Tuesday, September 15, 2015

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

ఆధునిక సమాజంలో సమస్యలెన్నో ఉండగా పురాణ కథల గురించి ఇంకా రాయ వలసిన అవసరం ఏమిటీ అని చాలామంది అనుకోవచ్చు. స్వశక్తినీ స్వయంకృషినీ పక్కకు పెట్టి దేవుళ్ళను మొక్కుకోవటాలూ దేవుళ్ళమీద ఆధారపడటాలూ రోజురోజుకూ ఎక్కువవటం గమనించాక మహాత్మా జోతిరావ్‌ ఫూలే (1827-1890), డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ (1891- 1956), శ్రీ మాదరి భాగ్యరెడ్డి వర్మ (1888-1939) గార్ల భావజాలాన్ని వర్తమాన సమాజానికి అందించవలసిన అవసరం ఉన్నదనిపించింది.

    భారతదేశంలో మతమే ప్రజల జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నది. ముఖ్యంగా కింది కులాల ప్రజలకు పురాణ పాత్రలు, రామాయణ, మహాభారతాలలోని పాత్రలూ ఆదర్శం. ఆ పాత్రల గురించి వారికి తెలియజెప్పవలసి ఉంది.

    శూద్ర కులాలనూ స్త్రీలనూ విద్యకు దూరం పెట్టినప్పటికీ పురాణాలలోనివిగా విన్న విషయాలను వారే బలంగా నమ్ముతున్నారు. ఆచరణలో పెడుతున్నారు. వాస్తవ విషయాలను స్వయంగా చదవకపోవడం వల్లనూ పురాణాలను ప్రశ్నించకూడదనే ఆంక్షలవల్లనూ ఈ పరిస్థితి ఏర్పడింది. పురాణాలలోని సంఘటనలనూ వాటి పూర్వాపరాలనూ తార్కికంగా పరిశీలించిన మహాత్మా జోతిరావ్‌ పూలే అసుర చక్రవర్తులను స్థానికులుగా పరిపాలనా దక్షులుగా, ధర్మ ప్రవర్తకులుగా, ప్రజలకు సమన్యాయం అందించిన మానవతావాదులుగా గుర్తించారు. పురాణాల పేరిట, ధర్మశాస్త్రాల పేరిట, ప్రజలను - ముఖ్యంగా రైతులనూ కింది వర్గాల వారినీ దోచుకుంటున్న పురోహిత వ్యవస్థను ప్రశ్నించారు. తాను కనుగొన్న వాస్తవాలను  రచనల ద్వారా, రాత్రి పాఠశాలల ద్వారా, దృశ్య కళారూపాల ద్వారా ప్రజలలో ప్రచారం చేశారు.

    జోతిరావ్‌ పూలే ఆలోచనా ధారను డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ మరింత ముందుకు తీసుకువెళ్ళారు. వైదిక మతం గురించీ వర్ణ ధర్మాల గురించీ, రాముని, కృష్ణుని రహస్యాల గురించీ చర్చించారు. ఎవరైతే మన స్థానిక వీరులైన అసురులను తుదముట్టించారో వారినే మనం పూజించటం తగనిపని అని భాగ్యరెడ్డి వర్మ చెప్పారు. ఆర్య - ఆర్యేతర ఘర్షణలలోని వాస్తవాలను చిన్న చిన్న నాటకాలుగా ప్రదర్శింపజేసి ప్రజలను చైతన్య పరచారు.

    వివేకానందుడు (1863-1902) తన చివరి రోజులలో మత సంస్కృతిలోని దోషాలను గురించి ఆందోళనపడ్డాడు. ''మతంలో ఏమీ దోషంలేదు. జనపీడన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టిన కపట మతాచార్యులదే దోషం'' అన్నాడు. వేదాలు, రామాయణ, మహాభారతాలు, అష్టాదశ పురాణాలు అప్పటప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులను మానవ మనస్తత్వాలను, ప్రతిబింబిస్తూ ఉన్న రచనలు  వాటిని ఉద్దేశపూర్వకంగా మత ధర్మాలతో ముడిపెట్టడం జరిగింది. అలా ముడిపెట్టడం వర్గ ప్రయోజనాల కోసమే.
.....    ...   ...
శంబూకుని పట్ల అమలు అయిన న్యాయమే దళితులపట్ల అమలవుతూ ఉంది. ఊచకోతలలో దళితులది అసుర వారసత్వమే. రామాయణాన్ని అందులోని విషయాలనూ ప్రామాణికంగా ఇప్పటికీ భావిస్తుంటారు. అందులోని మత ధార్మిక విషయాలను 21వ శతాబ్దపు దృష్టితో కాకపోయినా వాస్తవాల కోసమైనా తెలుసుకోవాలి. పురాణాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ వ్యాసాల అవసరం ఉన్నదని భావిస్తూ నా పరిశీలనను మీ ముందు ఉంచు తున్నాను. వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి గతాన్ని తెలుసుకోవటం అవసరం.

(ముందుమాట నుంచి )


పురాణాలు - మరోచూపు
బి. విజయభారతి

380 పేజీలు ; ధర : రూ. 200/-

అట్టమీద ఫోటో    : హరీష్‌ నాగరాజ్‌,  శ్రీ వినాయక తోలుబొమ్మల బృందం, నిమ్మలకుంట గ్రామం, అనంతపురం జిల్లా వారి నుంచి సేకరణ

మొదటి ముద్రణ : జూలై 2015

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,గుడిమల్కాపూర్‌, 

హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 040 2352 1849

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌