Tuesday, September 15, 2015

19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం లామకాన్ లో "1984 దిల్లీ, గుజరాత్ 2002 - వ్యవస్థల వైఫల్యంపై పంచనామా" పుస్తకావిష్కరణ సభ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురిస్తున్న
"1984 దిల్లీ, గుజరాత్ 2002 - వ్యవస్థల వైఫల్యంపై పంచనామా" తెలుగు పుస్తకానికి
మనోజ్ మిట్టా ప్రత్యేకంగా రాసిన ముందుమాట నుంచి ...
....
1978లో నల్లకుంట పోలీసులు రమీజాబీపై అత్యాచారంచేసి, ఆమె భర్తను కొట్టి చంపిన సందర్భంగా రాజుకున్న గొడవలతో నాకు తొలిసారిగా మత హింస అంటే ఏమిటో తెలిసింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసుల చర్యకు వత్తాసు పలుకుతూ రమీజాబీని వేశ్యగా చిత్రించింది. ఆమె రోడ్డు మీద విటుల కోసం ఎదురుచూసేదని ప్రచారం చేసింది.

అంతవరకు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యం చేసుకుని సాగుతున్న విధ్వంసకాండ ఆ తరువాత మత హింసగా మారింది. ఆ తరువాత జస్టిస్‌ ముక్తదర్‌ కమిషన్‌ పోలీసుల వాదనను ఎంత ఎండగట్టినా 1978నాటి హింసాకాండ హైదరాబాద్‌ అంతటికీ మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున పాత బస్తీకి విస్తరించింది.

మేముండే మలక్‌పేట పాత బస్తీకి దగ్గర కాబట్టి అది తీవ్రస్థాయిలో మత హింస చెలరేగిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది. తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకూ నా చదువు ఈ గొడవలతో తరచూ కుంటుపడుతుండేది. మా ఇరుగు పొరుగు ప్రాంతాలు తరచూ కర్ఫ్యూ నీడలో బిక్కుబిక్కుమంటుండేవి.

హైదరాబాద్‌లో చదువుకుంటున్న రోజుల్లో 1984 ఆగస్ట్‌లో నేను చిట్టచివరి మత హింసాకాండను చూశాను. అత్యంత దారుణంగా జరిగిన మతోన్మాద హింసాకాండల్లో అదొకటి అని చెప్పవచ్చు. అప్పుడు మొత్తం 40 మంది బలయ్యారు.

అయితే, ఆ తరువాత కొద్ది నెలలకే దిల్లీలో చోటు చేసుకున్న దారుణ మారణకాండలో అధికారిక లెక్కల ప్రకారం 2,733 మంది బలైనట్టు తేలింది. హైదరాబాద్‌లోనే కాదు దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ ఆ స్థాయిలో మతోన్మాద హింసకు చెలరేగిన దాఖలాలు లేవు.

దిల్లీలో జరిగిన మారణహోమం భారత దేశ చరిత్రనే ఒక మలుపు తిప్పింది. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో సిక్కు వ్యతిరేక ఉన్మాదాన్ని ఉపయోగించుకుని రాజీవ్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

1984 నాటి రక్తపాతంపై విచారణ జరిపిన మిశ్రా కమిషన్‌ చాలా అవకతవకగా వ్యవహరించింది. దానికి తోడు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామజన్మభూమి గుడికి తలుపులు తెరిచి మతోన్మాదులకు మరింత శక్తిని సమకూర్చింది.

షాబానో సమస్యపై ముస్లిలను సంతృప్తిపరిచేందుకు తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా రామజన్మభూమి గుడికి తెరలేపినట్టు అనిపించినా ఆ చర్య హిందూ జాతీయవాదానికి అసలు ప్రతినిధిగా భావించబడే భారతీయ జనతా పార్టీకి ఒక వరంగా మారింది.

ఈ విధంగా మతపరంగా వేడెక్కి వున్న వాతావరణం మధ్య దిల్లీలో పత్రికా రచయితగా నా జీవితం ప్రారంభమయింది. నేను సహజంగానే 1984 నాటి హింసాకాండ బాధితులకు న్యాయం చేకూర్చాలన్న లక్ష్యానికి అంకితమయ్యాను.

హైదరాబాద్‌లో బాల్యం నుంచే నాలో లౌకికవాదం పట్ల ఏర్పడిన అభిమానమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడకుండా ముందుకు సాగేందుకు దోహదం చేసిందని నేను భావిస్తున్నాను.

- మనోజ్ మిట్టా

(19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం లామకాన్ లో జరిగే పుస్తకావిష్కరణ సభలో, చర్చలో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం లతో పాటు ఈ పుస్తక రచయితలు మనోజ్ మిట్టా, హెచ్ ఎస్ ఫూల్కాలు పాల్గొంటున్నారు)
No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌