Friday, October 5, 2012

కథలగూడు... దేవులపల్లి కృష్ఞమూర్తి ...
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే

తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.

ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది.

చే గువేరా ఏనాడో అరవయ్యో దశకంలో చనిపోతే అదంతా నిన్నో మొన్నో అయినట్టు ఎందుకు తలుచుకుంటుందీ ప్రపంచం. మన స్వతంత్ర పోరాటం గురించీ అంతకు ముందెప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చిన పోర్చుగీసు పాలనా, గోవా ప్రతిఘటన గురించి ఈ రోజుకీ చెప్పుకుంటున్నాం రాస్తున్నాం. సినిమాలు కూడా తీస్తున్నాం. చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాటమూ అంతే.
అది సజీవం.
దాన్ని మన కథలూ నవలలూ, సాహిత్యం మరింత నిత్యనూతనంగా ఉంచుతాయి.
ఉంచుతున్నాయి కూడా.

ఈ అరవైయ్యేళ్లుగా పోరాట సాహిత్యం చాలా వచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌ లాంటి యోధుల జ్ఞాపకాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇందులో చాలా వాటికి అట్టమీది బొమ్మలు గీసింది నేనే.

సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు,
దాశరథి, తెన్నేటి సూరి, సోమసుందర్‌ కవితలు ఒక వరస.
కిషన్‌ చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ నవలలు మరో వరస.

చిత్త ప్రసాద్‌ బొమ్మలూ, సునీల్‌ జెనా ఫొటోలూ చరిత్రని రికార్డు చేశాయి.
'మా భూమి' లాంటి సినిమాలూ అదే చేశాయి.
ఈ పరంపర ఇంతటితోనే ఆగిపోలేదు.

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమై క్లైమాక్స్‌కు చేరినప్పుడు కూడా హైదరాబాద్‌లో, ఇతర పట్నాల్లో జరిగిన అనేక సభల్లో సాయుధ పోరాట ప్రస్తావన పదే పదే వస్తూనే ఉంది.

దేవులపల్లి కృష్ణమూర్తి కథలకి ఓ విశేషం, ప్రత్యేకతా ఉన్నాయి.
అన్నీ పోరాటకాలం నాటివే.
అన్నీ అసాధారణమైన పోరాట పటిమ చూపిన అన్‌సంగ్‌ హీరో, హీరోయిన్స్‌వే.
పాత్రలన్నీ నిజంగా బతుకులో ఉన్నవే.
కృష్ణమూర్తికి తెలిసినవే.
త్యాగం, పోరాటం, విషాదం, విజయం లాంటివి చెప్పేటప్పుడు పాఠకుణ్ణి కన్నీరు పెట్టించాలనో, పిడికిళ్లు బిగించేట్టు చేయాలనో, మెలో డ్రామాలో ముంచెత్తాలనో రచయితకి అనిపిస్తుంది.

కృష్ణమూర్తి కథలు ఆ పనిచేయలేదు.
పైగా తెలిసిన మనుషులనీ, వాళ్లున్న సందర్భాల్నీ వరుసగా చెప్పుకు పోతాడు.
రియలిస్టిక్‌గా మేటర్‌ ఆఫ్‌ ఫాక్ట్‌గా వినిపిస్తున్నట్టే ఉంటుంది.
ఎక్కడా అతి ఉండదు.
అలాగని ఒక్క దగ్గరా విసుగనిపించదు.
అల్లికలో అందంతో అలనాటి ఊళ్లూ, మనుషులూ, ఘటనలూ కళ్లముందు రూపుకడతాయి.
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే.
కథలో, నవలలో, సినిమాలో ఒకనాడొచ్చిన ఇటాలియన్‌ నియోరియలిస్టిక్‌ పెయింటింగ్‌ ధోరణిలో కథనం సాగుతుంది.
....
- మోహన్‌
(చిన్నమాట నుంచి)


కథలగూడు
దేవులపల్లి కృష్ఞమూర్తి
ముఖచిత్రం : లక్ష్మణ్‌ ఏలె
122 పేజీలు, వెల: రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006
ఫోన్‌ నెం. 040 23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌