Saturday, October 1, 2011

స్మశానం దున్నేరు - డా. కేశవరెడ్డి నవల ...



కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి.
మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ట్రీట్మెంట్‌' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి.
''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే!

...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా?
చట్టాలు ఏం చేస్తున్నాయి?
ప్రభుత్వాధికారులు దుర్మార్గులను అణగ ద్రొక్కి సన్మార్గులకు న్యాయం కలిగిస్తున్నారా?
ప్రభుత్వాలు వున్నది ఎందుకు?
ప్రజలను రక్షించడానికా? భక్షించడానికా?


... ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు - నవల చదివిన తర్వాత మనల్ని కలచివేస్తాయి.

...దోపిడీ వర్గం అభివృద్ధికి కొమ్ముకాసే వెంకటాద్రి వంటి మధ్యతరగతి వ్యక్తులు యెలాంటి పరిణామాన్ని యెదుర్కోవలసి వస్తుందో, తమకు జరిగిన ఘోరాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు సంఘటిత శ్రామిక శక్తి ఏవిధంగా విజృంభిస్తుందో అద్భుతంగా చిత్రీకరించిన నవల యిది. శ్రమజీవులకు వాళ్ల హక్కులు, బాధ్యతలు గురించి 'ఎడ్యుకేట్‌' చేస్తూ, వారిని క్రమశిక్షణాయుతమైన విప్లవపథంవైపు నడిపించే - 'రాజకీయ నాయకత్వం' లేనప్పుడు - ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయో పరోక్షంగా నిరూపిస్తున్నది నవల. (ఆంధ్రజ్యోతి మాసపత్రిక, ఏప్రిల్‌1980 సమీక్ష నుంచి).

(విశాలాంధ్ర పత్రిక నిర్వహించిన పోటీలో (1980) ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది)

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10 పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండచ్చేరిలో ఎంబిబిఎస్చేశాక నిజామాబాద్జిల్లా డిచ్పల్లి విక్టోరియా మెమోరియల్ఆసుపత్రిలో స్కిన్స్పెషలిస్ట్గా కుష్ఠురోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్లో వుంటూ ఆర్మూర్లూ వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్ఠువ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ మెడికల్జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యల పట్ల సానుతాపంతో రాయలసీప గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. బానిసలు, భగవానువాచ, అతడు అడవిని జయించాడు, రాముడుండాడు రాజ్జిముండాది, మూగవాని పిల్లలన గ్రోవి, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్‌, ఇన్క్రెడిబుల్గాడెస్‌, మునెమ్మ వీరి ఇతర రచనలు. అతడు అడవిని జయించాడు నవలను నేషనల్బుక్ట్రస్ట్వారు 14 నారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్క్రెడిబుల్గాడెస్నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచడం, అనివార్యమైన జీవిత పోరాటానకి ఉపక్రమించపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ , కూతురూ సంతానం.


...

స్మశానం దున్నేరు
రచన : డా. కేశవరెడ్డి

ముఖచిత్రం: కాళ్ల
160 పేజీలు, వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇమెయిల్‌:hyderabadbooktrust@gmail.com

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌