తాడికొండలో
“పాడు” అని పిలవబడే చోట ‘ఆది ఆంధ్ర స్కూల్’ అని పిలిచే ప్రాధమిక పాఠశాల
స్వర్ణోత్సవ కార్యక్రమం అది. స్టేజి మీద తొంభై ఏళ్ళ వృద్దుడు
మాట్లాడుతున్నాడు...
ఆయన, ఆయన
భార్య ఆ స్కూల్ వ్యవస్థాపకులు. ఒక ప్రైవేట్ స్కూల్ గా ప్రారంభం చేసి పాట్లో
పిల్లలకు విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు ఆ భార్యా భర్తలు. తరువాత అది
ప్రభుత్వ పాఠశాలగా మారింది. ఇప్పుడా పాటి నుండి ఎంతో మంది విద్యావంతులు,
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. (పాడు అంటే మాదిగ పల్లె అని అర్ధం).
అదే దుఖం,
ఉద్వేగం “మా నాయన బాలయ్య” పుస్తకం చదువుతుంటే కలిగింది. ఇది షుమారు వంద
సంవత్సరాల మాదిగల జీవన ప్రస్థానం. భారత రైల్వేలు, వాటి మొదటి దశలో బడుగు
జీవుల బతుకుల్లో తెచ్చిన మార్పులు చెప్పిన చరిత్ర ఇది. కుల వివక్ష
మార్చుకొన్న రూపాలను చర్చించిన జీవితం ఇది. కష్టాలలో, దారిద్ర్యంలో,
అంటరానితనంలో, ఆస్తులు ఉన్నా అనుభవించనివ్వని దాస్యంలో తలంటుకొన్న
కుటుంబంలో బిగుతుగా అల్లుకొన్న బంధాల అల్లిక ఇది.
నాలుగు
తరాల మాదిగల జీవితంలో వచ్చిన మార్పులను ఈ ఆత్మ కధాత్మక జీవిత చరిత్ర
కూలంకషంగా చర్చించింది. వందేళ్ళ క్రితం తెలంగాణ పల్లెల్లో భూమి లేని వెట్టి
చాకిరీ, దరికి రానివ్వని అస్పృశ్యత, హుందాగా బతకనివ్వని అవమానం, వెంటాడే
అంటు రోగాలు నిమ్న కులాల బతుకులను అతలాకుతలం చేసాయి. చెల్లించే డబ్బులపై
కూడా నీళ్ళు చిలకరించి తీసుకొనే దుర్మార్గం బుసలు కొట్టే కాలంలో ఈ ఆత్మ కధ
ప్రారంభం అవుతుంది.
చెప్పులు
కుట్టే పెద నర్సయ్య పనితనానికి మెచ్చి యాభై ఎకరాల సారవంతమైన భూమిని ఇనాంగా
ఇచ్చిన నిజాం నవాబు ఔదార్యాన్ని అనుభవించకుండా చేసిన అగ్రకుల, పెత్తందారీ
దురహంకారం పెదనర్సయ్యను గులాంగానే ఉంచింది.
అతని కొడుకు నర్సయ్య హయాంలోనూ ఆ పరిస్తితిలో మార్పేమి లేదు. ‘గత్తర’ వచ్చి
చనిపోయిన భార్య శవాన్ని వీపుకి కట్టుకొని, తల్లిలేని పిల్లవాడిని
వెంటబెట్టుకుని పిడెకెడు ఆత్మ గౌరవంతో బతికే మార్గం వెతుక్కుంటూ పల్లె
దాటుతాడు నర్సయ్య.
బ్రిటీష్
ప్రభుత్వం తన పరిపాలనా సౌలభ్యం కోసం, వ్యాపార సంబంధాల అభివృద్ధి కోసం ఆనాడు
మొదలు పెట్టిన రైల్వే పనులు అతి కష్టమైనవి. ప్రమాదభరితమైనవి.
అగ్రవర్ణాలవాళ్ళు దూరంగా ఉండడం వలన ఆ కష్ట సాధ్యమైన, ప్రాణాంతకమైన పనులు
దళితులకు అందుబాటులో వచ్చాయి. ఆ పనుల కోసం భారతదేశం నలుమూలలనుండి ఆ నాటి
అస్పృశ్యులు వచ్చారు.
భారత
రైల్వేలు కట్టించిన క్వార్టర్స్ ను, చౌకధరలకు సరఫరా చేసిన నిత్యావసర
వస్తువులను వారి ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని మెరుగుచేసుకొనేందుకు
ఉపయోగపెట్టుకొన్నారు. తద్వారా పల్లెల్లో వెంటాడే అంటరానితనంకి కొంత దూరంగా
ఉంటూ తరువాత తరాలకు విద్యాగంధాలు అందిచగలిగారు. అరకొరగా అందిన ప్రభుత్వ
సహాయాన్ని అడ్డం పెట్టుకొని మెరుగైన జీవితాల కోసం అహర్నిశలు శ్రమించారు.
ఇదంతా
రాత్రికి రాత్రే వచ్చిన మార్పు కాదు. అక్షరం ముక్క రాని పెదనర్సయ్య నుండి,
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అధ్యాపకులుగా స్థిరపడ్డ బాలయ్య నలుగురు కొడుకుల
వరకు సమాజంలో ఉన్న అననుకూల పరిస్థితులతో అలసిపోని యుద్దం చేశారు. కుటుంబ
వారసత్వంగా వచ్చిన అవిద్య, సాంఘిక వెలివేత, బయట ప్రపంచంతో స్నేహం చేసే
వెసులుబాటు లేని సంకుచిత పరిస్థితులు వీరిని నిరంతరం వెన్నాడాయి.
అర్ధాకలితో, అవాంతరాలతో, వసతులు లేని చిన్న చిన్న ఇళ్ళళ్ళో అమరని
సౌకర్యాలతో కొనసాగిన వీరి చదువులు ముళ్ళ బాట మీదే నడిచాయి.
సెంటు భూమి
కూడా ఇవ్వటానికి నిరాకరించబడిన, తృణీకరించబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన
బాలయ్య, విద్య ద్వారా మాత్రమే తన పిల్లలు సమాజంలో సముచిత స్థానాన్ని
పొందగలరనే బలమైన ఆకాంక్షతో చేపట్టిన యజ్ఞం కఠోరమైన ప్రతికూల పరిస్థితులను
ఎదుర్కొంది.
రచయత తన
ఆత్మ కధలో సృజించిన విషయాలు అనేకం అమూల్యమైనవి. చరిత్రలో నిక్షిప్తం
చేయాల్సినవి. తరాలు మారే కొలది రూపాలు మార్చుకొన్న కుల వివక్షత, దాన్ని
స్వీకరించే విధానంలో వచ్చిన మార్పులు వివరంగా చర్చించారు. మొదటి తరం
పెదనర్సయ్యతో దొర “నీకు భూమి కావాల్నారా” అని హుంకరించగానే “నీ బాంచన్,
నువ్వే నా దొరవు, దేవునివి” అని చేతులు జోడిస్తాడు. రెండో తరంలో నర్సయ్య తన
కొడుకుతో “లేదు బిడ్డా! మనం సదువుకోవద్దు. సదువుకుంటే పాపం తలుగుతది”
అంటాడు. బాలయ్య దగ్గరకు వచ్చేసరికి “ఎవరికైనా అణగి ఉండటం ఆయనకు కోపమే కానీ ఈ
అస్పృశ్యత పాటించడం గురించి నిరసన వెలిబుచ్చేవాడు కాదు. అది సమాజ
నిర్మాణంలో ఒక భాగం అనుకొనేవాడు.”
మన పుస్తక
రచయిత దగ్గరకు వచ్చేసరికి ఆయన కులాన్ని అర్ధం చేసుకోవటం, కుల వివక్షతకు
కారణాలు శోధించటం అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే రచనల వెలుగు నుండి
ప్రయత్నించినట్లు అనిపించింది. “నీ
బానిసత్వాన్ని నువ్వే నిర్మూలించుకోవాలి. ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి బతకడం
అవమానాల్లోకెల్లా అవమానం. ఆత్మగౌరవంతో హుందాగా జీవించాలంటే కష్టాలు
భరించాలి. నిరంతర పోరాటాల నుంచే శక్తి జనిస్తుంది. ఆత్మ విశ్వాసమూ,
గుర్తింపూ, గౌరవమూ వస్తాయి.” అనే అంబేడ్కర్ వాక్యాలను రచయిత ఉటంకించడం
బట్టి ఈ ఆలోచన కలుగుతోంది.
కుల
దురహంకారులు వ్యక్తిగతంగా, సామూహికంగా; తన మీద, తన వారి మీద చేసిన దాడులను,
బహిరంగ తిరస్కారాన్ని అత్యంత పరిణతితోనూ, ఆవేశకావేశాలను అణచుకొని
ఎదుర్కొన్నట్లు అనిపిస్తుంది. కుల దురహంకారానికి, దురభిమానానికి మూలాలు
వ్యక్తుల్లో కాక, వ్యవస్థలో వెదికే ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తుంది.
కులానికి సంబంధించి వీరు పేర్కొన్న చేదు అనుభవాలు కంట నీరు రప్పిస్తాయి.
“మనం ముట్టుకోని వాళ్ళం బిడ్డా, ఆళ్ళు మనకు చదువు చెప్పరు”
“ఎందుకు?”
“మనలను వాళ్ళు ముట్టుకోరు బిడ్డా! అందుకే ”
“అయితేంది? నేను వాళ్ళకు దూరంగా కూసుంట, అక్కడ కూడా ఎవర్నీ ముట్టుకొను”
“కాని నీకు పంతులు పాఠం చెప్పడు”
“నేను పంతుల్ని గూడ ముట్టుకోను.”
చదువుకోవాలనే
తీవ్ర వాంఛగల బాలయ్యను బడి దరిదాపులకు కూడా అనుమతించని అమానవీయ పరిస్థితుల
నుండి ఆయన పిల్లలకు రైల్వే బడుల్లో ప్రవేశం అయితే లభించింది కానీ కుల
దౌష్ట్యం మాత్రం వారిని వీడలేదు.
“నేను
క్లాసులోకి అడుగు పెట్టగానే అతను తన స్నేహితులకి అక్కడున్న గోడ చూపించి
‘ఇది ఎవరిది?’ అని అడిగే వాడు. వాళ్ళు ‘మాది’ అనేవాళ్ళు. అప్పుడు మళ్ళీ
‘ఇదేమిటి?’ అని అడిగేవాళ్లు. వాళ్ళు ‘గోడ’ అనే వాళ్ళు. అప్పుడతను ఆ రెండు
సమాధానాలనీ కలిపి చెప్పమనేవాడు. వాళ్ళు వెంటనే ‘మాదిగోడా ‘ అని
అరిచేవాళ్ళు.” ఎంత అవమానపడి బాధపడ్డా, ఆ బృందానికి వ్యతిరేకంగా తన తరఫున
ఎవరూ మాట్లాడే వాళ్ళు లేక ఎదురు సమాధానం చెప్పలేక పోవటం ఆనాటి దుర్భర,
అసహాయ స్థితికి నిదర్శనం.
గ్రామాల్లో
వివిధ వర్ణాల ఇళ్ళ నిర్మాణం అవర్ణుల గాలి, అగ్రకులాలకి తగలకుండా మనువు
సూత్రాలకు అనుగుణంగానే ఉండేదని, ఇప్పటికీ అదే రకమైన పద్దతి కొనసాగుతుందని
రచయత పేర్కొన్న విషయం ప్రాముఖ్యత గలది. ఇది భారత దేశంలో అస్పృశ్యత లేదని
వాదించే వర్గాలకు మనం చూపించగలిగిన సజీవ దృశ్య ఖండిక.
కటిక
పేదరికం, ప్రతికూల సామాజిక పరిస్థితుల నేపధ్యంలో కుటుంబ సభ్యులు, వారి మధ్య
పొందికగా పెంచుకొన్న ప్రేమాభిమానాలు ఎన్నదగ్గవి. అన్నదమ్ములు, అక్క
చెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు చేసుకొన్న త్యాగాలు గొప్పవి. తమ చదువు కోసం తల్లి
దండ్రుల కష్టాన్ని, చాకిరీని పరికించి, తల పంకించి అత్యాశలకు పోకుండా
అర్ధాకలితో సర్ధుకొన్నతీరు హృద్యంగా వర్ణించారు. మొదటి కొడుకు ఐన తనను
తల్లిదండ్రులు ఎక్కువ చదివించక లేకపోయినా కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని
బాలరాజు చివరి వరకు కష్టించిన వైనం, తనను కుటుంబమంతా ఇబ్బందుల కోర్చి
చదివించినందుకు అబ్బసాయిలు తమ్ముళ్ళు స్థిర పడే వరకు ఇచ్చిన తోడ్పాటు,
తరువాత కాలంలో తమ్ముళ్ళు ఆ బాధ్యతను అందుకొన్న తీరు… అంచెలంచెలుగా భుజాలు
మార్చుకొంటూ కుటుంబాన్ని గట్టెక్కించిన విధానం చాలా ఉన్నతంగా అనిపిస్తుంది.
కడగండ్లతో పెంచుకొన్న సంసారాల్లోని సంతానంలోనే ఇంత గాఢమైన బాంధవ్యాలు
చూడగలం.
తాను
కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యాక ‘నాన్న సోఫా మీద కూర్చొని చందమామ చదవడం, అమ్మ
వెక్కిరించటం’ తన మధుర స్మృతుల్లో ఒక భాగంగా రచయిత రాసుకొన్నారు. అది
చదువుతున్నప్పుడు అప్రయత్నంగా మన పెదాల మీద కూడా చిరునవ్వు కదులుతుంది.
అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత పంచుకోవటానికి కొడుకులు సమావేశమైన రోజు
రచయిత పడిన ఆవేదన మనల్ని కూడా మనస్థాపానికి గురి చేస్తుంది.
మూడు తరాల
మాదిగ కుటుంబాలలో వచ్చిన సంస్కృతీకరణ మార్పు కూడా గమనించదగింది. దళితులు
పూజించిన దేవతలు గ్రామ దేవతలు. (క్షుద్ర దేవతలు అని హిందువులు ఎగతాళి
చేసేవాళ్ళు) ఈ గుడులు ఎత్తు తక్కువగా ఉండి, పైకప్పు గుమ్మటంలా ఉండేవి .
స్త్రీలూ పురుషులు, ఎవరు పూజ చేస్తే వారే పూజారులు. తమ రోజూవారి ఆహారాన్నే
నైవేధ్యంగా పెట్టేవాళ్లు. పెళ్ళిళ్ళు కూడా అదే కులానికి చెందిన బైండ్లాయన
చేసేవాడు. (“బైండ్లాయన తనకు వచ్చిన ఒకే శ్లోకం ‘శుక్లాంభరధరం’ చదివినప్పుడు
మా అన్న భ్రాహ్మణ స్నేహితులు నవ్వారు”). రచయిత మిగతా వర్ణాలవారిని
‘హిందువులు‘ అని పుస్తకమంతా పేర్కోవటం విశేషం. ఈ సంభోదన వెనుక తమని
హైందవేతరులుగా ఐడెంటిఫై చేసుకోవటంగా కనిపిస్తుంది. అలాగని క్రైస్తవ,
ముస్లిం మతాల స్వీకరణ కూడా వీరి కుటుంబంలో జరగలేదు. ఈ రోజు హిందుత్వ అంటే
భారతీయ సంస్కృతి అని ఊదరగొడుతున్న వారికి; శూద్రులు, అవర్ణులు అని
చెప్పబడిన ఈ మెజారిటీ ప్రజల సంస్కృతి మూలాలు హిందూ మతంలో లేవని ఈ కుటుంబ
చరిత్ర చెబుతుంది. కాల క్రమేణా వీరి కొన్ని కుటుంబాలలో హిందూ దేవుడి పటాలు
రావడం; ఇళ్ళళ్ళో వాస్తు పట్టింపులు, తులసి మొక్కలు రావటం, పూజలు చేసి గంటలు
మోగించటం… ఇవన్నీ ఆధిపత్య వర్ణాల ప్రజల మతాన్ని అనుసరించడం తప్ప మరొకటి
కాదు.
తమ మొదటి
తరంలో, చదువు అభ్యసించటానికి ఏర్పడిన సంక్లిష్టతకు కారణాలు కూడా
శాస్త్రీయంగా అర్ధం చేసుకొన్నారు రచయిత. కులం కారణంగా రుద్దబడిన
ఆత్మన్యూనతా భావం, బయట ప్రపంచంతో సంభాషించలేని వారి అసహాయ ప్రపంచం… ఇవన్నీ
వారి అభివృద్దికి అవరోధాలే. అన్నిటికి మించి కొన్ని తరాలుగా విద్యకు,
జ్ఞానానికి నోచుకోక బీళ్ళు పడ్డ మెదడును పునర్జీవింపచేయటానికి మొదటి తరం
చేసిన మధనం చిన్నది కాదు.
ఈ ఆత్మ
కధలో ప్రశ్నార్ధకంగా మిగిలి పోయిన యాదగిరి అదృశ్యం గురించి ఇంకొంత రాసి
ఉంటే బాగుండేదనిపించింది. భారతదేశంలో అత్యంత అణచివేయబడిన వర్గం, కులం నుండి
వచ్చి, వామ పక్ష భావాలకు ఆకర్షితుడైన యాదగిరి ఎన్నుకొన్న జీవనమార్గం
ఇతరులకు తప్పక ఆదర్శం అయ్యేది. అలాగే కుటుంబంలో ప్రస్పుటంగా కనబడిన
పురుషాధిక్యత గురించి రచయత అంతర్లీనంగా చర్చించినా (ఆడపిల్లలకు చదువు
చెప్పించక పోవటం, మగాళ్ళు రెండు వివాహాలు చేసుకొనే వెసులుబాటు, కుటుంబంలో
పురుషుని ఆధిక్యత) ఇంకొంత విశదీకరించి, విమర్శిస్తే బాగుండేదని
అనిపించింది. కుటుంబానికి పట్టుకొమ్మ అయిన నరసమ్మగారి వైపు నుండి కూడా
ఇంకొక పుస్తకం రావాల్సి ఉంది.
- బత్తుల రమాసుందరి
ప్రజాసాహితి మాసపత్రిక నవంబర్ 2013
" కథలు డాట్ కాం " సౌజన్యంతో
very nice. it was the real history. such people are real warriors.
ReplyDeleteIppatiki graamaallo niraashalo magguthunna vaariki oka inspiration laantidi.
ReplyDelete