Tuesday, August 11, 2009

గడ్డి పరకతో విప్లవాన్ని సృష్టించిన మసవోబు ఫుకువోక పై "ప్రాణహిత" లో అజయ్ ప్రసాద్ పరిచయ వ్యాసం ,,,



ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మసవోబు ఫుకువోక అద్భుత రచన "ది వొన్ స్ట్రా రివల్యూషన్ " ను చాలా కాలం క్రిందటే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ "గడ్డి పరక తో విప్లవం" పేరుతొ ప్రచురించింది. ఆ మహానీయుడిపై "ప్రాణహిత" ఆగస్ట్ 2009 సంచికలో బి అజయ్ ప్రసాద్ గారు చక్కని పరిచయ వ్యాసం రాశారు.
మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. ప్రాణహిత (pranahita.org) వారికీ, అజయ్ ప్రసాద్ గారికీ మా కృతఙ్ఞతలు.
.....

ప్రకృతి దార్శనికుడు మసనోబు ఫుకువోకా

గతసంవత్సరం ఆగష్టు 16న మసవోబు ఫుకువోకా మరణించాడు.బాగా మగ్గిన పండు తనంత తానే చెట్టు కొమ్మ నుండి రాలి పడినట్టు ఫుకువోకా తొంభై ఐదు సంవత్సరాల నిండు వయసులో ప్రకృతి ఒడిలోకి వెళ్ళి పోయాడు.

భూమిని నాగలితో దున్ననవసరం లేదనీ,రైతులకు తీరిక లేకుండడం,వారు అవిశ్రాంతంగా పని చేసుకుంటూ పోవడం భూమికి హానికరం అంటాడు పుకువోకా.రైతులు నాగరికత మూలంగా తమమీద పడిన అనవసర అదనపు శ్రమ వదిలించుకొని హైకూలు రాసుకోవాలని కలలు కన్నాడాయన.పుకువోకా మీద జెన్ బౌద్ధంతో పాటు చైనాలొని టావోయిజం ప్రభావం ఉందని ఒప్పుకోవాలి. ప్రకృతి వ్యవసాయానికి అతీతంగా ప్రకృతి ఆహారం గురించి, పిల్లల పెంపకం గురించి ,మానవ శాస్త్ర పరిశోదనల గురించి ఆయన దృక్పథం ఏమిటి?

పుట్టుక ఫలితమే జీవితం.ఇంతకుమించి ఏమీలేదు.ప్రకృతికి సాధమైనంత దగ్గరగా జీవించడమే మనిషి ఉద్దేశ్యం. బతకడానికి ఏమి తిన్నా,లేదా బతకడానికి ఏవేవి తప్పనిసరిగా తినాలని మనుషులనుకున్నా ఇదంతా వాళ్ళు ఊహించుకున్నదే.మనిషి జీవితానికి ఒక ఉద్దేశ్యమంటూ లేదు. అది ఉందని ఊహించుకొని దానిని తెలుసుకోవాలన్న తాపత్రయంలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇది ఒక వ్యక్తి చేసే ముష్టి యుద్ధంలాంటిది. జీవితానికి ఉద్దేశ్యమంటూ ఊహించుకోనవసరం లేదు.ఉద్దేశ్యం లేని జీవితం యెంత అర్థరహితమో పిల్లల్ని అడిగి చూడండి అంటాడు పుకువోకా.

చావు పుట్టుకలను మానవులు చాలా సంకుచిత దృష్టితో చూస్తారు. వసంతంలొ మొలకెత్తడం,ఆకురాలే కాలంలో చనిపోవడం, ఈగడ్డి పరకకు ఏం పట్టింది? జీవితం సంతోషమనీ,చావడం విచారమని మనుషులకు అనిపిస్తుంది.భూమిలో దాగి ఉండి వసంతంలో మొలకెత్తినప్పుడూ,ఎండి పొయి రాలి పోతున్నప్పుడూ వరి గింజలో జీవిత ఆనందం ఒకే విధంగా నిండుగా ఉంటుంది జీవితంలోని ఆనందం చావుతో విడిపోదు. క్షణంలో కదలిపోయే ఘటన మృత్యువు.వరి గింజకు జీవించడంలోని ఆనందం పూర్తిగా తెలుసు కాబట్టి మరణించడంలోని దుఃఖం తెలియదనిపించడంలేదూ?

ఈ జననమరణ చక్రాలలో పాల్గొని,అనుభూతి చెంది,ఆనందించగలిగితే అంతకు మించి ఏమీ సాధించాల్సిన అవసరం లేదు. చాలా మంది తెలిసిన జీవితాన్నే పట్టుకు వేళ్ళాడుతూ ఉంటారు. అందుకే చావంటే అంత భయం.చేజారిన గతం మీదా,ఇంకా రాని రేపు మీదా దృష్టి నిలిపి ఇక్కడా,ఈ క్షణంలో భూమి మీద బతికున్నామన్న సంగతి మరచి పోతారు.గందర గోళంలో కొట్టుమిట్టాడుతుండడం వల్ల జీవితం కలలాగే గడచి పోతుంది.

ప్రకృతిలో చావు పుట్టుకలు లేవు.ప్రకృతి సంతోషమయంగా ఉంటుంది.మానవ సమాజంలో చావు పుట్టుకలున్నాయి.ప్రజల్లో విషాదముంది అంటాడు పుకువోకా.

ఆయన జీవితాన్ని మార్చివేసి ఆయనను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించిన సంఘటన ఏమిటి?

ఇరవై ఐదు సంవత్సరాల పాటు కస్టమ్స్ బ్యూరోలో మొక్కల తనిఖీ విభాగంలో మొక్కల తెగుళ్ళ గురించి చదువుకున్నాడు.సాయంత్రాలు ఆటపాటలతో తీరిక లేకుండా గడిపేవాడు.సూక్ష్మదర్శినిలో అతడు చూసే ప్రపంచమూ,ఈ విశాల విశ్వమూ ఒకే రకంగా గోచరించి అద్భుతంగా అనిపించేది.ఒకసారి తీవ్రమైన పని ఒత్తిడిలో న్యుమోనియాకు గురయ్యాడు.ఆసుపత్రిలో ఒంటరి జివితం గడిపాడు.చావు,పుట్టుకలు అంటే ఏమిటి అన్న ప్రశ్నలు అతడిని వెంటాడాయి. మొట్టమొదటి సారిగా చావు అంటే భయం ఏర్పడింది.ఆసుపత్రి నుంచి బయట పడ్డాడు.కానీ నిరాశా వాదం నుండి బయట పడలేదు.

“అప్పటి వరకు దేని మీద నమ్మకంతో బతికాను? ఏ విషయమూ పట్టించుకోకుండా సంతోషంగా తిరిగే వాడిని.కానీ నాకు సంతృప్తినిచ్చిన విషయమేమిటి?ఇటువంటి ప్రశ్నలు నన్ను వెంటాడాయి.చావు పుట్టుకలు అంటే అనుమానం పట్టి పీడించసాగింది.వీటితో నిద్ర పట్టేది కాదు.పనిలో కూడా మనసు నిలిచేది కాదు.రాత్రిళ్ళు తీరంవెంట తిరిగినా ఉపశమనం దొరికేది కాదు.

ఒక రాత్రి తిరిగి తిరిగి అలసి పోయాను.కొండ మీద నుంచి రేవు కనపడుతుంది.రేవు కేసి చూస్తూనే ఒక పెద్ద్ద చెట్టు మొదలుకు ఆనుకొని మత్తులొకి జారుకున్నాను.నిద్ర,మెలకువ కాని స్థితిలో పొద్దు పొడిచే వరకు గడిపాను.ఆరోజు మే 15.అదంతా నా గ్నాపకాల పొరల్లో చెరగని ముద్రలా నిలిచి పోయింది.సూర్యోదయం.ఆ వెలుగులొ రేవు నిండి పోవటం కలలోలాగా అనిపించింది.కొండ కింది నుంచి గాలి వీచి ఒక్కసారిగా మంచు విడి పోయింది.అదే క్షణంలోఒక నీటి కొంగ ఒక్క అరుపు అరిచి దూర తీరాలకు ఎగిరి పోయింది.దాని రెక్కల చప్పుడు నాకు స్పష్టంగా వినపడింది.ఆ సమయంలో నాలోని అయోమయపు మబ్బులు విడిపొయాయి.అప్పటి వరకు నేను నమ్మినవీ,నేను పట్టుక వేళ్ళాడుతున్నవీ గాలితో పాటే కొట్టుక పోయాయి.”ఈ ప్రపంచంలో ఏమీ లేదు” అన్న మాటలు నా నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి.నేను అర్థం చేసుకుంది ఏమీ లేదు.”

ఈ అనుభవం అయిన మరుదినమే ఫుకువోకా తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు.సంవత్సరం పాటు దేశామంతటా అనేకమంది ప్రజలతో కలసి తిరిగాడు.నగరానికి వచ్చినప్పుడల్లా గుళ్ళలొనూ,పార్కులలోను నిద్ర పోయేవాడు. గ్రామాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి రైతుల మధ్య జీవిస్తు వాళ్ళతొ కలసి పొలాల్లో పని చేసేవాడు.ఆయనకు అర్థమైన విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాడు.అభేద్యమైన ప్రకృతిలో మనవ అస్థిత్వానికి అర్థమే లేదని చెప్పినప్పుడల్లా ఆయనని ఎవరూ నమ్మలేదు.చివరికి తను నమ్మినదానిని రుజువు చేయడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు.సుమారు నలబై సంవత్సరాల పాటు భూమిని దున్నకుండా,రసాయన ఎరువులు వాడకుండా అనేక రకాల పంటలు అధిక దిగుబడులతో పండించాడు.ప్రకృతి గురించి తను తెలుసుకున్నదానికి వ్యతిరేకంగా ఏనాడూ రాజీ పడలేదు.రసాయనిక ఎరువులు,రైతుల అనవసర వృధా శ్రమ ఇవన్నీ చూసి అసలేమీ చేయకుండా ఉండడానికి ఒక ఉద్యమం తీసుకు రావాలేమో అంటాడు పుకువోకా.

ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం ప్రకృతి వ్యవసాయమే.అంతకు మించి మరేమీ కాదంటాడు పుకువోకా.అది మనకు ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది.తద్వారా వొక అంతఃదృష్టినిస్తుంది.ప్రకృతి వ్యవసాయం అంతిమ లక్ష్యం పంటలను పండించడమే కాదు.మనుషులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దే వ్యవసాయం As I see it,the ultimate goal of natural farming is not growing crops…but the cultivation and perfection of human beings.

ప్రకృతిలో సాపేక్షిక ప్రపంచమంటూ ఉండదు.అనుభవానికి మానవ మేధస్సు ఇచ్చే రూపమే సాపేక్షికత.ఇతర ప్రాణులు అవిభాజ్యమైన వాస్తవిక ప్రపంచంలో జీవిస్తాయి. ఈ మేధస్సు సృష్టించిన సాపేక్షిక ప్రపంచంలో కూరుకు పోయినవారు కాలానికి అతీతమైన కాలాన్ని, స్థలానికి అతీతమైన స్థలాన్ని గ్రహించలేరని ఆయన ఉద్దేశ్యం.

పుకువోకా దృష్టిలో డబ్బు గురించి చింతపడడం,ఇంకా ఇంకా విస్తరించాలనుకోవడం,వ్యాపార పంటలు సాగు చెయ్యడం వంటివి రైతు జీవన విధానంలోవి కావు.తన చిన్న మడిని జాగ్రత్తగా చూసుకుంటూ పూర్తి స్వేచ్చ, కావలసినంత తీరికతో ప్రతి రోజు గడపడమే అసలయిన వ్యవసాయవిధానం.కోరికల తీవ్రత కారణంగా ప్రపంచం ప్రస్తుత ఈ స్థితిలో ఇరుక్కుంది.ఇంకా ఇంకా ఎక్కువ,ఇంకా ఇంకా వేగంగా అన్నది అభివృద్దికి మారు పేరయింది.ఇది సమాజ పతనానికి దారి తీస్తుంది.ఇది మనిషిని,ప్రకృతినీ వేరు చేస్తుంది.మానవాళి భౌతిక వస్తువుల పట్ల కోరిక,వ్యక్తిగత లాభాలు విడనాడి ఆధ్యాత్మిక చైతన్యం దారిలో పయనించాలి.ఒక చిన్న ఊరిలో పరిపూర్ణమైన జీవితాన్ని గడపవచ్చునని టావో తత్వవేత్త లావోత్సు అభిప్రాయం.జెన్ మత సంస్థాపకుడయిన బోధి ధర్ముడు ఎటూ కదలకుండా ఒక గుహలో సంవత్సరం పాటు గడిపాడు.

సంస్కృతిని కేవలం మనుషులు రూపొందించి కాపాడి,అభివృద్ధి చేయలేరు.మనిషీ,ప్రకృతీ కలయికతోనే సంస్కృతి పుడుతుది.రూపుదిద్దుకుంటుంది.సంస్కృతికీ,రోజువారీ జివితానికీ సంబంధం ఉంది.ఈ విధంగానే ఇది తరతరాలకు సంక్రమిస్తూ,నేటివరకూ కొనసాగుతూనే ఉంది.మానవ అహంకారం నుండి,సుఖాన్వేషణ నుండి పుట్టింది నిజమైన సంస్కృతి కాదు.నిజమైన సంస్కృతి ప్రకృతిలొ పుట్టి స్వచ్చందంగా,సీదాసాదాగా,అణకువగా ఉంటుంది అంటాడు పుకువోకా.

శాస్త్ర పరిశోదనల గురించి చెబుతూ ఐన్ స్టీన్ రూపొందించిన సాపేక్షికతా సిద్ధాంతం మనుషుల్ని కాలం,స్థలం అన్న బంధాలనుంచి విడుదల చేసి మరింత ప్రశాంత సంతోషభరిత జీవితానికి దారి తీసి ఉంటే, ఆయన కిచ్చిన నోబెల్ బహుమతికి అర్థం ఉండేది.మానవ ఆధ్యాత్మిక సుఖ శాంతులను చెడగొట్టినందుకు అతనికి బహుమతి ఇచ్చి ఉంటే సరిపోతుంది అని అంటాడాయన.

పోటీ సిద్ధంతంపై ఆధారపడి ఉన్నానా,సహజీవన సిద్ధాంతంపై ఆధార పడి ఉన్నానా ఆని ప్రపంచం తనను తాను ప్రశ్నించుకోదు.మానవ బుద్ధిలొని సాపేక్షిక దృష్టితో చూసినపుడే బలమైనవీ,బలహీనమైనవీ పెద్దవీ,చిన్నవీ కనిపిస్తాయి.బలవంతుడు బలహీనుడు అనే భావలపై ఆధారపడి యుద్ధం చేయడంమనుషులకు మాత్రమే సాధ్యమయ్యే అంశమంటే బతుకు హాస్యాస్పదమవుతుంది.ఈ హాస్యాస్పదమైన దాన్ని హాస్యాస్పదమైనదిగా గుర్తించలేక పోవడంలోనే మానవ విషాదం ఉంది.

ఒక వస్తువును మొత్తం నుంచి వేరుచేసి ప్రత్యేకంగా చూస్తే అది దాని అసలైన వస్తుతత్వాన్ని కోల్పోతుంది.అందుకు ఉదాహరణగా పిల్లలు ఇది ఆకుపచ్చ,ఇది ఎరుపు అని రంగులు గుర్తుపట్టడం మొదలైనప్పుడే వాళ్ళకు ప్రకృతి అర్థం కాకుండా పోతుంది అంటాడు పుకువోకా.ప్రపంచంలో ఏడు మూల రంగులున్నాయి(ఇంద్ర ధనుస్సులోనివి).ఈఏడు రంగులూ కలిస్తే తెలుపు వస్తుంది.స్ఫటిక, తెలుపును ఏడు రంగులుగా విడగొడుతుంది.ప్రపంచాన్ని మనిషి “మేధ లేకుండా”చూస్తే రంగులోని

రంగు మాయమవుతుంది.విచక్షణతో కూడుకున్న ఈ ఏడు రంగుల మేధతో చూసినప్పుడే రంగులు కనపడతాయి.వైరుధ్యాలు,విభేదాలు లేని ప్రపంచంలో పిల్లలు ప్రశాంతంగా జీవిస్తారు.వెలుతురు,చీకటి,బలమైనది,బలహీనమైనది వంటివి గ్రహిస్తారు.కాని ఏ విధమైన తీర్పులు చెప్పరు.నిజమైన ప్రకృతిని పిల్లలొక్కరే చూడగలరు.వాళ్ళు ఏమీ ఆలోచించకుండా,హాయిగా,ఆనందంగా చూస్తారు.కనీసం చెట్ల పేర్లు తెలిసినా,ఇది చీనీ చెట్టు,ఇది దేవదారు చెట్టు అని తెలిసినా ప్రకృతి అసలు రూపాన్ని చూడలేరు.

అంతేగాక పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవడానికి సహజంగా ఏ విలువా ఉండదు.విద్యావంతులైతే గాని బతకలేని పరిస్థితులు సృష్టించిన తర్వాత దీని అవసరం ఏర్పడుతుంది.మానవ సమాజం ప్రకృతి నుంచి ఎంతగా దూరమైతే అంతగా బడి అవసరం ఏర్పడుతుంది.బడికి వెళ్లి చదువుకొవడానికి ప్రకృతిలొ ఎటువంటి ఉపయోగమూ లేదు.

ఆడుకుంటూ,లేదా ఏమీ చెయ్యకుండాపిల్లలు సంతోషంగా గడిపేస్తారు.దీనికి భిన్నంగా పెద్దవాళ్ళు ముందుగా తమకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నిర్ణయించుకుంటారు. అటువంటి పరిస్ఠితులు ఏర్పడినప్పుడే సంతృప్తి పొందుతారు.ఆధునిక ప్రజలు తమ సహజ శక్తులను కోల్పొయారు.ఫలితంగా వాళ్ళు వసంతకాలపు ఏడు మూలికలను ఏరుకొని ,తిని ఆనందించలేకపోతున్నారు.రకరకాల రుచుల కోసం పాకులాడుతుంటారు.వాళ్ళ ఆహారం గందరగోళ మవుతుంది.రానురాను వాళ్ళ సహజ శక్తి మరింత అయోమయంలో పడిపోతుంది.ఈ దశలో వంటల్లో మసాలా ఎక్కువగా వేయడం మొదలవుతుంది.వంటకు ఎక్కువ సమయం తీసుకుంటుది..క్రమేపీ ఆహారం-మానవ ఆత్మ మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది.

పుకువోకా అమెరికా ,యురప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఇథియోపియా,సోమాలియా వంటి కరువు పీడిత ఆఫ్రికా దేశాలను పర్యటించాడు.అమెరికాకి ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల శక్తి ఉంది.అదే సమయంలోసహాయం చేయగల శక్తీ ఉంది.అది ఆ రెండు పనులూ చేయదు.అమెరికా ఆయా దేశాలను కాఫి, పంచదార వంటి వాణిజ్య పంటల పండించేట్లు చేస్తున్నది. వాళ్ళు తమకు కావలసిన వరి,కాయగూరలు పండించుకోగలరు.కాని అమెరికా వాళ్ళని వాణిజ్య పంటల కోసం బానిసల వలే అనుక్షణం పని చేయండి అని ఒత్తిడి తెస్తూ ఉంది.ఒక్క కాఫి పంట కోసం అమెరికా, ఆఫ్రికా ప్రభుత్వాలు ఆఫ్రికా ప్రజలని కాఫి,తేయాకు వంటి ఐదారు వాణిజ్య పంటలు పండించడానికి ప్రోత్సహిస్తాయి.వాళ్లకుప్రజల ఆకలితో పనిలేదు.కావలసిందల్లా ఎగుమతుల వాణిజ్యం ఫలితంగా చివరకు అది ఎలా తయారయిందంటే అక్కడి ప్రజలు తమకు కావలసిన కూరగాయలు తినడం కూడా మరచి పోయారు.

ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఎడారులను కూడా సస్యశ్యామలం చేయవచ్చునంటాడు పుకువోకా.అమెరికా,యూరప్ దేశాలు అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాయి. అదంతా వృధా శ్రమ.దానికి బదులు విమానాల ద్వారా ఎడారుల్లో విత్తనాలు చల్లించండి అంటాడు పుకువోకా.

నేను నా వరి పైరులలో నుంచొని వినాశకర సాంకేతికాభివృద్ధికి,ఇతర ప్రాణులను నిర్మూలించడానికి వ్యతిరేకంగా నిలబడి మానవాళికి సేవ చేస్తున్నానని నమ్ముతున్నాను.ఒకప్పుడు ప్రపంచం చాలా సహజంగా ఉండేది.పొద్దున్నే మైదానంలో నడిస్తే మంచు బిందువులు చల్లాగా తగిలేవి.ఈ ఒక్క మంచు బిందువును శాస్త్రీయంగా వివరించడానికి పూనుకోవడంతో ఇప్పుడు అంతులేని మేధో జగత్తులొ కూరుకు పోయారు.మానవ జ్ఞానం ఎంత అల్పమైనదో రుజువు చెయ్యడానికి మాత్రమే శాస్త్ర జ్ఞానం తోడ్పడింది.

మానవ మేధ సృష్టించే ప్రకృతి చిత్రాన్ని నేను తృణికరిస్తాను.విచక్షణ చేయని బుద్ధి ద్వారా అనుభవంలోకి వచ్చే ప్రకృతి దీని కంటే ఎంతో భిన్నమైనది.శాస్త్రీయ సత్యాలు ఎన్నటికీ అసలయిన సత్యాన్ని చేరుకోలేవు.తత్వ శాస్ర్తాలన్నీ ఈ ప్రపంచానికిచ్చేది భాష్యాలు మాత్రమే.విధ్వంసానికి గురయిన ప్రకృతే శాస్త్రీయ విజ్ఞానానికి బోధ పడుతుంది. మొదటి నుంచి తూర్పు,పడమరలు లేవు.ఇన్-యాంగ్ లేవు (opposite forces).

ప్రకృతిని అర్ఠం చేసుకోవడం ఎందుకు సాధ్యంకాదు?ప్రకృతి అనేది ఆయా వ్యక్తుల మెదడులో జనించే ఊహ మాత్రమే.ప్రకృతి నుంచి ఎంతగా విడిపోతే మూలం(source) నుంచి అంత దూరంగా మానవులు పరిభ్రమిస్తుంటారు.తిరిగి మూలానికి,ప్రకృతికి చేరుకోవాలన్న తహతహ కూడా అదేసమయంలొ పుడుతుంది.కేవలం ప్రతి చర్యగా కుడి వైపుకో,ఎడమ వైపుకో వెళతాం.కాని ప్రకృతిని మాత్రం చేరుకోలేం.సాపేక్షిక సిద్ధాంతానికి అందని నిశ్చల కేంద్రం ఎవరి దృష్టికీ ఆనలేదు.ప్రకృతి విధానాలకు అనుగుణంగా,కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలు మెచ్చుకోదగినవే కాని నిజమైన పరిష్కారమిచ్చే దిశలో పయనించడంలేదు.

కాలంకాని కాలంలో పండించడంగురించి చెపుతూ “కొంతకాలం తరువాత ఇలా పండిస్తున్నకూరగాయల్లో పోషక విలువలు ఏ మాత్రమూ లేవని కనుగొంటారు.దీనితొ పోషక విలువలు నష్టపోకుండా ఉండడానికి మరో సాంకేతిక నిపుణుడు పరిశోధనలు మొదలు పెడతాడు. కాంతి ప్రసరణలో సమస్య ఉందనుకొని దానిపై పరిశోధనలు చేస్తాడు. మనుషులు ఎంత కష్టపడినప్పటికి ప్రకృతికి మించి మంచి కూరగాయలు,పండ్లూ సాగు చేయలేరు.కృత్రిమ విధానాల్లో పండించిన పంట ద్వారా ప్రజల గొంతెమ్మ కోర్కెలు తీర్చవచ్చు.కాని ఇవి మనిషి శరీరాన్ని బలహీనపరుస్తాయి.శరీర రసాయన ధర్మాన్నే మార్చేసి ఇటువంటి ఆహారంపైనే ఆధారపడేట్లూ చేస్తాయి.ఈ పరిస్థితులలో విటమిన్ బిళ్ళలు,టానిక్కులు అవసరమైతాయి.వీటన్నిటివల్లా రైతులకు అదనపు శ్రమ, వినియోగదారులకు అనారోగ్యమూ మిగులుతాయి. ఆహారాన్ని పండించడంలో ప్రకృతి మనకు సహకరిస్తుందని భ్రమ పడతాం.ప్రకృతి మనకు ఏది ఇవ్వడానికి నిశ్చయించుకుందో కేవలం దాన్ని మాత్రమే స్వీకరిస్తాం అంటాడు పుకువోకా.

జపాను భూములూ,సమాజమూ గత నలభై సంవత్సరాలుగా క్షీణించిపోవడాన్ని పుకువోకా నిరశనతో చూస్తుండిపోయాడు.పుకువొకా వరి పొలాలను చీలుస్తూ ఇప్పుడొక జాతీయ రహదారి పడింది.

ప్రకృతిని చూసే విధానం యుగయుగానికీ మారవచ్చు కాని ప్రకృతి మారదు. ఏ యుగానికైనా సరే వ్యవసాయం ఆలంబనగా ప్రకృతి సేద్యం ఉండనే ఉంటుంది.

గడ్దిపరకతో విప్లవం రావాలని కాంక్షించాడు పుకువోకా.ఈ నేల మీద సూర్య కిరణం తాకి గడ్డి మొలకెత్తుతూ పుకువోకాని గుర్తు చేస్తూనే ఉంటుంది.అలా గడ్డి పరక కూడా మొలకెత్తలేని రోజు ఈ భూమి మీద మనిషి మనుగడే ఉండదు.

...............

గడ్డి పరకతో విప్లవం
-మసనోబు ఫుకుఓకా


ఆంగ్ల మూలం: The One Straw Revolution, Originally published in Japanese as Shizen Noho Wara Ippon No Kakumei, translated into English and published by Other India Press, Goa, 1992.

తెలుగు: సురేష్‌, సంపత్‌

తెలుగులో మొదటి ముద్రణ: టింబక్టూ కలెక్టివ్‌, 1990
రెండవ ముద్రణ: హెచ్‌బిటి, 2001

199 పేజీలు, వెల: రూ.50
.....

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.........

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌