Monday, November 6, 2017

జయకాంతన్‌ కథలు తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

'' మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని - ఇదిగో మీ కోసం....'

- కామం పిడికొట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు, ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెను కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు'కథలో...

ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీథిని చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్‌స్కోప్‌ లాగా వీథిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. కిటికీకే అంకితమైపోయి 'బామ్మ' పట్టమూ దక్కించుకుంటుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది - 'నేను కిటికీ దగ్గర కూర్చోనున్నాను'... అన్న కథలో...

నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి తాను గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే - ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పనివల్ల మనిషిమీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ- 'నమ్మకం'

ఏ స్పందనలూ లేని ముసల్ది పిల్లల్ని బొమ్మల్లా బడికి తీసుకెళ్లి వస్తుంటుంది. కానీ కఠినమైన శిలలోనూ జల స్పర్శను కలిగించే కథ- 'యంత్రం'

ఎదురుచూపులకే తన జీవితాన్ని అంకితం చేసి ఒంటి స్తంభంలా నిలబడిపోయిన ఒక స్త్రీ అంతర్యపు లోతుల్ని తేటతెల్లం చేసే కథ - 'ఎదురుచూపులు'

ఇలా... స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలు ఇందులో... చదవండి!

జయకాంతన్‌ కథలు

తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

పేజీలు: 218 వెల : 150



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌