Friday, April 23, 2010

"మర్యాదస్తులకు రోత పుట్టించే జీవితాలే!" - కె. సుధ. రంగనాయకమ్మ గారి విమర్శ పై ప్రతి విమర్శ.

ఆంద్ర జ్యోతి 19 ఏప్రిల్ 2010 సోమవారం వివిధ లో "మర్యాదస్తులకు రోత పుట్టించే జీవితాలే!" అనే శీర్షికతో కే. సుధ గారు ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కధపై రంగనాయకమ్మ గారి (వ్యభిచారం కూడా ఒక వృత్తేనా?) విమర్శ పై ప్రతివిమర్శ చేసారు. ఆంద్ర జ్యోతి సౌజన్యం తో మా బ్లాగు వీక్ష కుల సౌలభ్యం కోసం దానిని ఇక్కడ పొందు పరుస్తున్నాము.



''మర్యాదస్తుల''కు రోత పుట్టించే జీవితాలే!
...................................................
నళిని తాను నీచమైన, రోత పుట్టించే జీవితం గడుపుతున్నందుకు విచారిస్తే రంగనాయకమ్మ సంతోషిస్తారా? ఇదేం పైశాచిక ఆనందం? ఫెమినిస్టులను తూర్పారపట్టడానికి రంగనాయకమ్మకు అనేకానేక అవకాశాలూ సందర్భాలూ ఉండగా వారిని తిట్టిపోయడానికి నళిని జీవితాన్ని ఒక వేదిక చేయాల్సిన అవసరం వుందా? నళినిని సెక్స్‌వర్కర్‌ అనకూడదు. వ్యభిచారాన్ని వృత్తి అనకూడదు. సరే, ఇది చాలామందికి ఇబ్బంది కలిగించే విషయమే.
................................................

సాంప్రదాయవాదులకు 'శీలం' ఎంత పవిత్రమైనదో మార్క్సిస్టులకు 'పని' అంత పవిత్రమైంది. వేశ్యలు చేసే రోత పుట్టించే పనికి సెక్స్‌ 'వర్క్‌' హోదా కల్పించడం నిజంగానే సబబు కాదనుకుందాం. మరైతే సెక్స్‌ వర్కర్‌ అనకుండా వారిని ఏమనాలి? వేశ్య, పతిత, సాని, లం..., గుడిశేటి, తిరుగుబోతు, గాలిది, ముండ... వీటిల్లో ఏది బాగుంది? రోత పుట్టించే జీవితం గడుపుతున్నారు కాబట్టి ఎంత రోత పుట్టించే మాట వాడితే అంత బావుంటుందంటారా? సంబోధించే పద్ధతిలోనే అమర్యాద వుంది. మర్యాదివ్వండని వాళ్లు అడుగుతుంటే కాసేపు మన ఇబ్బందులను పక్కన పెట్టలేమా?

వ్యభిచారంలో దోపిడికి గురవుతున్న స్త్రీలకు అందరిమీదా ఉన్నట్లే స్త్రీవాదుల మీదా అనేక విమర్శలున్నాయి. స్త్రీవాదులకు కూడా వేశ్యా సమస్యపై ఏకాభిప్రాయం లేదు. కొంతమంది స్త్రీవాదులు వ్యభిచారాన్ని నిర్మూలించాలంటే కొంతమంది నియంత్రిస్తే సరిపోతుందంటున్నారు. వ్యభిచారంలోకి తరలించడాన్ని (ట్రాఫికింగ్‌ని) నేరంగా పరిగణించాలి కాని వ్యభిచారాన్ని కాదనే వాళ్లున్నారు. ట్రిఫికింగ్‌నే కాదు వ్యభిచారాన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘనగా భావించాలనే వారున్నారు. కాదు ట్రాఫికింగ్‌ ఒక్కటే మానవ హక్కుల ఉల్లంఘన అనే వాళ్లున్నారు. ట్రాఫికింగ్‌ని నిర్మూలించి వేశ్యలకు సగటు పౌరులకు కల్పించే అన్ని స్వేచ్ఛలు వర్తింపజేయాలనే వాళ్లున్నారు. వేశ్యలను పోలీసులు, కోర్టు ఉచ్చులోనుంచి బైటపడేస్తే సరిపోతుంది, అంటే నేరం పరిధిలో నుండి తొలగించాలని అడుగుతున్న వారున్నారు. లైసెన్సులు ఇచ్చి తీరాలనే వాళ్లున్నారు. నువ్వు పునరావాసానికి ఒప్పుకుంటేనే సహాయపడతాం లేకపోతే నిర్బంధంలో వుంచైనా నిన్ను సంస్కరిస్తామనే వాళ్లున్నారు.

హైదరాబాద్‌లో మెహందీ ఎత్తేసినప్పుడు 'ప్రత్యామ్నాయ' పేరుతో తల్లీ బిడ్డలను దూరం చేసిన వెర్రి ప్రయత్నాలేమయ్యాయి? వేశ్యా సమస్యపై జరుగుతున్న ఈ చర్చ గురించి రంగనాయకమ్మ ప్రస్తావించలేదు. వాటి గురించి తెలిసిన దాఖలాలు కూడా ఈ వ్యాసంలో లేవు. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నళిని జీవితం ఈ చర్చలో చిక్కుకు పోయి ఉంది. కాబట్టి నళినికి అవన్నీ తెలుసుకోక తప్పదు. పునరావాసానికి నళిని ఒప్పుకోలేదని రంగనాయకమ్మ కన్నెరజ్రేశారు. కాని ఆ పునరావాసాలు ఎలా వున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారా? వ్యాసం చదివితే అ లా అనిపించలేదు. నళిని కుటుంబ స్త్రీల జీవితాన్ని తూలనాడిందని ఆమె కోపం వ్యక్తం చేశారు. మరి కుటుంబ స్త్రీలు నళిని జీవితాన్ని తూలనాడవచ్చా? ఇరువురి జీవితాలూ లోపభూయిష్టమే అయినప్పుడు ఎవర్ని ఎవరు విమర్శించుకోవచ్చు? ''పేద స్త్రీ లందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అ లా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం ధనిక కుటుంబాల స్త్రీలలో వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే'' అన్నారు రంగనాయకమ్మ. ఈ సూత్రీకరణని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌.ఐ. ముందు పెట్టి చూడండి. అది సరైన సూత్రీకరణ అవునో కాదో తేల్చి చెప్పేస్తారు.

ఇప్పుడైనా, ఎప్పుడైనా సమాజానికి నళిని లాంటివారు నిత్యం గుర్తుండే వ్యక్తులు కారు. సమాజానికి అవసరమైనప్పుడే వాళ్లు గుర్తుకొస్తారు. ఇప్పుడైనా ఈ ''సెక్స్‌ వర్కర్స్‌'' గుర్తొచ్చింది ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికే. అందుకే నళిని లాంటివారు ఇప్పుడు సెక్స్‌ వర్కర్సే కాదు పియర్‌ (పీర్‌) ఎడ్యుకేటర్స్‌ కూడా అయ్యారు. ఎయిడ్స్‌ నివారణ పేరుతో ఇవాళ వాళ్ల ఆరోగ్యాల గురించి కొంత పట్టించుకుంటున్నారు. రేపు ఆ వ్యాధికి మందు కనిపెట్టగానే నళిని లాంటివారి ఊసెత్తేవారు కూడా వుండరు. ప్రజారోగ్యం దృష్టిలో వుంచుకుని ఎ.పి.సాక్స్‌, నాకో వంటి ప్రభుత్వ సంస్థలు సెక్స్‌ వర్కర్స్‌ సముదాయాలను ఏర్పాటు చేస్తున్నా ఒకసారి ఆ రోగానికి మందులేస్తారు. కనిపెట్టగానే ఈ రకమైన ప్రయత్నాలను గాల్లో వదిలేస్తారు.

19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ఉన్నత, మధ్యరతగతి స్త్రీలు గడప దాటి బైట ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే వేశ్యలు వారికి కంటగింపుగా కనిపించారు. ఈ స్త్రీట్‌ వాకర్స్‌ పక్కన నడవడం ఆ స్త్రీలకు రోత అనిపించింది. ''మర్యాదస్తులైన'' కుటుంబ స్త్రీలు బైట ప్రపంచంలోకి రావాలంటే ఈ స్ట్రీట్‌ వాకర్స్‌ని వీధుల్లోకి రానీయకూడదని జసఫీన్‌ బట్లర్‌ వంటి స్త్రీవాదులు వాదించి ఆమేరకు చట్టాలు రూపొందించారు. ఫలితంగా స్ట్రీట్‌ వాకర్స్‌ రోడ్లపై నుంచి మాయమయ్యారు. ఆ తర్వాత వాళ్లు తిండికి మాడారా? వాళ్ల పిల్లా జెల్లా ఏమయ్యారు? ఎవరికి పట్టింది? గాలి ముండలు, గాలి ముండల పిల్లలు... వాళ్ల గురించి పట్టించుకోవడమేమటిట అనుకుందామా? ఇంగ్లాండ్‌ వీధుల్లో స్ట్రీట్‌ వాకర్స్‌ని నడవనీయకుండా చేసినా, దేవదాసీ వ్యవస్థను రద్దు చేసినా, మెహందీ రూపు మాపినా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంది వేశ్యలను కాదు. ప్రజా ఆరోగ్యం, ప్రజా భద్రత, భ్రద్రలోక్‌ మహిళల సున్నిత భావాలు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలు మాత్రమే. వాటి కోసం చేశారే కాని వేశ్యలను ఉద్దరించడానికి కాదు. సౌజన్యారావు పంతుల్ని మధురవాణి ముద్దు అడిగే సన్నివేశంలో గురజాడ అప్పారావు వీరేశలింగం పంతులు గార్కి వేసిన చురకలు అర్థమైతే నళిని మీద రోత పుట్టాలో పుట్టకూడదో అర్థమవుతుంది.
- కె. సుధ
(ఆంధ్రజ్యోతి, 19 ఏప్రిల్‌ 2010)

3 comments:

  1. రంగనాయకమ్మ గారి వాదనే సమర్థ నీయంగా ఉంది.ఆ జీవితాలు తనకు రోత పుట్టిస్తాయని ఆమె అనలేదు.అదొక వృత్తి కాదని మాత్రమే అన్నారు. ఆ జీవితాలు ఆ వృత్తిలో ఉన్నవారికి సైతం రోత పుట్టిస్తాయనే మాట వాస్తవం కాదా? ఎవరైనా ఇష్టంతో చేస్తారా ఆ వృత్తిని? అందులో అవసరార్థం చేసే వృత్తి తప్ప,'ప్రేమ"అనే మాటకు తావెక్కడుంది? తన దగ్గరకు వచ్చే వారు ఎలా ప్రవర్తిస్తారో,ఎంత హీనంగా మాట్లాడతారో నళిని పుస్తకంలో చెప్పిందని రంగనాయకమ్మ గారు రాశారు.(పుస్తకం నేను చదవలేదు). అలాంటి జీవితాన్ని గౌరవనీయమైన వృత్తిగా ఎలా అంగీకరించాలని నళిని కోరుతుంది?

    పునరావాసాలు ఎలా ఉంటాయో రంగనాయకమ్మ గారికి తెలీక కాదు. తెలుసు కాబట్టే పునరావాస పద్ధతుల్లో ఉండే "లోపాల" గురించి ప్రస్తావించారు.

    పేద స్త్రీలందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అలా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే...ఈ వాక్యాన్ని సుధ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోంది.

    ధనిక స్త్రీలెవరూ వ్యభిచారం చెయ్యరు అని సూత్రీకరించలేదు రంగనాయకమ్మ గారు. "ధనిక కుటుంబాల్లో స్త్రీలెవరూ వ్యభిచారంతో జీవించడంలేదు"అని మాత్రమే అన్నారు. "కుటుంబం" అంటూ ఉంటే, అది ధనికమై ఉంటే ఇక "డబ్బు" కోసం వ్యభిచరించే అవసరం ఆ కుటుంబాల స్త్రీలకు ఎందుకుంటుంది?

    రంగనాయకమ్మ గారి అభిప్రాయం ప్రకారం వ్యభిచారం అనేది ఒక వృత్తిగా అంగీకరించనక్కర్లేని విషయం!

    మాకు కావలసింది జాలి దయ కాదు అని నళిని ఎంతగా చెప్పినా 'వారిని అర్థం చేసుకోవడం"అనే పాయింట్ వస్తే వారి జీవితాల పట్ల సామాన్య మానవులకు కలిగేవి ఆ రెండే!

    ReplyDelete
    Replies
    1. asalu sudha garu vyasanni baga chadivera. ranganayakamma garu cheppinadi veru. asalu alanti vanni samajam lo vundakunda povalane kada manamandaru korukunedi. inka alanti vatiki chattabadhta enduku kalpinchali...

      Delete
  2. ధనిక కుటుంబాలకి చెందిన స్త్రీలకి డబ్బుల కోసం వ్యభిచారం చెయ్యాల్సిన అవసరం ఉండదు. భూస్వామ్య సమాజంలో భూస్వాముల ఉంపుడుగత్తెలుగా వెళ్ళేవారైనా, పెట్టుబడిదారీ సమాజంలో వేశ్యలుగా మారేవాళ్ళైనా దిగువ తరగతికి చెందిన మహిళలే అని లెనిన్ కూడా అన్నాడు. స్త్రీలు ఎవరూ వ్యభిచార వృత్తిలోకి దిగే పరిస్థితి ఉండకూడదు అనే రంగనాయకమ్మ గారు కోరుకున్నారు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌