Thursday, November 3, 2011

నిష్కల్మతను నిద్రలేపే బషీర్‌ కథలు - వాడ్రేవు చినవీరభద్రుడు


...
నా మళయాల మిత్రురాలొకామెను వైకం మహమ్మద్‌ బషీర్‌ కథలమీద సమీక్ష రాయాలి, ఏవైనా నాలుగు మాటలు చెప్పమని అడిగాను. ఆమె రెండు మాటలు చెప్పింది:

'మొదటిమాట బషీర్‌లో నాకు నచ్చేదేమిటంటే ఆయన రాసిన పుస్తకాలు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతాయి. కానీ ప్రతి వాక్యంలోనూ ఎంత దార్శనికత ఉంటుందంటే, దాన్ని పండితులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అ లాగని ఆ రచనలు చదివి ఆనందించడానికి ఆ దార్శనకిత తెలియాల్సిన పనిలేదు' అని.
ఆమె వెంటనే ఓ ఉదాహరణ కూడా ఇచ్చింది: ''బాల్యకాల సఖి'' కథలో ఒక చిన్నపిల్లవాడు ఒకటి ఒకటి కలిస్తే పెద్ద ఒకటి అవుతుంది అంటాడు. ఈ మాట వినగానే మనకు నవ్వొస్తుంది. రచయిత చిన్న పిల్లల మనస్తత్వాన్ని భలే పట్టుకున్నాడనిపిస్తుంది. కానీ కొద్దిగా ఆలోచిస్తే ఈ వాక్యం తాత్వికంగా చాలా లోతైన వాక్యమని అర్థమవుతుంది. ఒక నది మరొక నదితో కలిసిందనుకో, అప్పుడవి రెండు నదులు కావు కదా, పెద్ద నదిగా మారతాయంతే'' అంది.

ఆమె మాటలు వింటుంటే నాకో ఆలోచన వచ్చింది. కొందరు రచయితలు కొన్ని భాషా సాహిత్యాలకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటారేమోనని. ఉదాహరణకి చలం లాంటి రచయిత మనకి భారతదేశంలో మరే సాహిత్యంలోనూ కనబడడు. గాంధీజీ లాంటి రచయిత ఒక్క గుజరాతీకి మాత్రమే ప్రత్యేకం.
ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గిరిజన తెగలు నివసిస్తుంటారో, అక్కణ్ణుంచి మాత్రమే గోపీనాథ మొహంతి లాంటి రచయిత ప్రభవిస్తాడు. అ లాగే, వైకం మహమ్మద్‌ బషీర్‌ (1908-1994) ఒక్క మళయాళ సాహిత్యానికి మాత్రమే ప్రత్యేకం, ఆ ప్రాంతానికి చెందిన మొక్కల్లాగా, పూలల్లాగా.

పరశురాముడు పైకిలేపాడని చెప్పుకునే భూభాగం మీద హిందువులు ప్రధాన స్రవంతిగా కొనసాగే సమాజంలో అ ల్పసంఖ్యాక ముస్లిం జీవితం నుండి పుట్టి పెరిగిన రచయిత - ఆయన భాషలో ఎనభై శాతానికి పైగా పదజాలం సంస్కృతం మీద ఆధారపడే మళయాళంలో ఒక గురజాడ లాగా పూర్తి మట్టి వాసన కొట్టే సాధారణ వాడుక భాషలో రచనలు చేసినవాడు. దాదాపు అర్థ శతాబ్దపు సాహిత్య కృషిలో ఆయన రాసింది మొత్తం 13 నవలలు, 13 కథా సంపుటాలు. 2,200 పేజీలకు మించని రచనా సర్వస్వం.

కానీ, ఇరవయ్యవ శతాబ్దపు భారతదేశ రచయితల్లో ఒక సుబ్రహ్మణ్య భారతి, ఒక టాగోర్‌, ఒక ప్రేమ్‌ చంద్‌, ఒక గురజాడతో సమానమైన స్థానాన్ని పొందాడు. ఎందుకని?
ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులోకి అనువదింపచేసి తీసుకువచ్చిన ''బహీర్‌ కథలు'' చదివితే ఆ ప్రశ్నకు జవాబు చాలా సులభంగా దొరుకుతుంది.

బషీర్‌ కథలు ఒట్టి కథలు కావు.
అవి ఒక రకంగా ఆయన అనుభవాలు. ఆయన కుటుంబ కథలు. ఆయన పుట్టి పెరిగిన సమాజం కథలు.

ఈ సంపుటంలోని 21 కథలూ చదవడం పూర్తి చేయగానే మనమొక నిజమైన మానవుణ్ణి కలుసుకున్నట్టనిపిస్తుంది. ఆగ్రహం, దు:ఖం, జీవిత పరిమళాలతోపాటు మనకెందుకో ఒకటే నవ్వొస్తూంటుంది. ఆ నవ్వు మళ్లా ఎక్కడో తీవ్రమైన విచారంలోకి తీసుకుపోయి పడేస్తుంది మనని.

బషీర్‌ కథల్ని ఇంగ్లీషులోకి అనువదించిన అబ్దుల్లా ఒక మాట రాస్తాడు: ''మీరు ఈ కథల్ని మళ్లీ మళ్లీ చదవకుండా ఉండలేరు. ఆ కథలు చదువుతూ మీ కళ్లమ్మట నీళ్లొచ్చేంతగా నవ్వుకుంటారు. ఇంతలో మీకు తెలియకుండానే రచయిత మిమ్మల్నేడిపిస్తున్నాడనే సంగతి మీకు తడుతుంది. మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

''పాతుమ్మా మేక'' కథనే తీసుకోండి, ఆ కథ చదువుతున్నంతసేపూ మీరు గడియారం పెండ్యులంలాగా నవ్వులకీ, కన్నీళ్లకీ మధ్య, మళ్లీ కన్నీళ్లకీ, నవ్వులకీ మధ్య ఊగుతూనే ఉంటారు.' (పూవన్‌ బనానా అండ్‌ అదర్‌ స్టోరీస్‌, ఓరియంట్‌ లాంగ్మన్‌, 2009, పే.11).

బషీర్‌ను చదువుతున్నప్పుడు, మనం మర్చిపోయిన మనలోని మానవత్వం, నిజాయితీ, నిష్కల్మషత్వం లాంటి గుణాలన్నీ నెమ్మదిగా బయటికి రావడం మొదలెడతాయి. ఆ మనిషి ఓ వరుసవేది. ఎటువంటి మనిషి కాకపోతే, వైకంలో ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకోమని పంపిస్తే, 16 సంవత్సరాల వయసులో వైకం సత్యాగ్రహం (1924) కోసం వచ్చిన గాంధీజీని ఒక్కసారి తాకి చూడాలని అంతగా ఉవ్విళ్లూరతాడు!

తాకి ఊరకున్నాడా? ఆ క్షణమే సమస్తం వదిలేసాడు. స్కూలుకు పోవడం కన్నా సత్యాగ్రాహ ఆశ్రమానికి పోయిరావడాన్నే ఎక్కువ ప్రేమించాడు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాడు. తిరువాన్కూరు సంస్థానంలో సత్యాగ్రహం చేయాలనుకున్నాడు. జైలుకి వెళ్లాడు. జైలు నుంచి బయటికొచ్చి ఎనిమిదేళ్లపాటు హిమాలయాల నుంచి ఆఫ్రికాదాకా తిరిగిన చోటు తిరక్కుండా తిరిగాడు. చేనేతకారుడిగా, జ్యోతిష్కుడిగా, వంటమనిషిగా, కాపలాదారుగా, సేవకుడిగా, గొర్రెలు కాచుకునేవాడిగా, సూఫీ సాధువుగా, సన్యాసిగా ఆయన ఎత్తని అవతారం లేదు. చెయ్యని ఉద్యోగం లేదు. తిరిగి ఇంటికి రాగానే అరెస్టువారంటు. మళ్లీ మరొకసారి జైలు. జైలు నుంచి బయటపడేటప్పటికి, మానసిక ఉన్మాదం. ఈ సారి పిచ్చాసుపత్రికి.

తుపాను పట్టిన సముద్రంలాగా ఘూర్ణిల్లిన ఆ యవ్వన దినాలన్నీ అయిపోయాక, ఏభైయ్యోపడిలో పడ్డాక, పెళ్లి. ఇద్దరు పిల్లలు. భర్తగా, తండ్రిగా కొత్త పాత్రలు. ''బేపూర్‌ సుల్తాన్‌''గా మూడున్నర దశాబ్దాలు ప్రశాంతమైన గృహజీవితం.

నా మిత్రురాలు చెప్పిన రెండో మాట ఏమిటంటే ''బషీర్‌ రచనలు కాలంతో పాటు కొత్తగా అనిపిస్తాయి. ఆయన మొట్టమొదటి కథ ''ప్రేమ లేఖనం'' (1943) ఇప్పుడు మళ్లీ చదివితే, అందులో స్త్రీపురుష సహజీవనం గురించీ, ఎవరూ మరొకరి మీద పెత్తనం నెరపని ఆదర్శ జీవితం గురించీ, స్త్రీల సాధికారత గురించీ ఎన్నో కొత్త ఆలోచనలు కలుగుతాయి' అని.

నిజమే. ఆ కథలో ఇవి చాలా మామూలు వాక్యాలే కాని, చూడండి: ''అ లా రైలు మూడు స్టేషన్లు దాటి ఆగింది. పెట్టెలో వాళ్లిద్దరే ఉన్నారు. నాలుగో స్టేషను దగ్గర ఆగినప్పుడు కేశవన్‌ నాయర్‌ టీకోసం చూసాడు. సారమ్మ కాఫీ కావాలంది. కేశవన్‌ నాయర్‌ టీయే కావాలన్నాడు. మాటా మాటా పెరిగింది. చివరకి సారమ్మ టీ, కేశవన్‌ నాయర్‌ కాఫీ తాగారు. తెల్లారింది. రైలు ఒక వంతెన దాటుతోంది. వంతెనకింద బంగారు నది ప్రవహిస్తూంది. కాఫీ, టీ గొడవను మరిచిపోయారు వాళ్లు.''

బషీర్‌ ముస్లిం మలబారు ముస్లిం జీవితం గురించి రాసాడు. అరబిక్‌లో ఖొరాన్‌ అధ్యయనం చేసాడు. కానీ ఆయన ముస్లిం మాత్రమే కాదు, పదహారేళ్ల తొలి యవ్వనంలో యువకులు యువతుల ప్రేమకోసం పరితపించే వేళ, ఆయన గాంధీజీతో ప్రేమలో పడ్డాడు. సత్యాగ్రహం చేసాడు. జైలుకు వెళ్లాడు. కానీ కాంగ్రెస్‌ వాది కాదు. భగత్‌సింగ్‌లో తన పోలికలు చూసుకున్నాడు. భావాల్లో, భాషలో సమూల విప్లవం అనుభవించాడు. కానీ రివల్యూషనరీ కాదు. బీదరికం, ప్రేమ, తనకు కలిగినది నలుగురితో కలిసి పంచుకోవడం కోసమే జీవించాడు. దాన్నే రాసాడు. కానీ మ్యూనిస్టు కాదు. స్త్రీ పరిమళాన్ని ప్రాణప్రదంగా ఆస్వాదించాడు. కానీ పూవన్‌ బనానా కథ చదివితే, ఆడవాళ్లను ద్వేషిస్తున్నాడా అనిపిస్తుంది. ఆయన ఫెమినస్టూ కాడు. యాంటీ ఫెమినిస్టూ కాడు. పైకి విరుద్ధంగా కనిపించే ఈ అంశాలన్నిటినీ, ఈ జిగ్‌సా పజిల్‌ని జాగ్రత్తగా పేర్చుకుంటూ పోతే అత్యంత విశ్వసనీయుడైన, అత్యంత ప్రేమాస్పదుడైన ఒక మనిషి ముఖచిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆయన్ని కేరళ సమాజమెలా ప్రేమించిందో మనం కూడా అ లాగే ప్రేమించడం మొదలు పెడతాం.

ఇంతకుముందే చెప్పినట్టుగా, ఆయన మనలో నిద్రపోతున్న నిష్కపట మానవుణ్ణి మేల్కొలుపుతాడు. అవును, మనం కూడా ఒకప్పుడు, మన బాల్యంలోనో, తొలియవ్వనంలోనో ఇంత నిర్మలంగా ఉండేవాళ్లం. ఇప్పుడెందుకిలా అయిపోయాం? మనకి ఏడుపొస్తుంది.

''అమ్మ కథ (అది కథ కాదు, ఆయన జీవితమే) చదవడం ముగించగానే నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది.
బషీర్‌ నేను కూడా నీలా బతకాలంటే, నీలా రాయాలంటే, చెప్పు నేను ఏం కావాలి? ఏం వదులుకోవాలి?

నాలాంటివాళ్లు అసంఖ్యాకంగా ఉన్న తెలుగు సమాజం, తెలుగు సాహిత్య సమాజం తప్పనిసరిగా చదవాల్సిన కథలివి. అనువాదాలు కూడా బాగున్నాయి.

-వాడ్రేవు చినవీరభద్రుడు
( ఆదివారం ఆంద్ర జ్యోతి తేదీ 02 అక్టోబర్ 2011 సౌజన్యంతో )

పేజీలు 200, వెల: రూ.100...

1 comment:

  1. ఏం విమర్శలో, ఏం పుస్తక పరిచయాలో... అనువాదాలు కూడా బాగున్నాయి..ట. ఈ పుస్తకమే అనువాద కథా సంకలనం. మరి కూడా బాగుండటమేంటి తమరి బొంద.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌