మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, February 16, 2010
“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” - పూర్ణిమ
“టోటో చాన్”
Give me some sunshine
Give me some rain
Give me another chance.. I wanna grow up once again
ఇటీవల విడుదలైన హిందీ సినిమాలోని పాట వినగానే నాకు నచ్చిందిగానీ, నన్ను నేను చూసుకునే అవకాశంగా అనిపించలేదు, “టోటో చాన్” అనే పుస్తకం చదివే వరకూ. ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివాక కూడా “యెస్.. నాకూ ఒక ఛాన్స్ ఉంటే బాగుణ్ణు” అని అనిపిస్తూ ఉంది.
నా బాల్యంతోనూ, బడితోనూ, అసలు ఇప్పటిదాకా జీవితంలో దేనితోనూ తీవ్ర నిరాశ చెందలేదు. ఉన్నంతలో దొరికిందే చాలు అనుకుంటూ ఉంటాను. పైగా నేను చదివిన బడి అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో హైద్రాబాద్ లో పేరెన్నిక గల పాఠశాలలో అది ఒకటి. “నీదే స్కూల్?” అని ఎవరన్నా అడగగానే సమాధానంతో పాటు ఒక రవ్వ పొగరు కూడా ఉండేది. స్కూల్ ఉండి బయటకొచ్ఛేటప్పటికి అందరికీ పదో తరగతి మార్కుల మీదే కన్ను. మన లెక్కలు ప్రకారం ఎన్ని ఎక్కువ మార్కులు, ఎంత ఎక్కువ మందికి వస్తే ఆ పాఠశాల అంత మంచిదని కదూ? కాకపోతే సంవత్సరాలు గడిచేకొద్దీ, రెస్యుమే లో పదో తరగతి మార్కులు అట్టడుగున మూలుగుతూ, వల్లవేసిన పాఠాల కన్నా, చుట్టూ ఉన్న మనుషులతో, పరిస్థితుల్లో వేగాల్సి వచ్చినప్పుడు మన ఐ.క్యూ కన్నా ఇ.క్యూకి పరీక్ష! పాఠశాల విద్యార్థిగా మన మెదడెంత పదనుగా ఉన్నదానికంటే మనం జీవితంలో మనకున్న పరిమితుల్లో ఏం చెయ్యగలం అన్నదానికి ముడిసరకైన వ్యక్తిత్వం ముఖ్యం. దానికి బీజాలు పడేది స్కూల్లోనే మరి! మన స్కూల్లు వ్యక్తిత్వాలని తీర్చిదిద్దటం మాట అటుంచి, వాటిని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఆ చర్చకి ఇది అనువైన చోటు కాదు.
మొన్న హైద్రాబాద్ బుక్ ఫేర్‍లో “నేషనల్ బుక్ ట్రస్ట్” వాళ్ళ స్టాల్ లో పుస్తకాలు చూస్తుండగా, నాతో పాటున్న స్నేహం ఓ పుస్తకం తీసి, “ఈ పుస్తకం చదివారా?” అని అడిగారు. నేను చదవలేదన్నాను. పుస్తకం గురించి మరో ముక్క చెప్పకుండా, ఓ కాపీ నా చేతిలో పెట్టి “తప్పక చదవండి! భలే ఉంటుంది. రైలు బడి అన్న కాన్సెప్టుతో బడి నడుపుతుంటారు. ఆ బడిలో చదివిన విద్యార్థిని రాసిన పుస్తకం ఇది. జపాన్ లో కథ” అని ఉత్సాహంగా చెప్పటం మొదలెట్టారు. సరే, చదివి చూద్దాం అని తీసుకున్నాం.
మొన్నెప్పుడో ఏం చెయ్యటానికీ తోచక, ఊరికే కాసేపు చదువుదాం అని మొదలెట్టాను. పూర్తయ్యే వరకూ ఎక్కడా ఆగలేదు. ఇది “టోటో చాన్” అనే చిన్నారి కథ. ఈ చిన్నారిని ఓ స్కూల్ నుండి పంపించేస్తారు. “ఎందుకూ?” అని అడగడానికి వాళ్ళ అమ్మ స్కూల్‍కి వెళ్లినప్పుడు టీచర్ సవాలక్ష కారణాలు – “క్లాసులో చెయ్యొద్దన్న పని చేస్తుంది”, “పిట్టలతో మాట్లాడుతుంది”, “రోడ్డూ పోయే వాళ్లని అరుస్తూ పిలుస్తుంది” – లాంటివెన్నో చెప్తుంది. టోటో చాన్ అమ్మ చాలా కలరవపడుతున్నా పిల్లకి మాత్రం ఏం జరుగుతుందో చెప్పదు. నేరుగా తీసుకెళ్లి వేరే స్కూల్లో వేస్తుంది.
కాకపోతే ఈ పాత స్కూల్ అన్ని స్కూల్లా ఉండదు. ఇక్కడసలు గదులే ఉండవు. ఒక రైలులో బల్లలు, కుర్చీలూ, బ్లాక్‍బోర్డ్ లు అన్నీ ఉంటాయి. ఈ స్కూల్లో చేరటానికి ఇంటర్వ్యూ ఏంటో తెల్సా? ప్రిన్సిపాల్ ముందు మనకి ఏం తోస్తే అది చెప్పటం. ఎంత సేపైనా చెప్పచ్చు, ఆయన వింటూ ఉంటారు. టోటో చాన్ లాంటి వాగుడుకాయే, “అబ్బా.. ఇంకేం చెప్పాలి” అనుకునేంత వరకూ సహనంగా వింటారు. బడిలో చేరాక, రోజూ బడికి వెళ్ళటం ఎంత నచ్చుతుందంటే, ఒక్క రోజు కూడా స్కూల్ మిస్స్ కాకుండా వెళ్లాలనిపించేంత. క్లాసులో పిరీయడ్స్ ఉండవు. రోజుకిన్ని చదువుకోవాలనుంటే, ఏది ఏక్కడైనా మొదలెట్టచ్చు. “అబ్బా.. పొద్దునే మాథ్సా? ఆ టీచరంటే నాకు చచ్చేంత భయమే” లాంటి ఆలోచనలు ఇక్కడుండవు. అలానే చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యంగా ఉండడం, బోలెడేసి పుస్తకాలున్న లైబ్రరీ, బొమ్మలు గీసుకోడానికి కాగితాలు కాకుండా, ఏకంగా నేల మీద గీయడానికి అనుమతి.
ఈ పాఠశాల నిర్వహణలో నాకు నచ్చిన రెండు విషయాలు:
“నిన్ను చెయ్యొద్దన్నానా? మళ్ళీ చేస్తావా ఇలాంటి పని?” అని ఎంత మంది టీచర్లు, తల్లులు గొంతులు చించుకుంటూ పిసివాళ్ళని కొట్టరూ?! ఓ సారి మన టోటో చాన్ కూడా ఛెయ్యద్దన్న . చెయ్యకూడని పని చేస్తుంది. ఓ వస్తువు పోగొట్టుకుంటుంది. పోయిందని ఏడ్వకుండా ఆ వస్తువు వెతకడానికి మరో పని చెయ్యటం మొదలెడుతుంది. దాని వల్ల చాలా చెత్త చెత్తగా మారుతుంది ఆ ప్రదేశం. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు కనిపిస్తే వాళ్ళని కసిరి, అక్కడి నుండి పంపించేసి, ఆనక నాలుగైదు దెబ్బలు పడేలా చేస్తారు. కానీ ప్రిన్సిపాల్ టోటోని చూడగానే “నీ పని అవ్వగానే ఇదంతా శుభ్రం చేసేస్తావు కదూ” అంటూ వెళ్లిపోతారు. వస్తువూ దొరకదూ, ప్రదేశాన్ని శుభ్రమూ చెయ్యాలి. అంతా అయ్యేసరికి టోటోకి ఆయాసం, నీరసంతో పాటు బుద్ధికూడా వస్తుంది, “ఎందుకా పని చెయ్యటం? ఎందుకు వస్తువు పోగొట్టుకోవడం? ఎందుకు వెత్తుక్కోవటం?” అని.
మరో విషయమేమిటంటే, ఈ స్కూల్ పిల్లలు రోజూ మధ్యాహ్న భోజన విషయంలో ఒక సూత్రం పాటించాలి. దాని పేరు “కొండ నుండి కొంచెం, సముద్రం నుండి కొంచెం”. దీని ప్రకారం పిల్లలకి పెట్టే భోజనంలో నేల పై దొరికే ఆహారం, సముద్రంలో దొరికే ఆహారం సమతుల్యంగా ఉండి పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందివ్వాలని. ఏ కారణాల వల్లనైనా ఏ విద్యార్థి అయినా సరైన ఆహారం తెచ్చుకోకపోతే ప్రిన్సిపల్ భార్యే వాళ్లకి వడ్డిస్తారు. తినడం కూడా “కొన్ని నిమిషాలలో చేసే పని”గా భావించి, పిల్లలు తిన్నా తినకున్నా కొంత వ్యవధిలో మరలా క్లాసుకు వచ్చేయాలని భావించే పాఠశాల్లో చదివుండడం వల్ల అనుకుంటా, నాకీ పాఠశాల ఇంతగా నచ్చింది.
ప్రపంచ యుద్ధం వల్ల ఈ పాఠశాల పూర్తిగా నాశనమయ్యిపోయినా, దాని అవశేషాల్లా మిగిలిన విద్యార్థుల వల్ల పాఠశాల ప్రపంచ ప్రసిద్ధం అయ్యింది. టోటో చాన్ ప్రముఖ టివి ప్రెజంటర్‍గా పేరు తెచ్చుకుంటుంది. అలానే ఆ బడిలో చదివిన తక్కిన పిల్లలు కూడా. వారందరి విశేషాలు పుస్తకం చివర్న జతపరిచారు.
“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” అనిపించేంత అందంగా రాశారు కథని. తెలుగులో వాసిరెడ్డి సీతాదేవిగారి అనువాదం.
నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. బొమ్మలు కనిపించేలానే లేవు. అచ్చు తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఇక ఫాంటూ, పేపరు సంగతి సరే సరి. వెల ఎంతో నాకు గుర్తు లేదు కానీ, ఇదో అరుదైన రచన, దాచుకోవాల్సిన పుస్తకం. అందుకని అన్నీ బాగున్న పుస్తకాన్నే కొనుక్కోండి. స్కూల్‍కి వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకి మాత్రం ఈ పుస్తకం.. MUST READ. తక్కిన వారు కూడా ఓ మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతికోసం ఈ పుస్తకం చదవచ్చు. ఇదే రచన “రైలు బడి” అన్న పేరుతో కూడా వచ్చిందని విన్నాను.
నా చేత పుస్తకం కొనిపించినవారికి మాత్రం బోలెడంటే బోలెడు థాంక్స్!
- పూర్ణిమ (పుస్తకం డాట్ నెట్)
(( టె ట్సుకో కురోయనాగి రచించిన ఈ పుస్తకం జపాన్ భాషలో ప్రచిరించబడిన వెంటనే 45 లక్షల కాపీలు అమ్ముడై చరిత్ర సృష్టిం చింది. ఆ తరువాత దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదమైయింది. ఒక్కో భాషలో రెండేసి మూడేసి అనువాదాలు వెలువడిన సందర్భాలు కూడా వున్నాయి. అలాగే తెలుగు లో కూడా టోటోచాన్ ను "రైలు బడి" పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఈశ్వరి, ఎన్. వేణు గోపాల్ లు తెలుగు అనువాదం చేసారు.
పూర్ణిమ గారి స్ఫూర్తి దాయకమైన పుస్తక సమీక్షను మా బ్లాగు వీక్షకులకు సదా అందు బాటులో ఉంచాలని తిరిగి పొందు పరుస్తున్నాము. ఈ పుస్తక సమీక్ష పై వచ్చిన స్పందనల కోసం ఇక్కడ pustakam.net నొక్కండి.
పూర్ణిమ గారికీ, పుస్తకం డాట్ నెట్ వారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. )
.
Subscribe to:
Post Comments (Atom)
Thank you very much for introducing a very good book. The concept is very close to my heart. My heart is already filled with joy. I don't find the need to read it.
ReplyDeleteRegards.
Thanks for sharing about a wonderful book :)
ReplyDeleteఈ పుస్తకం ఎన్నిపర్యాయాలు చదివానో!!! చదివిన ప్రతిసారీ కొత్తదనమే...చదువుతున్నంతసేపూ పరకాయప్రవేశం...
ReplyDelete