Sunday, April 22, 2012

ఓహో యాత్రికుడా ... యాత్రికుడా ... !

ఓహో యాత్రికుడా ... యాత్రికుడా ... !

...
రచన ఒక విధంగా సంగీతం వంటిదే కదా.
శృతిలయలున్న గొంతు ముచ్చటగా పాడుతోంటే చెవులు పరవశించిపోతాయి.
పాట దేని గురించి అన్నది తరువాతి సంగతి.
వ్యాసం గానీ, కథ గానీ చక్కగా రాయాలేగానీ వాక్యాలు పాటల్లా మనలో అంతర్మథనాన్ని నింపిపెట్టవా ఏం?
ఇవాళ నిజానికి ఈ పరిస్థితి ఇంత అనుకున్నంతగా లేదు.
నాటి గ్రాంథికం నేడు లేదుగానీ దినపత్రికల భాష ఒకటి వచ్చి పడింది ప్రాణం తియ్యడానికి.
కథలోనూ వ్యాసంలోనూ అదే పాత్రికేయ భాష చొరబడి చిరాకెత్తిస్తే పాపం పాఠక నిర్భాగ్యుడేమయిపోవాలి?
మరి ఇవాళ చాలా వరకు కథల్లో, నవలల్లో ఈ చొరబాటే కనిపించడంతో రచయిత గారి 'స్వీయ రచనా శైలి'  ఒకటంటూ లేకుండా పోయి, ఫలానా రచయిత రాసిందే ఇది అని పేరు చూడకుండానే చెప్పగలిగే స్థితి తరిగిపోతోంది.

ఇందుకే మన ''మా యాత్ర'' చదవవలసింది. సుఖయానం వంటి 'యాత్ర'శైలి మనల్ని కట్టిపడేసి దేవులపల్లి కృష్ణమూర్తి గారితో పాటు ప్రయాణం చేయిస్తుంది. శ్రీముఖలింగం గుడికి పొవటం సుతరామూ నాకు ఇష్టంలేదని శ్రీమావో గారి తమ్ముడిలాగా భీష్మించుకున్నా సరే కృష్ణమూర్తితో కులాసాగా అ లా తిరిగి వస్తాం. నచ్చని సంగతి గదాని పేజీలు తిరగేసి ఊరుకోలేం. అదీ దే.కృ.మూర్తి గారి పట్టు.

సులభంగా, హాయిగా రాసుకుపోవటం నిజానికి అంత సులువైందికాదు.
రచయితకి సహజంగానే పుట్టుకు రావాలి కర్ణుడి కవచకుండలాల్లాగేను.
అయితే 'వస్తువు' (అదేమయినా ఇత్తడా, ఇనుమా?) కోసం సహజ కవచంలాటి 'శైలి' వదులుకోవడం హృదయవిదారకం! నిజానికి ఆధునిక తెలుగు కథ, నవలల్లో శైలి వచ్చి కొండచిలువలాగా 'వస్తువు'ను మింగేసేంతటి పరిస్థితి ఎక్కడుంది కనుక?
గట్టిగా మాట్లాడితే చదివించే 'గుణమే', 'తీరే', 'లక్షణమే' శైలి.
ఈ సద్గుణం ''మా యాత్ర'' నిండా పరచుకుని ఉంది.

అ లాగని ఈ పుస్తకంలోని దేశంలోని వివిధ యాత్రా స్థల పురాణాల భోగట్టాల గొడవుండదు. పుస్తకం ఒక గైడ్‌ కాదు. మాటల్లో మాటగా మాటవరసకు అన్నట్టు ఆయా ప్రాంత వివరాలు వుండాలన్నట్టు ఉన్నాయంతే. ఇక్కడ యాత్రా స్థలాలకంటే జీవన గమ్యాలు చేరీ చేరక పోవటం గురించిన జీవన యాత్ర జరుగుతుంది. చిన్న పుస్తకమే కావచ్చుగాక, లోపల మనల్ని నడిపించే ప్రయాణికుల కథలు పెద్దవి. రచయిత చిన్నగా సరిపుచ్చినా సరే, భారీ పదాలు, స్టాక్‌ ఎక్స్‌ప్రషన్‌లూ లేకుండా క్లుప్తంగా సాటి యాత్రికుల దిగుళ్లను, యాతనలనూ అనాయాసంగా చెప్పుకొస్తారు రచయిత. అంటీముట్టనట్టు, చెప్పీ చెప్పనట్టు అ లా అ లా రచయిత చెప్పుకొచ్చే నల్గొండ మిత్రులతో స్నేహం ముగియదు. మరచిపోనూలేం. అదీ ఆయన రచనా శైలి!

పుస్తకంలో ప్రతి పేజీ ఒక చక్కటి పద్యంతోనో, కవితతోనో, పాటతోనో ఆరంభమవుతుంది.
ఈ తీరుబలేగా వుందసలు.
ముందుమాటలో నగ్నముని గారు రచయితని కోరిన కోరికలు నిజానికి ఈ పుస్తకం చదివే వారందరివీనీ!
ఈ చిన్న పుస్తకానికి పెద్ద కరచాలనం!
నమస్తే సారూ!
యాత్ర చేయండిక!


మా యాత్ర - దేవులపల్లి కృష్ణమూర్తి, పేజీలు 112, వెల: రూ.60/- ప్రతులకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌...

- శివాజీ, (వార్త ఆదివారం సంచిక, తేది 8 ఏప్రిల్‌ 2012) సౌజన్యంతో

1 comment:

  1. నేనూ చదివాను. మా అబ్బాయి ( పదో తరగతి ) కూడా చదువుతున్నాడు. బాగుంది.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌