Monday, July 27, 2009

ఓ "కౌమారుడి" ఆత్మ కథ ... "ఊరు వాడ బతుకు" పై సాక్షి సమీక్ష ...


"కత్తులు దూసుకు పోయినా
నెత్తురు టేరులు పారినా
ఎత్తిన జండా దించకోయ్
అరుణ పతాకకు జై ......"

వామపక్ష భావజాలం ఉధృతంగా ఉన్న రోజుల్లో, చాలామంది లాగే అటువైపు ఆకర్షితుడైన దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మ కథ ఇది. తన పుట్టినరోజును 1940గా పేర్కొన్నాడు గనుక, 1958లో ఆయన పెళ్లయ్యేవరకు అంటే అటూఇటుగా 18 ఏళ్ల జీవితాన్ని 'ఊరు వాడ బతుకు' స్కృశిస్తుంది. నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణ ఊరూ వాడల్లోని బతుకుల్నీ ఇది చిత్రిస్తుంది.

మేలురకం అమ్ముతాడమ్మా చందమామా రైతు తాలురకం తింటాడమ్మా చందమామా రైతు
నాలుగు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో అప్పటి కుటుంబ జీవితాలు, వారాలు చేసుకుని చదువుకోవటాలు, పిల్లల ఆటలు, సాధనా శూరుల గారడీలు, నాటకాలు, పంచాయితీలు, తాగి కొట్టుకోవడాలు, తాతాక్కలిక మోహాలు... ఎన్నిటింలో జ్ఞాపకాల మాలగా కట్టాడు రచయిత.

''ఎండకాలం అపోయివచ్చిందంటే తాటిపండ్ల కాలం వచ్చేది. పొద్దున్నే చీకటితో లేచి చెరువు కట్టమీదకు పోయి తాటిచెట్లకింద రాలిపడ్డ తాటిపండ్లను ఏరుకొచ్చుకునేది. కొన్ని చెట్లపండ్లు తియ్యగా వుండేవి.ఆ చెట్లేవో మాకు బాగా తెల్సు . ఎరగ్రావున్న తాటిపండ్లను బాపని పండ్లనేది. వాటిని చెత్తతో కాల్చి చల్లారినాక తోలు తీసి చీకితే చాలా రుచిగా వుండేవి. బొచ్చెలు భూమిలో పాతితే సంకురాత్రి వరకు గేగులుగా మారేవి. ఆ గేగులు కాల్చితింటే కమ్మగా వుండేవి. ఇవే మా చిరుతిండ్లు''

సందర్భానుసారంగా వచ్చే పల్లెపాటలే కాదు, నాభికాడ చల్లబడితే నవాబకాడ జవాబియ్యొచ్చు', 'వండిన కుండాగదు వంగిన పొద్దాగదు', ధైర్యం దండిది చెయ్యి మొండిది' లాంటి పలుకుబడులు పుస్తకం సొగసును మరింత పెంచుతాయి.

రచయిత శైలి రాసనట్టుగా కాకుండా, చెప్పినట్టుగా ఉంటుంది. ఆ చెప్పడంలో కూడా ఏ ఆవేశాలూ, ఉద్రేకాలూ లెకుండా కేవలం ఓ మౌనసాక్షిగా తాను చూసినవి వివరించుకుంటూ వెళ్తాడు. ఈ విధానం కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్నిసార్లు ఇంతేనా అనిపిస్తుంది. అయితే, జీవితపు చివరిదశకు చేరిన మనిషికి, ఇదంతా ఓ ఆటగా భావించే మానసిక స్థితి వచ్చివుంటుంది కాబట్టి, ఇది సహజంగానే భావించొచ్చు.
.....

ఊరు వాడ బతుకు పుస్తకం పై సాక్షి దినపత్రిక సమీక్ష ...ఇక్కడ నొక్కి. చదవండి.

సమీక్షకులు : రాజిరెడ్డి

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=32745&Categoryid=10&subcatid=42


ఊరు వాడ బతుకు
రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి

పేజీలు; 138. వెల 40

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
పాట్ల్‌ నం; 85 బాలాజీనగర్‌
గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌ 500067
ఫోన్‌; 040-23521849.


......................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌