Wednesday, September 9, 2009

బషీర్ కథలు - వైక్కం మొహమ్మద్‌ బషీర్


'' దాదాపు వెయ్యేళ్లకు ముందునుంచీ ముస్లింలు ఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచనలు చేస్తాను.''
- వైక్కం మహ్మద్‌ బషీర్‌
.... .... ....
వైక్కం మహమ్మద్‌ బషీర్‌ (1908 - 1994) ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవితకాలంలోనే ఓ 'లెజెండ్‌'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కథలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు. ఏకకాలంలో పండిత పామరుల్నీ, ఆబాల గోపాలాన్నీ ఆలరించే రచనా చమత్కృతి బషీర్‌ ప్రత్యేకతలు.

మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్వితితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్‌ రచనలకు అసమాన ప్రాశస్త్యం వుంది. అది నానాటికీ పెరుగుతోంది.

ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కథా సంకలనమిది.
.....
ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ
2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ
3. పూవన్‌ బనానా
4. బంగారు ఉంగరం
5. దుడ్డులాఠీ పణిక్కర్‌
6. అమ్మ
7. మోసకారి కూతురు
8. తాయెత్తు
9. విశ్వవిఖ్యాత ముక్కు
10. ఏకాంత తీరం
11. గోడలు
12. ఒకనాటి ప్రేమకథ
13. పుట్టిన రోజు
14. టైగర్‌
15. ఒక మనిషి
16. అవని తల్లికి అసలైన వారసులు
17. అనల్‌ హఖ్‌
18. శబ్దాలు
19. ఏనుగు పిలక
20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం
21. పాత్తుమ్మా మేక

సతీష్‌ పొదువాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కల్చరల్‌ స్టడీస్‌ విభాగం, ఈఎఫ్‌ఎల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ఈ పుస్తకానికి ''ఆధునిక వైతాళికుడికి సమకాలీన పరిచయం'' పేరుతో ముందుమాట రాశారు.
........................

ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌
జి.షేక్‌బుదన్‌
విమల
ప్రభాకర్‌ మందార
సి.వనజ
హెచ్చార్కె
పి.సత్యవతి
ఎస్‌.జయ
భార్గవ
కాత్యాయని
ఆకెళ్ల శివప్రసాద్‌
సంధ్య
కలేకూరి ప్రసాద్‌
పట్నం ఉమాదేవి
....................

మధ్య కేరళలోని ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 1908లో పుట్టిన బషీర్‌ చాలావరకు తనను తానే రచనకు ముడిసరుకు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే భారత జాతీయోద్యమంలో చేరి ఎన్నోసార్లు జైలుకెళ్లారు. ఆ తర్వాత జర్నలిస్టుగా, తీవ్రవాదిగా, దేశ దిమ్మరిగా, సూఫీ సాధువుగా, హోటల్లో పనిమనిషిగా, మిల్లు కూలీగా, వంటమనిషిగా, హస్త సాముద్రికుడిగా, ట్రావెల్‌ ఏజెంట్‌గా ... ఇంకా ఎన్నెన్నో వృత్తులు చేశాడాయన. ప్రముఖ రచయితగా పేరు గడించిన తర్వాత పుస్తకాల దుకాణం నడిపారు. ఈ సహస్ర వృత్తుల బలం కేవలం బషీర్‌ వ్యక్తిత్వాన్నే కాదు, ఆయన రచనలనూ పదును దేల్చింది. ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. 1970: కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1972: స్వాతంత్య్ర సమరంలో పాల్గోన్నందుకు కేంద్రప్రభుత్వ తామ్రపత్రం,1981: కేరళ సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1982: పద్మశ్రీ పురస్కారం, 1987 కాలికట్‌ యూనివర్సిటీ డిలిట్‌ ప్రదానం. బషీర్ మాత్రం ఇవేమీ పట్టనట్టే వుండేవారు. అదే ఆయన ప్రత్యేకత. బషీర్‌ 1994 జులై 5న కన్నుమూశారు.

బషీర్‌ రచనలను ఎన్నింటినో స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చారు. భారతీయ/కేరళ సాహిత్య చరిత్ర గ్రంధాలన్నింటిలో వీటిని ప్రత్యేకంగా చర్చించారు. విఖ్యాత దర్శకులు పలు సినిమాలుగా కూడా తీశారు. బషీర్‌ ఫొటోలు, చిత్రాలు ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లిపోయాయంటే కేరళలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు పట్టగలరు . ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడచిపోయినా ఇప్పటికీ 'బేపూర్‌ సుల్తాన్‌'గా (బషీర్‌ ఈ పేరుతోనే లబ్ధప్రతిష్టులు), భారతీయ సాహితీ జగత్తులో అత్యంత సమ్మోహనాత్మక రచయితగా ఎప్పటికీ నిలిచే వుంటారు.
................

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009

289 పేజీలు, వెల: రూ.100

.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.............

2 comments:

  1. బషీర్ కధలండి శీర్షిక సరిదిద్దండి

    ReplyDelete
  2. @ రాజేంద్ర కుమార్ గారూ,
    పొరపాటును సరిదిద్దాం. తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌