Saturday, June 28, 2008

సవాలక్ష సందేహాలు స్త్రీలు - ఆరోగ్య సమస్యలు


సవాలక్ష సందేహాలు

స్త్రీలు - ఆరోగ్య సమస్యలు

హైదరాబాద్‌ ఉమెన్స్‌ హెల్త్‌ గ్రూప్ ‌

వీణా శతృఘ్న - కె. లలిత - షమా నారంగ్‌ - ఉమా మహేశ్వరి - గీతా రామస్వామి - రామరాజ్యం - సుమతి నాయర్‌

పేజీలు 320- వెల: రూ.200/-

సహజ సిద్ధంగా శరీరంలో వచ్చే మార్పులకు స్త్రీలు కుంచించుకు పోవడం, ప్రకృతి సిద్ధంగా సంభవించే సంఘటనలపట్ల కుటుంబంలోనూ సమాజంలోనూ సానుభూతి లేకపోవడం, అవమానాలు ఎదుర్కోవడం వంటి సత్యాలను వైద్యపరంగా, నిశితంగా పరిశీలించారు ఈ గ్రంథకర్తలు.

అధునిక వైద్య విధానాల్లోనూ, సాంప్రదాయక వైద్య పద్ధతుల్లోనూ వున్న మంచి చెడులను నిష్పక్షపాతంగా వీరు చేసిన విశ్లేషణ సామాన్య స్త్రీలకే గాక, వైద్య విద్యార్థులకూ, నర్సులకూ, డాక్టర్లకూ, అందరికీ మార్గదర్శకం. అత్యంతావశ్యకం.

- అబ్బూరి ఛాయాదేవి

సులభమైన, స్పష్టమైన పద్ధతిలో స్త్రీలు సాధారణంగానూ, ముఖ్యంగా పిల్లల్ని కనే వయసులోనూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్ని ఎత్తిచూపుతుంది ఈ పుస్తకం. పిల్లలు కలగకపోవడం, బహిష్టును అదుపులో వుంచటం, నడుం నొప్పి, కాన్సర్‌ల వంటి సమస్యల్ని వివరంగా చర్చిస్తుంది. ఈ ప్రయత్నంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విమర్శనాత్మకమైన దృక్పథంలో స్త్రీలకు అందిస్తుందనటంలో సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా అటు వైద్య వ్యవస్థలో, ఇటు సమాజంలో స్త్రీల ఆరోగ్యం పట్ల వున్న దృక్పథాల్ని, సిద్ధాంత అవగాహనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది.

- డా. సుగుణా రామ్మోహన్‌

ఈ పుస్తకం గురించి

1975 అత్యవసర పరిస్థితి తర్వాత దేశమంతటా చెలరేగిన ఉద్యమాలతో, అప్పటివరకు ప్రశ్నించకూడని విజ్ఞానరంగాలు కొన్నింటిని మొదటిసారి ప్రశ్నించే అవకాశం కలిగింది. సమాజంలో స్త్రీల గురించి వున్న అవగాహనలు, సిద్ధాంతాల్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నించే అవకాశం కూడా అప్పుడే కలిగింది. ... ... .

ఎమర్జెన్సీ తర్వాత వాతావరణంలో హైదరాబాద్‌లో ఏర్పడిన సంస్థలు - స్త్రీ శక్తి సంఘటన, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌.బి.టి.)లు. స్త్రీ శక్తి సంఘటన స్త్రీవాద సంఘం అయితే హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ సాంఘిక లక్ష్యాలతో అభ్యుదయ రచనల్ని తెలుగు భాషలో అందించేందుకు ఏర్పడిన సంస్థ. స్త్రీ శక్తి సంఘటన నుంచి ఆరుగురు, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నుంచి ఒకరు కలిసి స్త్రీలు - ఆరోగ్య సమస్యలు అన్న అంశంపై పుస్తకాని రాయాలనే లక్ష్యంతో ఒక గ్రూప్‌గా ఏర్పడడం జరిగింది. ... ...

స్త్రీలను రోజువారీ జీవితంలో భాధించే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకునే అవకాశం లేక, ఒకవేళ డాక్టర్లను సంప్రదించినా ప్రశ్నలడిగే ధైర్యం చాలక, ఎన్నో సందర్భాలలో డాక్టర్లు తీసి పారేసినట్టు మాట్లాడే ధోరణులను, అవనామాలను దిగమింగి వైద్య వ్యవస్థలోనే ఎక్కడో ఏదో లోపం వుందనే అసగాహనను కడుపులో దాచుకునే స్త్రీల సమస్యల్ని వారు చేసే చాకిరీని, వారి బాధను అర్థం చేసుకోలేని, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైన చేయని డాక్టర్లు, వాళ్ల విదిలింపులు స్త్రీల నిత్య అనుభవాలుగా చర్చకొచ్చాయి. చాలామంది స్త్రీలు వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించకపోవడానికి కారణాలేమిటో పరిశీలనకొచ్చాయి. .... ....

ఈ పుస్తకంలో విస్తృతంగా చర్చించి పొందుపరచిన కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు:

. జననాంగాలు - నిర్మాణం విధులు

. బహిష్టు సమస్యలు

. మెనోపాజ్‌ (ముట్లు ఆగిపోయే దశ)

. రక్తం లేకపోవటం

. రక్తపోటు (బిపి)

. నడుంనొప్పి

. మూత్రాశయపు వ్యాధి

. రొమ్ము సమస్యలు

. గర్భనిరోధం

. గర్భం రావటం, ప్రసవం

. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు

. పిల్లలు పుట్టకపోవటం

. తెల్లబట్ట ఇతర సమస్యలు

. గర్భ సంచి జారడం,

. అధిక స్రావం, అకాల ఋతుస్రావం

. గర్భాశయ ద్వారానికి కాన్సర్‌

. గర్భ సంచిని తీసేయడం
............................................

సవాలక్ష సందేహాలు పుస్తకంలోని బహిష్టు సమస్యల అధ్యాయాన్ని చదివి ప్రజాకవి గద్దర్‌ దానిని పాట రూపంలోకి మార్చారు. ఆ పాటను మా ఆడోళ్ల బతుకులు అనే శీర్షికతో పుస్తకంలో పొందుపరచడం జరిగింది:

మా ఆడోళ్ల బతుకులు

...............పెంక మీద పేలాలురో - మా ఆడోళ్ల బతుకు

...............ముండ్లమీద అరటి ఆకురో - మా ఆడోళ్ల బతుకు

సెప్పుకుంటే సిగ్గు పోతది - సెప్పకుంటే పానం బోతది

సవాలక్ష సవాల్లున్నయ్‌, ఛాతి నిండా బాధలున్నయ్‌

నోరు వుండి మూగ జీవులం - మా ఆడోళ్ల బతుకు

మొగోళ్ల కాళ్ల చెప్పులం - మా ఆడోళ్ల బతుకు

పెద్ద మనిషి ఐన నుండి, పండు ముసలి అయ్యెదాక

ఆట మీద పాట మీద, చూపు మీద రూపు మీద

...............మొగోడు గీసిన గీతరో - మా ఆడోళ్ల బతుకు

...............మా నొసటి మీద కత్తి వాతరో - మా ఆడోళ్ల బతుకు

పుష్పవతి అయిందాని, పూలు బెట్టి పసుపు బూసి

మూలకు కూకుండ బెట్టి, మొఖానికి పర్ద గట్టి

వంటిల్లు, దేవునిల్లు, బాతురూము బయిట గడప

ముట్టయిన ఆడదానివి, ముట్టకనిరి పట్టకనిరి

...............మా యిల్లె మాకు జైలాయెరో - మా ఆడోళ్ల బతుకు

...............ఈసడింపు బతుకులాయెరో - మా ఆడోళ్ల బతుకు

ఉతికీన పాత సీర, లుంగీలు, లంగాలు

మెత్తాని మూట జేసి మానముల్ల వొత్తుకుంటే

నడుముకు చుట్టిన పేల్క, కాటు బడీ కమిలిపాయె

...............తొడలన్నీ పచ్చి పుండురో - మా ఆడోళ్ల బతుకు

...............నడవ బోతె నరకమాయెరో - మా ఆడోళ్ల బతుకు

ముట్టు బట్టలన్నిటిని మల్లెలోలె ఉతుకుంటె

ఎవరి కంట్ల బడతయాని ఎండల ఆరెయ్య కుంటె

లోకానికి తెలియకుండ చీకట్లొ దాసి పెడితె

కంటికి కనబడని పురుగు బట్టలల్లో పుట్టుకొచ్చె

...............చెప్పుకోని రోగమొచ్చెరో - మా ఆడోళ్ల బతుకు

...............అప్పులల్ల మునిగిపోతిమో - మా ఆడోళ్ల బతుకు

మోటు బట్ట దొడ్డు బట్ట తడిపినపుడు తేజుగయ్యి

తొడలల్లో రాసుకోని మండిపోయి పుండయ్యె

ఎవరన్నా సూస్తరాని భయమాయె సిగ్గాయె

...............దురద బెట్టి దుక్కమొచ్చెరో - మా ఆడోళ్ల బతుకు

...............దద్దులొచ్చి దద్దరిల్లెరో - మా ఆడోళ్ల బతుకు

పానం కంటె ఎక్కువాని పైసలు పోతె పోనీ ఆని

దవకానలో వాడె దూది బ్యాండేజు బట్ట తెచ్చి

నెత్తురంత పీల్చె సైజు దూది బిల్ల కత్తిరించి

కదలకుండ ఊడకుండ గుడ్డ తోని కట్టివేస్తే

...............రోజు కూలి దూదికాయెరో - మా ఆడోళ్ల బతుకు

...............కూలి ఏదాని మొగడు దన్నెరో - మా ఆడోళ్ల బతుకు

శానిట్రీ నాప్కిన్సు శాన మంచివాని చెప్తె

రక్తాన్ని పీల్చుకునె గుణం దానికున్నదంటె

బెల్టులాగ నడుముకు బెస్టుగా వుంటదంటె

మందుల దుకానమెల్లి మెల్లంగ ధర అడిగితె

...............పెద్ద పెద్ద యాపారులకు - మా ఆడోళ్ల బతుకు

...............మా ముట్టు బట్ట పెట్టుబడిరో - మా ఆడోళ్ల బతుకు

బహిష్టు బాధ సూడు బతికి సచ్చినట్లయితది

పొత్తి కడుపు సూదులతో పొడిచి పొడిచి పెకిలిస్తది

...............నేల మీద చేప పిల్లలా - మా ఆడోళ్ల బతుకు

...............గిల గిల గిల కొట్టుకుంటమో - మా ఆడోళ్ల బతుకు

వొంగి నాటేసెటప్పుడు ఒకవేళ ముట్టయితే

బస్సులెక్కి పోయెటపుడు పుస్కుమాని ముట్టయితే

పది మంది మొగోళ్ల నడుమ ఫ్యాక్టరీలో ముట్టయితే

బాతురూముల్ల కెల్లి బట్టలు మార్చుకుందమంటె

బాతురూంకు తలుపులేదు తలుపుకు గొల్లాము లేదు

ఏమి చేద్దు ఎందు బోదు బుర్రంతా టెన్షనాయె

...............పిచ్చి లేసినట్టయితది - మా ఆడోళ్ల బతుకు

...............ఇగ సచ్చిపోయినట్టయితది - మా ఆడోళ్ల బతుకు

ముట్టు రక్తములోనె పుడతాడు ముద్దు బిడ్డ

బిడ్డను ముద్దాడతారు ఆడదాన్ని అసంటంటరు

.................మా ముట్టులోనె బుట్టినోడురో - మా ఆడోళ్ల బతుకు

.................మము కాకులోలె పొడవ బట్టెరో - మా ఆడోళ్ల బతుకు

- గద్దర్‌

.....................................................................................................................................5 comments:

 1. Excellent post, my friend, excellent!
  Have a nice weekend.

  ReplyDelete
 2. టీవీలో ఇటువంటి ప్రకటనలే వస్తుంటే నాకైతే సిగ్గుగా ఉంటుంది.కొన్ని బాధలు చెప్పుకుంటే బాగుండదు.అన్నీ వ్యాపారంగా చూడకుండా వుండలేరా?

  ReplyDelete
 3. good post
  but DISGUSTINGLY PATHETIC
  because we the men, are eternally fearful of menstrual blood.

  ReplyDelete
 4. గద్దర్ ఇలా ప్రతి దాని మీదా పాట రాసి తీరాలా?

  ReplyDelete
 5. రేపు ఆర్డర్లు వచ్చింతరువాత అక్కడికి ఇక్కడికి పరుగెత్తకుండా, ఇప్పుడే, విదేశాలకు ఎలా పంపాలన్నది కూడ చూసుకోండి.
  పుస్తకాలు పంపండం సులువే, మరి మీకు డబ్బులు అందడం ఎలా? అలాగే మీకు డబ్బులు అందించడం ఎలా?
  దానికి మార్గాలు ఆలోచించారా?

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌