Monday, March 9, 2015

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ''ఇంట్లో ప్రేమ్‌చంద్‌'' పుస్తక అనువాదానికి గాను  కేంద్ర సాహిత్య అకాడమీ వారు శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి ఈ యేడు అనువాదక అవార్డును ప్రదానం చేయబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

గత 40 సంవత్సరాలుగా అనువాద ప్రక్రియలో కృషి చేస్తున్న శ్రీమతి ఆర్‌. శాంతసుందరి ఇప్పటివరకు కథ, నవల, కవిత్వం, నాటకం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అన్ని ప్రక్రియలలో మొత్తం 68 పుస్తకాలకు అనువాదం చేశారు. 


ఇంగ్లీషు హిందీ భాషల నుంచి తెలుగులోకే కాకుండా అనేక పుస్తకాలను హిందీలోకి అనువదించి తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయి ప్రాచుర్యాన్ని కల్పించారు. అలాంటి అనువాదాల్లో సలీం నవల 'కాలుతున్న పూలతోట', పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలు, ఓల్గా కథలు, డా. కె.శివారెడ్డి 'అంతర్జనం', డా.ఎన్‌.గోపి 'కాలాన్ని నిద్రపోనివ్వను', వరవరావు ఎంపిక చేసిన 51 కవితలు మొదలైనవి వున్నాయి.

ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అయిన శ్రీమతి ఆర్‌. శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. బిఎ ప్రెసిడెన్సీ కాలేజీలో, ఎంఎ, బిఎడ్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసారు. వీరి సోదరుడు శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచించిన పలు పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన విషయం విదితమే. 


కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన ''ఇంట్లో ప్రేమ్‌ చంద్‌'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 2012 సెప్టెంబర్‌లో ప్రచురించింది. అంతకంటే ముందు జనవరి 2009 నుండి జూలై 2012 వరకు భూమిక మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది.  ప్రేమ్‌చంద్‌ రచనల గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ మహారచయిత వ్యక్తిత్వం, మానవీయత, విశాల హృదయం గురించి మనకు తెలియని అనేక విషయాలను స్వయంగా ఆయన సతీమణి శివరాణీదేవి ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీమతి ఆర్‌.శాంతసుందరి ఈ పుస్తకాన్ని హిందీ నుంచి సరళమైన తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు .

శ్రీమతి ఆర్‌. శాంతసుందరి గతంలో భారతీయ అనువాద్‌ పరిషద్‌, దిల్లీ వారి 'డా.గార్గీ గుప్త్‌ ద్విగాగీష్‌ పురస్కార్‌; నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ దిల్లీ వారి అనువాద పురస్కారం; హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అనువాద పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతి  లభించడం ఇది రెండో సారి. గతంలో హెచ్‌బిటి ప్రచురించిన డా.యాగాటి చిన్నారావు రచన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ (ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర) అనువాదానికి గాను ప్రభాకర్‌ మందారకు ఈ అవార్డు లభించింది.

ఈసందర్భంగా శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ శుభాభినందనలు తెలియజేస్తోంది. 




No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌