Friday, September 4, 2015

మానవతామూర్తి సీకే (ఆంధ్రజ్యోతి 4 సెప్టెంబర్ 2015 ఎడిటోరియల్ పేజి)

మానవతామూర్తి సీకే

(ఆంధ్రజ్యోతి 4 సెప్టెంబర్ 2015 ఎడిటోరియల్ పేజి)

సీకే చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఎల్లప్పుడూ ఎదుటివాళ్ళు చెప్పేదాన్ని వినేవాడు. ఆయన తరానికి చెందిన ఏ కమ్యూనిస్టులోనూ అంతగా కనపడని అరుదైన లక్షణం ఇది. తప్పులు దిద్దుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు. నాకు తెలిసి చాలామంది కమ్యూనిస్టులకు భిన్నంగా - సీకే మహిళలు, పేద ప్రజల పట్ల ఎంతో సున్నితంగా, ఆర్తితో వ్యవహరించేవాడు. దీనితో పోలిస్తే ధనవంతుల పట్ల మాత్రం కొంత కఠినంగా వుండేవాడని చెప్పుకోవచ్చు. విరాళాలు సేకరించటం కోసం మేం ఎవరివద్దకన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు- కొత్త ఇల్లు కట్టుకున్నామనీ లేదా కూతురి పెళ్ళి చేశామనీ, అందువల్ల విరాళం ఇవ్వలేమనీ అన్నారనుకోండి, సీకే వాళ్ళను అస్సలు వదిలేవాడు కాదు. ‘‘ఆహా! సరిగ్గా అందుకోసమే నీ దగ్గరికి వచ్చాం. ఆ పనులన్నింటికీ నువ్వు బాగానే ఖర్చుపెట్టావని విన్నాం. అందుకే అసలు నిన్ను మొదట్లో అడగాలనుకున్న మొత్తానికి ఇప్పుడు రెట్టింపు అడుగుతున్నాం’’ అనేవాడు. పేదల పెన్నిధిగా పేరున్న ప్రముఖ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌, సీకే గురించి కొంత సరదాగా మాట్లాడుతూ ‘‘నేను భయపడే కొద్దిమంది వ్యక్తుల్లో సీకే కూడా ఒకడు. ఆయన మనకేదైనా పని అప్పగిస్తే, దాన్ని చెయ్యకుండా తప్పించుకోవడం సాధ్యమయ్యేదే కాదు’’ అనేవాడు.

మిగతా కమ్యూనిస్టులకంటే సీకేను భిన్నంగా నిలబెట్టిన అంశాలేమిటి? సీకే ఎక్కడికి వెళ్లినా ప్రజల్ని ఇబ్బందులపాలు చేస్తున్న రోజువారీ సమస్యలను, వారి వ్యక్తిగత సమస్యలను పట్టించుకునేవారు. ఏ ఇంటికి వెళ్లినా- తనకు పని ఉన్నది ఆ ఇంట్లో మగమనిషితోనే కావచ్చు, అయినా ఇంట్లో ఆడమనిషిని కచ్చితంగా పలకరించేవాడు సీకే. ఎలా వున్నావు, పిల్లలు బాగున్నారా, వాళ్ళ ఆరోగ్యం, చదువులు ఎలా వున్నాయని అడిగి మరీ తెలుసుకునేవాడు. ఎవరికన్నా వ్యక్తిగత సమస్యలున్నట్టు తన దృష్టికొస్తే, వాటిని పరిష్కరించేందుకు వాళ్ళకి సహాయపడేవాడు. అందుకోసం, ఎంత సమయం పట్టినా శ్రద్ధ వీడే వాడు కాదు. తరచూ ఆరోగ్య సమస్యలు ఆయన దృష్టికి వచ్చేవి. కాల క్రమంలో ఆయనకు ఎంతోమంది డాక్టర్లతో, వివిధ వైద్య విభాగాలకు చెందిన స్పెషలిస్టులతో పరిచయాలు పెరిగాయి. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని ఎంతోమంది రోగులకు ఆయన తన పరిచయాల ద్వారా ఉచితంగా వైద్యం చేయించేవాడు. డాక్టర్లు డబ్బులు చెల్లించగలిగిన సామర్థ్యం వున్న రోగులను చూసినంత శ్రద్ధగా పేదవారిని కూడా చూడాలని, వీలైతే ఇంకొంచెం ఎక్కువగానే చూడాలని ఆయన ఆశించేవాడు. ఈ మాట పైకి అనకపోయినా ఆయన ఉద్దేశం అదే, ఆయన తీసుకొచ్చిన రోగుల పట్ల వైద్యులు కూడా అలాగే వుండేవారు. ఎవరినైనా వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించాక ఆయన క్రమం తప్పకుండా వెళ్ళి వాళ్ళను చూసేవాడు, మందులు కొనిచ్చేవాడు, అలాగే వైద్య పరీక్షలకీ, డాక్టర్లు, సర్జన్లు వచ్చి వాళ్ళని చూసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసి, వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకూ భరోసాగా వెంటవుండే వాడు. దీని గురించి వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇలా గుర్తు చేసుకున్నాడు...

‘‘నా సమస్య వెంటనే ఆయన సమస్యగా మారిపోతుంది. జేఎన్‌టీయూ హాస్టల్‌లో నా కొడుకు వున్నప్పుడు టైఫాడ్‌ జ్వరం వచ్చి జబ్బు పడ్డాడు. సీకే వాడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించి, వైద్య ఖర్చులన్నీ చెల్లించి వాడు బాగయ్యాక తన ఇంటికి తీసుకొచ్చి, కోలుకునేంత వరకూ తనతోపాటే వుంచుకున్నాడు. ఆ తర్వాత పిల్లాడిని మదనపల్లికి పంపించేప్పుడు... అప్పుడు చెప్పాడు నాకు.. ‘అబ్బాయు జబ్బుపడ్డాడు. ఇప్పుడు చాలా వరకు ఫర్వాలేదు. ఉదయం బస్సుకు వస్తున్నాడు. ఇంటికి తీసుకువెళ్ళు’ అన్నాడు. సీకే ఎడంచేత్తో చేసిన మంచి పనులేమిటో కుడి చేతికి కూడా తెలిసేది కాదన్న మాట. అట్లా వుండేది ఆయన వ్యవహార శైలి.’’5,

2013 సెప్టెంబర్‌లో జరిగిన సీకే సంస్మరణ సభలో సీపీఐ(ఎం) నాయకుడు రాఘవులు మాట్లాడుతూ ‘‘కమ్యూనిస్టు పార్టీల్లో దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు, మనం ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను కూడా పట్టించుకోవాలని సీకే నాతో చెప్పేవాడు. పాలకవర్గ పార్టీలు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను... అది రేషన్‌ కార్డులు కావచ్చు, బడి, ఆసుపత్రి ఇలా అన్నింటినీ పట్టించుకుంటాయి. ఇలాంటి వాటన్నింటినీ మరి కమ్యూనిస్టులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని తరచూ ప్రశ్నించేవాడు’’ అని గుర్తు చేసుకున్నాడు.

ప్రచురణ కోసం ఏదైనా పుస్తకాన్ని సిఫార్సు చేస్తే, వేర్వేరు వృత్తుల్లో, రకరకాల వ్యాపకాల్లో ఉన్న భిన్న నేపథ్యాల వ్యక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే దానిపై ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునేవాడు సీకే. అంత సున్నితమైన వ్యక్తి కూడా పుస్తకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఈ విషయంలో ఒక్కోసారి రాజీనామా చేస్తానని కూడా బెదిరించే వాడు. చాలాకాలం పాటు ఆయన ‘స్టాలినిస్టు’గా వుండి పోయాడు. వీరాభిమానం కాదుగానీ, స్టాలిన్‌ పట్ల గౌరవంతో, ఆయన అందించిన సేవలను విలువైనవిగా పరిగణంచేవాడు సీకే. మానవ హక్కుల విషయంలో స్టాలిన్‌పై వున్న విమర్శలను ఆయన చాలా చిన్న అంశాలుగా కొట్టిపారేసేవాడు. అందుకని ఏ పుస్తకంలోనైనా స్టాలిన్‌ పట్ల విమర్శ ఉందని ఆయన దృష్టికి వస్తే, చికాకు పడటమే కాదు, ఆ పేరా ఏదో తొలగించే వరకూ ఊరుకునేవాడు కాదు.

అలాగని సీకే పిడివాదిలా, మారని మనిషేం కాదు. ‘నేనీ విషయంలో తప్పుచేశాను’ అని నిజాయితీగా ఒప్పుకోగలిగిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఆయనా ఒకడు. ఈ సందర్భంగా నాకు అరుంధతీ రాయ్‌ రాసిన ‘ద గాడ్‌ ఆఫ్‌ ద స్మాల్‌ థింగ్స్‌’ పుస్తకం విషయంలో జరిగిన వాదోపవాదాలు గుర్తుకొస్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేను చదివాను, నాకు చాలా నచ్చింది. అనువదించి, తెలుగులో తెస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఆ పుస్తకంలో ఒక పాత్ర ద్వారా కేరళకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎమ్‌.ఎస్‌. నంబూద్రిపాద్‌ మీద చేసిన వ్యాఖ్యానాలను చూసి, సీకే తీవ్రంగా బాధపడి ఆ పుస్తకాన్ని అనువదించాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. మరుసటి సంవత్సరం, అభివృద్ధి గురించి, భారీ డ్యాముల పేరుతో జరుగుతున్న మానవ హక్కుల హననం గురించీ తీవ్ర నిరసన స్వరంలో అరుంధతీ రాయ్‌ రాసిన ‘ఫర్‌ ద గ్రేటర్‌ కామన్‌ గుడ్‌’ వచ్చింది. దాన్ని చదివిన తర్వాత సీకే ఆమె రచనలన్నింటినీ చదవటమే కాదు, మొదటి పుస్తకంపై తాను గతంలో వెల్లడించిన అభిప్రాయాలు సరైనవి కావంటూ తనను తానే సరిచేసుకున్నాడు. ఇదంతా ఎనభై ఏళ్ల వయసులో!’’

(స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీకే నారాయణరెడ్డి జీవిత చరిత్ర ‘నేను కమ్యూనిస్టుని’ నుంచి కొన్ని భాగాలు ఇవి. 
రేపు ఆయన ద్వితీయ వర్థంతి)

http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDkwNDA5MDQwMjE5MDQ2NDEuanBn&day=20150904No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌