Sunday, January 25, 2009

పంచమం ... నవల ... రచన : చిలుకూరి దేవపుత్ర .





'ఆటా' నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు 2001లో, యునివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఆంధ్రా యునివర్సిటీ వారు 2005లో తమ ఎం.ఎ. తెలుగు సిలబస్‌లో చేర్చి గౌరవించారు. ఈ నవల ఉండేల విజ్ణాన కళా పీఠం అవార్డును కూడా గెలుచుకుంది.
....

....పద్మకి ఇంగ్లీషు గ్రామర్‌ ట్యూషన్‌ చెపుతున్నాడు శివయ్య. పద్మ తల్లి ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఎప్పటిలాగే పద్మకి స్టీల్‌ గ్లాసులో, శివయ్యకి సత్తుగ్లాసులో.
పద్మవాళ్ల ఈడిగ కులం పెద్దగొప్పదేం కాకపోయినా శివయ్య మాదిగవాడు.
శివయ్యను ప్రేమగా పలకరిస్తూనే అతనికి సత్తు గ్లాసులో కాఫీ ఇవ్వడం సహజమైన విషయంగా పద్మ తల్లి భావిస్తుంది.అ లా కాఫీ ఇచ్చినప్పుడల్లా పద్మ ఎంతో అపరాధ భావనకు గురవుతుంది.

అమ్మ ఇద్దరికీ స్టీల్‌ గ్లాసుల్లోనే కాఫీ ఇస్తే ఎంత బావుండును అనుకొంటుంది. తన గ్లాసు అతనికిచ్చి, అతని గ్లాసు తను తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అదే జరిగితే పరిణామాలెంత తీవ్రంగా వుంటాయో శివయ్యకు తెలుసు.
నిత్యమూ అనుమానాల మధ్యన, హింసల మధ్యన, హింసోన్మత్త ఎగతాళి చూపుల మధ్యన పుట్టి పెరిగినవాడు శివయ్య. ఆ సున్నిత తిరస్కృతి వెనుక ఎంతటి భయం, దాగివుందో, ఎంతటి భీభత్సం పొంచి వుందో రచయిత చిలకూరి దేవపుత్ర తన ''పంచమం'' నవలలో బొమ్మ కట్టినట్లు చూపుతాడు.

తల్లా ప్రగడ వారి ''హేలావతి'' నవల నుండి ఈనాటి వరకూ దళిత జీవితాన్ని చిత్రిస్తూ అనేక నవలలు, కథలూ వచ్చాయి. దళితుడుగా పుట్టి, దళితాన్ని జీవించి, ఆ బాధలోంచి ఆవేదనలోంచి, ఆ అనుభవంలోంచి ఆవిష్కరించిన దళిత జీవన పరిణామమే ''పంచమం'' నవల. దళిత జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతోందో ప్రతి చిన్న కదలికతో సహా పట్టి మనకు అందించారు దేవపుత్ర.

.......... కలేకూరి ప్రసాద్‌ (గుండె గొంతుకను దాటిన పంచమం స్వరం, వార్త 8-2-1999)


.........

..... జీవితాన్ని అద్భుతంగా చిత్రించలిగిన నవలా ప్రక్రియలోకి దళిత సాహిత్యోద్యమం ప్రవేశించకపోవడం ఇన్నాళ్లూ ఒక వెలితిగానే ఉండింది. నిజానికి దళిత జీవితంలోని వైవిధ్యం, కళాత్మకత, ఆర్థిక, రాజకీయ, సాంస్కృనిజతిక రంగాలలో దళితులు అనుభవిస్తున్న దోపిడీ పీడనల ప్రత్యేక రూపాలు నవలా ప్రక్రియకు విశిష్టమైన ముడిసరుకుగా పనిచేస్తాయి.

అయితే దళిత సాహిత్యోద్యమం ఆ అద్భుతమైన ముడి సరుకును ఉపయోగించి సృజనాత్మక, కాల్పనిక ప్రక్రియలుగా అనువదించలేకపోయింది. ఆ పని జరిగే లోగానే వాద వివాదాలలో, చీలికలలో పడి జీవన సంక్లిష్టతను సమగ్రంగా ఆకళించుకోగల కుదురును రచయితలకు అందించలేని స్థితి నెలకొంది.

ఈ అన్ని కారణాల వల్ల చిలుకూరు దేవపుత్ర నవల పంచమం, తెలుగు నవలా చరిత్రలోనూ, దళిత జీవిత చిత్రణ చేసిన సృజనాత్మక కళారూపాలలోనూ ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నూట ఇరవై ఏళ్ల తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో, సంక్లిష్ట సామాజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ మధ్య వున్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తీకరించడంలో ''పంచమం'' అగ్రస్థానంలో నిలుస్తుంది.

...........ఎన్‌. వేణుగోపాల్‌ (సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, ఆంధ్ర ప్రభ, 15-5-2000)

.........

....కమర్షియల్‌ నవలలు ఎప్పుడూ వస్తుంటాయి. డబ్బు చేసుకుంటుంటాయి. పాఠకులు వాటిని పొద్దుపోవడానికి చదువుతూ వుంటారు. ఆ మరుసటి రోజే చదివినదంతా మరిచిపోతుంటారు. అందుకు కారణాలు - వాటి ఇతివృత్తాలు రచయిత మెదడులోంచి మాత్రమే పుట్టుకురావడం, వాటిలోని పాత్రలన్నీ నేలమీద నడవక పోవడం.

కానీ సామాజిక స్పృహతో చేసిన రచనలన్నీ పదికాలాలపాటు నిలబడతాయి. అందుకు ఉదాహరణ ఉన్నవగారి ''మాలపల్లి'', మహీధర గారి ''రథచక్రాలు'', కొడవటిగంటి కుటుంబరావుగారి ''చదువు'' మొదలైన నవలలు. దళితులు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా, మంత్రి పదవులు చేపట్టినా, వారు భూస్వాములకీ, రాజకీయ నాయకులకీ ఉపయోగపడతారే తప్ప మరెవరికీ ఉపయోగపడరు. దళితులకి రాజ్యాధికారం రావాలంటే వాళ్లల్లో చైతన్యం రావాలి, వాళ్లంతా ఒక్కటయిపోరాడాలి. ఈ అంశాలు ''పంచమం''లో బలంగానే చెప్పానని అనుకుంటున్నాను.

.......... చిలుకూరి దేవపుత్ర (మీతో కాసేపు, ముందుమాట నుంచి)
....

- చిలుకూరి దేవపుత్ర అనంతపురం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డిడబ్ల్యూఎంఎ), ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్నారు. ఇంతవరకూ వీరివి 100 కథలకు పైగా వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీటిలో కొన్ని ఆంగ్ల, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. ''ఆరుగ్లాసులు'', ''ఏకాకి నౌక చప్పుడు'', ''వంకరటింకర ఓ'', ''బందీ'' పేర్లతో నాలుగు కథా సంకలనాలు వెలువడ్డాయి.
''అద్దంలో చందమామ'', ''చీకటి పూలు'', ''పంచమం'', ''కక్షశిల'' నవలలు ప్రచురితమయ్యాయి.

....


పంచమం (నవల)
రచన: చిలుకూరి దేవపుత్ర
ముఖచిత్రం : రమణ జీవి
275 పేజీలు, వెల: రూ.100


ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కా పూర్‌,
హైదరాబాద్‌- 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

........................

.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌