Tuesday, November 9, 2010

నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్‌ మహామహుడు - నార్ల వెంకటేశ్వరరావు ...


బాబా సాహెబ్‌ అంబేద్కర్‌
 
(జీవిత చరిత్ర)


రచన: బి.విజయభారతి



ఈ పుస్తకానికి 1982లో నార్ల వెంకటేశ్వరరావు రాసిన పీఠిక నుంచి ...

ఒక ప్రసంగంలో డాక్టర్‌ అంబేద్కర్‌ అన్నాడు - గాంధీ కంటె, జిన్నా కంటె మహదేవ గోవింద రెనడే అనేక విధాల మహామహుడని.
ఈ పీఠికలో నేనంటున్నాను - నెహ్రూ
కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్‌ మహామహుడని.

నెహూృ నేతాజీలవలె అంబేద్కర్‌ జన్మించింది అగ్రకులంలో కాదు, నిమ్నాతి నిమ్నమైన దానిలో. వారివలె ఆయన సంపన్న కుటుంబంలో పెరగలేదు. కటిక దారిద్య్రంలో పెరిగాడు. అడుగడుగునా అవమానాల మధ్య పెరిగాడు. ఒక గాంధీకి, ఒక సి.ఆర్‌.దాస్‌కు కూర్చినట్టు ఆయనకు రాజకీయంగా ప్రోత్సాహ ప్రోద్బలాలను కూర్చినవారు లేరు. సరిగదా, ఎందరెందరో ఆయనను అణగద్రొక్కడానికి ప్రయత్నించారు.

అయినా డాక్టర్‌ అంబేద్కర్‌  మహోన్నత స్థితికి రాగలగడం స్వయం కృషి వల్లనే, స్వీయ ప్రతిభ వల్లనే. విద్యా విజ్ఞానాలలో ఆయనకు సాటి రాగలవారు తక్కువ. ప్రజ్ఞా ప్రాభవాలలో ఆయనను మించగలవారు లేరనే చెప్పవచ్చు.
ధైర్య సాహసాలలో ఆయన స్థానం ప్రథమ శ్రేణిలో.  శీల సంపదకు ఆయన సరసన నిలవగలవారు ఈనాటి భారత వర్షంలో బహుశా ఒక్కరైనా లేరు.

ఇవి ముఖస్తుతులనడానికి, వీటిని విని నాకు ఏదో కట్టబెట్టడానికి అంబేద్కర్‌ సజీవుడైలేడు.  పోతే, ఇవి ఆత్యుక్తులనడానికి ఎవరైనా సాహసిస్తే వారికి భారత సాంఘిక చరిత్ర ఆణుమాత్రంగానైనా తెలియదనే చెప్పవలసి వుంటుంది.
... ... ... ... ... 

 
బానిసత్వం కంటె అతి నీచమైనది, నికృష్టమైనది, అత్యంత క్రూరమైనది, కఠోరమైనది, ఆద్యంతం అధమాధమమైనది, అమానుషమైనది - అస్పృశ్యత. 
ప్రపంచం మొత్తం మీదనే మరొక దేశంలో ఈ విధమైన రాక్షసత్వం కానరాదు.
.... ... ... ...
అస్పృశ్యతపై హిందూ దేశంలో తిరగబడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్‌ అంబేద్కర్‌ కావడం ఏ దృష్టితో చూచినా ఒక గొప్ప విశేషం.
ఆయన గురించి చదివినకొద్దీ ఆయన పట్ల నాకున్న ప్రేమ గౌరవాలు పెరుగుతూ పోతున్నాయి.

అయితే ఆయన సాగించిన తిరుగుబాటు సాగవలసిన మేరకు సాగలేదు.
కొన్ని విషయాలలో సాగవలసిన మార్గాలలో సాగలేదు కూడా.
అందువల్లనే ఈనాడు దేశంలో ఏదో ఒకమూల అస్పృశ్యులపై ఏదో ఒక అత్యాచారం, ఏదో ఒక అమానుష చర్య జరిగినట్టు దినపత్రికలలో వార్తలు వస్తూనే వున్నాయి.
కాగా, పత్రికలకెక్కని ఘోరాలలెన్నో, క్రౌర్యాలెన్నో ఎవరు చెప్పగలరు?

ఈ దుర్భర పరిస్థితి తొలగాలంటే ఒక అంబేద్కర్‌ చాలడు.
ఆయన అంతస్తును అందుకొనలేకపోయినా, కనీసం ఆయన ప్రతిభలో, ఆయన స్వేచ్చా �ప్రవృత్తిలో, ఆయన నిష్కలంక శీలంలో శతాంశాన్ని చూపగలవారైనా కొన్ని వందలమంది ఆ సంఘం నుంచి పైకి రావాలి.
అందుకు కావలసిన ఉత్కంఠను, అందుకు కావలసిన ఉత్తేజాన్ని
డాక్టర్‌ బి.విజయభారతి రచించిన అంబేద్కర్‌ జీవిత చరిత్ర కలిగించగలదని ఆశిస్తున్నాను.

పెక్కు గ్రంథాలను పరిశోధించి సరళమైన శైలిలో, సమగ్రమైన రీతిలో ఈ రచనను చేసినందుకు ఆమెను నేను అభినందిస్తున్నాను.
ఆమె రచనలో ఆలోచనతోపాటు ఆవేదన వున్నది.
జీవంతో పాటు జవం వున్నది.
ఇది జీవిత చరిత్ర అయినా నవల వలె సాఫీగా నడుస్తున్నది.
కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలె ముఖ్య దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్నది.
దీనిలో చెదురుగా కొన్ని లోపాలుంటే అవి పట్టించుకోదగినవి కావు.
ఇంతటితో సరిపుచ్చక అస్పృశ్య సంఘంలో నవచైతన్యానికి, విప్లవోత్సాహానికి దోహదం కూర్చగల మరి పెక్కు రచనలను డాక్టర్‌ విజయభారతి కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను.

- నార్ల వెంకటేశ్వరరావు, జూన్‌, 1982, లుంబిని, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌, 500034

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌

 
బి.విజయభారతి
మొదటి ముద్రణ: 1982
పునర్ముద్రణ: 1986, 1990, 1992, 1999, 2005, 2008, 2009

 
256 పేజీలు, వెల: రూ.70/-

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. pls i want dr ambedkar life history book.

    ReplyDelete
    Replies
    1. The book is available with us for Rs. 100. Kindly send us the money by MO/DD or online (we will give you bank details if asked for separately) and we will post you the book.
      HBT

      Delete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌