Wednesday, July 4, 2012

తొలి తెలుగు కథా రచయిత్రి ''భండారు అచ్చమాంబ సచ్చరిత'' - కొండవీటి సత్యవతి


1910లో గురజాడ రాసిన ''దిద్దుబాటు'' కథే తెలుగులో తొలి కథగా ఇంతవరకూ ప్రచారంలో వుంది. కానీ నిజానికి శ్రీమతి భండారు అచ్చమాంబ  1902లో రాసిన ''ధన త్రయోదశి'' కథ తొలి  తెలుగు కథ. ఇది 'హిందూ సుందరి' పత్రికలో ప్రచురించబడింది.

భండారు అచ్చమాంబ అతి చిన్న వయసులోనే కథా రచన మొదలు పెట్టినట్టు, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనేక రచనలను అనువదించినట్టు 'తెలుగు జనానా' పత్రికను నిర్వహించిన రాయసం వెంకటశివుడు వెల్లడించారు. అయితే 1898లో ప్రచురించబడ్డ ఆమె రెండు కథలు ఇప్పుడు లభించడం లేదు. అందువల్ల 1902 నాటి ధనత్రయోదశి కథే తొలి తెలుగు కథగా చెప్పుకోవాలి.

ధనత్రయోదశి కథలోని ఇత్రివృత్తం, గురజాడ 'దిద్దుబాటు' కథలోని ఇతివృత్తం దాదాపు ఒక్కటే కావడం ఒక విచిత్రం.... రెండు కథల్లో వున్న థీమ్‌ తెలివైన భార్య తన భర్తను సంస్కరించుకోవడం!

1874లో కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన అచ్చమాంబ బాల్యం నల్గొండ జిల్లా దేవరకొండలో గడిచింది. పదేళ్లు కూడా నిండని వయసులో ఆమె వివాహం దేవరకొండలోనే భార్య చనిపోయి ఒక బిడ్డ కూడా వున్న మేనమామ భండారు మాధవరావుతో జరిగింది. ఆమెను కొందరు తెలంగాణా  రచయిత్రిగా మరికొందరు ఆంధ్ర రచయిత్రిగా పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా వందేళ్ల క్రితమే స్త్రీల స్థితిగతుల గురించి ఎంతో అత్యాధునికంగా ఆలోచించి, స్త్రీల అభ్యున్నతి కోసం అహరహం కలవరించి, పలవరించిన అచ్చమాంబ ఆనాటి స్త్రీల పరిస్థితిపట్ల తన ఆవేదనను, అంతరంగ ఘోషను కథలుగా, వ్యాసాలుగా, చరిత్రగా ఉపన్యాసాలుగా మలుచుకున్న తీరు ఆమోఘం, ఆశ్చర్యకరం కూడా. ఆ విషయాలనన్నింటినీ సవిరంగా చర్చించిన పుస్తకమిది.

ఈ పరిశోధనాత్మక రచనను అందించిన శ్రీమతి కొండవీటి సత్యవతి ఫెమినిస్ట్‌గా, భూమిక సంపాదకురాలిగా, రచయిత్రిగా తెలుగు పాఠకులకు సుపరిచితమే.

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర
-కొండవీటి సత్యవతి

పేజీలు : 92, వెల : రూ.50/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849
ఇ మెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

1 comment:

  1. మంచి వ్యాసం. శ్రీమతి భండారు అచ్చమాంబ గారు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి అక్కగారు. ఈ‌విడ ప్రముఖ రచన అబలాసచ్చరిత్రరత్నమాల. మీరు యీ రెండు విషయాలూ ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది వ్యాసం.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌