Wednesday, April 18, 2012

దేవులపల్లి 'మా యాత్ర'లో కనిపించిన మానవబంధాల జాత్ర! - ప్రొ. చందు సుబ్బారావు - The Sunday Indian ...


'ఊరూ-వాడా బ్రతుకు'లో కుగ్రామ జీవిత విశేషాలు రాసి విశేష కీర్తినార్జించిన దేవులపల్లి కృష్ణమూర్తి, ఏకంగా భారతదేశ యాత్ర చేసి అనుభవాలను, అనుభూతులను ఓ చిరుపుస్తకంగా వెలువరించాడు.

మళ్ళీ గాల్లోకి లేచింది బంతి. ఫోరా, సిక్సరా అన్నది అంపయిర్లు జాగ్రత్తగా చూసి చెప్పాలి.
'మేం చూసిన సింగపూర్‌', 'చైనాలో నెలరోజులు', 'పాకిస్తాన్‌లో పదిరోజులు' అంటూ యాత్రా గ్రంథాలు ఏనుగుల వీరాస్వామి గారి 'కాశీయాత్ర' కాలంనుంచి వున్నవీ, వస్తున్నవే. భారతదేశ బస్సుయాత్రల గురించి బహుశా రాసిన వారుండరు. కారణం, ప్రయాణ సౌకర్యాలు పెరిగిన యీ రోజుల్లో బస్సులో భారత యాత్రలు చేసి 'నేను చూసిన తాజమహలు కాశీ విశ్వేశ్వరాలయం, గంగానదిలో స్నానం అంటే ఏం బావుంటుంది. ఎవరు చదువుతారు. చూడనివారెవ్వరు? అజంతా చిత్రాల్ని, ఆగ్రా అందాల్నీ చూసి పరవశించని వారెవరు?

ఇది గమనించాడే మా కృష్ణమూర్తి....బస్సులో ఉత్తర భారత యాత్ర చేసి చూసిన ప్రదేశాల్ని చూచూయగా చెబుతూ, మానవ సంబంధాల్ని, భారతీయ సందర్భంలో యిరికించి మెరిపించేటట్లు చూపించాడు. ఔరా! గడుసుతనం...అనేలా రాసుకుంటూ వెళ్ళాడు. ప్రసిద్ధ కవి నగ్నముని ముందుమాటలో అన్నట్లుగా యాత్రానుభవాలను అడ్డం పెట్టుకుని వ్యక్తుల పాత్రానుభవాలను పూసగుచ్చేశాడు! నగ్నముని చేత 'నేనూ ఉంటే యీ బస్సులో బావుండేది' అనిపించాడు. కృష్ణమూర్తి మెత్తని కత్తి అని తెలుసు గనుక అలా అననుగానీ, ఆ ప్రాంతాలన్నీ బస్సులో కాకపోయినా, రైళ్ళలోనో కార్లలోనో చూసిన వాడినే గనుక దేవులపల్లి కృష్ణమూర్తి అంతరంగాన్ని యిట్టే పట్టేయటానికి వీలుపడింది.

యాత్రా గ్రంథాలు రాసినవారి 'ఇంటెన్షన్‌' ఏమిటి?
మీరు చూడనివి, ఎరుగనివి మేం చూశామని చెప్పటం....
ఒకవేళ మీరు చూసినవీ, ఎరుగనివీ అయితే మేం కొత్తకోణంలో చూశాం. చిత్తగించండి....అనటం అంతేకదా..!
కృష్ణమూర్తి 'బస్సుయాత్ర'ను అడ్డుపెట్టుకుని మానవ మానస మానసరోవరంలోని జీవిత విశేషాలను, సామాన్యుల బ్రతుకుబంధాలను గుదిగుచ్చి మాలగా తయారుచేశాడు. అతని అసలు 'ఇంటెన్షన్‌' అదేనని మనకు కాస్త ఆలస్యంగా తెలుస్తుంది.

నల్లగొండలో బయలుదేరిన బస్సు జ్ఞాన సరస్వతీ బాట-బాసర నుంచి, షిర్డీ సాయి మానవత్వం నుండి- ఎల్లోరా దౌలతాబాద్‌, అజంతాల నుండి మౌంట్‌ అబూ, ఆజ్మీర్‌ దర్గా, జైపూర్‌, హరియానా, ఢిల్లీ ఎర్రకోట, హరిద్వార్‌, నైనిటాల్‌, ద్వారక, ఖజురహో, ఆగ్రా తాజ్‌, అయోధ్య, వారణాసి, శాంతినికేతన్‌, కోణార్క్‌ దేశాలయం, పూరీ, చిల్కా, అరసవిల్లి సూర్య దేవుడి కిరణాలు, సింహాచలం, అద్భుత విశాఖ, అరకు, అన్నవరం, భద్రాచలం రాముడితో సీతాకళ్యాణం చూసుకుని యింటికి చేరింది!!

ఇన్ని మహత్తర ప్రదేశాలు ఇరవై రోజుల్లో చూసిన మరొకరైతే సాయిరెడ్డి, తిరపతమ్మ, మాయాచారి, రాజు, సత్యం అంటారా? బాల వితంతువు లలిత గూర్చి మాట్లాడతాడా? అజంతా చిత్రాల మీద అరవై పేజీలు, ముంతాజ్‌ ప్రేమపై ముప్ఫై పేజీలు, నైనిటాల్‌ అందాలమీద వంద పేజీలు లాగించేయరూ! ఒక్కోస్థలానికి మూడుపేజీలు అందులో మళ్లీ శ్రీశ్రీ, దాశరథి, సినారె, అన్నమయ్య, గురజాడ, నండూరి, ఆత్రేయ, తిలక్‌, శివసాగర్‌, అల్లం రాజయ్య కవితా శకలాల ముఖద్వారాలూ! అజంతాను చూసినా, ఎల్లోరాను చూసినా, తుగ్లక్‌ గారి పిచ్చి పనుల దౌలతాబాద్‌ను చూసినా రామనాధం, వెంకటరెడ్డి, మాయాచారి గుర్తుకొచ్చి కావల సొచ్చిండ్రా? అసలు నీ ఉద్దేశమేంది కిష్టమూర్తీ....భారద్ద్దేశాన్ని గూర్చి చెప్పాలనుకున్నావా...లేక నీ బస్సులో యాభైమంది సహయాత్రీకుల గూర్చి తడవలు తడవలుగా యివరించాలనుకున్నావా...అట్టగయితే మద్దెలో యీ ఎర్రకోటలెందుకు? కోణార్క్‌లో బట్టల్లేని బొమ్మల ఊసులెందుకు? ఎమ్మార్వో చేసి చేసి ప్రతిదీ లెక్కగా చూసుకునే బూరోక్రాటు బుద్ధి అబ్బినట్టుందే....లేపోతే ఎందిది? అరె బుద్దడి జన్మభూమి గురించి చబుతా....తోటి ప్రయాణీకురాలు తిరపతమ్మ నీళ్ల బాటిలు గురించి చెబుతవేంది? అప్పుడప్పుడు చండీల రాజుల గురించి చెప్పినట్లు గొప్ప విషయాలు చెప్పినవనుకో, సటుక్కున ఫిట్టొచ్చినట్టు హైదరబాద్‌లోని నీ కొడుకుల ఊసెందుకయ్య? ఆళ్ళేదో బుందేల్‌ ఖండ్‌ రాజులైనట్టు?

రాజస్థాన్‌లు ఉదయపూర్‌ సరోవరాల మనోహర దృశ్యాలను వర్ణిస్తూ 'రామనాధం గారి గుమాస్తా కొడుకు గురించి వివరిస్తావా? అందుకే మా బాగ జరిగింది...మీ బస్సులోని సంచులన్నీ దొంగలు కొట్టేసిండ్రు గదా...! ఆరావళీ పర్వతాల మీద ఎల్తూ సూర్యంతో లేచిపోయిన పెళ్ళాం కత చెప్తవా? బెమ్మకుమారి విశ్వవిద్యాలయం గురించి రాయమంటే లచ్చమ్మ చీరెలూ, చంద్రమౌళీ బనీన్లు అంటావా...? స్వర్గానికి తీస్కపోయి యింద్రుడి వైభోగం చూడమంటే, మావూళ్ళ కొలువుల్లో యిట్టాగె గెంతులేస్తరంటావా? దేవులపల్లోరి కిట్టమూర్తీ....యింటిపేరు చెడగొట్టావు కదయ్యా...మా కష్ణశాస్ర్తి చూడు...'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అన్లే...! పేరుపెట్టుకోగాన సరే...నెవ్రూ అని పేరుపెట్టుకుని తొమ్మిదో క్లాసు తప్పితే ఎట్టా...! గాంధీ గారి పేరెట్టుకొని బిరియానీలు లాగించేస్తే ఏంది మార్గం! నీ బుర్రలో ఏదో దాగుందిలే. పసిగట్టిన! ఎట్టాగైతేనేంలే...భారద్దేశాన్ని చుట్టుముట్టి వస్తివి. అన్ని స్థలాల గురించి అంతోయింతో పరిచయం చేస్తివి. అవి గొప్పయివరాలేం గావుగాని, మొత్తానికి పరిచయంగా రికార్డు చేసినావు గద...అస్సలు నీ మయిండులో దాచివున్నట్లే నీవూరోళ్ళ, నీ నేస్తుల, నీ ప్రాంతపోళ్ళ, నీ బంధువుల ఊసులన్నీ పూసగుచ్చినట్లు విడతలు విడతలుగా రాసి చదివించినవ్‌లే!

ఎటొచ్చీ 'పోలవరం' పేజెక్టు గూర్చి భద్రాచలం మునిగిపోద్దని ఎవరో అంటునట్లు రాసినవు. అది నిజం కాదు కాని సీమాంద్రోళ్ళ పిల్లలు సుఖంగుంటే నువ్వున్నట్టు కాదా! ఆడపండేపంట, ఆడ లేచే సౌభాగ్యం ఆడనే వుంటదా...! దేశాన్ని అలుముకోదు! మరి దేశమంటే ఏంది? భారద్దేశపు యాత్ర చేసి యింత బంగారం లాంటి సమాచారం కలగలిపి, రంగులు పులిమి అందించినవే....ఒక్క పోలవరం...తెలుగోళ్ళ మద్దెన అన్నదమ్ముల యవహారంలో అన్నాయంగా రాసినట్టు పీలవుతున్నా....నన్ను సీమాంద్ర పొగరుబోతోడని అనబాకు కిష్టన్నా...డెబ్బయి చేరినోళ్ళం నువ్వూ నేనూ పులుముకునేదేముంది...ప్రాజెక్టులు ...నీళ్ళు...మన 'సూర్యం' లలిత'లకు పుట్టబోయే బిడ్డలు సుకపడేటందుకే గదా! ఆళ్ళు రెడ్‌ యిండియన్లలాగ అవుతారని ఎట్టనుకొంటవు....భారద్దేశం యీ దినాన్నే గొప్పగా వుంది కదా. ఆళ్ళ బిడ్డల నాటికి అమెరికావోణ్ని తలదన్ని పోదూ... జాగరత్తగా ఆలోచిచ్చన్నా...నీ పుస్తకం గూర్చి ఓ కవిత పలకనా....?

అది కవనం...విజ్ఞానం
అది గ్రహాంతర యానం...
అది మోదం...అది ఖేదం...
శిల్పచిత్రకళా ప్రయాణం..
అది పవిత్రం మన చరిత్ర....!
సాధారణ సామాన్యుల అనుభూతుల జాత్ర!
కిష్టమూర్తి కలం నుండి
ప్రవహించిన, పయనించిన నవభారత యాత్ర!!

ప్రొ. చందు సుబ్బారావు |
The Sunday Indian … Issue Dated: ఏప్రిల్ 16, 2012

మా యాత్ర
దేవులపల్లి కృష్ణమూర్తి

ముఖచిత్రం: ఎడ్గర్‌ దేగా, వాసు
లోపలి బొమ్మలు: శీలా వీర్రాజు

112 పేజీలు, వెల రూ. 60/-





.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌