ఆంద్ర జ్యోతి 5 ఏప్రిల్ 2010 వివిధ లో
"ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పుస్తకం పై రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ ను మా బ్లాగు వీక్షకుల కోసం ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాం .
ఆంద్ర జ్యోతి వారికి కృతజ్ఞతలతో.
వ్యభిచారం కూడా ఒక వృత్తేనా? ఈ మధ్య నేను చదివిన పుస్తకాల్లో 'సెక్స్ వర్కర్ ఆత్మ కథ' కూడా ఒకటి. తనను సెక్స్ వర్కర్‌గా చెప్పుకున్న నళినీ జమీలా మలయాళీ స్త్రీ (కేరళ). తన ఆత్మకథని ప్రచురించుకున్న కాలంలో ఆమె వయసు 52.
పుస్తకం రాసిపెట్టే పని ఇతరులు చేశారు. కానీ పుస్తకంలో ఆభిప్రాయాలన్నీ ఆమెవే. రాసిన వాళ్ళు చేర్చిన అభిప్రాయాలన్నీ ఆమె ఏకీభవించినవే. నళిని. తన పుస్తకంలో చివరికి తేల్చిన విషయం. 'ఎవరికి తోచిన వృత్తి వాళ్లు చేసుకుంటున్నట్టు, మేము వ్యభిచారం వృత్తి చేసుకుంటున్నాం. మా పనిని కూడా సమాజం. ఒక వృత్తిగా గుర్తించాలి. అన్ని వృత్తులతో పాటే మా వృత్తిని. కూడా సమాన గౌరవంతో చూడాలి'. ఇదీ పుస్తకం సారాంశం.
మానవ సమాజంలో-ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, మతం కన్నా, వైద్యం లేని జబ్బుల కన్నా, అన్ని రకాల దురంతాల కన్న్నా, అతి క్రూరమైన - అతి నీచమైన దురంతం-వ్యభిచారం. సమాజంలో నిరు పేదతనమూ, పురుషాధిక్యతా అనేవి ఏ దశలో ప్రారంభమయ్యామో ఆ దశలో ప్రారంభమైంది వ్యభిచారం. ఇది, పురుషుల కోసమే. స్త్రీలకు ఇది జుగుప్సాకరమైన దురంతం. కానీ ఈ నళిని. వ్యభిచారాన్ని స్త్రీల కోసం కూడా అవసరమైన విధానంగా కనిపెట్టింది. 'సెక్స్ అనేది కేవలం మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ, అందరూ భావిస్తూ వుంటారు' అంటూ ఆమె వాపోయింది.
మగవాళ్లు విటులుగా తయారైనట్టే, ఆడవాళ్లు వేశ్యలుగా తయారవడం, వారి ఆనందానికి చక్కని మార్గమనే సూచన ఇస్తుంది ఈ పుస్తకం. ఈ సూచనని కనిపెట్టడంలోనూ. ప్రకటించడంలోనూ, నళిని పాత్ర ఒక్కటే కాదు. కొందరు ఫెమినిస్టుల పాత్ర కూడా వుంది. ప్రతి వ్యభిచారిణి జీవితంలోనూ తప్పకుండా ఏదో ఒక విషాదగాధ వుంటుంది. ముఖ్యంగా బీదరికం వుంటుంది. నళిని ప్రారంభ చరిత్ర కూడా అలాంటిదే. తాగుబోతూ,తిరుగుబోతూ గూండాగిరీ గల మగవాడితో సంసారం ప్రారంభించి. తను కూడా తాగుడు నేర్చి తాగుడు తెగులుతో భర్త మూడేళ్ళకే పోగా. ఇద్దరు పిల్లల పోషణ కోసం కూలి డబ్బులు చాలక, క్రమంగా వ్యభిచార ఆదాయ మార్గం చేపట్టింది నళిని.
కూలి పనికి వచ్చే ఆదాయం రెండు పూటలా తినడానికి సరిపోయేదిగా ఉంటే. ఆమె తన దారి మార్చుకునేది కాదు. ఆ తర్వాత కూడా అప్పుడో మగాణ్ణి. ఇప్పుడో మగాణ్ణి భర్తలుగా నమ్మి. ఆ కాలాల్లో వ్యభిచారం కట్టిపెట్టి. కొత్త భర్తల పాత భార్యలు బైట పడగా ఎక్కడా స్థిరపడ లేక, ఇక వ్యభిచారాన్నే శాశ్వితాధారంగా చేసుకుంది. పేద స్త్రీలందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అలా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే.
వ్యభిచార స్త్రీలకు పోలీసుల నించి ఎదురయ్యే కేసులూ, అనారోగ్య పరిస్థితులూ, గూండాల దాడులూ- వంటి సమస్యల్లో, వారిని ఆదుకోవడానికి 'జ్వాలాముఖి' అనే ఫెమినిస్టు సంస్కర్తల సంఘం వుందని తెలిసి, అందులో సభ్యురాలిగా చేరిన తర్వాతే నళినికి. 'వ్యభిచారం చక్కని వృత్తి' అనే విశ్వాసం కలిగింది. ఆ సంఘం ద్వారా ఆ అవగాహన ఏర్పడిన తర్వాతే రాసిన తన ఆత్మకథలో నళిని. తనని 'సెక్స్ వర్కర్‌గానూ, విటుల్ని తన 'క్లయింట్లు' గానూ. ఆ సంబంధాల్ని అవగాహనతో ఏర్పడిన ప్రేమ సంబంధాలు గానూ, అదంతా సమాజం పట్టించుకోనక్కర లేని వ్యక్తుల వ్యక్తిగత విషయంగానూ వివరించింది.
వ్యభిచార స్త్రీలని పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టడం గురించి నళిని మంచి ప్రశ్నలే వేస్తుంది- 'మాది నేరం అయితే. మా దగ్గరికి వచ్చే పురుషులది నేరం కాదా? వాళ్ళని పట్టించుకోరెందుకు? అని, కానీ పోలీసుల దాడుల్లో దొరికిపోయినప్పుడు పురుషులమీద కూడా అరెస్టులూ కేసులూ ఉండడం పత్రికల్లో చూస్తాం. 'వ్యభిచారానికి లైసెన్స్' పద్ధతిని ఆమె ఒప్పుకోదు. అది నీచమైన మార్గం- అని కాదు. లైసెన్సుల్ని పోలీసుల నుంచీ. డాక్టర్ల నుంచీ తీసుకోవాంటే అది మళ్ళీ అనేక ఇబ్బందులు తెచ్చి పెడుతుందని ఆమెకు తెలుసు. 'సెక్స్ వర్క్‌ని ఒక నేరంగా చూడడం మానెయ్యాలనేది మా డిమాండ్, అంటుంది నళిని.
'స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రతి లైంగిక సంబంధమూ పెళ్ళితో ముగియాల్సిందేనా? జీవితాంతమూ ఆ సంబంధం అలా కొనసాగడానికి అవకాశం ఉండదా?' అంటుంది. అంటే, పెళ్ళిళ్ళు వేరే స్త్రీలతో చేసుకోండి. అది వేరు. ఆ తర్వాత కూడా వ్యభిచారం సాగడాని కేం?- అని అర్థం.
ఈ విజ్ఞానం అంతా తనకు, జ్వాలాముఖి సంస్థలో చేరిన తర్వాతే అబ్బినట్టు చెప్పుకుంటుంది. వ్యభిచార సంబంధాలు జీవితాంతమూ సాగకూడదా?- అని ఒక పక్క చెపుతూ. సెక్స్‌ని అమ్మడమూ-కొనడమూ శాశ్విత సత్యాలు కావు. పరిస్థితులే నిర్ణయిస్తాయి అంటుంది ఇంకోచోట. సెక్స్‌ని అమ్మే- కొనే పరిస్థితులు ఎప్పటికైనా బాగుపడాలని ఆమె అభిప్రాయం కాదు.ఆ పరిస్థితులు మారకూడదన్నదే ఆమె వాంఛితం. ఒకసారి. ఒక టీవీ ఇంటర్వ్యూలో టీవీ వాళ్ళు ఆమెని 'ఈ వృత్తి నిర్మూలనకు మీ సంఘం ద్వారా మీరేం చెయ్యదల్చుకున్నారు?' అని అడిగితే. 'ఈ వృత్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని జవాబు చెప్పింది. అంటే, 'సెక్స్ ని అమ్మే- కొనే పరిస్థితులేవీ మారనక్కరలేదని. 'వ్యభిచార స్త్రీలకు పునరావాసం' అనే దానికి ఆమె పూర్తిగా వ్యతిరేకం. ఆ పునరావాస పద్ధతుల్లో లోపాలు వుంటే. వాటిని విమర్శించడం కాదు. అసలు పునరావాసం అనవసరం. వృత్తి మానేస్తేనే మర్యాద దొరకడం కాదు. వృత్తి చేసినా తమకు మర్యాద ఇవ్వాలి.
కుటుంబ స్త్రీలకు లేని ఎన్నో స్వేచ్ఛలు. భర్తలు లేని వ్యభిచారిణులకు వుంటాయిని ఆమె వాదం. భర్తకు వండి వార్చటం. అతని మీద ఆధారపడడం మాకు అక్కర లేదు. అతని ఆస్తిపాస్తుల్లో వాటా ఇమ్మని దేవిరించటం మాకు వుండదు అంటుంది. కుటుంబాల్లో స్త్రీలు, వంటలు చేసేది. భర్తల కోసమే కాదు. తమకోసమూ. పిల్లల కోసమూ కూడా. స్త్రీ భర్త నుంచి స్వేచ్ఛని నిలబెట్టుకోవలసింది. తిరుగుబోతు పురుషుల ద్వారా సంపాదించే డబ్బుతో కాదు. ఈ నళిని తన క్లయింట్ల ద్వారా తను ఎలాంటి అవమానాలు పడిందో. ఎంత జుగుప్సాకరమైన ఘట్టాల్లో నించి ఎంత ప్రాణభయంతో బైట పడిందో చెపతూనే, మానాభిమానాలకు చోటులేని ఆ బతుకులోనే. స్వేచ్ఛ వుంటుందని చెపుతుంది.
'ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో, సెక్స్ సంబంధంలోకి వెళ్ళదలుచుకుంటే, దానివల్ల మిగిలిన సమాజానికి జరిగే హాని ఏమీ లేనప్పుడు ఆ విషయాన్నొక నేరంగా పరిగణించనక్కర్లేదనేది నా వాదన' అంటుంది. తన వాదనలన్నీ చాలా సరైనవని ఆమె నమ్ముతుంది. క్లయింటుతో' పరస్పర అవగాహన' అంటే, 'డబ్బు బేరం' కుదరడం. అది సెటిలైపోతే, మిగతా విషయాలతో సమాజానికి హాని ఉండదు. తన క్లయింట్లు వేరే స్త్రీలకు భర్తలైనా, ఆ భర్తలు జీవితాంతమూ వ్యభిచారిణులతో కూడా చక్కని అవగాహనతో గడపవచ్చు భార్యల జీవితాలు దుఖ్ఖసాగరాల్లో మునిగి పోయినా. తిరుగుబోతు పురుషులవల్ల. సమాజం నిండా తండ్రులు లేని బిడ్డలు తయారైనా. సమాజానికి హాని వుండదు.
'మాకు కావలసింది. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడమే తప్ప, జాలీ. దయా కాదు' అంటుంది. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటే. 'వ్యభిచారం కూడా ఒకవృత్తే' అని అర్థం చేసుకోవాలి. 'బ్రతుకు దెరువుకోసం రాళ్ళ తట్టలు మోసినట్టూ, పారిశుద్ధ్యం పనులు చేసినట్టూ మేము ఈ వృత్తిని చేపట్టాం' అంటుంది ఆడ సెక్స్ వర్కర్లతో పాటు మగ సెక్స్ వర్కర్ల వృత్తిని కూడా ప్రస్తావించింది.
టీచర్లు విద్యాబోధన చేసి డబ్బు తీసుకుంటారు. మధుర గాయకుడు జేసుదాసు పాటలు పాడి డబ్బు తీసుకుంటాడు. ఆ పాటలు విని అందరూ ఆనందిస్తారు. సెక్స్ వర్కర్ల వృత్తిని కూడా అలాగే అర్థం చేసుకోమని నా కోరిక అంటుంది. ఈ కోరిక, దొంగలకూ, హంతకులకూ కూడా వుండవచ్చు.'దొంగతనాలు మా వృత్తి' అని దొంగలూ, 'హత్యలు మా వృత్తి' అని కిరాయి హతకులూ గర్వం గా చెప్పుకోవచ్చు. 'మా వృత్తులకు మర్యాద ఇవ్వండి' అని డిమాండ్ చేయవచ్చు. ఈమె వాదనల ప్రకరం నేరాలన్నీ వేరువేరు వృత్తులే అవ్వాలి. ఇటువంటి అస్తవ్యస్తపు వాదనలు ఎన్నో. ఈ వాదన ప్రకరం. వ్యభిచారిణుల పిల్లలందరూ. 'మా అమ్మ సెక్స్ వర్కర్‌గా పని చేస్తోంది. ఫలానా కంపెనీలో' అని నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. తన కూతురు తనని అలాగే చక్కగా అర్థం చేసుకుందని నళిని ఎంతో ముచ్చటగా చెప్పుకుంటుంది.
వ్యభిచారాన్ని ఒక చక్కని వృత్తిగా బోధించే సంఘసంస్కర్తల చేతుల్లో పడకముందు ఈమె, తన వ్యభిచారాన్ని రహస్యంగా దాచుకోవాలనే తాపత్రయ పడింది. కానీ, కొత్త జ్ఞానంవల్ల, క్రమంగా వ్యభిచారిణులందరికీ ధైర్యాన్ని నూరిపోసే కార్యకర్తగా ఎదిగింది. ఆ ధైర్యంతోనే తన చరిత్రని సాహన చరిత్రగా చిత్రించుకుంది. కానీ, ఆ ఫెమినిస్టుల్లో కూడా కొందరి మీద ఈమె చాలా అసంతృప్తి పడింది. 'జయశ్రీ లాంటి కొద్దిమంది తప్ప, సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తింపు నివ్వడానికి ఇష్టపడడం లేదు. సెక్స్ అనేది మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ. అందరూ భావిస్తూ వుంటారు. చాలామంది ఫెనిమిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు' అని ఆ ఫెనిమిస్టుల మీద అసంతృప్తి ప్రకటించి వాళ్ల పరువు కాపాడింది. 'ఆడ వాళ్ళ అవసరం గురించి ఆడవాళ్ళకు ఈమె చాలా నేర్పబోయింది. గానీ అసలు ఆ విషయం అనేక ప్రశ్నలు సృష్టించింది. తన అవసరం కోసమే తను ఆరకంగా చేస్తున్నానని ఆమె ఆర్థమా? అది తన ఆవసరమే అయితే, దానికి డబ్బు ఎందుకు తీసుకోవాలి? జవాబు లేదు.
వ్యభిచారం అనేది. కుట్టు పనీ. నేత పనీ. వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికీ కావాలి. కానీ. సెక్సు అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు. ఇంత చిన్న జ్ఞానం, ఈమెకు, వికృత మార్గాలు కనిపెట్టే రకపు ఫెనిమిస్టులు ద్వారా అందలేదు.
నిజానికి, వ్యభిచారిణి అయినా, తన నిస్సహాయ చరిత్రని చెప్పి'మా జీవితాల వంటి నీచమైన జీవితం ఏ స్త్రీకి సంభవించకూడదు. ప్రపంచం ఏ నాటికైనా వ్యభిచారం అనే రోత మాటని మరిచి పోవాలి' అనే ఆశతో ముగిస్తే, ఆ రెండు మాటలే ఉత్తమ సందేశంగానూ, ఆమె పూర్తిగా నిర్దోషిగానూ అవుతుంది.