Sunday, October 11, 2009

పౌరహక్కులకు మరో పేరు బాలగోపాల్‌ - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నివాళి



1970,80 దశాబ్దాలలో అనేక కీలక ఉద్యమాలు మన దేశాన్నే కాక ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపాయి. ఐరోపాలో విద్యార్థుల తిరుగుబాటు, వియత్నాం యుద్ధవ్యతిరేక పోరాటం, అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం, భారతదేశంలో నక్సల్‌బరీ ఉద్యమం మొదలైనవాటి నేపథ్యంలో ఎందరో కొత్త తరం ప్రజానాయకులు ఆవిర్భవించారు. అట్లాంటి వారిలో బాలగోపాల్‌ ప్రముఖులు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల ఉద్యమానికి పథనిర్దేశనం చేసిన సాహసి ఆయన.

గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా, రచయితగా, వక్తగా, వకీలుగా బహుముఖ ప్రతిభావంతుడైన బాలగోపాల్‌ తన జీవితాన్ని పూర్తిగా తాడిత పీడిత ప్రజల సంక్షేమానికి అంకితం చేశారు. రాజ్య హింస, పౌరహక్కుల ఉల్లంఘన ఎక్కడ ఏ మారుమూల, ఏ అటవీ ప్రాంతంలో జరిగినా ఆయన వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆపన్నులకు అండగా నిలిచేవారు. అందుకోసం కాకతీయ యునివర్సిటీలో తన అధ్యాపక వృత్తిని సైతం తృణప్రాయంగా త్యజించారు.

రాజ్య హింసతో పాటు విప్లవం పేరుతో జరిగే అనుచిత హింసను కూడా ప్రశ్నిస్తూ ఆయన పౌరహక్కుల సంఘం నుంచి విడిపోయి మానవ హక్కుల సంఘాన్ని స్థాపించి తన పరిథిని ఇంకా విస్తరించుకున్నారు. అయితే మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి తెలిసినట్టు న్యాయవాదిగా ఆయన ప్రజలకు అందించిన సేవగురించి చాలామందికి తెలియదు.

తను ప్రథానంగా గణితశాస్త్రజ్ఞుడు అయినప్పటికీ పతితులకు, బాధాసర్ప దష్టులకు మరింతగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంతో దీక్షగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పేదల పక్షాన నిలిచి లాయర్‌గా హైకోర్టులో ఎన్నో కేసులు వాదించారు. ఆదివాసీలు, బీడీ కార్మికులు, ఉపాథి కోల్పోయినవాళ్లు, గృహహింసకు, రాజ్యహింసకు గురైన వాళ్లు ఇలా ఎందరెందరి తరపున్నో ఆయన పైసా ఫీజు తీసుకోకుండా అత్యంత ప్రతిభావంతంగా వాదించి న్యాయం జరిపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దత్తత పేరిట జరగుతున్న పసిపిల్లల విక్రయాలకు శాశ్వతంగా తెరదించేట్టు చేయడంలో బాలగోపాల్‌ నిర్వహించిన పాత్ర అపూర్వమైనది. ఆయన మరణం వల్ల మానవ హక్కుల ఉద్యమానికి జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ హైకోర్టు న్యాయవాదనకు జరిగిన లోటును పూడ్చడం అసాధ్యం అనిపిస్తుంది.

బాలగోపాల్‌ మానవహక్కుల నేతగా, న్యాయవాదిగానే కాక రచయితగా కూడా ఎంతో సుప్రసిద్ధులు. తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ఆయన ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ప్రత్యేకించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో రాసిన వ్యాసాలు, నక్సలైట్‌ ఉద్యమం మీద రాసిన పుస్తకాలు ఎంతో సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఆయన రచన ''కల్లోల లోయ'' (కాశ్మీర్‌ సమస్య), ''ప్రాచీన భారతదేశ చరిత్ర'' (డి.డి.కొశాంబి పరిచయం అనువాదం) ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వార్థం, డబ్బు సంపాదన, సుఖలాలసత్వం, వినిమయతత్వం, వ్యక్తిగత వాంఛలు, వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో నిస్వార్థానికి, నిర్భీతికి, నిరాడంబరతకు, పరోపకారానికి ప్రతీకగానిలిచే బాలగోపాల్‌ జీవన శైలి నిజంగా ఒక అద్భుతం. ఆయన స్మృతి, స్ఫూర్తి ఎన్నటికీ చెరిగిపోవు.

3 comments:

  1. ఆంధ్ర దేశంలో ఒక గొప్ప శాంతి ప్రవక్త కన్నుమూశారు.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. హైదరా బాద్ బుక్ ట్రస్ట్,
    *తను ప్రథానంగా గణితశాస్త్రజ్ఞుడు అయినప్పటికీ పతితులకు, బాధాసర్ప దష్టులకు మరింతగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంతో దీక్షగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పేదల పక్షాన నిలిచి లాయర్‌గా హైకోర్టులో ఎన్నో కేసులు వాదించారు. ఆదివాసీలు, బీడీ కార్మికులు, ఉపాథి కోల్పోయినవాళ్లు, గృహహింసకు, రాజ్యహింసకు గురైన వాళ్లు ఇలా ఎందరెందరి తరపున్నో ఆయన పైసా ఫీజు తీసుకోకుండా అత్యంత ప్రతిభావంతంగా వాదించి న్యాయం జరిపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దత్తత పేరిట జరగుతున్న పసిపిల్లల విక్రయాలకు శాశ్వతంగా తెరదించేట్టు చేయడంలో బాలగోపాల్‌ నిర్వహించిన పాత్ర అపూర్వమైనది. ఆయన మరణం వల్ల మానవ హక్కుల ఉద్యమానికి జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ హైకోర్టు న్యాయవాదనకు జరిగిన లోటును పూడ్చడం అసాధ్యం అనిపిస్తుంది. *
    * స్వార్థం, డబ్బు సంపాదన, సుఖలాలసత్వం, వినిమయతత్వం, వ్యక్తిగత వాంఛలు, వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో నిస్వార్థానికి, నిర్భీతికి, నిరాడంబరతకు, పరోపకారానికి ప్రతీకగానిలిచే బాలగోపాల్‌ జీవన శైలి నిజంగా ఒక అద్భుతం. ఆయన స్మృతి, స్ఫూర్తి ఎన్నటికీ చెరిగిపోవు. *
    బాల గోపాల్ గారి గురించి మీరు చాలా బాగా రాశారు. కాని ఒకటి మాత్రం మీరు రాయటం మరచిపోయారు. అది ఆయన బ్రహ్మణుడని. సాధారణం గా మీరు ప్రచురించె పుస్తకాల లో హిందూ మతమును,బ్రాహ్మణలను విమర్శిస్తూ రాసే మీరు, అదే బాల గోపాల్ విషయం లో ఎక్కడా వ్యాసం లో ఆయన బ్రహ్మణుడని రాయ లేదు. మీరు ప్రచారం చేసే లేక రాసే పుస్తకాలా లో ఉన్న నిజం ప్రజలందరికి తెలుసు. మీరన వచ్చెమో ఆయన కి కుల మతాల పట్టింపు లేదు అని, కాని ఇదే బాలగోపాల్ లాంటి వాడు ఎదైనా ఇతర మైనారిటి వరగం,లేక దళితుడు అయితే మీరు ఆ విషయం ప్రస్తావించ కుండా ఉనంటారా? బాలాగోపాల్ లాంటి బ్రహ్మణులు చాలా మంది వెనుక బాటు తనానికి, అంటరాని తనానికి పాటు పడినా వారి గురించి మీరు ఎన్ని పుస్తకాలు ప్రచురించారు?

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌