నేను హిందువు నెట్లయిత ?...కొత్తగా చేర్చిన అధ్యాయం లోంచి కొంతభాగం ........ ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూ మతం నిన్నమొన్నటిదే.
''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అ ల్ హింద్''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు.
ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది. భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్ అన్నారు. అయితే 'హిందుస్థాన్' అన్న పదం వాడుక మొదలయింది 'సింధుస్థాన్' అన్న పదంలోంచి. అంటే సింధూ నదీ పరీవాహక ప్రాంతమన్నమాట.
అ ల్ బెరూనీ వాడిన 'హింద్' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్' లాగే వుంటుంది.
వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరులనందరినీ హిందువులుగా పరిగణించింది.
క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు. అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదూ అన్న భావన వారిలో లేదు. అయితే కంటికి కనిపించే ఒంటి రంగు తేడాపై ఆధారపడ్డ జాతి విభజనమాత్రం వారిలో వుంది.
పాశ్చాత్య మేధావులు అ ల్ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించారు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నారు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా తనకి దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు.
కుల వ్యవస్థ వల్లనే భారతీయాత్మ ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.
హిందూ మతం - బౌద్ద, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. అదే మిగతా మూడు మతాలు పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది.
హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని తాత్వికంగా బొత్తిగా ఉపేక్షించింది.
ప్రాచ్య మేధోవర్గం హిందూమత సారాన్ని అర్థంచేసుకోకుండా మిగతావాటిలాగా అదో సరైన పౌర మతంగా పరిగణించింది. ఇస్లాంను, క్రైస్తవాన్ని వ్యతిరేకించే సనాతన ధర్మానికి మరోపేరైన ఈ హిందూమత గుర్తింపును బాపన జాతీయవాదులు చక్కగా వాడుకున్నారు. ఆధ్యాత్మిక నియంతృత్వానికీ - ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికీ మధ్య జరిగే పోటా పోటీలో ఇది వారికి బాగా ఉపయోగపడింది.
ఇస్లాంలోనూ క్రైస్తవంలోనూ ప్రత్యేకించి మహిళలు అనేక రకాల అసమానతలను ఎదుర్కొన్నారు. ఇస్లాంలో 'బురఖా', 'తలాక్' సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సమావేశం విషయంలో మహిళలకు ఏనాడో హక్కును కల్పించారు. ఇతర మతాలకూ హిందూ మతానికీ మధ్య వున్న ప్రధానమైన తేడా ఏమిటంటే హిందూమతంలో ఆధ్యాత్మిక నియంతృత్వ స్వభావం అంతర్గతంగా పెనవేసుకుపోయి వుండటం.
అదే బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలలో అయితే ఇంతకు ముందే ప్రస్తవించినట్టు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం వాటి ప్రధాన సారంగా కనిపిస్తుంది. పరస్పర మత యుద్ధాలలో వారు తమ ప్రాథమిక మత సారాన్ని ఉల్లంఘించారు. కొన్ని సందర్భాలలో ఆ మత యుద్ధాలు చాలా అమానుషంగా జరిగాయి. మతపరమైన యుద్ధాలు, మతప్రచార యుద్ధాలు ఉధృతంగా కొనసాగిన చారిత్రక దశలు వున్నాయి. ఈ మతాలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాలతో కూడినవి. ఆ ప్రజాస్వామ్యాలు రాజకీయపరమైనవి కాదు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్ని సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కరించలేదు. కానీ, సామాజిక, రాజకీయ సమానత్వానికి అది పునాదులు వేస్తుంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యాన్ని ఒక వ్యవస్థగా సమగ్రంగా అభివృద్ధిపరిచేందుకు చారిత్రకంగా ఎంతగానో దోహదం చేస్తుంది.
ఒక్క హిందూ మతం తప్ప మరే ఇతర మతం కూడా పౌర సమాజంలో తన మతస్థులుగా పరిగణింపబడేవారిని తనే అణగదొక్కి హింసించే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని నిర్మించలేదు. హిందూ మతం తనను తాను సంపూర్ణంగా సంస్కరించుకోనైనా సంస్కరించుకోవాలి లేదా మొత్తం భారతీయ సమాజం ఆధ్యాత్మిక నియంతృత్వ సామాజిక వ్యవస్థలు లేని ఇతర మతాల్లో నైనా చేరిపోవాలి.
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ''నేను హిందువు నెట్లయిత?'' ను రాయడం జరిగింది. తన ఆరున్నరేళ్ల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ హిందూమతాన్ని సంస్కరించేందుకు ఎట్లాంటి ప్రయత్నమూ చేయలేదు. హిందూ ఏకజాతి గురించి అదేపనిగా మాట్లాడే బీజేపీ హిందూమతాన్ని కులరహితంగా మార్చేందుకు మాత్రం పూనుకోలేదు. పైపెచ్చు బ్రాహ్మణిజం పెత్తనం చెలాయించడాన్ని, దాని గుత్తాధిపత్యాన్ని బిజెపి ప్రోత్సహిస్తోంది.
గతంలో కొనసాగిన భక్తి ఉద్యమం సూద్రులను బ్రాహ్మణీకరించడం ద్వారా వారికి ఆధ్యాత్మిక హక్కులు కల్పించాలని మాత్రమే అడిగింది. అయితే ఆ ఉద్యమం కూడా కుల వ్యవస్థను మార్చలేదు. భవిష్యత్తులో సైతం బ్రాహ్మణత్వానికి ప్రాతినిధ్యం వహించే హిందూత్వ ఆలోచన తనను తాను సంస్కరించుకుంటుందన్న ఆశ నాకు ఏకోశానా లేదు. ఎందుకంటే హిందూమతం తాలూకు రోజువారీ ఆచరణగానీ, దాని సిద్ధాంత గ్రంథరచనలు గానీ సంస్కరణకు ఏమాత్రం అవకాశాన్ని కల్పించేలాలేవు.
ఇటీవల హిందూ మితవాదులైన బిజెపి, ఎన్‌డిఎ అధికారంలో వున్నప్పుడు సైతం ఆవిధమైన ప్రయత్నాలు లీలామాత్రంగానైనా చేయలేదు. హిందూమతం హింసావాద మతం అనీ, గుజరాత్‌లో జరిగిన జాతిహత్యాకాండలో మాదిరిగానే కరడుగట్టిన హిందువు హింసను చాలా సహజంగా సమర్థిస్తాడని నేనీ పుస్తకంలో పదేపదే ప్రస్తావించినట్టుగానే - 2004 సాధారణ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వారీ విషయాన్ని మళ్లీ నిరూపించారు. 'మంచి' వాజిపాయి, 'తెలివైన' అరుణ్ శౌరి మొదలుకుని 'చెడ్డ' నరేంద్రమోడీ, తొగాడియాల వరకూ హింస అనివార్యమైనదంటూ సమర్థించారు.
ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన హింస సమర్థనీయమైనదే అయితే గతంలో చారిత్రకంగా దళితబహుజనలపై చేసిన హింస కూడా సమర్థనీయమైనదేనన్నమాట. హింస వారి మతవిశ్వాసం. హింసను వారు ప్రేమిస్తారు. హింసలోనే జీవిస్తారు. హింస వారి ఆధ్యాత్మిక నియంతృత్వంతో కలిసే పుట్టిపెరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భారతదేశంలో దళితబహుజన ఉద్యమం చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. దళితబహుజన విద్యావంతులు బ్రాహ్మణీయ విద్యా సంస్థల్లో నేర్చుకున్న దానిని విసర్జింపజేయడం కష్టంగా వుంది. అనేక విశ్వవిద్యాలయాల్లో బ్రాహ్మణిజంను మార్క్సిస్టు పరిభాషలో బోధిస్తున్నారు. భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో, కొన్ని విదేశీ విద్యాలయాల్లో శిక్షణ పొందిన శక్తులు ''గులాంగిరి'', ''కుల నిర్మూలన'', ''నేను హిందువునెట్లయిత?'' వంటి పుస్తకాలను తిరస్కరిస్తున్నాయి. మతతత్వాన్ని, లౌకికవాదాన్ని బోధించే క్రమంలో హిందూత్వ గ్రంథాలను వ్యతిరేకించే దళితబహుజనుల సానుకూల పాఠ్యాంశాల కంటే ఎక్కువగా సావర్కార్ 'హిందూత్వ' లేదా గోల్వాల్కర్ 'బంచ్ ఆఫ్ థాట్స్' లకు అత్యంత ప్రాధాన్యత యిస్తున్నాయి.
అసలు కులం గురించి మౌనాన్ని పాటించే లౌకికవాదం లౌకికవాదమేనా అని? కులతత్వం అనేది మతతత్వంలో అంతర్భాగమే కదా? ఒక హిందువును కాని భారతీయుడిగా నేను ఎన్‌ఆర్‌ఐ మేధావులతో సహా దేశీయ మేధావులనందరినీ ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాను: వాజ్‌పేయీ, అద్వానీలు సాక్షాత్తూ అపర శ్రీరాముని అవతారాలే కదా? ఒక జాతిగా ఆ ఇరువురూ హింసనే ఆచరించినప్పుడు రాముడు హిందూ మర్యాదా పురుషోత్తముడై, అద్వానీ మాత్రం అమర్యాదా పురుషోత్తముడెట్లా అవుతాడు.
రాముడు తాటకిని చంపాడు. తన తమ్ముడైన లక్ష్మణుడి చేత ద్రవిడ జాతికి చెందిన అత్యంత అందగత్తె అయిన శూర్పణఖ ముక్కుచెవులు కోయించాడు. వాలిని హతమార్చాడు. శంబూక వధ చేశాడు. రావణాసురుడి మొత్తం వంశాన్ని నిర్మూలించాడు. రాముడు తన భార్య సీతను నిలువునా అగ్నికి ఆహుతి చేయడానికి కూడా వెనుకంజవేయలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసి సజీవంగా వచ్చివుండకపోతే కాలిబూడిదై వుండేదే కదా.
ఆయన చేసిన ఈ హింసంతా దళితబహుజనులకూ, స్త్రీలకూ వ్యతిరేకంగా సాగించినదే. తన దళితబహుజన సేవకుడైన హనుమంతుడి చేత అనేకమందిని చంపించి హిందూ రామరాజ్య రక్షణ కోసమే ఆ హింస అంతానూ అని ఒప్పిస్తాడు.
అద్వానీ, వాజ్‌పేయీల పర్యవేక్షణలో వారి ప్రియతమ శిష్యుడు, ఓబీసీికి చెందినవాడూ అయిన నరేంద్రమోడీ గుజరాత్‌లో చేసింది అదే కదా.
నేను హిందువునెట్లయిత రాముడి హింసనూ వ్యతిరేకిస్తుంది, రామరాజ్య హింసనూ వ్యతిరేకిస్తుంది. హిందూమతం, హిందూత్వ అనేవి ఆధ్యాత్మిక నియంతృత్వ మనబడే ఒకే నాణానికి రెండువైపులా వున్న బొమ్మా బొరుసులే! ఈ అంశాన్ని చర్చించడం చాలా ముఖ్యం కదా? ఈ రెంటిలో ఒకదానిని ప్రేమిస్తూ, అందులోనే జీవిస్తూ మరొకదానిని ద్వేషించడం సాధ్యమవుతుందా?
,,,
ఈ కొత్త అధ్యాయాన్ని ప్రభాకర్ మందార అనువదించారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేను హిందువు నెట్లయిత ?
కంచ ఐలయ్య ఆంగ్ల మూలం : Why I Am Not a Hindu, Kancha Ilaiah, Samya, Calcutta, 1996
Copy right: Kancha Ilaiah 1996
తెలుగు అనువాదం : ఎ . సురేందర్ రాజు
ప్రధమ ముద్రణ : జనవరి 2000
మలి ముద్రణలు : 2000, 2002, 2005, 2007, 2009
188 పెజీలు , వేల : రూ. 55,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్ 500067
ఫోన్ నెం. 040- 2352 1849.........
ఇ మెయిల్:
hyderabadbooktrust@gmail.com
.....................................