కార్టూన్లలోమార్క్స్
మార్క్సిజం సామాన్య ప్రజలకు అర్థం కాని బ్రహ్మపదార్థంగా పరిగణింపబడు తున్నది.
ఇంతాచేస్తే ఇది సామాన్యుడి కోసమే ఏర్పడ్డ సిద్ధాంతం.
మార్క్సిజం కొద్దిమంది పండితుల సొత్తుగానే చాలాకాలం నుండి ఉంటున్నది. మళ్ళీ ఈ పండితులలో ఏకాభిప్రాయంలేదు. వాళ్ళ వాళ్ళ వాద భేదాలను బట్టి రకరకాల భాష్యాలు, ఖండనమండనలూ కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య మార్క్సిజం నిజంగానే బ్రహ్మపదార్థమయి కూర్చున్నది.
ఈ పై పరిస్థితి ఒక్క తెలుగు ప్రాంతాలకే పరిమితమయినది కాదు. ప్రపంచ మంతా ఇదే పరిస్థితి ఉంది.
దీనికెక్కడో ఎవరో గండికొట్టకపోతే, మార్క్స్ తన సిద్ధాంతాన్ని ఎవరికోసం ఉద్దేశించాడో వారికందకుండా పోయే ప్రమాదం ఉంది.
ఈపాటికే మార్క్సిజం విశ్శవిద్యాలయ 'ఎకడమిక్' చర్చల్లో భాగమైపోయింది.
'మార్క్సిస్టు' అనేమాట కొంతమంది పేర్లకు బిరుదుగా కూడా తగిలిస్తున్నారు (వాళ్ళకి యిష్టమున్నా లేకపోయినా). ఇదేదో ''పెద్ద పెద్ద'' వాళ్ళకు, ఉద్దండ పండితులకూ సంబంధించిన విషయమనుకొని, సామాన్యుడు దీన్నుంచి దూరంగా తొలగి పోతున్నాడు. ఇది హాస్యాస్పదమే కాదు, విచారించదగింది కూడా.
మార్క్సిజాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నాలు చాలాకాలం నుంచి జరుగు తున్నాయి.
తెలుగు పత్రికలు తెలుగు ప్రచురణ సంస్థలు, ఔత్సాహికులైన వ్యక్తులూ ఈ పనిచేస్తున్నారు.
వాళ్ళ సిన్సియారిటీని ఏమాత్రం శంకించడానికి వీల్లేదు.
కాని వాళ్ళ ప్రయత్నం ఆశించినంతగా ఫలవంతం కాలేదు. విషయం కఠినమయింది కావటం ఒక్కటే అందుకు కారణం కాదు. ఉపయోగించిన భాష 'గొట్టు'ది కావటం ఇంకో ముఖ్యకారణమనుకుంటాం.
అయితే పూర్వప్రయత్నాలు పూర్తిగా నిరర్థక మయినవిగా భావించడం పొరబాటు. ఇప్పటి వాళ్ళు స్వేచ్ఛగా వాడుకోవడానికి వీలుగా, మాట్లాడుకోటానికి అనువుగా బోలెడు పదజాలాన్ని వెనకటితరం వాళ్ళు సృష్టించి ప్రచారం చేశారు.
'పెట్టుబడిదారీ విధానం, కార్మికవర్గం, వర్గసామరస్యం, వర్గ వైరుధ్యం, వర్గ పోరాటం, చారిత్రక భౌతికవాదం, గతితర్కం'' వంటి ఎన్నో మాటలు ఇవాళ ఏమంత కొత్తవిగా అనిపించకపోవటానికి కారణం, ఇంతకు ముందటి వాళ్ళ కృషే. అంతేకాక 'ఫ్యూడలిజం, బూర్జువా, బూర్జువాజీ, సోషలిజం వంటి ఇంగ్లీషు, ఫ్రెంచి మాటలు తెలుగు మాటలతో బాటు ప్రచారం కావటానికి కూడా వాళ్ళ ప్రయత్నమే కారణం.
అయితే ఆ ప్రయత్నం మాత్రమే చాలదు. వీలైనన్ని పద్ధతుల ద్వారా, మార్గాల ద్వారా ఆ పని జరగాలి. విషయం సాధ్యమయినంత ఎక్కువ మందికి బోధపరచాలి. తప్పులు పోతాయని భయపడుతూ కూర్చుంటే అసలు పనే జరగదు.
మార్క్సిజాన్ని సంప్రదాయేతర మార్గాలద్వారా చదివే వాళ్ళకు ఆసక్తి కలిగించే లాగా చేయాల్సిన అవసరాన్ని మెక్సికోలో 'రీయుస్' అనే మారుపేరుతో బొమ్మలు వేసే ప్రఖ్యాత కార్టూనిస్టు ఎడువార్డో-డెల్-రియో అనే ఆయన గుర్తించాడు.
దాని ఫలితమే ఈ పుస్తకం.
అంతర్జాతీయ బహుమతులందుకున్న కార్టూనిస్టు ఇతను. కార్టూను బొమ్మల ద్వారా మార్క్సును (అంటే మార్క్సిజాన్ని) పరిచయం చెయ్యటం ఒక కొత్త ప్రయత్నం. చదివేవాళ్ళను ఆకట్టుకొని ముందుకు లాక్కుపోయే గుణం ఈ కార్టూన్లకుంది. బొమ్మల ద్వారా సున్నితమైన హాస్యం కలిగిస్తూ, మాటల్లో కూడా సాధ్యమైనంత చమత్కారాన్ని నింపుతూ సాగిన ఈ రచన పుస్తక రచనలలోనే సరికొత్త ప్రయోగం.
అనుకున్న లక్ష్యానికి అత్యంత ప్రయోజనకారి
....
(1982 నాటి తోలిముద్రణ కు 'చే. రా. ' రాసిన ముందుమాట నుంచి )
కార్టూన్లలో మార్క్స్
-రీయుస్
తెలుగు అనువాదం : కే. బాలగోపాల్
148 పేజీలు ; వెల: రూ. 100
No comments:
Post a Comment