Monday, October 15, 2012

వివేకానికో గీటురాయి... రీడింగ్ రూమ్ ...- మందలపర్తి కిషోర్...సాక్షి ...

వివేకానికో గీటురాయి

 బాలగోపాల్ చనిపోయి మూడేళ్ల యింది. ఈ మూడేళ్లలో ఆయన రచనలు - తెలుగులో - ఎనిమిది పుస్తకాలుగా వచ్చాయి. వాటిలో కొన్ని పత్రికలకు రాసిన వ్యాసాలు. కొన్ని కాలమ్స్. కొన్ని ముందుమాటలు. కొన్ని ఉపన్యాసాలు. కొన్ని కరపత్రాలు. కొన్ని సిద్ధాంత పత్రా లు. కొన్ని నివాళులు. కొన్ని జవాబులు. కొన్ని సంపాదకీయాలు. కొన్ని ఇంట ర్వ్యూలు. ఇన్ని ‘రచనా రూపాలు’ ప్రయత్నించిన రచయితలు బాలగోపాల్ సమకాలికుల్లో మరెవరూ లేరేమో! మత తత్వం, రాజ్యం-సంక్షేమం, హక్కుల ఉద్యమం, దళిత సమస్య, సాహిత్య పరామర్శ, మార్క్సిజం సమీక్ష-ఇలాంటి వస్తువులతో రాసినవీ రచనలు. అంటే, రూపంలోనూ సారంలోనూ కూడా బాలగోపాల్ రచనల్లో ఎంతో విస్తృతీ వైవిధ్యం కనిపిస్తుంది.

ఇవి దాదాపు మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ చేసిన రచనలు. ఈ కాలంలో ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పులన్నీ ఈ రచనల్లో ప్రతిఫలించాయి. ఈ మార్పుల్లో ైవైరుధ్యంలా అనిపించే వైవిధ్యం కనిపిస్తుంది. ఏకసూత్రతా ఉంది. మొదటినుంచీ ఆయన పనిచేసిన రంగం హక్కుల రంగం. మన దేశంలో ఈ రంగంలో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసినవాళ్లలో ఎక్కువమంది నక్సలైట్ ఉద్యమాన్ని అభిమానించే మేధావులు. ఎప్పుడో 1970 దశకంలోనే బొజ్జా తార కం, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, కన్నబీరన్ తదితరులు ఈ కృషి మొదలుపెట్టారు. ఎనభయ్ దశకంలో బాలగోపాల్ ఈ రంగంలో మొదలుపెట్టిన కృషి కొత్తపుంతలు తొక్కింది.

చట్టాల ప్రకారం హక్కులను నిర్వచించి విశ్లేషించడం కాకుండా సామా జిక న్యాయం(ఇప్పటి వాడుక అర్థంలో కాదు-దాని అసలు అర్థంలో) ప్రాతిపది కగా బాలగోపాల్ హక్కుల గురించి మాట్లాడారు. దీన్నే తర్వాతి రోజుల్లో హక్కుల ఉద్యమానికి ఉండాల్సిన ‘తాత్విక దృక్పథం’గా ఆయన చెప్తుండేవారు. వ్యక్తిగతం గా-ఒంటరిగా మాత్రం కాదు- బాలగోపాల్ తీసుకొచ్చిన పెద్దమార్పు ఇదేనేమో!

ఇక, సాహిత్యరంగంలో కూడా బాలగోపాల్ చాలానే కృషి చేశారు. ‘సాహి త్యంమీద నేను రాసిన వ్యాసాలు సమగ్రమయిన సాహిత్య విమర్శ అని నేను అనుకోవడం లే’దన్నారు బాలగోపాల్. అంతేకాదు-ఆ వ్యాసాల్లో ఉన్నది ‘సామా జిక ఆర్థిక నేపథ్యంలో సాహిత్యాన్ని పరిశీలించడం’ మాత్రమేనని వివరించి, అదే సమగ్రమయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శ కాబోదని కూడా స్పష్టం చేశారు. ఇలా చెప్పడంవల్ల బాలగోపాల్ తన పరిమితులను వెల్లడించడమే కాదు- మార్క్సిస్టు ముద్రాంకిత విమర్శకుల పరిమితులను సైతం బయటపెట్టారు.

కిందటివారం, బాలగోపాల్ వ్యాసాలు కొన్నింటిని ‘మనిషి మార్క్సిజం’ పేరుతో పుస్తకంగా విడుదల చేసింది పర్‌స్పెక్టివ్స్ సంస్థ. ఇందులో, 1993 సెప్టెంబర్ ‘అరుణతార’లో వచ్చిన ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అనే వ్యాసం ఉంది. దీన్ని చాలామంది చరిత్రాత్మక వ్యాసంగా పరిగణిస్తారు. కానీ, ఆ వ్యాసంలో బాలగోపాల్ కనిపెట్టి చెప్పిన విషయాలేం లేవు. తను కొత్తగా ఆ విషయాలు చెప్పడమే అందులోని కొత్తదనం. అలాగే, ‘కల్లోల చిత్రాలు’ వ్యాసం లోని విషయాలు కూడా. ఈ వ్యాసాల్లోని విషయాలు -బహుశా బాలగోపాల్ చెప్పిన కారణంగా- అపారమయిన ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
చివరిగా ఓ మాట- మతానికి వ్యతిరేకంగా వచ్చిన చాలా సిద్ధాంతాలు కొత్త మతాలుగా స్థిరపడడం చరిత్రలో చూస్తాం. ఉదాహరణకు బౌద్ధం.

ఇది, సంప్రదాయ విరుద్ధత (నాన్‌కన్‌ఫామిజం), సంప్రదాయ విధేయత (కన్‌ఫా మిజం)గా మారడం మాత్రమే. మార్క్సిజం శాస్త్రమని, దాన్ని విశ్వసించేవాళ్లు చెప్తారు. ఏ శాస్త్రమయినా ప్రశ్నల పునాదిమీద పెరిగిపెద్దవుతుంది. స్వయంగా మార్క్సే అన్నిటినీ ప్రశ్నించమని చెప్పాడట. కానీ, మార్క్సిస్టు ప్రతిపాదనల విషయంలో ఆత్మవిమర్శకు ప్రయత్నించేవారిని మార్క్సిస్టు విశ్వాసులు ప్రశంసించరు. పెపైచ్చు అభిశంసిస్తారు కూడా. బాలగోపాల్ విషయంలో అదే జరిగింది. ఆయన చనిపోయి మూడేళ్లయింది. కానీ, కామన్‌సెన్స్ ప్రాతిపదికగా బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలను నక్సలైట్లూ, తదితర గోత్రికులయిన మార్క్సిస్టులు -అప్పట్లో- సరయిన స్పిరిట్‌లో తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇప్పటికయినా ఈ విషయంలో మార్పు వచ్చిందేమో పరిశీలించాలి. ఆ పరిశీలనకు బాలగోపాల్ రచనలు గీటురాళ్లుగా ఉపయోగపడతాయి.

- మందలపర్తి కిషోర్

( సాక్షి దినపత్రిక 15 10 2012 సౌజన్యం తో )

* 1. మనిషి-మార్క్సిజం, పే.168, వెల రూ.100/- దళిత / పే.209, వెల రూ.120/- 

2. రాజ్యం - సంక్షేమం / పే.161, వెల రూ.100/-

పర్‌స్పెక్టివ్, ఫ్లాట్ నం.305, ఇ.నం.2-2-647/182/ఎ3, హిమశివ అపార్ట్‌మెంట్స్ / బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్-13.


* 3. సాహిత్యంపై బాలగోపాల్ పే.339, వెల రూ.150/- /

4. మతతత్వంపై బాలగోపాల్ / పే.302, వెల రూ.150/-

 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్టాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-67


* 5. నిగాహ్,  పే.407, వెల రూ.200/-

 ప్రజాతంత్ర కార్యాలయం, ఫ్లాట్ నం.1, ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ, ఉప్పల్, హైదరాబాద్-39


* 6. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పథం / రూ.100/-  / నవోదయ, దిశ.


* 7. ఆ శిక్షే ఒక నేరం /  పే.88, వెల రూ.30/- ప్రజాశక్తి, నవోదయ.


.
  
.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌