Wednesday, February 18, 2009

ఇట్లు ఒక రైతు ... గొర్రెపాటి నరేంద్రనాథ్‌ ...స్వానుభవాలను స్వగతంలో చెబితే లేదా రాస్తే
ఏ విషయమైనా ఆసక్తికరంగా వుంటుంది.
మనసుకు హత్తుకుపోతుంది.

గొర్రెపాటి నరేంద్రనాథ్‌ రాసిన పుస్తకం ''ఇట్లు ఒక రైతు'' ఆద్యంతమూ ఆసక్తికరంగా వుంది.

పుస్తకం చదవడం ఆరంభిస్తే, అయిపోయేంతవరకు వదలిపెట్టడానికి బుద్ధి పుట్టదు.

నరేంద్రనాథ్‌ 'ఇట్లు ఒక రైతు' అని అన్నారు.
కానీ నిజానికి ఇది రైతులందరి గొడవే.
లక్షలాది మంది ఘోషను తన గొంతు ద్వారా వినిపించారు.

''సేద్యంలో నా గొడవ'' అని రాసుకున్నారు.
అయితే, సేద్యంతో పాటు అనేక ముఖ్యమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక
అంశాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు.

నగరంలో పుట్టి పెరిగినవాడూ, విద్యాధికుడూ అయిన యువకుడు పల్లెబాట పట్టాడంటే నిజంగా ఇది ఎంతో ఆదర్శవంతమైనది, స్ఫూర్తి దాయకమయినది.

స్వగ్రామంలో నరేంద్రనాథ్‌ గత ఇరవై ఏళ్లుగా సేద్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు.
తన చుట్టూ వున్న జనం, ముఖ్యంగా, పేద వర్గాల వారి అభ్యున్నతికి, సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేశారు.
ఈ అంశాలనన్నింటినీ ఆయన ఈ పుస్తకంలో వివరించారు.

రైతుల ఆత్మహత్యలు, నిర్వాసిత సమస్య, గిట్టుబాటు కాని సేద్యం, జలయజ్ఞం (ధన యజ్ఞం?), పేదలకు సాగుభూమి, రాష్ట్రాన్ని సారాంధ్రప్రదేశ్‌గా మార్చటం మొదలైన అంశాలన్నీ ఆయన్ను వేదనకు గురిచేస్తున్నాయి.
జనాన్ని నిరాశలో పడేస్తున్నాయి.
ఆ నిరాశను ఆశగా మార్చడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిద్దాం.

-ప్రొఫెసర్‌ కె. ఆర్‌. చౌదరి (ముందుమాట నుంచి)
....................................................


గొర్రెపాటి నరేంద్రనాథ్‌ కి వ్యవసాయన్నా, ప్రజా ఉద్యమాలన్నా ఎనలేని మక్కువ.
ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే ''లోకాయన్‌'' అనే సంస్థతో కలసి పనిచేసేందుకు గాను ఆయన ఢిల్లీలో తన బ్యాంక్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు.

ఆ తరువాత చిత్తూరు జిల్లాలోని పాకాల వద్దగల తన స్వగ్రామం వెంకటరామాపురంకు వెళ్లి సేంద్రీయ వ్యవసాయ, మొదలుపెట్టారు.

గత రెండు దశాబ్దాలుగా ఒకపక్క రైతుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే మరోపక్క అంటరానితనంపై, భూ సమస్యలపై, నిర్వాసితుల పునరావాసంపై, రైతు సమస్యలపై ఎంతో కృషి చేశారు.
ఆయన ఎన్‌ఎపిఎం, హెచ్‌ఆర్‌ఎఫ్‌, రాష్ట్రీయ రైతు సేవా సమితి వంటి సంస్థల్లో పనిచేస్తున్నారు.

సేంద్రీయ వ్యవసాయదారుడిగా మారిన నరేంద్రనాథ్‌ చేసిన ప్రయోగాలు,
సాధించిన ఫలితాలు, వ్యవసాయంలోని మంచిచెడు అనుభవాల సమాహారమే ఈ పుస్తకం.

తన జీవితంలోని ఆసక్తికరైన విషయాలను ప్రస్తావిస్తూనే
సేంద్రీయ వ్యవసాయ ప్రాధాన్యతను,
వ్యవసాయ రంగపు సాధక బాధకాలను,
పల్లె జీవితంలోని ఒడిదుడుకులను ఆయన ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు.

రైతులకూ,
వ్యవసాయరంగం పట్ల ఆసక్తి వున్నవారికే కాక -
క్షీణిస్తున్న పర్యావరణం గురించి,
తరుగుతున్న సహజ వనరుల గురించి ఆందోళన చెందుతున్న వారికీ,
తాము తింటున్న ఆహారం మంచిదో చెడ్డదో తెలుసుకోవాలనుకునే వారికి
ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.ఇట్లు
ఒక రైతు

-గొర్రెపాటి నరేంద్రనాథ్‌

మొదటి ముద్రణ: ఫిబ్రవరి 2009

138 పేజీలు, వెల: రూ.60

ప్రతులకు, వివరాలకు:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్లాపూర్‌,
హైదరాబాద్‌ - 500028
ఫోన్‌ నెం. 040-2352 1849


...................................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌