
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
సవాలక్ష సందేహాలు
స్త్రీలు - ఆరోగ్య సమస్యలు
హైదరాబాద్ ఉమెన్స్ హెల్త్ గ్రూప్
పేజీలు 320- వెల: రూ.200/-
సహజ సిద్ధంగా శరీరంలో వచ్చే మార్పులకు స్త్రీలు కుంచించుకు పోవడం, ప్రకృతి సిద్ధంగా సంభవించే సంఘటనలపట్ల కుటుంబంలోనూ సమాజంలోనూ సానుభూతి లేకపోవడం, అవమానాలు ఎదుర్కోవడం వంటి సత్యాలను వైద్యపరంగా, నిశితంగా పరిశీలించారు ఈ గ్రంథకర్తలు.
అధునిక వైద్య విధానాల్లోనూ, సాంప్రదాయక వైద్య పద్ధతుల్లోనూ వున్న మంచి చెడులను నిష్పక్షపాతంగా వీరు చేసిన విశ్లేషణ సామాన్య స్త్రీలకే గాక, వైద్య విద్యార్థులకూ, నర్సులకూ, డాక్టర్లకూ, అందరికీ మార్గదర్శకం. అత్యంతావశ్యకం.
- అబ్బూరి ఛాయాదేవి
సులభమైన, స్పష్టమైన పద్ధతిలో స్త్రీలు సాధారణంగానూ, ముఖ్యంగా పిల్లల్ని కనే వయసులోనూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్ని ఎత్తిచూపుతుంది ఈ పుస్తకం. పిల్లలు కలగకపోవడం, బహిష్టును అదుపులో వుంచటం, నడుం నొప్పి, కాన్సర్‌ల వంటి సమస్యల్ని వివరంగా చర్చిస్తుంది. ఈ ప్రయత్నంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విమర్శనాత్మకమైన దృక్పథంలో స్త్రీలకు అందిస్తుందనటంలో సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా అటు వైద్య వ్యవస్థలో, ఇటు సమాజంలో స్త్రీల ఆరోగ్యం పట్ల వున్న దృక్పథాల్ని, సిద్ధాంత అవగాహనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది.
- డా. సుగుణా రామ్మోహన్
ఈ పుస్తకం గురించి
ఎమర్జెన్సీ తర్వాత వాతావరణంలో హైదరాబాద్‌లో ఏర్పడిన సంస్థలు - స్త్రీ శక్తి సంఘటన, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.)లు. స్త్రీ శక్తి సంఘటన స్త్రీవాద సంఘం అయితే హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ సాంఘిక లక్ష్యాలతో అభ్యుదయ రచనల్ని తెలుగు భాషలో అందించేందుకు ఏర్పడిన సంస్థ. స్త్రీ శక్తి సంఘటన నుంచి ఆరుగురు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి ఒకరు కలిసి స్త్రీలు - ఆరోగ్య సమస్యలు అన్న అంశంపై పుస్తకాని రాయాలనే లక్ష్యంతో ఒక గ్రూప్‌గా ఏర్పడడం జరిగింది. ... ...
స్త్రీలను రోజువారీ జీవితంలో భాధించే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకునే అవకాశం లేక, ఒకవేళ డాక్టర్లను సంప్రదించినా ప్రశ్నలడిగే ధైర్యం చాలక, ఎన్నో సందర్భాలలో డాక్టర్లు తీసి పారేసినట్టు మాట్లాడే ధోరణులను, అవనామాలను దిగమింగి వైద్య వ్యవస్థలోనే ఎక్కడో ఏదో లోపం వుందనే అసగాహనను కడుపులో దాచుకునే స్త్రీల సమస్యల్ని వారు చేసే చాకిరీని, వారి బాధను అర్థం చేసుకోలేని, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైన చేయని డాక్టర్లు, వాళ్ల విదిలింపులు స్త్రీల నిత్య అనుభవాలుగా చర్చకొచ్చాయి. చాలామంది స్త్రీలు వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించకపోవడానికి కారణాలేమిటో పరిశీలనకొచ్చాయి. .... ....
ఈ పుస్తకంలో విస్తృతంగా చర్చించి పొందుపరచిన కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు:
. జననాంగాలు - నిర్మాణం విధులు
. బహిష్టు సమస్యలు
. మెనోపాజ్ (ముట్లు ఆగిపోయే దశ)
. రక్తం లేకపోవటం
. రక్తపోటు (బిపి)
. నడుంనొప్పి
. మూత్రాశయపు వ్యాధి
. రొమ్ము సమస్యలు
. గర్భనిరోధం
. గర్భం రావటం, ప్రసవం
. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు
. పిల్లలు పుట్టకపోవటం
. తెల్లబట్ట ఇతర సమస్యలు
. గర్భ సంచి జారడం,
. అధిక స్రావం, అకాల ఋతుస్రావం
. గర్భాశయ ద్వారానికి కాన్సర్
సవాలక్ష సందేహాలు పుస్తకంలోని బహిష్టు సమస్యల అధ్యాయాన్ని చదివి ప్రజాకవి గద్దర్ దానిని పాట రూపంలోకి మార్చారు. ఆ పాటను మా ఆడోళ్ల బతుకులు అనే శీర్షికతో పుస్తకంలో పొందుపరచడం జరిగింది:
మా ఆడోళ్ల బతుకులు
...............పెంక మీద పేలాలురో - మా ఆడోళ్ల బతుకు
...............ముండ్లమీద అరటి ఆకురో - మా ఆడోళ్ల బతుకు
సెప్పుకుంటే సిగ్గు పోతది - సెప్పకుంటే పానం బోతది
సవాలక్ష సవాల్లున్నయ్, ఛాతి నిండా బాధలున్నయ్
నోరు వుండి మూగ జీవులం - మా ఆడోళ్ల బతుకు
మొగోళ్ల కాళ్ల చెప్పులం - మా ఆడోళ్ల బతుకు
పెద్ద మనిషి ఐన నుండి, పండు ముసలి అయ్యెదాక
ఆట మీద పాట మీద, చూపు మీద రూపు మీద
...............మొగోడు గీసిన గీతరో - మా ఆడోళ్ల బతుకు
...............మా నొసటి మీద కత్తి వాతరో - మా ఆడోళ్ల బతుకు
పుష్పవతి అయిందాని, పూలు బెట్టి పసుపు బూసి
మూలకు కూకుండ బెట్టి, మొఖానికి పర్ద గట్టి
వంటిల్లు, దేవునిల్లు, బాతురూము బయిట గడప
ముట్టయిన ఆడదానివి, ముట్టకనిరి పట్టకనిరి
...............మా యిల్లె మాకు జైలాయెరో - మా ఆడోళ్ల బతుకు
...............ఈసడింపు బతుకులాయెరో - మా ఆడోళ్ల బతుకు
ఉతికీన పాత సీర, లుంగీలు, లంగాలు
మెత్తాని మూట జేసి మానముల్ల వొత్తుకుంటే
నడుముకు చుట్టిన పేల్క, కాటు బడీ కమిలిపాయె
...............తొడలన్నీ పచ్చి పుండురో - మా ఆడోళ్ల బతుకు
...............నడవ బోతె నరకమాయెరో - మా ఆడోళ్ల బతుకు
ముట్టు బట్టలన్నిటిని మల్లెలోలె ఉతుకుంటె
ఎవరి కంట్ల బడతయాని ఎండల ఆరెయ్య కుంటె
లోకానికి తెలియకుండ చీకట్లొ దాసి పెడితె
కంటికి కనబడని పురుగు బట్టలల్లో పుట్టుకొచ్చె
...............చెప్పుకోని రోగమొచ్చెరో - మా ఆడోళ్ల బతుకు
...............అప్పులల్ల మునిగిపోతిమో - మా ఆడోళ్ల బతుకు
మోటు బట్ట దొడ్డు బట్ట తడిపినపుడు తేజుగయ్యి
తొడలల్లో రాసుకోని మండిపోయి పుండయ్యె
ఎవరన్నా సూస్తరాని భయమాయె సిగ్గాయె
...............దురద బెట్టి దుక్కమొచ్చెరో - మా ఆడోళ్ల బతుకు
...............దద్దులొచ్చి దద్దరిల్లెరో - మా ఆడోళ్ల బతుకు
పానం కంటె ఎక్కువాని పైసలు పోతె పోనీ ఆని
దవకానలో వాడె దూది బ్యాండేజు బట్ట తెచ్చి
నెత్తురంత పీల్చె సైజు దూది బిల్ల కత్తిరించి
కదలకుండ ఊడకుండ గుడ్డ తోని కట్టివేస్తే
...............రోజు కూలి దూదికాయెరో - మా ఆడోళ్ల బతుకు
...............కూలి ఏదాని మొగడు దన్నెరో - మా ఆడోళ్ల బతుకు
శానిట్రీ నాప్కిన్సు శాన మంచివాని చెప్తె
రక్తాన్ని పీల్చుకునె గుణం దానికున్నదంటె
బెల్టులాగ నడుముకు బెస్టుగా వుంటదంటె
మందుల దుకానమెల్లి మెల్లంగ ధర అడిగితె
...............పెద్ద పెద్ద యాపారులకు - మా ఆడోళ్ల బతుకు
...............మా ముట్టు బట్ట పెట్టుబడిరో - మా ఆడోళ్ల బతుకు
బహిష్టు బాధ సూడు బతికి సచ్చినట్లయితది
పొత్తి కడుపు సూదులతో పొడిచి పొడిచి పెకిలిస్తది
...............నేల మీద చేప పిల్లలా - మా ఆడోళ్ల బతుకు
...............గిల గిల గిల కొట్టుకుంటమో - మా ఆడోళ్ల బతుకు
వొంగి నాటేసెటప్పుడు ఒకవేళ ముట్టయితే
బస్సులెక్కి పోయెటపుడు పుస్కుమాని ముట్టయితే
పది మంది మొగోళ్ల నడుమ ఫ్యాక్టరీలో ముట్టయితే
బాతురూముల్ల కెల్లి బట్టలు మార్చుకుందమంటె
బాతురూంకు తలుపులేదు తలుపుకు గొల్లాము లేదు
ఏమి చేద్దు ఎందు బోదు బుర్రంతా టెన్షనాయె
...............పిచ్చి లేసినట్టయితది - మా ఆడోళ్ల బతుకు
...............ఇగ సచ్చిపోయినట్టయితది - మా ఆడోళ్ల బతుకు
ముట్టు రక్తములోనె పుడతాడు ముద్దు బిడ్డ
బిడ్డను ముద్దాడతారు ఆడదాన్ని అసంటంటరు
.................మా ముట్టులోనె బుట్టినోడురో - మా ఆడోళ్ల బతుకు
.................మము కాకులోలె పొడవ బట్టెరో - మా ఆడోళ్ల బతుకు
అసుర సంధ్య
మాల్కం ఎక్స్ ఆత్మకథ
ఆంగ్ల మూలం: The Autobiography of Malcolm X with the assistance of Alex Haley, Penguin Books, 1968.
తెలుగు అనువాదం: యాజ్ఞి
పేజీలు: 110 వెల: 40/-
నిజమైన ఇస్లాంను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయలేకపోవటం తూర్పు దేశాల వైఫల్యం. దీనివల్ల మతాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు పనులు చేసేవాళ్లు మా నల్లజాతి ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం ఏర్పడింది
- మాల్కం ఎక్స్
ఈ ఆత్మకథ ముద్రించటానికి ఇచ్చిన ఒప్పంద పత్రంపై సంతకం చేసిన తర్వాత, మాల్కం ఎక్స్ నా వంక కర్కశంగా చూసి నాక్కావలసింది రచయిత వ్యాఖ్యాత కాదు అన్నాడు. అట్లా వుండటానికే ప్రయత్నించాను. ఏమైనా, ఇంతటి విద్యుత్తేజం కలిగిన వ్యక్తిత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అతను చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకున్నాను. చరిత్రకారులు రాయాల్సిన తర్వాతి అధ్యాయంలోకి అతను అట్లా వెళ్లిపోయినట్టే నా మనసుకింకా అనిపిస్తోంది.
అమెరికన్ శిలువెక్కిన ఆఫ్రికన్ తార
ఇది అమెరికన్ నల్లముస్లిం జాతీయోద్యమనాయకుడైన మాల్కం ఎక్స్ ఆత్మకథ. సుప్రసిద్ధ నవల రూట్స్ (దీనిని ఏడుతరాలు పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో వెలువరించింది) రాసిన అ లెక్స్ హేలీ తనకు మాల్కం ఎక్స్ చెప్పినట్టు ఈ అత్మకథకు అక్షర రూపమిచ్చాడు.
అమెరికా తీర రక్షక దళంలో ఇరవై ఏళ్లు పనిచేసిన తర్వాత హేలీ, లాస్ వేగాస్‌లో జర్నలిస్టుగా స్థిరపడ్డాడు. అక్కడ నేషన్ ఆఫ్ ఇస్లాం గురించి విని హార్లిమ్ (న్యూయార్క్) కు వచ్చాడు. ప్లేబాయ్ పత్రిక తరఫున ఈ రచన పూర్తి చేయటానికి ఆయనకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. దానిక్కారణం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే మాల్కం ఎక్స్ జీవితశైలి.
నేషన్ ఆఫ్ ఇస్లాం నాయకుడు ఎలైజా మహమ్మద్ తర్వాతి స్థానంలో వుండే వ్యక్తిగా మాల్కం ఎక్స్ క్షణం తీరికలేని జీవితం గడిపాడు. పొద్దున నిద్రలేచింది మొదలు, పడుకొనే వరకూ తెల్లవాడి మీద నిప్పులు కక్కుతూ, ఒక్క అమెరికాలోనే కాకుండా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలన్నీ సుడిగాలిలా తిరిగాడు. నల్లవాళ్లను ముస్లింలుగా మార్చటం కోసం కాలాన్ని తన ఊపిరిగా చేసుకొని బతికాడు. 1950లో ఒక కార్యకర్తగా సంస్థలో చేరి చాలా కొద్దికాలానికే నాయకుడిగా ఎదిగాడు.
1963లో నేషన్ ఆఫ్ ఇస్లాం నాయకుడు ఎలైజా మహమ్మద్ తన అనైతిక ప్రవర్తనను మాల్కం ప్రశ్నించాడనే కోపంతో, రోజు రోజుకూ అమెరికాలోని నల్లవాళ్లలో ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి అసూయతో, భవిష్యత్తులో తన స్థానానికే ముప్పు వస్తుందన్న భయంతో కుట్రపన్ని ఆయన్ను సంస్థ నుంచి బహిష్కరించాడు. అంతటతో ఊరుకోకుండా మాల్కం ఎక్స్‌ను చంపేయమని తన సంస్థలోని ముస్లింలను ఆదేశించాడు.
తన ఆలోచనలతో, ఆవయాలతో, ప్రసంగాలతో అప్పటికే తెల్ల శత్రువులను సంపాదించుకున్న ఆయనకు తన సహచరులు కూడా బద్ధ శత్రువులు కావటం బాధాకరం. నేషన్ ఆఫ్ ఇస్లాం నుండి బైటికొచ్చిన తర్వాత హార్లెమ్ మధ్యలో కొత్త మసీదును స్థాపించి మక్కా యాత్రకు పోయాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్స్ యూనిటీ అనే కొత్త సంస్థను స్థాపించాడు. 1964లో పరిస్థితి మరింతగా విషమించింది. నల్ల ముస్లింలు మాల్కం ప్రతి కదలికనూ నీడలా వెంటాడారు. ఏ క్షణమైనా ప్రాణంపోయే ప్రాణంపోయే పరిస్థితుల్లో అ లెక్స్ హేలీ ఈ ఆత్మకథ రెండో భాగానికి సంబంధించిన నోట్స్ రాసుకున్నాడు. తన ఇంటిలో జరిగిన బాంబుపేలుడు నుండి భార్యా బిడ్డలతో సహా బైటపడ్డ మాల్కం ఎక్స్‌ను 1965 ఫిబ్రవరి 21న హార్లెమ్‌లోని అడూబన్ బాల్ రూంలో ప్రసంగిస్తుండగా నేషన్ ఆఫ్ ఇస్లాం సభ్యులు అతి దగ్గర నుండి పదిహేను రౌండ్లు కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు తెల్లవాళ్లు పోలీసులు నిశ్వబ్దంగా సహకరించారు. ఇది అ ల్లా విధించిన శిక్ష అని ఎలైజా మహమ్మద్ తన నేరేన్ని సమర్థించుకున్నాడు.
ఇంగ్లీషులో 1965లో అచ్చయిన ఈ ఆత్మకథ ఇంతకాలం తర్వాత తెలుగులో రావటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అసాధారణమైన నాయకత్వ లక్షణాలున్న మాల్కం ఎక్స్ అసలు ఇక్కడి మేధావుల దృష్టి నుండి ఎ లా తప్పిపోయాడు? మార్టిన్ లూథర్ కింగ్‌తో పోలిస్తే ఈయన ఆవేశపరుడు కావచ్చు. కానీ ఒక ప్రజా నాయకుడిగా ఈయన జీవితంలో ఇక్కడి దళితులకూ, ముస్లింలకూ ఉపయోగపడే విషయాలు ఎన్నో వున్నాయి.మనకు డాక్టర్ లేని చోట
ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
ఎ అగస్ట్ బర్న్స రాని లోవిచ్ జేన్ మాక్స్ వెల్ క్యాథరీన్ షాపిరో
తెలుగు అనువాదం : డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి
ఆంగ్ల మూలం: వేర్ వుమెన్ హావ్ నో డాక్టర్, హెస్పెరియన్ ఫౌండేషన్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.
584.పేజీలు
సాదా ప్రతి: రూ.220/-
మేలుప్రతి బౌండ్ : రూ.300/-
ప్రపంచమంతటా కోట్లాది మంది స్త్రీలు గ్రామాలలో, పట్టణాలలో డాక్టర్ లేని ప్రదేశాల్లో, ఆరోగ్య సంరక్షణను పొందే స్థోమత లేని పరిస్థితులలో జీవిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణకు అవకాశాలు లేక, అందుకు ఉపయోగపడే సమాచారం అందుబాటులో లేక ఎందరో స్త్రీలు అనేక బాధలకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు.
మనకు డాక్టర్ లేని చోట ఇటు వైద్యపరమైన స్వయం సహాయక సమాచారాన్ని అందించడంతో పాటు అటు స్త్రీల ఆరోగ్య సంరక్షణని దెబ్బతీస్తున్న బీదరికం, పక్షపాతవైఖరి, సాంస్కృతికపరమైన విశ్వాసాలు మొదలైన వాటి గురించి అవగాహనను కూడా కలిగిస్తుంది. ముఫ్ఫైకి పైగా దేశాలలోని వివిధ సామాజిక సంస్థలు, వైద్య నిపుణులు రూపొందించిన పుస్తకమిది. అందువల్ల అనేక స్త్రీల ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకునేందుకు, చికిత్స చేసేందుకు, నివారించేందుకు ప్రతి ఒక్కరికీ ఇది తోడ్పడుతుంది.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తేట తెలుగులో, సులువైన పదజాలంతో .... కి పైగా చిత్రాలతో, .... పేజీలతో, వన్ ఫోర్త్ క్రౌన్ సైజులో ఆకర్షణీయమైన, అత్యాధునికమైన ముద్రణతో వెలువరించింది. వైద్యుడు లేని చోటను సరళమైన రీతిలో సమర్థవంతంగా అనువదించిన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిగారే ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అనుకూలంగా ఎడిట్ చేసి అనువదించారు.
ఇందులోని కొన్ని శీర్షికలు:
. మన శరీరాల గురించి అర్థం చేసుకోవడం.
. బాలికలను వ్యాకుల పరిచే ఆరోగ్య సమస్యలు.
. గర్భం మరియు ప్రసవం
. తల్లిపాలు
. వయసు ముదరడం, మెనోపాజ్
. లైంగిక ఆరోగ్యం
. కుటుంబ నియంత్రణ
. పిల్లలు పుట్టకపోవటం (ఇన్‌ఫెర్టిలిటీ)
. గర్భస్రావం దుష్పరిణామాలు
. అంగవైకల్యం వున్న స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు.
. సుఖవ్యాధులు, జననాంగాలకు సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లు
. హెచ్‌ఐవి ఎయిడ్స్
. మానభంగాలు లైంగిక దాడులు
. సెక్స్ వర్కర్లు
. క్యాన్స్‌ర్ మరియు కణితులు, క్షయ ఇతర వ్యాధులు
. మానసిక ఆరోగ్యం
. స్త్రీల ఆరోగ్యంలో మందుల ఉపయోగం
. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలు
. కొన్ని మందుల జాబితా.
హెచ్‌ఐవి ఆరోగ్యం మనమూ మన సమాజం
తల్లి దండ్రుల
తలనొప్పి
గిజుభాయి
తెలుగు అనువాదం: పోలు శేషగిరిరావు
పేజీలు 100 - వెల: రూ.18
పిల్లలను పెంచడం ఒక కళ. అది తలనొప్పి కానే కాదు.
పిలలతో కలిసి ఎదగడంలో ఆనందం వుంది.
జీవిత సార్థకత వుంది.
పిల్లలను సరిదిద్దాలంటే ముందుగా వాళ్ల తల్లి దండ్రుల్ని
దృష్టిలో వుంచుకోవాలి.
శ్రీగిజుభాయి పిల్లలన్ని పెంచే తల్లిదండ్రుల్ని ఇదెక్కడి తలనొప్పి
అనుకోవద్దంటున్నారు.
ఈసఫ్ కథలు, పంచతంత్రం, హితోపదేశాలతో పోల్చ దగిన
కథల సమాహారమే ఇదెక్కడి తలనొప్పి.
సరళ సుందరమైన శైలిలో గిజూభాయి ఈ పుస్తకం చదివినవారి
మనస్సుపై చెరిగిపోని ముద్ర వేస్తారు.
ఈ కథలు కొత్తవి కావు.
ఇవి ఇంటింటి కథలు, ప్రతి ఇంటి కథలు.
చదువుతున్నప్పుడు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి.
నిజమే సుమా అనిపిస్తాయి.
పిల్లలతో చేయించతగిన పనులూ,
చేయించకూడని పనులూ, పిల్లల భవిష్యత్తు గురించిన
ఉచితమైన నిర్ణయిలూ, అనుచితమైన నిర్ణయాలనూ
ఈ కథలు చక్కగా బోధిస్తాయి.
పిల్లల్ని అర్థం చేసుకోవటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే.
సిద్ధాంతాలూ, తాత్విక చర్చలతో తలనొప్పి కలిగించకుండా
ఆహ్లాదకరమైన రీతిలో చిన్న చిన్న కథలలో జీవిత సత్యాలను
అలోకగా అందిస్తుంది యీ పుస్తకం.