Saturday, April 21, 2012

చదవాల్సిన యాత్రా రచన - గుడిపాటి (పాలపిట్ట మాస పత్రిక లో ) ...

చాలా కాలానికి ఒక మంచి యాత్రా రచన చదివాను.
హృదయానికి దగ్గరగా వచ్చిన రచన.
మనసును ఆహ్లాదపరచిన రచన.
ఇది దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన 'మా యాత్ర'.
చాలా ఇష్టంగా చదివించిన పుస్తకం.
ఎక్కడా పత్రికల్లో అచ్చుకాలేదు.
నేరుగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు అచ్చు వేసింది.
ఈ యాత్రా రచన అనేకానేక ప్రత్యేకతల్ని సంతరించుకుంది.
ఒక నవలలా సరళమైన శైలిలో నడిచిన రచన ఇది.

ఏడాది కిందట ఇరవై నాలుగు మంది రిటైర్డ్‌ ఉద్యోగులు దాదాపు ఇరవై రోజులపాటు చేసిన ఉత్తర భారత దేశ యాత్ర ఈ రచనకు ప్రేరణ. వారిలో ఒకనిగా దేవులపల్లి కృష్ణమూర్తి పర్యటించారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఉన్నారు. కష్టసుఖాలు కలబోసుకున్నారు. మంచిచెడ్డలు తెలుసుకున్నారు. తమ పర్యటనను ఈ రచనలో దృశ్యమానం చేయడం, మానవ సంబంధాల్లోని అంతరువుల్ని దర్శింపజేయడం ఈ రచన విలక్షణత.

యాత్రా రచన అంటే కేవలం యాత్రాస్థలాల్ని పరిచయం చేయడం, అక్కడి వివరాలు పోగుచేయడం కాదు. లేదంటే ఆ పర్యటనా కేంద్రాల సందర్శనానుభూతుల వ్యక్తీకరణ మాత్రమే కాదు. అంతకు మించి మానవ జీవన సరళిలోని బహుళ పార్శ్వాల్ని వ్యక్తీకరించడం ఈ రచనలోని విశిష్టత.

కొందరు పర్యటనల కోజసం గుంపులుగా పర్యటిస్తుంటారు. సమూహాలుగా వెళుతుంటారు. అయినప్పటికీ ఎవరి దారి వారిదే. ఎవరి ప్రపంచం వారిదే. ఈ పర్యటనలో మాత్రం సరామూహికమైన సంస్పందనలున్నాయి. ఒకరినొకరు మరింత సన్నిహితంగా తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవడంలో అప్పటికే పరిచితమైనవాళ్లు, సన్నిహితులనుకున్నవాళ్లు మనసుకు మరింత దగ్గర అవుతారు. ఈ వైనాన్ని అక్షరాల్లో ప్రతిఫలించడమే దేవులపల్లి కృష్ణమూర్తి సృజన సాధించిన విజయం.

యాత్రా రచన కూడా ఓ సృజనాత్మక రచన. సృజనాత్మకంగా జీవించే లక్షణం ఉన్న కృష్ణమూర్తి దృష్టికోణంలోని వైశాల్యం ఈ రచనకు సొబగులు అద్దింది. మనుషుల్ని అర్థం చేసుకునే లక్షణం ఉండాలి. సంయమనంతో లోకాన్ని పరికించే సహనం కావాలి. వీటితో పాటు సుదీర్ఘకాలపు సాహిత్య అధ్యయనం ఉన్న సృజనశీలి కృష్ణమూర్తి. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం రచనా వ్యాసంగంలోకి వచ్చినప్పటికీ వారిలో ఎప్పటినుంచో ఓ రచయిత దాగి వున్నాడు. '' ఊరు వాడ బతుకు '' ద్వారానూ, కొంతకాలంగా రాస్తున్న కథల్లోనూ కృష్ణమూర్తి సృజనశీలతను తెలుగు పాఠకులు ఆస్వాదిస్తున్నారు.

సరళంగా, సూటిగా, పదునుగా ఉంటుంది దేవులపల్లి కృష్ణమూర్తి శైలీ సంవిధానం. రచనని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలిసిన ప్రతిభాశాలి. దశాబ్దాలుగా వింటున్న సంగీతం, పాటలు, చదువుతున్న కవిత్వం, సాహిత్యం చూస్తున్న సినిమాలు వారిలో ఒక సృజనకారుని ప్రోది చేశాయి. ఆ సృజనాత్మక ప్రతిభను తారాస్థాయిలో అభివ్యక్తం చేసిన రచన ''మా యాత్ర''. మానవానుభూతుల సాంద్రతను అనుభవంలోకి తీసుకువచ్చే మేలిమి గుణం ఈ రచనలో ఉంది.

ఒక రోజున చేతిలోకి తీసుకున్న వెంటనే నడుమ ఒక అధ్యాయాన్ని చదివాను. తెలియని పరవశానికి లోనయ్యా. గాఢతమమైన అనుభూతికి లోనయ్యా. గుండె ఒకానొక తన్మయత్వంతో ఉల్లాసమొందింది. ఆ తర్వాత మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టా. ముప్పయి చిన్నచిన్న అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయాన్ని కవిత్వంలా ఇష్టంగా, ప్రేమగా చదువుకున్నా. ఇష్టమైన పదార్థాన్ని త్వరగా అయిపోతుందేమో అని కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తిన్నట్టు ప్రతి అధ్యాయాన్ని అ లా చదివా.

ఈ రచన మీద ఎందుకింత మోహం?
ఎందుకింత ఆకర్షణ?
ఎందుకింత ఉన్మత్త ప్రేమభావం?
అని ఆలోచిస్తే, తర్కిస్తే, వివేచిస్తే కారణాలు అనేకం.
వాటి విచికిత్స జోలికి ఇక్కడ వెళ్లడం లేదు.
కానీ ఒక్కటి చెప్పగలను- ఇందులోని భాషా సంవిధానం, శైలీ వైశిష్ట్యం పాఠకుల్ని ఆకర్షిస్తాయి.
ప్రవాహ సదృశమైన శైలి రచన వెంట మనల్ని తీసుకెళ్తుంది.
ఒక మంచి తెలుగు పుస్తకాన్ని చదివిన మధురానుభూతుల్ని మిగులుస్తుంది.

- గుడిపాటి (పాలపిట్ట మాస పత్రిక) సౌజన్యంతో
 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌