Friday, June 27, 2008

అసుర సంధ్య మాల్కం ఎక్స్‌ ఆత్మకథ


అసుర సంధ్య

మాల్కం ఎక్స్‌ ఆత్మకథ

అ లెక్స్‌ హేలీ

ఆంగ్ల మూలం: The Autobiography of Malcolm X with the assistance of Alex Haley, Penguin Books, 1968.

తెలుగు అనువాదం: యాజ్ఞి

పేజీలు: 110 వెల: 40/-

నిజమైన ఇస్లాంను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయలేకపోవటం తూర్పు దేశాల వైఫల్యం. దీనివల్ల మతాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు పనులు చేసేవాళ్లు మా నల్లజాతి ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం ఏర్పడింది

- మాల్కం ఎక్స్‌

ఈ ఆత్మకథ ముద్రించటానికి ఇచ్చిన ఒప్పంద పత్రంపై సంతకం చేసిన తర్వాత, మాల్కం ఎక్స్‌ నా వంక కర్కశంగా చూసి నాక్కావలసింది రచయిత వ్యాఖ్యాత కాదు అన్నాడు. అట్లా వుండటానికే ప్రయత్నించాను. ఏమైనా, ఇంతటి విద్యుత్తేజం కలిగిన వ్యక్తిత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అతను చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకున్నాను. చరిత్రకారులు రాయాల్సిన తర్వాతి అధ్యాయంలోకి అతను అట్లా వెళ్లిపోయినట్టే నా మనసుకింకా అనిపిస్తోంది.

అమెరికన్‌ శిలువెక్కిన ఆఫ్రికన్‌ తార

ఇది అమెరికన్‌ నల్లముస్లిం జాతీయోద్యమనాయకుడైన మాల్కం ఎక్స్‌ ఆత్మకథ. సుప్రసిద్ధ నవల రూట్స్‌ (దీనిని ఏడుతరాలు పేరిట హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులో వెలువరించింది) రాసిన అ లెక్స్‌ హేలీ తనకు మాల్కం ఎక్స్‌ చెప్పినట్టు ఈ అత్మకథకు అక్షర రూపమిచ్చాడు.

అమెరికా తీర రక్షక దళంలో ఇరవై ఏళ్లు పనిచేసిన తర్వాత హేలీ, లాస్‌ వేగాస్‌లో జర్నలిస్టుగా స్థిరపడ్డాడు. అక్కడ నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం గురించి విని హార్లిమ్‌ (న్యూయార్క్‌) కు వచ్చాడు. ప్లేబాయ్‌ పత్రిక తరఫున ఈ రచన పూర్తి చేయటానికి ఆయనకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. దానిక్కారణం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే మాల్కం ఎక్స్‌ జీవితశైలి.

నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం నాయకుడు ఎలైజా మహమ్మద్‌ తర్వాతి స్థానంలో వుండే వ్యక్తిగా మాల్కం ఎక్స్‌ క్షణం తీరికలేని జీవితం గడిపాడు. పొద్దున నిద్రలేచింది మొదలు, పడుకొనే వరకూ తెల్లవాడి మీద నిప్పులు కక్కుతూ, ఒక్క అమెరికాలోనే కాకుండా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలన్నీ సుడిగాలిలా తిరిగాడు. నల్లవాళ్లను ముస్లింలుగా మార్చటం కోసం కాలాన్ని తన ఊపిరిగా చేసుకొని బతికాడు. 1950లో ఒక కార్యకర్తగా సంస్థలో చేరి చాలా కొద్దికాలానికే నాయకుడిగా ఎదిగాడు.

1963లో నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం నాయకుడు ఎలైజా మహమ్మద్‌ తన అనైతిక ప్రవర్తనను మాల్కం ప్రశ్నించాడనే కోపంతో, రోజు రోజుకూ అమెరికాలోని నల్లవాళ్లలో ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి అసూయతో, భవిష్యత్తులో తన స్థానానికే ముప్పు వస్తుందన్న భయంతో కుట్రపన్ని ఆయన్ను సంస్థ నుంచి బహిష్కరించాడు. అంతటతో ఊరుకోకుండా మాల్కం ఎక్స్‌ను చంపేయమని తన సంస్థలోని ముస్లింలను ఆదేశించాడు.

తన ఆలోచనలతో, ఆవయాలతో, ప్రసంగాలతో అప్పటికే తెల్ల శత్రువులను సంపాదించుకున్న ఆయనకు తన సహచరులు కూడా బద్ధ శత్రువులు కావటం బాధాకరం. నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం నుండి బైటికొచ్చిన తర్వాత హార్లెమ్‌ మధ్యలో కొత్త మసీదును స్థాపించి మక్కా యాత్రకు పోయాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ అమెరికన్స్‌ యూనిటీ అనే కొత్త సంస్థను స్థాపించాడు. 1964లో పరిస్థితి మరింతగా విషమించింది. నల్ల ముస్లింలు మాల్కం ప్రతి కదలికనూ నీడలా వెంటాడారు. ఏ క్షణమైనా ప్రాణంపోయే ప్రాణంపోయే పరిస్థితుల్లో అ లెక్స్‌ హేలీ ఈ ఆత్మకథ రెండో భాగానికి సంబంధించిన నోట్స్‌ రాసుకున్నాడు. తన ఇంటిలో జరిగిన బాంబుపేలుడు నుండి భార్యా బిడ్డలతో సహా బైటపడ్డ మాల్కం ఎక్స్‌ను 1965 ఫిబ్రవరి 21న హార్లెమ్‌లోని అడూబన్‌ బాల్‌ రూంలో ప్రసంగిస్తుండగా నేషన్‌ ఆఫ్‌ ఇస్లాం సభ్యులు అతి దగ్గర నుండి పదిహేను రౌండ్లు కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు తెల్లవాళ్లు పోలీసులు నిశ్వబ్దంగా సహకరించారు. ఇది అ ల్లా విధించిన శిక్ష అని ఎలైజా మహమ్మద్‌ తన నేరేన్ని సమర్థించుకున్నాడు.

ఇంగ్లీషులో 1965లో అచ్చయిన ఈ ఆత్మకథ ఇంతకాలం తర్వాత తెలుగులో రావటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అసాధారణమైన నాయకత్వ లక్షణాలున్న మాల్కం ఎక్స్‌ అసలు ఇక్కడి మేధావుల దృష్టి నుండి ఎ లా తప్పిపోయాడు? మార్టిన్‌ లూథర్‌ కింగ్‌తో పోలిస్తే ఈయన ఆవేశపరుడు కావచ్చు. కానీ ఒక ప్రజా నాయకుడిగా ఈయన జీవితంలో ఇక్కడి దళితులకూ, ముస్లింలకూ ఉపయోగపడే విషయాలు ఎన్నో వున్నాయి.


1 comment:

  1. అద్భుతమైన జీవితం మాల్కమ్ ఎక్స్ ది.తాను తప్పక హత్య చేయబడతానని తెలిసిన మొక్కవోని ధైర్యంతో తాను నమ్మిన దాన్ని ఆచరించిన ఆగొప్ప వ్యక్తి గురించి మరో గొప్ప రచయిత ఎలేక్స్ హేలి రచనను తెలుగులోకి తెచ్చిన HBT వార్ని అభినందినందిస్తూ చదివి స్ఫూర్తి పొందాలని మిత్రుల్ని కోరుకుంటూ...,రాజారామ్

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌