Sunday, January 4, 2009

మా కొద్దీ నల్ల దొరతనము ... కుసుమ ధర్మన్న కవి (1921)


తెల్ల దొరల పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్న దశలోనే దళితులు తమపై తరతరాలుగా సాగుతూ వస్తున్న నల్ల దొరల పీడన, అణిచివేత, వివక్షల నుంచి విముక్తిని కోరుకున్నారు.

బ్రిటీష్‌ రాజ్యం పోయి స్వరాజ్యం వస్తే అది ఎవరి రాజ్యం అవుతుంది?

స్వరాజ్య ఫలాలు అందరికీ అందుతాయా లేక కొందరికే చెందుతాయా?

అనే ప్రశ్నలు వారిని అప్పట్లో తీవ్రంగా వేధించాయి.

ఆ వేదనలోంచి వెలువడిందే ఈ ''మా కొద్దీ నల్ల దొరతనము'' పుస్తకం.

దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి - తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో 'కుసుమ ధర్మన్న కవి' ఒకరు.

ఆయన ఈ పుస్తకాన్ని 1921లో వెలువరించారు.

అయితే గరిమెళ్ల సత్యనారాయణ రాసిన '' మాకొద్దీ తెల్లదొరతనం'' ప్రబోధ గీతాలు కూడా అదే సంవత్సరం వెలువడ్డాయి.

కాగా కుసుమ ధర్మన్న కవే ముందుగా '' మాకొద్దీ నల్లదొరతనము'' పాట రాశారనీ, ఆ తరువాత అదే వరసలో గరిమెళ్ల ప్రబోధ గీతం రాశారని ప్రతీతి.

మొత్తం మీద ఈ రెండూ ఏకకాలంలో ప్రచారం పొందాయి.

''స్వారాజ్య మనుచు సర్కారుతో పోరాడి
స్వాతంత్రీయ మడుగుతారు
మాకు స్వాతంత్య్ర మివ్వబోరు

గుడిగోపురాలకైనా రానీరు
సత్రమూలందు మమ్ముండనీరు
నూతి నీళ్లన్న తోడుకోనీరు
మాలలంటె హక్కు లేదంటారు
మాకు హక్కు లేదంటె స్వారాజ్య మెక్కడ దక్కు?...

మాకొద్దీ నల్ల దొరతనము -
దేవ మాకొద్దీ నల్ల దొరతనము
మాకు పదిమందితో పాటు -
పరువు గలుగకున్న
మాకొద్దీ నల్ల దొరతనము''

అంటూ ఆగ్రహంతో ఆక్రోశిస్తాడు కవి.

తెల్లదొరల పైని కళ్లెరగ్రా జేసి
హక్కు లడగ జూచు నాగ్రహమున
పక్కనున్న నిన్ను తొక్కిపెట్టరె వీరు
ఆలకింపు మయ్య హరిజనుండ

అంటూ దేశంలో వున్న మాల మాదిగలపట్ల దారుణమైన వివక్షను ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాలోని జాతివివక్ష గురించి మాట్లాడే అగ్రవర్ణాల వారి హిపోక్రసీని బట్టబయలుచేస్తాడు.

అచ్చరాలు నేర్వ - ముచ్చటున్న గాని
చదువు బడిలో జేరనీరు
చదువు చదివితే సహించుకోరు
విద్యలేదని వెయ్యి తిట్టేరు
సరివారినీ దరికి రానీరు - దేవ
వేదాలంటా మేము వినరాదంట బాబు...

దళితులకు చదువుకునే అవకాశం లేకుండా చేసింది అగ్రకులస్థులే. తిరిగి విద్య లేనివాడు వింత పశువు అంటూ దళితులను అవహేళన చేసేదీ అగ్రకులస్థులే.

అగ్రకులాలవారు దళితుల పట్ల ప్రదర్శించిన అమానుషమైన వివక్షను, అన్యాయాన్ని, అంటరానితనాన్ని, హిందూ అధర్మశాస్త్రాలను, సాంప్రదాయాలను చీల్చి చెండాడుతాడు కవి.

మా కొద్దీ నల్ల దొరతనము
(అంటు దోషము మాన రేలా?)

- కుసుమ ధర్మన్న కవి
28 పేజీలు, వెల: రూ.7

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌