Sunday, February 8, 2009

ఎగిరే క్లాస్‌ రూమ్‌ ...జర్మన్‌ రచన: ఎరిక్‌ కాస్ట్‌నర్‌...తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య



... రెక్కలు చాచిన బాల్యం ...

పిల్లల కోసం రాసిన పుస్తకాల్లో పబ్లిషర్లు అయస్కాంతం ముక్కలేమైనా అతికించి పెడతారేమో.
లేకపోతే కొన్ని పుస్తకాలు మన చేతులకు, కళ్లకు, ఆపైన మనసుకు అంత గట్టిగా ఎలా అతుక్కుపోతాయి?

'' ఎగిరే క్లాస్‌ రూం '' లో అ లాంటి ఒక అయస్కాంతం ముక్క కచ్చితంగా వుంది.
ఎరిక్‌ కాస్ట్‌నర్‌ అనే జర్మన్‌ రచయిత 75 ఏళ్ల క్రితం బాల్యానికి, పిల్లల స్నేహానికి ఇచ్చిన గొప్ప గౌరవం ఇది.
బి.వి.సింగరాచార్య దీన్ని నేరుగా జర్మన్‌ నుంచి అనువాదం చేయడం మన అదృష్టం.

అయితే 40 ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చి కూడా నిన్న మొన్నటి వరకు ఎవరికీ అందుబాటులో లేకపోవడం మాత్రం మనందరి దురదృష్టం.

బుగుడులా, టామ్‌ సాయర్‌ లా ఇందులోని పిల్లలందరూ మనకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు.
అసలు వాళ్లలో వున్నది మనమే అనుకుంటాం.

ప్రత్యర్థి విద్యార్థుల్ని బందీలుగా పట్టుకుపోవడం, వాళ్ల ఎక్సర్‌సైజు పుస్తకాలను ఎత్తుకుపోవడం, వాటికోసం మంచు ముద్దలతో యుద్ధాలు, గాయాలు, అయినా విషయం టీచర్ల దాకా వెళ్లకుండా విద్యార్థి గౌరవాన్ని నిలబెడుతూ తమలో తామే పరిష్కరించుకోవడం... ఇన్ని వున్నాయి ఇందులో.

ఒట్టి అ ల్లరే కాదు పేదరికాన్ని కప్పి పెట్టేందుకు పెట్టుకున్న కన్నీళ్లు, పిరికితనం నుంచి బయటపడడానికి చేసే పెను సాహసాలు, కొందరు టీచర్లంటే ప్రత్యేక అభిమానాలు, స్నేహాలు, వైఫల్యాలు ... ఇవీ వున్నాయి చాలానే.

ఇంత మంచి పుస్తకం రాసిన ఎరిక్‌ కాస్టనర్‌ని నాజీలు చాలా ఇబ్బందులపాలు చేశారంటే, ఈ పుస్తకాల ప్రతులను సైతం తగలబెట్టారంటే ఎంత నాజీలైతే మాత్రం బాల్యాన్ని కూడా బతకనివ్వరా, కాల్చిపడేస్తారా అని ఒళ్లు మండిపోతుంది మనకి.

అనువాద ప్రతిని జాగ్రత్తగా దాచి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు అందించిన చిత్రకారుడు అన్వర్‌కు ప్రత్యేక అభినందనలు.

- వసంత

(...ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 ఫిబ్రవరి 2009 సౌజన్యంతో ... )



ఎగిరే క్లాస్‌రూమ్‌
- ఎరిక్‌ కాస్ట్‌నర్‌

తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య

పేజీలు : 162, వెల: రూ.70


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్ నెం. 85 ,
బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్ ,
హైదరాబాద్ - 500 067
ఆంద్ర ప్రదేశ్
ఫోన్ నెం. 040-2352 1849

.......................................

1 comment:

  1. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదు.ఒక తరం బాల్యం యొక్క కుతూ హలాన్ని నాశనం చేస్తే చాలు

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌