Wednesday, September 9, 2009

కాంక్రీటు కీకారణ్యాల నుంచి పచ్చటి పల్లెలోకి


ఊరు వాడ బతుకు
ఇండియా టు డే
8-9-2009 సంచికలో వెలువడిన సమీక్ష



చెయ్యి పట్టుకుని ఊరంతా చూపిస్తూ ముచ్చట చెబుతున్నట్టుగా సాగే ఓ చక్కని దృశ్య కావ్యం ఈ ఆత్మకథ .
ఊరుచివర మిద్దె. ఇంటి ముందు దొరోరి మోటబావి. బావి గట్టున మర్రిచెట్టు. దాని మధ్య నుండి రెండు తాటిచెట్లు. పక్కన పంట పొలాలు. అటు పనుల కొట్టం, ఆనుకొని గడ్డివాములు, దొడ్లు, పెంట కుప్పలు. ఎదురుగా ఇంకో ఇల్లు లేదు. ఎప్పుడూ ఇంటి ముందు నుండి చెక్కలకు పోయే బండ్లు, పనులు, మేకలు వచ్చిపోయే జనాలు. ఇక మా ఇల్లు తూర్పు వసారాలో రెండు మగ్గాలు ఎదురెదురుగా నడుస్తుండేవి. మా అన్నలిద్దరు మగ్గాలు నేస్తుండేటోళ్ళు, పెద్ద వసారాలో ఓ బల్ల పీట, పెద్ద మనుఘలు కూర్చోటానికని, పక్కన కుంపటి. దాని వెనుకకు వంటిల్లు ప్రక్కకు పోతె పడమటిల్లు, అదే దేవుని అర్ర. దాంట్లో బియ్యం ఉప్పులు పప్పులు ఉండేవి..''

నాగరికత పేరుతో తుడిచిపెట్టుకుపోయిన ఇలాంటి ఊరు, ఇల్లు ఈ రోజుల్లో మచ్చుకైనా కనబడే అవకాశం ఉందంటారా? అందుకే దేవులపల్లి కృష్ణమూర్తి ఆ పచ్చటి పల్లెబాటన, ఆ చల్లటి ఇంటిలోకి తన ఊరు వాడ బతుకు ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు.

బాల్యం నుండి యౌవ్వనం దాకా సాగిన తన ఆత్మకథను ఊరు వాడ బతుకు అంటూ ఒక జోలి (ముచ్చట) లాగా చెప్పుకుంటూ పోయిన కృష్ణమూర్తి, డెబ్భై ఏళ్ళ తన జీవితపు కిటికీ లోంచి బాల్యపు ఆనంతారం, యౌవ్వనపు సూర్యాపేటలోకి తలుపులు బార్లా తెరచుకుని తెరలు తెరలుగా కదలివచ్చిన అనుభవ జ్ఞాపకాలను పూనగుచ్చినట్టు అల్లుకుంటూ పోయారు. రచయితగా తనకిది తొలి పుస్తకమే అయినా మంచి చేయి తిరిగిన రరచనా పటిమను కనబరిచారు. కవులకు కళాకారులు, రచయితలతో విస్తృతమైన పరిచరయాలు, ఏ సాహిత్య సమావేశాన్ని వదలకుండా హాజరైన అనుభవం, నిరంతర పుస్తక పఠనం ఆయనకీ పుస్తక రచనలొ బాగా తోడ్పడి ఉండవచ్చు. 'పొద్దు పొడుస్తుంది లేరా అని తల్లి నిద్ర లెనపడంతో మొదలయ్యే ఈ కథ, పద్దెనిమిదో ఏట భార్య కమల తన జీవితంలోకి ప్రవేశించే 'కలికి గాధారి వేళకు ముగుస్తుంది. తాను రాసే విషయం పట్ల పూర్తి అవగాహన, పుస్తక పరిమితి పై పట్టు, చక్కని ప్లాను ఉన్న రచయితకే ఇలాంటి ఎత్తుగడలతో కతను ప్రారంభించి ముగించడం సాధ్యపడుతుంది. ఈ ఊరు వాడ బతుకు కూడా అంతే పకబ్చందీ ప్రణాళికతో రాసిన నవల లాంటి ఆత్మకథ.

1940 నుండి 58 దాకా ఒక ప్రవాహంలాగా సాగే కృష్ణమూర్తి జీవితకథ, వెనుకబడిన తెలంగాణ పల్లెల్లోని అందరి జీవితాలకూ ప్రతీక లాంటిది. ఆయన తన ఊరును పూర్తిగా తనలోకి ఇంకించుకుని మహాప్రదర్శన చేసి చూపుతారు. ఊరు వెంట తనను, తన వెట ఊరును ఉరికించుకుంటూతీసుకెళ్ళే కథన రీతి ఆద్యంతం ఉత్సాహంగా చదివిస్తుంది. చదువుతుంటే ఆ వేగం, ఆ ఉరుకు పాఠకులూ అందుకుంటారు. మీలో ఊరు, ఊరిలో మీరు లాగా ఉంటుంది. ఆత్మకథ కథ అంటే 'ఎట్లా జరిగింది అట్లాగే' అన్న మూస పద్దతిలో కాకుండా మొదలుపెడితే అపకుండా చదివించడంలాంటి నవలా టెక్నిక్‌ కథ ఒడుపుగా నడుస్తుంది.

పైగామనసు,కళ్ళుఅక్షరాలవెంటఉరుకులుపెడ్తుంటే,చెవులకు మధురమైన జానపద గీతాల హోరు వినబడుతుంటుంది. కథ, కథనం మాట పాట, చక్కని స్క్రీన్‌ప్లే అన్నీ ఉన్న ఈ ఊరు వాడ బతుకు 'అపూ చూపు నుంచి రాసిన సత్యజిత్‌ రే పథేర్‌ పాంచాలి' అని వరవరరావు కొనియాడారు.

ఊరు ఊరి పరిసరాలు, ఊళ్ళో ఉండే ఇళ్ళు, వాటి ఆర్కి టెక్చర్‌, కుటుంబాలు, ఆ కుంటుంబాల మధ్య ఉండే సంబంధాలు. వృత్తులు, దొరోరి పెత్తనాలు, ఇతరత్రా కొత్తగా వచ్చిన పరిణామాలు అన్నీ విపులంగా, విస్తారంగా చెప్పుకుంటూ పోతారు రచయిత. ఆ చెప్పడం చెయ్యి పట్టుకుని ఊరంతా తిప్పుతూ ముచ్చట చెబుతున్నట్లుగా ఉంటుంది.

''ఎర్ర మన్నుతో గోడలు పూసి సున్నంతో మూరకో నిలువు గీత గీసే టోళ్ళు కింది భాగాన చుట్టూ అడ్డ గీతచ వీటిని పట్టేలు పెట్టటమంటారు. ఈ పట్టెలు కోడి రెక్కతో గీస్తే అందంగా అమరేవి. మా వదినెలు పండగలకు పబ్బాలకు ఇల్లు అలికి ముగ్గులు పెడ్తే ఎంతో అందంగా ఉండేది. పేడ, పుట్టమన్ను కలిపి ఇల్లంతా అలికితే నున్నగా ఉండేది. తలుపులకు, దర్వాజాలకు జాజు రంగు ఎర్రగా ఉండేది.'' పేదరికంలో నూ ఇలాంటి ఇల్లల్లో జీవనం పచ్చగా ఉండేదో, ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే భాషలో రాసిన ఈ వివరణాలు అన్ని ప్రాంతాల వారినీ అసక్తిదాయకంగా చదివిస్తాయనడంలో సందేహం లేదు.

బల్లెపీట, దేవుని అర్ర, పటేండ్లు, దర్వులు, ముసుర్లు, పొటుకు పెట్టడం, గిన్నె పండ్లు,తాతీళ్ళు, గాబులు అటిక, ఆట, బెర్ర, దూప, చింతపాల పళ్ళు, కలికి గాంధారి వేళ... లాంటి తెలంగాణ మాండలికంలోని లెక్కకు మిక్కిలి పదాలతో జీవధారలా సాగే ఈ రరచనలో, ''తీరకుంట చేస్తే చాల కుంటాయె, నాభికాడ చల్లబడితే నవాబు కాడ జవాబియ్యొచ్చు, గుడ్డి కొంగకు కొమ్రట్ట దొరికినట్టు'' లాంటి సామెతలు సందర్భశుద్ధితొ పుస్తకమంతా పరచుకుంటవి.

ఇలా తన పల్లె ప్రపంచంలో జరిగే రకరకాల ఆచార వ్యవహారాలు, పండగ పబ్బాలు, జాతర్లు, ప్రదర్శనలు, బాగోతాలు, ఆనాటి నైజాం రజాకార్ల దురాగతాలు, సంఘపోల్ల తిరుగుబాట్లు, కమ్యూనిస్టు నాయకుల ప్రభావం, ఊరి దొరల పలాయనం ఇంకా అనేకానేక సామాజిక విషయాలు కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూనే బాల్యం నుంచి తాను పెరుగుతున్న క్రమాన్నీ సమానంగా నడుపుకుంటూ వచ్చారు కృష్ణమూర్తి.

నేత కుంటుంబంలో పుట్టినందున అబ్బిన విద్యేమో, దేనికి దాన్ని ఒక పద్ధతి ప్రకారం అల్లుకుంటూ గాడి తప్పని, గాడీగా లేని చక్కని పట్టువస్త్రం నేశారీ సాలాయన. ఈ వస్త్రానికి గొప్పగా అమరిన వెండి జరీ అంచు లక్ష్మణ్‌ బొమ్మలు.తెలంగాణ పునరుజ్జీవనాన్ని మరొక్కసారి కళ్ళముందు అవిష్కరించిన ఈ ఊరు వాడ బతుకుకు కొనసాగింపుగా, కృష్ణమూర్తి 'అసలు జీవితం 'లోకి ప్రవేశించిన కథ మరో భాగంగా రావచ్చు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

మా పుస్తకాలని ''ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.

2 comments:

  1. ఇంకా నేను సమీక్ష రాద్దాం అని మీనమేషాలు లెక్కెడుతున్నా. బాగా పరిచయం చేశారు.
    మీ సమీక్షలో మిస్సయ్యింది నేను చెప్పాలనుకున్నది మరో విషయం. పుస్తకంలో ఏలే లక్ష్మణ్ గారి బొమ్మలు. వావ్. తెలంగాణను తన బొమ్మలతో అద్భుతంగా పరిచయం చేస్తారు. నలభై రూపాయలకు లక్ష్మణ్ గారి నాలుగుబొమ్మాలొస్తాయంటే కళ్ళు మూసుకొని కొనాల్సిన పుస్తకం.
    మరో విషయం. రచయిత చెబుతున్న విషయాలను as a matter of fact ధోరణిలో చెబుతారు. చాలా మందికి ఆ సంఘటనలపై తమ తీర్పు వెలువరిస్తూ రాసే అలవాటుంది. జరిగింది జరిగినట్టు చెప్పి తీర్పులు గట్రా పాఠకులకు వదిలేయడం నిజంగా మంచి రచయితకు ఉండాల్సిన లక్షణం.

    ReplyDelete
  2. ఈ సమీక్ష ఇండియా టు డే లో వెలువడినది. గతం లో ఈ పుస్తకాన్ని అరుణ పప్పు (అరుణమ్ బ్లాగు), తెలిదేవర భానుమూర్తి (వార్త), రాజి రెడ్డి (సాక్షి) మొదలైన వారు సమీక్షించారు. వారి సమీక్షలను పుస్తక సమీక్షలు అన్న లేబిల్ లో చూడవచ్చు. మీరు ఈ పుస్తకం తాలూకు ఒక విలక్షణమైన అంశాన్ని ప్రస్తావించారు.
    *** చాలా మందికి ఆ సంఘటనలపై తమ తీర్పు వెలువరిస్తూ రాసే అలవాటుంది. జరిగింది జరిగినట్టు చెప్పి తీర్పులు గట్రా పాఠకులకు వదిలేయడం నిజంగా మంచి రచయితకు ఉండాల్సిన లక్షణం.***
    ధన్యవాదాలు. మీరు కూడా మీ దృష్టి కోణం లోంచి ఈ పుస్తకాన్ని సమీక్షిస్తే అందరికీ మరింత ఉపయుక్తంగా వుంటుంది కదా.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌