భాగం రాయాల్సిందే ఇక.

  ReplyDelete
 2. తప్పదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంత చక్కని సమీక్షను అసంపూర్ణంగా వదిలేయనిస్తామా! త్వరలో పూర్తిచేయండి.

  ReplyDelete
 3. "ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి..."
  నిజమంటే నిజం. కావలిస్తే వెనుక మాటలు రాసుకోవచ్చు కానీ ముందుమాటలెందుకు? రచనలో సత్తా ఏంటో రచనే చెప్పాలి. ఒంకొకరి వకాల్తా అనవసరం.
  పాఠకుడికి అంతగా ప్రేరణ కావలిస్తే వెనుక మాటలే ముందు చదువుకుంటాడు.

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌