Friday, November 26, 2010

ముస్లింలను అర్థం చేసుకోవడం, వారి మతాన్ని గౌరవించడం నేర్చుకుందాం!


ముహమ్మద్‌ ప్రవక్త జీవితం
- క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌
తెలుగు అనువాదం: పి. సత్యవతి

''ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లాం. క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ వ్రాసిన ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్‌ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజల గురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్థం చేయిస్తుంది. ఇస్లామ్‌కు దగ్గర సంబంధం కల జూడాయిజం, క్రైస్తవంతో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది''
''భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికీ మించి, చదివించే శక్తి కలది''
-ఎకనమిస్ట్‌

''పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్నీ, అపార్థాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా.''
- ముస్లిమ్‌ న్యూస్‌
...

ముందుమాట నుంచి ...

సల్మాన్‌ రష్డీ రచించిన ''సెటానిక్‌ వర్సెస్‌'' వివాదం, రష్డీని హతమార్చాలంటూ అయాతుల్లా ఖొమైనీ 'ఫత్వా' జారీ సందర్భంగా నేను ఈ ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను.

అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారుకూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనబరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ... ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా వున్న ఒక మతం పట్ల మనం అస్పష్టమైన, అసత్యమైన అభిప్రాయాలను పెంచిపోషించ కూడదనిపించింది. ...

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్‌ కాంగ్రెస్‌ సమావేశం జరగింది.  అందులో పాల్గొన్న 45 ముస్లిం రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఖొమేనీ జారీ చేసిన ఫత్వాని నిర్ద్వంద్వంగా ఖండించారు. అది ఇస్లామ్‌ మత విరుద్ధమన్నారు.  అయినా బ్రిటన్‌లో  ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ...

అయాతుల్లా ఖొమేనీతో విభేదించేవారూ, రష్డీన చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది వున్నారు. అయితే సల్మాన్‌ రష్డీ తన నవలలో ముహమ్మద్‌ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వాళ్లందరినీ తీవ్రంగా కలవరపరిచింది.

పశ్చిమ మేధావులు మాత్రం, ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ల జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటన్‌ రచయితలు, మేధావులు తత్వవేత్తలు కూడా ఇస్లామ్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గ మతం కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్లిముల సున్నితమైన మనోభావాలను వారు అసలు పట్టించుకోలేదు. అదంత ముఖ్యమైన విషయమే కాదనుకున్నారు.
. ...
2001 సెప్టెంబర్‌ 11 సంఘటన... ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని, పెంటగన్‌లో ఒక భాగాన్ని ముస్లిం ఉగ్రవాదులు ధ్వంసం చేసిన తీరు, దాదాపు 5000 వేల మంది మరణానికి కారణం కావడం పశ్చిమ దేశాలలో ముస్లిమ్‌ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌ మతం పై వుండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది.
...
ఇస్లాం హింసను సమర్థిస్తుందనే భావాలు ప్రచారంలో వున్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాదవివాదాల్లో చాలామంది ఖురాన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. అటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్‌, జ్యూయిష్‌ తదితర మత గ్రంధాల్లో కూడా అనేక హింసను ప్రోత్సహించే వాక్యాలు వున్నాయనే విషయాన్ని మరిచిపోతున్నారు.
...
పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.
...
ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే
మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లమ్‌లను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాటపోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి.
అందుకు ముహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు.
ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.

...
పుస్తక రచయిత్రి గురించి:
క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ 1944 నవంబర్‌ 14న బ్రిటన్‌లో జన్మించారు. 1962 నుంచి ఏడు సంవత్సరాలు హోలీ చైల్డ్‌ జీసస్‌ సొసైటీలో ఒక నన్‌గా వున్నారు. తరువాత సొసైటీ నుంచి తప్పుకొని టెన్నిసన్‌ మీద డీ.లిట్‌ చేస్తూ అస్వస్థత వల్ల అసంపూర్తిగా వదిలేశారు.
నన్‌గా తన అనుభావాలను, అవేదనలను వ్యక్తపరుస్తూ 1982లో వ్రాసిన ''థ్రూ ది నారో గేట్‌'' బహుళ  జనాదరణ పొందింది. అప్పుడే ఒక బ్రిటీష్‌ టెలివిజన్‌  ఛానెల్‌ ఆమెకు  సెయింట్‌ పాల్‌ మీద డాక్యుమెంటరీ తీసే అవకాశమిచ్చింది. ఆ పని మీద జెరూసలేంలో వుండడం కూడా ఆమెను ఎక్కువ ప్రభావితం చేసింది. 1993లో ఆమె వ్రాసిన ''హిస్టరీ ఆప్‌ గాడ్‌'' దాదాపు 30 భాషల్లోకి అనువాదమై ప్రపంచ ప్రజల మన్ననలందుకుంది.
అన్ని మతాల తులనాత్మక అధ్యయనం ఆమె అభిరుచి. ప్రపంచలోని అన్ని మత సంప్రదాయాల బాహ్య స్వరూపాలలో వైవిధ్యం వున్నా వాటి అంతస్సారం ఒకటేననీ మతాలన్నీ కూడా పరస్పర సానుభూతినీ సదవగాహననూ, సహనాన్నీ బోధించేవేననీ నమ్మకం కన్నా ఆచరణ ముఖ్యమనేది అమె తాత్విక దృక్పథం.

...
అనువాదకురాలి గురించి:
పి. సత్యవతి ప్రసిద్ధ స్త్రీవాద కథా రచయిత్రి. ''సత్యవతి కథలు'', ''ఇల్లలకగానే'', ''మంత్రనగరి'' కథా సంపుటాలు ప్రచురించారు. కొన్ని ఆంగ్ల కథలు తెలుగులోకి అనువదించారు. విజయవాడలో వుంటారు.

ఉదయకాంతి రేఖ
ముహమ్మద్‌ ప్రవక్త
రచన: క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌
తెలుగు: పి. సత్యవతి
ఆంగ్ల మూలం: Muhammad: A Biography of the Prophet, 1991, Harper Collins, U.K.


206 పేజీలు, వెల: రూ.80/-


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

3 comments:

  1. ముందు ముస్లింలకు చెప్పండి ఇతర మతాలను అర్థం చేసుకొమ్మని, ఇతర మతాలను గౌరవించడం నేర్చుకొమ్మని.

    ReplyDelete
  2. ఇంకా బాగ అర్థం చేసుకోవడానికి చూడండి
    http://video.google.com/videoplay?docid=-871902797772997781#

    http://www.jihadwatch.org/islam-101.html

    ReplyDelete
  3. Here are some more resources for those who would like to "understand".

    http://www.jihadwatch.org/2008/03/here-is-fitna.html

    http://en.wikipedia.org/wiki/Fitna_%28film%29

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌