Monday, June 23, 2008

తిరగబడ్డ తెలంగాణ : దొరలను దించాం నిజాంను కూల్చాం - డా. ఇనుకొండ తిరుమలి


తెలంగాణా ప్రజా ఉద్యమ చరిత్రను వివరించే రచనలు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో ప్రాముఖ్యాన్నీ సంతరించుకున్నాయి. కానీ అవన్నీ చాలా వరకు ఆ ఉద్యమాన్ని నడిపించిన కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుంచి, పార్టీనే కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు. వీటికి భిన్నంగా ఆ ఉద్యమంలో నిమగ్నమై వీరోచితంగా పోరాడిన ప్రజలను కేంద్రంగా చేసుకుని నిజాంనూ, దొరలనూ ఇరువురినీ దించాలన్న కృతనిశ్చయంతో సాగిన అపూర్వ ప్రజా పోరాటానికి అద్దం పడుతుందీ రచన. తెలంగాణా పోరాట చరిత్ర రచన కోసం మొట్టమొదటిసారిగా అధికార/ప్రభుత్వ రికార్డులను విరివిగా ఉపయోగించుకోవటం ఈ పుస్తకం ప్రత్యేకత. ఇది లోతైన పరిశోధనాత్మక కృషి మాత్రమే కాదు, అప్పటి దృశ్యాలను సాక్ష్యాధారాలతో సహా మనముందు అసక్తికరంగా అవిష్కరించే సజీవ చారిత్రాత్మక కథనం .

తిరగబడ్డ తెలంగాణ పుస్తకంపై ఆంధ్ర జ్యోతిలో 23-6-2008 నాడు వెలువడిన సమీక్ష:

అపూర్వ ప్రజాపోరాటానికి సజీవచిత్రం

కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైనప్పటికీ సంప్రదాయ కమ్యూనిస్టు రైతాంగ పోరాటాలకు భిన్నంగా జరగడం వల్లే తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి ప్రపంచ రైతాంగ పోరాట చరిత్రలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. సంప్రదాయ కమ్యూనిస్టులు భావించినట్టుగా ఈ ఉద్యమం మధ్యతరగతి రైతాంగం లేక పట్టణశ్రామికవర్గం అధిపత్యంలో జరగలేదు. ఈ వర్గాల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మచ్చుకైనా కనిపించదు. ఇది కేవలం పేదరైతుల, రైతు కూలీల ఉద్యమం. అక్షరం ముక్కరాని పేదరైతుకూలీలు కుల గ్రామ సమాజంలో ఇమిడి వున్న పోరాట సంప్రదాయాన్ని పోరాట పటిమను ఆధునిక రాజకీయ భావ జాలంతో జోడించి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా మహత్తర ఉద్యమాన్ని నిర్మించారు. ఈ కారణంగానే ఈ పోరాటం దేశ విదేశీ పరిశోధకుల, మేధా వుల దృష్టిని ఆకర్షించింది. అయితే వీరి రచనలు ప్రజల పోరాట పటిమను గుర్తించకపోవడమే కాకుండా కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ ఉద్యమం కమ్యూనిస్టు పంథాలో జరగలేదన్న నెపంతో ఇది ఆధునిక రైతాంగ పోరాటమే కాదని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు-ముఖ్యంగా ట్రాట్స్కీ యిస్టులు ఈ పోరాటాన్ని విఫలపోరాటంగా అభివర్ణించారు. ఇంకొంతమంది పరిశోధకులు మరో అడుగు ముందుకువేసి తెలంగాణ అణగారిన కులాలు బానిసత్వానికి అలవాటు పడ్డవారని వారికి పోరాటపటిమ మచ్చుకైనా ఉండ దని తేల్చిచెప్పారు. ఇటువంటి అనేక అభిప్రాయాలకూ వాదనలకూ మంచి సమాధానమే ఇనుకొండ తిరుమలి రచించిన తిరగబడ్డ తెలంగాణ దొరలను దించాం... నిజాంను కూల్చాం చారిత్రక (ఆర్కైవ్స్‌లూ ఉన్నవాటిని) మౌఖిక ఆధారాలతోపాటు స్వీయ అనుభవాలను జోడించి ప్రజలపక్షాన నిలబడి తిరుమలి ఈ పుస్తకాన్ని రాశా రు. ఉత్పత్తికులాలు ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన విషయాన్ని ఆయన బలంగా చెప్పారు. ఉద్యమం మొదటి దశలో (1939-46) గ్రామ సముదాయాల సంబంధాలను పునాదులుగా చేసుకుని పోరా టం చేస్తే రెండవ దశలో (1946-51) కమ్యూనిస్టు భావజాలంతో పోరాటా న్ని నడిపించారు.

మొదటి దశ కేవలం దొరల పెత్తనానికి వ్యతిరేకంగా జరిగిం ది. రెండవ దశ అంటే ఈ ఉద్యమం ఎప్పుడైతే ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయిందో- అప్పుడది నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంది. అనాదినుండి భారతదేశ గ్రామ సమాజంలో బ్రాహ్మణీయ హిందూధర్మంతో పాటు నీతిసూత్రాలు కూడా ఉన్నాయి. గ్రామ సమాజం రోజువారీ వ్యవహారంలో హిందూధర్మం కంటే ఈ నీతిసూ త్రాలే ఎక్కువ పాత్ర పోషించాయి. తిరుమలి ఈ పుస్తకంలో ఉద్యమ నిర్మాణ పునాదులను వివరిస్తూ కుల >గ్రామ సమాజంలో ఉండే సహజ నీతివిలువలు గ్రామ సమా జాన్ని రెండు వర్గాలుగా విభజించిన విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
ఈ నీతి సూత్రాల ఆధారంగానే గ్రామ సమాజం దొరలదోపిడీని అరాచకాలను నీతిలేని చర్యగా దొరలను నీతిలేనివారుగా పరిగణించి వారిని శత్రువర్గంగా ప్రకటించుకుంటుంది. గ్రామ నీతిసూత్రాల న్యాయం ప్రకారం నీతిలేనివారికి గ్రామంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యం నుంచే మొదటిదశలో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్నీ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమా న్నీ అర్థం చేసుకోవలసివుంటుంది. తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం రాకముందే ఇక్కడి ప్రజలు దొరలదోపిడీని పెత్తనాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాదు దొరలకు వ్యతి రేకంగా వీరోచితమైన పోరాటాలను కూడా నడిపించారు. ఈ రకమైన చైతన్యం పోరాట స్ఫూర్తి మనకు సాయుధపోరాట కాలంలోనూ విరమణ తరువాత కాలంలోనూ కూడా కని పిస్తుంది. పోరాటం హోరాహోరీ కొనసాగుతున్న కాలంలో కూడా ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి సంబంధం లేకుండా గ్రామస్థాయిలో అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉత్పత్తి కులాలు కమ్యూనిస్టు భావజాలంవల్లనే చైతన్యం పొంది దొరల దోపిడీ వ్యవస్థను నిజాం రాచరిక వ్యవస్థను అర్థం చేసుకోగలిగారన్న సాయుధపోరాటాన్ని నిర్మించారన్న వాదనలో వాస్తవం లేదని రచయిత ఈ రకమైన విశ్లేషణ ద్వారా తేల్చిచెప్పారు.
నిజాం పాలనని ఒక భూస్వామ్యవ్యవస్థగా బూజుపట్టిన వ్యవస్థగా అభివర్ణించడం పరిపాటి. అయితే వ్యవస్థను ఎవరు బూజుపట్టించారు నిజాం రాజులా వాస్తవా నికి తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ 19వ శతాబ్దం చివరిదశకంలోనే పురుడుపోసుకుంది. అంతకుముందు రాజ్యంలో ఎక్కడా ఈ రకమైన వ్యవస్థ మనకు కనిపించదు. భూమిమీద రాజ్యానికి కానీ శిస్తు వసూలు చేసే అధికారులైన వతన్‌దారులు, జాగీరుదారులు, దేశ్‌ ముఖ్‌లు, దేశ్‌పాండ్యలకు కానీ ఎటువంటి హక్కూ ఉండేది కాదు. అయితే బ్రిటిష్‌ ఇండి యా రైతువారీ విధానం రావడంతో పరిస్థితి తారుమారైంది. వేల సంవత్సరాలుగా భూమి సాగుచేస్తున్నవారు కౌలుదారులుగా రైతుకూలీలుగా మారిపోయారు.

సాంప్రదాయికంగా రెవిన్యూ వసూలు చేస్తున్నవారు అగ్రకుల రైతులు వేల ఎకరాల భూమిని తమ పేర పట్టా చేయించుకొని భూస్వాములుగా అవతారమెత్తారు. వడ్డీవ్యాపారం ధాన్యం కొనుగోలు ద్వారా అక్రమంగా వేల ఎకరాల భూములను సంపాదించుకున్నారు. గ్రామాల్లో దొరలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను నడిపించారు. వారి గడీలు కచేరీలుగా మారాయి. 19వ దశాబ్దంనుంచి దొరల పెత్తనం గ్రామ సమాజంమీద అంచెలంచెలుగా బలపడుతూవచ్చింది. పాత కొత్త రెవిన్యూ గ్రామ అధికారులూ అగ్రకుల రైతులూ భూస్వాములుగా అవతరిం చిన తీరునూ నూతన రెవిన్యూ విధానంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో మారిన దోపిడీ ఉత్పత్తి సంబంధాలనూ రచయిత వివరించారు.
ఈ దొరల దోపిడీ చాలా ఆలస్యంగా నిజాం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఈ దోపిడీని గ్రహించిన నిజాం ప్రభుత్వం మొదట్లో ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరితోనే ఉంది. అంతేకాదు ఉద్యమ కారుల డిమాండ్‌ చాలా న్యాయమైనదిగా భావించింది. కానీ ఎప్పుడైతే ప్రజల ఉద్యమం కమ్యూనిస్టుల ఆధి పత్యంలోకి వెళ్ళిందో అప్పుడు ప్రభుత్వం దానిని రష్యన్‌ బోల్షివిక్‌ ఉద్యమంతో పోల్చుకుని నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వమూ ప్రత్యేక ముస్లిం రాజ్య స్థాపనానినాదంతో ఆవిర్భవించిర రజాకారులూ భూస్వాములకు అండగా నిలచి ఉద్యమ అణచివేతను ఉధృతం చేశారు. దొరల గూండాలు పోలీసులు రజాకార్ల దోపిడీ హింసలు ప్రజలను మరింతగా ఉద్యమంవైపు నడిపించాయే తప్ప నీరసపరచలేకపో యాయి.

రాజ్యహింసను ప్రజలు ప్రతిఘటించిన వివిధ సంఘటనల వివరణ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఉద్యమంలో కీలకపాత్ర వహించిన నాయకుల సామాజికవర్గాన్ని సుందరయ్యగారు తన స్వీయచరిత్రలో అక్కడక్కడ ఉటంకించినప్పటికీ ఉత్పత్తికులాల పాత్రను సమగ్రంగా వివరించలేదు. వడ్డెర లంబాడి చాకలి గొల్లకుర్మలు మొదటగా దొరల దోపిడీకి పెత్తనానికీ వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేసిందీ తదనంతరం సాయుధపోరాట నిర్మాణంలో సంఘం కీలకపాత్ర గురించి ఈ పుస్తకం వివరించింది. దొరల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ను చైతన్యపరచడంలో ఆంధ్ర ప్రజానాట్యమండలి కీలకపాత్ర వహించింది. ఈ మండలి ప్రచార కార్యక్రమాల్లో ఉత్పత్తికులాలే ప్రధాన భూమిక నిర్వహించాయి.
గొల్లసుద్దులు వీర వస్తి, పగటివేషాలు, బుర్రకథ, ఒగ్గుకథ, జానపద పాటలు ఈ ఉద్యమ నిర్మాణంలో ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించాయి. సాధారణంగా సాయుధపోరాటాలు పురుషాధి పత్య స్వభావాన్ని కలిగివుంటాయి. అటువంటి పోరాటంలో కూడా తెలంగాణ స్త్రీలు అనేక దశల్లో వీరోచితమైన పాత్ర నిర్వహించారు. మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో అగ్ర కుల స్త్రీల భూమిక గురించి మనకు కొంత తెలుస్తుంది. కానీ ఉత్పత్తికులాల స్త్రీల పాత్ర ఏ రచనలోనూ మనకు కనిపించదు. ఈ పుస్తకంలో రచయిత ఆ లోటును భర్తీచేసేందుకు ప్రయత్నించారు. ఉత్పత్తికులాల పోరాట పటిమనుఆవేశాన్ని సాయుధపోరాటంగా మలచడంలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధించినా సాయుధదళాల్లో వారి ఆధిపత్యమే నడిచింది. ఉత్పత్తికులాలవారు కార్యకర్తలుగా రెండవ శ్రేణి నాయకులుగా మాత్రమే రాణించగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం మొత్తం తెలంగాణ రెడ్ల , ఆంధ్ర కమ్మల ఆధిపత్యంలోకి వెళ్ళిపో యింది. ముఖ్యంగా కదంపట్టించే కార్యక్రమంలోనూ భూ పంపిణీ విషయంలోనూ ఈ కులస్తుల పక్షపాత బుద్ధి అనేక సందర్భాల్లో బైటపడింది. భూ పంపిణీ విషయంలో కేవలం దేశ్‌ముఖ్‌ జాగీరుదారుల భూములనే పంపిణీ చేసేవారు. అనేకమంది రెడ్డి, వెలమ భూస్వాముల భూములను పార్టీ సానుభూతిపరులనే నెపంతో పంచకుండా వదిలి పెట్టేవారు. సైనికచర్య తరువాత కమ్మ, భూస్వాములు మా రాజ్యం వచ్చేసిందం టూ పంపిణీ చేసిన భూములను రైతులనుండి తిరిగిలాగేసుకుంటున్నప్పుడు పార్టీ మౌనం గా ఉండిపోయింది. సాయుధ ఉద్యమ విరమణలోనూ విశాలాంధ్ర ఉద్యమం చేపట్టడం లోనూ రెడ్డి, కమ్మ కులస్తుల ఎజెండా దాగి ఉందన్న విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

తిరగబడ్డ తెలంగాణ
దొరలను దించాం నిజాంను కూల్చాం
రచయిత డా. ఇనుకొండ తిరుమలి
తెలుగు అనువాదం ప్రభాకర్‌ మందార
కాపీ రైట్‌ రచయిత
మూలం ఎగెనెస్ట్‌ దొర అండ్‌ నిజామ్‌ పీపుల్స్‌ ముమెంట్‌ ఇన్‌ తెలంగాణ
ముద్రణ : జనవరి 2008
266 పేజీలు, వెల : రూ. 80/-

3 comments:

  1. టపా పైన మీ చిరునామ ఇచ్చినచోటేమీ ఫోన్ నెంబరూ,ఇమైల్ ఐడి ఇస్తే అవసరం ఉన్నవారు మిమ్మల్నిసంప్రదించడానికి అవకాశలు మెరుగవుతవి.
    మీ పని వేళలుకూడా తెలియజేయండి.
    ఈ టపా ఒఖ్ఖ భాగ్యనగరనివాసులకి మాత్రమే కాదు.ఇది దక్షిణ ఆఫ్రికాకి, కంబోడియాకి, హైతికి కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా "మీ" పుస్తకాలు చదివేవారున్నారు!

    ReplyDelete
  2. మీ సూచనను అమలుపరిచాం. ధన్యవాదాలు

    ReplyDelete
  3. This book is provides a good picture of the then history. Thank you!

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌