
'నేనే బలాన్ని - టి.ఎన్.సదాలక్ష్మి బతుకు కథ' పుస్తకం 60 ఏళ్ల సాంఘిక, రాజకీయ చరిత్రకు దర్పణం వంటిదనీ, నేటి నాయకులు తప్పక చదవవలసిన గ్రంథమనీ డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొ.ఘంటా చక్రపాణి అన్నారు.
అన్వేషి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రచురించిన ఈ పుస్తక సమీక్షా సదస్సు సెప్టెంబర్ 6న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది.
సదాలక్ష్మి రాజీపడని మనస్తత్వం గల నాయకురాలనీ, ఈ గ్రంథంలో రచయిత్రి గోగు శ్రామల మొత్తం సమాజాన్ని కూడా విశ్లేషణ చేశారనీ అన్నారు. మురికివాడల నుంచి పైకి వచ్చిన నిప్పుకణిక సదాలక్ష్మి అని కొనియాడారు. 1969లో తెలంగాణ సమస్యపై జె. ఈశ్వరీబాయి, సదాలక్ష్మి ప్రభుత్వంపై విరుచుకుపడేవారని చక్రపాణి అన్నారు.
ఈ గ్రంథంపై విస్తృతంగా చర్చ జరగాలని ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర అన్నారు. వివిధ కోణాల నుంచి సదాలక్ష్మి జీవితాన్ని విశ్లేషణ చేయాలన్నారు.
సుశీతారు (ఇఫ్లూ యూనివర్సిటీ) మాట్లాడుతూ రాజకీయ నాయకుల జీవిత చరిత్రల్లో సదాలక్ష్మి వంటి అణగారిన వర్గాల నాయకుల చరిత్రలు చోటు చేసుకోలేకపోవడం, కుల వివక్షకు తార్కాణమన్నారు.
సదాలక్ష్మి కుమారుడు డా. వంశీ తిలక్ పుస్తకాన్ని సమీక్షిస్తూ ఆమెకు ఆమె భర్త టి.వి. నారాయణ ప్రథమ గురువు అనీ, ఆమె జీవితంలో అనేక నాటకీయ విజయగాథలు ఉన్నాయని చెప్పారు. కొన్ని విలువలకు కట్టబడిన నాయకురాలనీ, ధనాశకు పోలేదనీ అన్నారు.
తెలంగాణ మహిళా మేధావుల, రచయితల వేదికకు చెందిన డా. టి. దేవకీదేవి మాట్లాడుతూ సదాలక్ష్మి స్త్రీ కావడం వల్లా, అందులో దళిత స్త్రీ కావడం వల్లా, అందులోనూ అట్టడుగు కులంలో జన్మించినందువల్లా రావలసినంత రాణింపు రాలేదన్నారు.
ఉస్మానియా విద్యార్తి జెఎసికి చెందిన బాలలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణా సాహిత్యంలో ఈ పుస్తకం చెప్పుకోతగ్గదన్నారు.
సదాలక్ష్మి భర్త డా.టి.వి.నారాయణ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఆమె జీవితం ఒడుదొడుకులతో గడిచిందన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దేవాదాయ శాఖల మంత్రిగా విశేష సేవలందించారని చెప్పారు. కాంగ్రెస్‌పై విసుగుచెంది జగ్జీవన్‌రాం పిలుపు మేరకు 'జనతా పార్టీ'లో చేరిందనీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులయ్యారనీ చెప్పారు. ఆమె రాజకీయ జీవితంలోని ఎత్తుపల్లాలను డా. నారాయణ ఎత్తి చూపారు. ఎప్పుడూ ఆమె వెనుక ఒక పురుషుడు ఉన్నట్లు అనిపించేదికాదనీ, తనకు ఇంకెవరి బలం అక్కరలేని బలవంతురాలనీ ఆమెను కొనియాడారు. ఈ పుస్తకం స్ఫూర్తితో
తనుకూడా తన జీవిత చరిత్రను రాయడానికి పూనుకున్నట్లు చెప్పారు.
పుస్తక రచయిత్రి శ్రీమతి గోగు శ్యామల స్పందిస్తూ దళితులు ఎవరికి వారు తమ చరిత్రలు రాసుకోవాలనీ, అట్లా చేయకపోవడం వల్ల దళిత చరిత్రలో అనేక చారిత్రక అంశాలు చోటు చేసుకోలేదనీ చెప్పారు. తన కుటుంబాన్నీ, శాసన సభనీ ఒకే ధాటిన పెట్టిన ధీశాలిగా సదాలక్ష్మిని కొనియాడారు. ఈ పుస్తక రచనకు ఏడు సంవత్సరాలు పట్టిందన్నారు. పుస్తక రచనకు తోడ్పడిన వారందరికీ - ముఖ్యంగా లలిత (అన్వేషి), హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌కు చెందిన గీతా రామస్వామికి, సదాలక్ష్మి బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సభకు లలిత అధ్యక్షత వహించారు.
- నీలిజెండా హైదరాబాద్ ప్రతినిధి
నీలిజెండా, పక్షపత్రిక,( సెప్టెంబర్ 16-30, 2011) సౌజన్యంతో
సంపాదకులు: బొజ్జా తారకం; అసోసియేట్ సంపాదకులు: గనుమల జ్ఞానేశ్వర్
వెబ్‌సైట్ : www.neelizenda.com
...
Kindly change the link on right side top for eBook click here to http://kinige.com/kpublisher.php?id=79
ReplyDeleteThe one currently presented is for feed, not a direct link.
Thank you sir.
ReplyDeleteChanged as suggested.