Sunday, January 19, 2014

ఇతని ఆగ్రహానికి ఒక ధర్మం ఉంది..ఈ యుద్ధానికి ఒక అనివార్యత ఉంది – రమా సుందరి (Kinige.com)




చదివి వెంటనే పుస్తకాన్ని విసిరేశాను కాని ….  
పుస్తకం మెదడుకు పంపిణీ చేసిన చేదు వాస్తవ రసాయనాలు ….  
అవి అచ్చులేసిన ముద్రలను తుడిచి వేయలేక పోయాను. 

ఇది డా. గోపీనాథ్ ఆత్మ కధగానే నేను చదవగలిగి ఉంటే ఇందులో నిజాలు, నిర్ధారణల కోసం పరుగులు పెట్టే అగత్యం నాకు కలిగేది. కానీ ఈ పుస్తకం ఒకానొక ప్రాధాన్యత కలిగిన కాలంలో రచయిత సాగించిన చేవగలిగిన బతుకు నడక. తన మూలాల తాలూకు యధార్ధాన్ని ఏమారకుండా అప్రమత్తతతో కాలు సాగించిన త్రోవరీ ఈయన. 

ఈ నడకలో నాకు ఒక మారుమూల భారతీయ పల్లె నుండి కొద్దిగా తెగువ, విశ్వాసం మూట ముడిచి కర్రకు చివర కట్టుకొని బయలు దేరిన పాదచారి కనిపించాడు. గమ్యం తెలుసు. కానీ దోవ ఎవరూ వేయలేదు. కష్టపడి వేసుకొన్నదారి తిన్ననైనదేమీ కాదు. దానికోసం చేసిన యుద్దం తక్కువదీ కాదు.

ఈ పుస్తకంలో రచయిత బయలు పరిచిన వస్తువుకి సార్వజనీనత ఉంది. వర్తమాన సామాజిక చిత్రంలో ఇప్పటికీ అనేకానేక సంఘటనలుగా కనిపిస్తూ ఈ వస్తువుకి తిరుగు లేని దాఖలాలు చూపిస్తున్నాయి. దళితులు అయినందుకు ప్రాజెక్ట్ గైడ్ గా ఉండటానికి ఒప్పుకోని ప్రొఫెసర్లు, ‘మీరు ప్రభుత్వ దత్తపుత్రులుఅని ఎకెసెక్కం చేసే విద్యార్ధులు వీరందరితో కూడిన సమాజం చుట్టూ ఇప్పటికీ ఉన్నపుడు ఈ ఆత్మకధలో ఏ విషయాన్ని తిరస్కరించగలం? రాజ్యాంగంలో హక్కులు, వెసులుబాటులు ఉంటాయి. అమలు పరిచే కాడ నిష్ఠూరం ఉంటుంది. గ్రంధాలయాల్లో దళితులకు పుస్తకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇచ్చే దగ్గర మనసు ఒప్పదు. స్కాలర్షిప్పులు అరకొరగా వస్తాయి. సమ్మతించటానికి అధికారులు నొసలు చిట్లిస్తారు. ఉన్న ఒక్క చొక్కా రోజూ ఉతుక్కొని, అర్ధాకలి కడుపుతో కాలేజీకి వెళ్ళే విద్యార్ధిలో క్రమశిక్షణ, శుభ్రత లేదనే సమన్యాయఅధ్యాపకుల ఆగ్రహం. ఇవన్నీ ఇప్పటి సమాజం వదిలేసిన విషయాలా?

ఇంకా కులవివక్షత ఉందా?” “కుల ప్రయోజనాలు పొందుతున్నప్పుడు కులం పోవాలని అనటం విడ్డూరం.” “రిజర్వేషనులు పొందుతున్నారు కాబట్టి కుల ధూషణ కూడా పొందాల్సిందే” …. ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు నిరంతరం మేధోజీవుల నుండి కూడా వినవచ్చే ఈ సందర్భానికి ఇలాంటి లక్షల జీవితాలు అచ్చుకెక్కటం తప్పనిసరి అవుతుంది. ఈ పుస్తకం వేసిన మౌలిక ప్రశ్నలను దాటవేసి ఇతర విషయాలను రంధ్రాన్వేషణ చేసేవారి గురించి ఇక చెప్పేదేమీ ఉండదు.

ప్రకృతితో దగ్గర సంబంధం ఉండే కుర్రాడికి వృత్తి విద్య బాగా వంటబడుతుందనే ప్రాధమిక సూత్రం పట్ల కావాలనే ఉదాసీనత వహించారు. పాండిత్యం ఒక కులం సొత్తుగా మార్చుకోవటానికి చేసిన కుట్రకు వ్యతిరేకంగా అన్ని శూద్ర కులాలు పోరాటాలు చేశాయి. చివరగా మాలా మాదిగలు చేసిన పోరు సొగసుగా ఉండక పోవచ్చు. గరుకుగా, కురూపంగా ఉండవచ్చు. కానీ ఆ యుద్దానికి ఒక అనివార్యత ఉంది. గతితార్కిక సూత్రం ప్రకారం అడ్డంకులను బద్దలు కొట్టే స్వభావం ఆ యుద్దానికి ఉంటుంది.

కులాలని పేరుపెట్టి తిట్టినా, కమ్యూనిష్టుల అవకాశవాద రాజకీయాలను ఎండగట్టినా (పార్టీల కతీతంగా), ప్రొఫెసర్ల కాలరు పట్టుకొన్నా …. దాని వెనుక నిర్మాణమై ఉన్న ఒక వ్యవస్థకు, పదును పెట్టిన కత్తిని ఆనించి ఎదురొడ్డిన సాహసమే కనిపిస్తుంది. కాస్తంత అసహనం ఉంటేనేం? కూసంత అతిశయం కనిపిస్తేనేం? యుగాలుగా మెదళ్ళ పొరల్లో కరడు కట్టుకు పోయి ….చేతల్లో, మాటల్లో, సైగల్లో, రాతల్లో, భావాల్లోప్రకటిత, అప్రకటిత కుల అహంకార రంకెలకు సమాధానం ఆ మాత్రం కటువుగా, పొగరుగా ఉండదూ?

పెద్ద చదువులు చదివితే దళితులకు మెరుగైన పౌర జీవనం లభిస్తుంది అనే నిర్వచనం పాక్షిక సత్యం. ముందుకు పోవటానికి వేసే ప్రతి అడుగు తుస్కారానికి, నిందకు గురి అవుతున్నదశలో ఏదో రూపంలో ఊతం ఇచ్చిన వెసులుబాటును మననం చేసుకోవటం సహజమైన విషయం. క్రిష్టియానిటీ ఇచ్చిన చేయూతను పదే పదే తలుచుకొని కృతజ్నతలు తెలుపుకోవటం కూడా అందులో భాగమే. తన ఆలోచన స్రవంతి ని ప్రభావితం చేసిన వి‌ప్లవ సంస్థలకు కూడా అదే వినమ్రతతో ధన్యవాదాలు తెలిపాడు.

డా. గోపీనాథ్ కుల వ్యవస్థకు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని మౌలిక ప్రశ్నలు వేశాడు. సమాధానాల కోసం వెదికాడు. అణగారిన తమ కులాల సమున్నతి కోసం విప్లవాన్ని కల కన్నాడు. దాని కోసం తను నమ్మిన రాజకీయాలలో తలమునకలుగా పని చేశాడు. విభేధించిన చోట మాట్లాడాడు. ఎక్కడా తన కుదుళ్ళను మర్చిపోలేదు. మొదలుకీ, గురికి సూటి గీత గీయగలిగాడు. ఆచరణతో ఆ గీతకు చక్కగా లంకె పెట్టగలిగాడు. ఆర్.ఎస్.యూ. లో పని చేస్తున్నప్పుడు కానీ, విద్యార్ధి ప్రతినిధిగా కానీ ఈ దేశ మూలవాసిగా తన కుల న్యాయ లక్షణాలను వదులుకోక పోవటం ఎన్నదగిన విషయం. ఆ కొనసాగింపును మిగిలిన ఆయన జీవితంలో నిస్సంకోచంగా ఆశించవచ్చు.

జీవిత కధలు విశిష్ట చారిత్రిక సంఘటనలతో కలబోసి ఉంటే ఆ జీవితాలకు ఒక ప్రత్యేకత, సార్ధకత ఉంటాయి. గోపీనాధ్ కధలో ఆ వనరులు చాలా ఉన్నాయి. రమిజాబి ఉదంతం, ఇంద్రవెల్లి మారణ కాండ, ఈశాన్య రాష్ట్రాల ప్రజా పోరాటాలు, “ది గ్రేట్ ఎస్కేప్లాంటి విశేష సంఘటనలతో ఈ రచయిత జీవితం ముడివడి ఉంది. చెరుకూరి రాజ్ కుమార్ లాంటి నిప్పు రవ్వతో మానసిక ఏకత్వం రచయిత జీవితాన్ని ప్రభావితం చేసినట్లు కనబడుతుంది. కేవలంప్రజలకు ఇంకా నా అవసరం ఉందిఅనే ప్రాతిపాదిక మీదే ప్రాణాలు నిలబడటం అనే విషయంనిర్ణయించబడి అంతకు మించి పూచిక పుల్ల కూడా దానికి విలువ ఇవ్వని విప్లవ సంస్థలలోని వ్యక్తుల సాంగత్యం ఈ డాక్టరుగారిని మొండిగా, సాహసిగా నిలబెట్టాయి. అణగారిన వర్గాలవైపు షరతులు లేకుండా నిలబడ్డ ఆ సంస్థల నిబద్దత రచయితను సూదంటు రాయి లాగా ఆకర్షించినదనటానికి సందేహం లేదు. అందుకే తన జీవితంలోని ఒక కీలకమైన దశలో జీవికను ఫణంగా పెట్టటానికి సైతం వెనకాడలేదు.

భారత దేశంలో కులం, వర్గం …. ఈ రెండు షరీకై చేసిన విన్యాసాలను ఈయన జాగ్రత్తగానే పరిశీలించినట్లుగా కనబడుతుంది. ఈ రెండిటి మధ్య సారూప్యత, వైరుధ్యం అంచనా వేయటానికి మార్కిజాన్ని, అంబేడ్కరిజాన్ని కలిపి అధ్యయనం చేయాలని అంటారు.

 కులాన్ని పట్టుకొని వర్గమే లేదనే వాళ్ళు ఎంత మూర్ఖులో, వర్గమే తప్ప కులం లేదన్న వాళ్ళు మూర్ఖులే కాక పచ్చి మోసగాళ్ళు.అలాగే పీపుల్స్ వార్ లోని వ్యక్తులు కులాతీతులు అనటం సహజ సూత్రానికి విరుద్ధం అని ఒప్పుకొన్నారు. వి‌ప్లవ కార్యాచరణలో భాగంగా ఆ లక్షణాలను వదిలించుకోవటం జరుగుతుంది. అయితే ఈ బలహీనత అన్ని వి‌ప్లవ సంస్థలలో తరతమ స్థాయిల్లో ఉంటుందనీ వర్గకుల సమాజాల్లోని సంస్థలు, వ్యక్తులు వాటికి అతీతంగా ఉండరనీ వాటి నుండి విడివడటానికి ఏ మేరకు ప్రయత్నం చేస్తున్నారనేదే మూలమనే విషయం డాక్టరు గారు అంగీకరిస్తే ఇతర వి‌ప్లవ సంఘాల పట్ల ఆయన అసహనం తగ్గుతుంది. ఎన్నికల్లో పాల్గోవటం ఒక ఎత్తుగడగా పాటిస్తున్న సంస్థల ఆచరణను ఇన్ని సంవత్సరాలుగా గమనించి కూడా ఎన్నికలు వసతుల కోసం ఎంచుకొన్నదారులని ఆయన భావించటం ఆయా సంస్థలలో పని చేస్తున్న నిజాయితీ కలిగిన వ్యక్తులకు ఇబ్బంది కలిగించవచ్చు.

కులాల పాకుడురాళ్ళపై ఎగబాకి వచ్చిన దళిత జీవితాలు ఇప్పుడు ముద్రణ పొంది మన ముందుకు వచ్చి జఠిలమైన ప్రశ్నలు వేస్తున్నాయి. ఎన్ని తరాలకూ మారని రాజకీయ ఆర్ధిక చిత్రాన్ని గీసి చూపించి సమాధానాల కోసం గల్లా పట్టుకొని అడుగుతున్నాయి. గుండె, గొంతు ఒకటే చేసి ఈ పుస్తక జీవితాలతో సంభాషిద్దామా? లేదంటే విసిరి కొట్టి లేచి పోదామా?
 – రమా సుందరి
ప్రింటుఈ-పుస్తకాలు “కినిగెలో లభ్యం
 http://patrika.kinige.com/?p=979

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500 006.
ఫోన్: 23521849

( కినిగె డాట్ కాం సౌజన్యం తో...)

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌