Thursday, March 18, 2010

కేరళ సామాజిక తత్త్వవేత్త – శ్రీ నారాయణ గురు ... పుస్తకం డాట్ నెట్ సమీక్ష ...



(హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన "కేరళ సామాజిక తత్త్వవేత్త – శ్రీ నారాయణ గురు" పై ఈ సమీక్ష పుస్తకం డాట్ నెట్ లో (9 మార్చ్ 2009 ) ప్రచురించ బడింది. పుస్తకం డాట్ నెట్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా బ్లాగు వీక్షకుల కోసం యదా తధంగా ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము.)

“భారతదేశపు చీకటి గతం లో జన్మించి కోట్లాది సామాన్యుల కుత్తుకల మీద విలయతాండవం చేసిన సామాజిక వ్యవస్థ కులం. దేశం లో అనాచారం తప్ప ఆచారం లేదు. ఉన్న కొద్దిపాటి ఆచారం మతిలేనిది. ’శాస్త్రీయం’ కానిది. హిందూమతం అంటే సతీ సహగమనం, బాల్య వివాహం, కులం, మూర్ఖత్వం, ‘heathen worship’, విగ్రహారాధన. హిందువులకు ముక్కోటి దేవతలున్నారు. కానీ దేవుడొక్కడే! ఒక్కడే ’నిజమైన’ దేవుడు. మరి ఏం చేద్దాం?! మూఢ విశ్వాసాలను మారుద్దాం! ఎలా?

ఇప్పుడున్న ప్రతి ఆచారాన్నీ ధిక్కరిద్దాం.. వీలైతే రూపు మాపుదాం. మతం మారుదాం. వేదాలనూ, స్మృతులనూ తగలెడదాం. మనదైన ప్రతి ఒక్కదానినీ మూర్ఖం గా ఖండిద్దాం. అదే అభ్యుదయం. అదే సంస్కరణ. అదే శ్రేయస్కరం. మనం మనం కాకుండా పోదాం! ఎంత త్వరగా వీలైతే… అంత త్వరగా…”

పద్దెనిమిదవ శతాబ్దం లో సంస్కరణ అంటే మన దేశీయ మేధావుల మనస్సులో ఉన్నది, పైన చెప్పిన దానికి ఇంచుమించు అటూ ఇటూ గా ఉండేది. వేల సంవత్సరాల ఒక జాతి సమిష్టి అనుభవాల ఫలితం గా కొన్ని మహోన్నత భావాలు ఆదర్శం గా మొదలై, ఆచరించదగ్గవి గాను, ఆశయాలు గాను, సంప్రదాయాలు గాను, ఆచారాలు గాను… విషయ సహజమైన మార్పుల వల్ల ఆ ఆచారాలు దురాచారాలు గాను, చివరికి అనాచారాలు గానూ పరిణమిస్తాయి. ఇది విషయధర్మం.

ఉన్నతకులాలు, సంపన్న వర్గాలలో పుట్టి, అప్పట్లో పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య విద్య వంట బట్టించుకున్న కొందరు నాయకులు, “స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం, సమానత్వం” వంటి పాశ్చాత్య ఉదారవాద భావాలపట్ల ఆకర్షితులై భారత దేశం లో ని సమస్యలన్నిటికీ సమాధానం అత్యంత త్వరితగతిన భారతాన్ని పాశ్చాత్యదేశాల్లా మార్చడమే అని త్రికరణశుధ్ధిగా నమ్మారు. ఆ దిశలో నిస్వార్థం గా అమూల్యమైన సేవ కూడా చేసారు. కాలి నొప్పి కి కేన్సర్ మందు అన్నమాట!

ఈ సంస్కర్తలందరిలోకీ భిన్నమైనవాడు, సంస్కర్తలకే సంస్కర్త, నిఖార్సైన నిశ్శబ్ద భారతీయ విప్లవ కారుడు, సామాజిక తత్త్వవేత్త, యోగి, మహాజ్ఞాని, శ్రీ నారాయణ గురు. ఆయన గురించినదే నేను మీకు పరిచయం చేయబోయే ఈ చిన్ని పుస్తకం, కేరళ సామాజిక తత్త్వవేత్త – శ్రీ నారాయణ గురు.

తిరువనంతపురానికి కూతవేటు దూరంలో ఉండే ’చెంపళంతి’ అనే గ్రామం లో 1856 లో నారాయణ గురు జన్మించారు. పుట్టినది మధ్యతరగతి కుటుంబంలో, ఆ కాలం లో నిమ్న కులం గా చూడబడిన ’ఈళవ’ కులం లో. మిగతా ”సంస్కర్తల’ కి మల్లే ఈయనకు విలాసవంతమైన జీవితమూ లేదు, పాశ్చాత్య విద్యాలేదు. ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు రామన్ పిళ్ళై ఆశాన్ వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. మేనమామ కూతురే అయిన తన భార్యను అర్ధాంతరం గా వదిలేసి చెప్పాపెట్టకుండా దేశాటను వెళ్ళిన నారాయణ దక్షిణా భారత దేశం అంతా తిరిగాడు. పేదరికం తో సహజీవనం చేసాడు. స్వయం గా అవర్ణుడై ఉండటం చేత జనం సమస్యలను అతి దగ్గర గా గమనింఛాడు. వేదాలను, ఉపనిషత్తులను, ఖురాన్, బైబిల్ లను ఔపోశన పట్టాడు. సంఘం లో ని అనాచారాలను దగ్గరి గా గమనించి ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు.

అంటరానితనం. స్వార్థపరులైన ఒక వర్గపు ప్రజలు కోట్ల మంది ప్రజలపై సాగిస్తున్న పెత్తనం. లెఖ్హ్ఖ్హలేనన్ని కులాలు. కులాల్లో మళ్ళీ ఉపకులాలు, ఉప కులాల్లో తెగలు, తెగల్లో వైషమ్యాలు, తలాతోకా లేని నమ్మకాలు… పంచములకు ఆలయ ప్రవేశం లేదు! ఇవీ ఆ కాలపు కేరళ పరిస్థితులు. మరి నారాయణ గురు ఏం చేసాడు? మందిని వెంటేసుకుని వెళ్ళి మనుస్మృతిని తగలెట్టలేదు. అత్తెసరు తెలివితో ఉపనిషత్తులను తర్జుమా చెయ్యలేదు. కోట్లమందొకసారి మతం మారండహో అని ప్రచారం చెయ్యలేదు. దేశ విదేశాల్లో మాతృభూమిని దూషించి భుక్తి సాధించలేదు. అవర్ణులకు దేవుడు లేడా? చూద్దాం దాని సంగతీ అనుకున్నాడు. అరువిప్పురం అనే గ్రామం లో 1888 లో, శివరాత్రినాడు ఉదయం వేళ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠాపించాడు.

అగ్రవర్ణాల లోని స్వార్థపరులు ఆడిందే ఆటగా సాగుతున్న ఆ రోజుల్లో, ఒక పంచముడు - విగ్రహ ప్రతిష్ఠాపన చేయడమా! ఊహించినట్టు గానే కొందరు బ్రాహ్మణులు దాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఒక గొప్ప బ్రాహ్మణ మేధావి ఆ ప్రదేశానికి చేరి, ఆవేశం గా అడిగాడు ” అవర్ణుడివి, అందునా ఈళవ కులస్థుడివి, నీకు విగ్రహ ప్రతిష్ఠాపన చేసే హక్కు ఎవడిచ్చాడు?” – ఆ తరువాత నారాయణ గురు ఇచ్చిన సమాధానాన్ని - సరిగ్గా ఆ ప్రదేశం లో, అక్కడే ఉండి వినడానికి ఒకసారి కాలం లో వెనక్కు వెళ్ళాలనిపిస్తుంది - నారాయణ గురు అన్నాడు: “క్షమించాలి. ఈ విగ్రహం బ్రాహ్మణ శివునిది కాదు. ఈళవ శివునిది.” సదరు బ్రాహ్మణుడు నెత్తి మీద అంటార్కిటికా మంచు తో చేసిన పిడుగొకటి పడుండాలి!! కత్తులు లేయలేదు, రక్తం చిందలేదు. పరుషమైన మాటైనా లేదు. కానీ ఒక్కదెబ్బతో దురహంకారుల గుండెలు చీల్చాడు నారాయణ గురు. అదీ మొదలు. ఇహ ఆ తర్వాత అంతా చరిత్రే!

నారాయణ గురు సాధించిన మార్పు, కేరళ మీద ఆయన ప్రభావం, చేసిన మహోన్నతమైన పనులు, ఈ వ్యాసం నిడివిలో చెప్పడం కష్టం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మొదలగు మహామహులు నారాయణ గురు ను వేనోళ్ళా పొగిడారు.

హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఆంగ్లం లో సత్యబాయ్ శివదాస్, ప్రభాకర్ రావు లు రాయగా, తెనుగీకరించినది ప్రభాకర్ మందార (ఈయన మన బ్లాగర్ ప్రభాకర్ మందార గారేనా?). ఇంతవరకూ నారాయణ గురు గురించి విని ఇప్పుడు లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్ని పుస్తకం మంచి ప్రారంభం అవుతుంది. కేరళ లోని ఆ నాటి సామాజిక పరిస్థితులను వివరించే క్రమం లో రచయిత(లు) ఆర్యుల వలస తో తమ విశ్లేషణ ను ప్రారంభిస్తారు. అది నన్ను కొంచెం చికాకు పరిచింది. పాశ్చాత్య అకాడెమీ లో ఈ రోజు ఈ ఆర్య సిద్ధాంతం మాట్లాడే ప్రొఫెసర్లను చాలా చిన్న చూపు చూస్తారు. ఒక సిద్ధాంతం గా అది లిటరరీ సర్కిల్ లో తన విలువను కోల్పోయింది. కానీ, పుస్తకం లో నారాయణ గురు జీవితం లోని ముఖ్య ఘట్టాలను ఈ పుస్తకం వివరించిన తీరు కోసమైనా, ఇలాంటి చిన్న విషయాలను వదిలెయ్యవచ్చు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.. ముఖ్యం గా దేశ సమస్యలమీద విపరీతం గా స్పందించే “తాబట్టిన కుందేలు కు మూడేకాళ్ళు…” మీడియా మేధావులు తప్పక చదవాలి నారాయణ గురు గురించి. తక్కువే అయినా.. అక్కడక్కడా నాలుగు కాళ్ళ కుందేళ్ళూ ఉంటాయని తెలియాలిగా వారికి మరి?

శ్రీ నారాయణ గురు - కేరళ సామాజిక తత్త్వవేత్త
(Sri Narayana Guru – Kerala Samajika Tatvavetta)

ఆంగ్లం: సత్యసాయి శివదాస్ (Satyasai Shivadas)
పి. ప్రభాకర రావు (Prabhakara Rao)

తెలుగు: ప్రభాకర్ మందార (Prabhakar Mandaara)

హైదరబాదు బుక్ ట్రస్ట్
ఫ్లాట్ న్ం. 85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్, హైదరాబాదు - 500 067
ధర: రు.25

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌