Thursday, November 7, 2013

ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు: పోలీసు, కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి? - బొజ్జా తారకం


ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?


- బొజ్జా తారకం


ఈ పుస్తకానికి ఎందుకనో ముందుమాట రాయలేదు. రాయకుండానే ముద్రణకు పంపించాం. కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయి అనిపించి ఓ నాలుగు మాటలు రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్‌ మార్టమ్‌ చేయించటం వంటి పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారికి మృతుల బంధువులకు నష్టపరిహారం అందేలా చూడటం, పునరావాస సౌకర్యం కల్పించటం వంటి పనులు వెంట వెంటనే జరుగుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ముద్దాయిలను అరెస్టు చేయించి జైలుకు పంపటం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

దీనివల్ల అత్యాచారం జరిపిన వర్గం  నుంచి తీవ్రత వస్తున్నప్పటికీ కార్యకర్తలు వెనుకాడటంలేదు. చట్టం సరిగ్గా అమలు జరిగితే సగం పని అయిపోయినట్టే! అత్యాచారాలు జరగకుండా చూడటం అనేది రాజకీయ వ్యవహారం. చట్టం అమలు పటిష్ఠంగా ఉంటే రాజకీయ శక్తులు, అగ్రకుల అహంకారులు కొంత వెనుకంజ వేస్తారు. దానితో పోలీసులు కూడా దారికి వస్తారు. ఈ చట్టాన్ని ఎంత పటిష్ఠంగా అమలు జరిపితే అంత త్వరగా అత్యాచారాలు కూడా ఆగిపోతాయి.
   
ఇప్పుడు ఒక కొత్త అత్యాచారం చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది.
''పరువు హత్యలంటూ'' ఎస్‌.సి., ఎస్‌.టి.లపై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయి.

అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్‌.సి. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్ళి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయిని విడిచిపెట్టేయ మంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు.
ఒకోసారి ఇద్దర్నీ చంపేస్తున్నారు.
దీనికి ఆ కులమూ, గ్రామమూ మద్దతు ఇస్తుంది.
 పోలీసు కూడా జోక్యం చేసుకోవటానికి భయపడుతుంది.

అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరువు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు.
దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది.

కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశమేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టటం అసాధ్యమనేది గ్రహించటంలేదు.

   
ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోవటంలేదు.
చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం.
అటువంటి పని దురదృష్ట వశాత్తు ఈ దేశంలో జరగటంలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి.
వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం. ఇటువంటి ఉద్యమాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయించటానికి బాగా ఉపకరిస్తాయి.ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు : పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?

- బొజ్జా తారకం


ధర    :    రూ. 50/-

మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
రెండవ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు 
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,   గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 23521849

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌