
మహా దార్శనికుడు ఫూలే
మహాత్మా జోతిరావు ఫూలే మానవీయ మహా దార్శనికుడు. ఆయన ఆలోచనలు దేశవ్యాప్తంగా బ్రాహ్మణేతర సామాజిక ఉద్యమాలకు తాత్విక భూమికను అందిస్తూ, దళిత, బహుజన ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేశాయి.
ఆయన తాత్విక చింతననూ, తరతరాలుగా అణచివేయబడిన వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్యకోసం, మహిళల, కార్మిక, కర్షక, మానవహక్కుల కోసం ఆయన సాగించిన కృషిని సమకాలీన దృక్కోణం నుంచి పాఠకుల ముందుంచే విస్తృత వ్యాస సంకలనమిది.
... ... ... ... ... ...
ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఈ కుల వ్యవస్థ భారతీయ సమాజాన్ని అసమ సమాజంగా మార్చివేసింది.
నిచ్చెన మెట్లలాగా ఏర్పడిన భారతీయ సమాజంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ పై వరుసలోనూ, శూద్రులూ, అతి శూద్రులూ పంచనములూ కింది వరుసలోనూ చేర్చబడ్డారు. పైవరుసలో వున్న బ్రాహ్మణులూ, క్షత్రియులూ క్రింది వరుసలోకి నెట్టివేయబడ్డ శూద్రులనూ, పంచములనూ శాశ్వతంగా క్రింది వరుసలోనే ఉంచేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలూ తీసుకున్నారు.
కులాలను సాక్షాత్తు భగవంతుడే సృష్టించాడనీ, ఏ కులంవాడు యే వృత్తిని చేపట్టాలో కూడా భగవంతుడే నిర్ణయించాడనీ, కుల వృత్తిని చేసుకుని బ్రతకడం, అగ్రవర్ణాల వారికి దాస్యం చేయడం ఆ కులంలో పుట్టిన వాడి ధర్మమనీ బ్రాహ్మణులు క్రింది కులంవాళ్లని నమ్మించారు.
ఇలా అగ్రవర్ణాల వారి కుట్రకు క్రింది వర్గాల వారు వేల సంవత్సరాలుగా బలిపశువులుగా మారారు. అమానుషమైన దోపిడీకీి, అవమానాలకూ గురయ్యారు. శూద్రులకూ, దళితులకూ చదువుకునే అవకాశం లేకుండా చేశారు. విద్యకు దూరం కావడంవల్ల వారు అజ్ఞానాంధకారంలోంచి బయటపడలేకపోయారు. తమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించలేకపోయారు. పైకులాల వారికి దాస్యం చేయాలని భగవంతుడే నిర్ణయించాడనీ, అది తాము పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితమనీ నమ్మారు. అ లా నమ్మడం వల్ల తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న చైతన్యమే వారిలో కలగలేదు. ఇలా మన హైందవ సమాజంలో తరతరాలుగా శూద్రులకు జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించిన మొట్టమొదటి భారతీయ దార్శనికుడు జోతిరావు ఫూలే (1827-1890).
...
ఆ మహాత్ముడు చేసిన కృషిని స్మరించుకోడానికి కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 2007 జనవరి 30, 31 తేదీల్లో ఒక జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించారు. నిమ్నవర్గాల అభ్యున్నతికోసం ఎంతో కృషి చేసిన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి ప్రొఫెసర్ మురళీమనోహర్ పదవీ విరమణ సందర్భంగా జరిగిన ఆ సెమినార్‌కు ఉ.సాంబశివరావు, బి.ఎస్.ఎ.స్వామి, బి.ఎస్.రాములు, బుర్రా రాములు, తాటికొండ రమేష్ మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఫూలే జీవితం, దృక్పథం, ఉద్యమం మీద 23 అధ్యయన పత్రాలను సమర్పించారు. ఆ పత్రాల సమాహారమే ఈ పుస్తకం.
మహాదార్శనికుడు ఫూలే
సంపాదకులు: తాటికొండ రమేష్
ముందు మాట: అంపశయ్య నవీన్
250 పేజీలు, వెల: రూ.100
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ 500 067
ఫోన్: 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment