Monday, October 24, 2011

రూపం-సారం ... సాహిత్యంపై బాలగోపాల్‌


...
కె.బాలగోపాల్‌ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త.

మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్యంపై చెదురుమదురుగానే అయినా చిక్కగా రాసిన వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు, ఇంటర్వ్యూల సంకలనమిది.

''దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి గానీ సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించమంటే , జీవితంలోని ఖాళీలను పూర్తిచేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు.''

''మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం. కొన్ని అభద్రత వల్ల చూడం. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అ లవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి.''

''సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.''

... ... ...

మా మాట

తెలుగు సాహిత్యానికి ఇది చాలా విలువైన పుస్తకమవుతుందని మా నమ్మకం.
ఆరేడు సాహిత్య వ్యాసాలతో పాతికేళ్ల క్రితం వచ్చిన ''రూపం-సారం'' తరువాత బాలగోపాల్‌ సాహిత్య వాస్యాసాలు ఇంతవరకూ సంకలనంగా వెలువడలేదు. బాలగోపాల్‌ను ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యాతగా భావించేవాళ్లు ఆయన ఆలోచనల తాత్విక మూలాలు ఆయన సాహిత్య పరిశీలనలలో ఉన్నాయని గుర్తించడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది.

మనిషి జీవితంపై, సమాజ జీవితంపై ప్రతీ మలుపులోనూ వెలుగులు ప్రసరించి అన్ని పార్శ్వాలనూ మనకు చూపించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని నమ్మిన వ్యక్తి బాలగోపాల్‌. మనం మన సందిగ్ధాలను, సంశయాలను లోతుగా నిజాయితీగా పరిశీలించుకునేందుకు ఈ వ్యాసాలు తోడ్పడతాయి.

ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం మేము అనుకున్నదానికన్నా చాలా పెద్దపనయింది. మొదటిసారి ఈ వ్యాసాలు అచ్చయిన పత్రికలు దొరకక, దొరికిన వాటిల్లో అనేక తప్పులు, పేరాలకు పేరాలు ఎగిరిపోవడం, అనువాద కష్టాలు వంటి ఇబ్బందులు ఎదురవడంతో గత అక్టోబర్‌కి తీసుకువద్దామనుకున్న పుస్తకాన్ని ఈ అక్టోబర్‌కి తీసుకురాగలిగాం.

ఇందులో అయిదు ఇంగ్లీషు వ్యాసాలను అనువదించిన మృణాళిని, వసంతలక్ష్మిలకు, వ్యాసాల సేకరణ, పరిష్కారంలో తోడ్పడిన మన్నం బ్రహ్మయ్య, ఆర్‌.కె., ఎన్‌. వేణుగోపాల్‌లకు, ముందుమాట రాసిచ్చిన కె. శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు.

రూపం-సారంకి చేరా, కెవిఆర్‌, త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని, బాలగోపాల్‌ ఆంగ్ల వ్యావాసలను (అనువాద ఒరిజినల్స్‌) కూడా అనుంబంధాలుగా ఇందులో చేర్చాం.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
1 అక్టోబర్‌ 2011

రూపం-సారం
సాహిత్యం పై బాలగోపాల్‌

339 పేజీలు, వెల: రూ.150

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌